Sep 27, 2011

' క్రియేటివిటీ'ని ఎవరైనా పెంపొందించుకోవచ్చు !

మనిషి మెదడులో రెండు ప్రధానమైన భావోద్వేగ స్థితులు వుంటాయి. వాటిని నిమ్నోన్నత స్థితులంటారు. నిమ్న భావోద్వేగ స్థితిలో విచారం. నైరాశ్యం. భయాందోళనలు గూడు కట్టుకుని వుంటాయి. ఉన్నత స్థితిలో ఆనందం, ఆశయం, క్రియేటివిటీ వుంటాయి. ఈ రెండు భావోద్వేగ స్థితులు ఎప్పుడూ ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూ ఒకదాని నొకటి జయించాలని ప్రయత్నిస్తూ వుంటాయి. ఫలితంగా ''క్రియేటివిటీ'' ప్రభావితమవుతుంది. మీలో క్రియేటివిటీ ఉందని మీరు భావిస్తున్నారా? లేదని నిరాశ చెందుతున్నారా? అది వున్నా లేకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ''క్రియేటివిటీని ఎవరైనా పెంపొందించుకోవచ్చు'' అంటున్నారు డాక్టర్‌ డబ్ల్యూ. బ్రాడ్‌ ఫోర్ట్‌ స్విఫ్ట్‌'' అందుకు కొన్ని సూత్రాలను అందిస్తున్నాడు. క్రియేటివిటీ జనించే మెదడు భాగాన్ని మనం జాగ్రత్తగా సంరక్షించు కున్నట్లయితే అది వికసిస్తుందని బ్రాడ్‌ఫోర్ట్‌ అంటాడు. క్రియేటివిటీని పెంపొందించుకోవడానికి అనేక పద్ధతులున్నాయి. వాటిలో కొన్నింటిని పరిశీలిద్దాం.
మెడిటేషన్‌: ప్రతిరోజు క్రమం తప్పకుండా మెడిటేషన్‌ చేయడం అలవర్చుకోండి మెడిటేషన్‌ చేయడమంటే హిమాలయ పర్వతాలెక్కి తపస్సు చేయడమంత కష్టమైన పనేమీ కాదు. రోజుకు రెండుసార్లు అంతగా వీలుగాకపోతే ఒకసారైనా చేయవచ్చు. ఈ స్వల్ప కాల వ్యవధిలో మీరు ఒకచోట నిశ్శబ్దంగా, ప్రశాంతంగా కూర్చోండి. మెడిటేషన్‌ కొనసాగించడానికి ఎన్నో పద్ధతులు వున్నాయి. మీ ఎదురుగా ఒక కొవ్వొత్తిని వెలిగించి పెట్టుకుని దానివంకే చూస్తూ మెడిటేషన్‌ చేయవచ్చు. మీకు నచ్చిన ఒక పదాన్ని పదేపదే ఉచ్ఛరిస్తూ చేయవచ్చు. మీరు ఎంచుకునే పద్ధతి ఏదైనప్పటికీ మెడిటేషన్‌లో మీరు చేయాల్సింది క్రమం తప్పకుండా ప్రతిరోజూ ప్రశాంతంగా కూర్చుని మీతో మీరు గడపడం. మెడిటేషన్‌ అంటే ఇదే. ఆత్మావలోకనం ఏర్పరుచుకోవడం, కాస్సేపు ఇలా గడపటానికి మీరు ఏ ప్రదేశాన్నయినా ఎంచుకోవచ్చు. అది మీ ప్రశాంతతకు భగం కలిగించకుండా వుంటే చాలు.
నచ్చిన పరిసరాలు: మీ మనసుకు నచ్చే పరిసరాలను ఎంచుకోండి. మీ ఇంట్లో మీరు ఉపయోగించే గదిని, మీకు నచ్చినట్లుగా అలంకరించుకోవడం, ఇందులో ఒకభాగం లేదా రోజులో మీరు ఎక్కువ కాలం గడిపే ప్రదేశాన్ని మీకు(ఉదా|| మీ కార్యాలయం)నచ్చే ప్రదేశంగా మార్చుకోండి. ఆ ప్రదేశాన్ని చూడగానే మీకు ఎన్నో మధురమైన భావాలు ఏర్పడాలి. 'ఎంతసేపూ అక్కడే కూర్చుని ఆనందంగా గడపాల'నిపించే ప్రదేశమైతే మేలు.

మీకు బాగా నచ్చే కాలక్షేపం కార్యక్రమాలను ఏర్పరచుకోండి. అవి మీ క్రియేటివ్‌ మూడ్‌ని పెంచుతాయి. పనుల ఒత్తిడితో బాగా అలసటకు గురైన మీ మైండ్‌ కాలక్షేప కార్యక్రమాలలోనే తిరిగి శక్తిని పుంజుకుంటుంది. అందుచేత ఈ కార్యక్రమాలను ఎంచుకోవడంలో ముందు జాగ్రత్త అవసరం. సాధారణంగా మన కాలక్షేపం కోసం చేసే పనులను గురించి ముందుగా ఆలోచించం. ఆ సమయానికి ఏది తోస్తే అది చేస్తాం. అందువల్ల మన క్రియేటివ్‌ మూడ్‌ పెరగడం మాట ఎలావున్నా లేనిపోని ఇబ్బందులు ఎదురొచ్చే అవకాశం వుంది. ఏదో కాలక్షేపానికే కదా అని స్నేహితుల బలవంతం మీద సినిమాకు వెళతారు. ఆ సినిమా పరమ చెత్త సినిమా అయిందనుకోండి.
మీ మూడ్‌ రిఫ్రెష్‌ అవడం ఎలా వున్నా తలనొప్పి మాత్రం తప్పదు. అందుచేత కాలక్షేప పనులను ముందుగానే తెలివిగా ప్లాన్‌ చేసుకోండి. జాగింగ్‌, మెడిటేషన్‌, రన్నింగ్‌, స్విమ్మింగ్‌, ఎరోబిక్స్‌, స్నేహితులతో పార్టీలు (మందు పార్టీలు వద్దు) సంగీత కచేరీలు, పచ్చని పొలాల మధ్య గడపడం, ప్రశాంతంగా వున్న పార్కులకు వెళ్లడం, శిల్ప సౌందర్యం కలిగిన చారిత్రాత్మక కట్టడాలు, సముద్రతీరం, వన్య ప్రాణుల సంరక్షణాలయాలు, పసిపిల్లలతో ఆడుకోవడం, మీ అభిరుచికి తగిన, మీకు బాగా నచ్చిన సినిమా చూడడం, మీ కుటుంబ సభ్యులతో కలిసి టి.వి. చూడడం వగైరా కార్యక్రమాల వల్ల మీకు చక్కని కాలక్షేపం ఏర్పడడమేగాక క్రియేటివ్‌ ఆలోచనలు ఏర్పడతాయి.

No comments: