
నేడు 'పబ్లిక్ రిలేషన్' సంబంధిత కొలువులపట్ల యువతలో
ఆసక్తి పెరుగుతోంది. ఏం సంస్థకైనా, కంపెనీకైనా ప్రజాదరణ ముఖ్యం. అందుకోసం
అవి చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగిన యువతకు అవకాశాలు ఇచ్చేందుకు
ముందుకొస్తున్నాయి. ఆకర్షణీయమైన వేతనాలతోపాటు ఆసక్తి ఉన్న యువత అటువైపు
మొగ్గుతోంది. అయితే అలాంటి కెరీర్లోకి ఎలా ప్రవేశించాలి. ఎలా మసలు కోవాలి?
తదితర విషయాలు తెలుసుకుందాం.
మీరొక సంస్థలో పిఆర్‌వో కావచ్చు.
రిసెప్షనిస్ట్ కావచ్చు. కాల్ సెంటర్లో టెలికాలర్ కావచ్చు. ఇవన్నీ
పబ్లిక్ రిలేషన్ సంబంధిత కొలువులే కాబట్టి ప్రతిరోజూ ఎంతోమందితో
మాట్లాడాల్సి వస్తుంది. మీ సంస్థ గురించీ, దాని లక్ష్యాల గురించీ
చెప్పాల్సి వస్తుంది. మీరు చెప్పేటప్పుడు ఎదుటివారు అడిగే సందేహాలను
నివృత్తి చేయాల్సి వస్తుంది. అది మీ ఉద్యోగంలో భాగమైనప్పుడు అందుకనుకూలంగా
మీరు వ్యవహరించాల్సి వస్తుంది. అంతేగాని అదో ఇబ్బందిగా భావిస్తే కెరీర్లో
ఎదగడం కష్టం. కేవలం పరిచయస్తులతోనే కాదు కొత్త వ్యక్తులతోనూ సంభాషించాల్సి
వస్తుంది. అది నేరుగానైనా కావచ్చు. ఫోన్లోనైనా కావచ్చు. మీరు చేస్తున్న
ఉద్యోగం అలాంటిదైతే ఇతరులను ఆకట్టుకునే మాటతీరునూ, శైలినీ అలవర్చుకోవాలి.
ముఖాముఖి అయినా, ఫోన్లోనైనా నిర్మొహమాటంగా, సూటిగా, స్పష్టంగా
మాట్లాడగలగాలి.
''రోజూ కనీసం వందమందితోనైనా ఫోన్లో
మాట్లాడాల్సి వస్తోంది. అసలా ఫోన్ ఎత్తాలంటేనే భయమేస్తోంది. ఏదో డంబెల్స్
ఎత్తుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఏం ఉద్యోగమో నాకైతే బోర్‌కొడుతోంది
బాబు'' కాల్‌సెంటర్ ఎగ్జిక్యూటివ్ మధురిమ అభిప్రాయమిది. ఫోన్లో మాట్లాడడం
ఆమె వృత్తి కదా! ఆ విషయాన్ని గ్రహిస్తే ఆమె అభిప్రాయం పూర్తిగా మారుతుంది.
అంటే ఉద్యోగాన్ని మనస్పూర్తిగా స్వీకరించి నెరవేర్చాలి. రిస్కుగా
ఫీలవ్వకుండా సానుకూల దృక్పథాన్ని ఏర్పర్చుకోవాలి. ఇలా చేస్తే ఏదీ ఇబ్బందిగా
తోచదు. కానీ మధురిమ అందుకు భిన్నంగా ఆలోచిస్తోంది. సో... ఇలాంటి అపసవ్య
ఆలోచనలు కెరీర్ పరంగా అనేక ఆటంకాలు సృష్టిస్తాయి. అందుకే మీరు చేస్తున్న
వృత్తిపట్ల ఎప్పుడూ సానుకూలంగానే ఆలోచించాలి. అది నెరవేర్చడం బాధ్యతగా
ఫీలవ్వాలి. అలా చేస్తే ఎలాంటి ఇబ్బందులూ రావు. వచ్చినా మిమ్మల్ని ఇబ్బందికి
గురిచేయలేవు.
ఎలా చెప్పాలి: మీ సంస్థ గురించో, కంపెనీ గురించో
చెప్పదల్చుకున్నారా? అయితే నిస్సందేహంగా, నిర్మొహమాటంగా చెప్పండి. ఎదుటి
వారు ఏమనుకుంటారనో, తిరస్కరిస్తారనో మీకు మీరే నిర్ణయానికి రాకూడదు. అది మీ
కెరీర్‌ని దెబ్బతీస్తుంది. ఆందోళన వీడి చెప్ప దల్చుకున్న విషయాన్ని
స్పష్టంగా, సూటిగా చెప్పాలి.
స్పష్టత అవసరం: ఏం
చెప్పదల్చుకున్నారో దాని గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. దానిపట్ల స్పష్టత
ఉండాలి. మధ్య మధ్యలో ఎదుటివారు ఏవైనా సందేహాలు వ్యక్తం చేయొచ్చు. వాటిని
నివృత్తి చేసే సామర్థ్యం మీలో ఉండాలి. ఇవన్నీ ముందుగానే తెల్సుకుని ఉంటే
మంచిది. ఒకవేళ కాస్త ఇబ్బందిగా ఉంటుందనుకుంటే నోట్ తయారు చేసుకోవాలి.
చెప్పాల్సింది కొత్త విషయమో, మీకు తెలియనిదో అయినప్పుడు సహోద్యోగులనో,
మిత్రులనో, కొలీగ్స్‌నో అడిగి తెలుసుకోవాలి. సహంజంగానే మీ వృత్తికి
సంబంధించి అవతలి వ్యక్తికి ఎలాంటి సందేహాలు వస్తాయో ముందుగానే ఊహించుకుని
నోట్ తయారు చేసుకోగలగాలి. సంభాషణ మధ్యలో నీళ్లునమలడం, దాటవేయడం మీ పట్ల
విశ్వాసం కోల్పోయేందుకు కారణం అవుతుంది. అందుకే జాగ్రత్తగా మాట్లాడాలి.
ఎలా
ప్రారంభించాలి: మీరు ఫోన్‌చేయగానే సుత్తి మెదలెట్ట కూడదు. ఆప్యాయంగా
పలకరించాలి. విష్ చేయాలి. తర్వాత మీ పేరు చెప్పి ఎదుటివారికి మాట్లాడే
సమయం, ఆసక్తి ఉందో లేదో తెలుసుకోవాలి. మీరెంతసేపు మాట్లాడతారో చెప్పాలి.
ఎందుకంటే ఇలా చేయడంవల్ల ఎదుటివారికి మీ పట్ల గౌరవం పెరగడమేగాక వారికి సమయం
అనుకూలంగా లేకపోతే మరోసారి మాట్లాడేందుకు సుముఖత చూపుతారు.
మీదే
చెప్పకండి: ఫోన్ చేయగానే ఇంగ్లీషులో ఎడాపెడా వాయించి ఎదుటి వారి
స్పందనకోసం ఎదురుచూస్తుండగానే అవతలి వారుఫోన్ పెట్టేశారనుకోండి. అది
వారికి ఇంట్రెస్ట్ లేదని మాత్రమే కాదు. మీరు చెప్పింది వారికి
అర్థమయ్యిందో లేదో అనేది కూడా ఆలోచించాలి. అసలు వారికి ఇంగ్లీష్ వచ్చో
రాదో, మీరు చెప్పింది అర్థమయ్యిందో లేదో ఏదీ తెలుసుకోకుండానే మాట్లాడడం
సైరైంది కాదు. అందుకే ఎప్పుడూ మీ ధోరణిలో మీరు చెప్తూ పోవద్దు. అవతలి వారి
అవగాహనా స్థాయినీ, అర్థం చేసుకునే తీరునూ దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి.
వారు చెప్పింది కూడా ఆసక్తిగా వినాలి. మీరూ అలాగే చెప్పాలి.
ఫాలోఅప్
ఉండాలి: ఒకసారి మాట్లాడాం కదా! అనుకుంటే సరిపోదు. కొన్ని సందర్భాల్లో
ఫాలోఅప్ తప్పక ఉండాల్సిందే. ఉదాహరణకు మీరు ఫోన్‌చేసి మీ సంస్థ గురించీ,
మీరు కల్పించే సౌకర్యాల గురించీ, బీమా సదుపాయాల గురించీ ఇతరులకు చేకూరిన,
చేకూరే ప్రయోజనాల గురించీ వివరించినప్పుడు ఆ వ్యక్తి ఎలా రియాక్టయ్యారో
పరిశీలించాలి. ఎదుటి వారితో మాట్లాడటమేకాదు... వారి ఆంతర్యాన్ని
గ్రహించగలగాలి. ఇంకోసారి కన్విన్స్ చేస్తే సానుకూలంగా స్పందించే అవకాశం
ఉన్నవారి లిస్టు తయారు చేసుకుని ఫాలోఅప్ చేయాలి. మీరు అనుకున్నది నెరవేరే
అవకాశం ఉంటుంది. ఇదంతా ఫాలోఅప్ ద్వారానే సాధ్యం. ఇలాంటి విషయాలన్నీ
పబ్లిక్ రిలేషన్ సంబంధిత ఉద్యోగస్థులందరికీ ఎంతో అవసరమౌతాయి. మీరు అలాంటి
వృత్తినే ఎంచుకున్నారా అయితే తప్పక పాటించండి మరి!
No comments:
Post a Comment