అందమైన ప్రకృతి దృశ్యాలకు నెలవు అయిన మాలి దేశం(ఆఫ్రికా ఖండం)లో అంతకంటే సుందరమైన ఊరు బందియాగరా. డాగాన్ తెగవారు నివసించే ఈ ఊరికి ఎవరైనా కొత్తవారు వెళ్తే, వారికి కావలసిన వారి ఇంటిని పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే, అక్కడి ఇళ్లన్నీ ఒకలాగే ఉంటాయి. పొడవైన మట్టి దిమ్మెల మీద, ఆకులతో పైకప్పు వేసినట్టుండే గృహాలే ఆ ఊరికి ప్రత్యేక ఆకర్షణ.
బందియాగరా అంటే ‘భోజనం చేసే పెద్ద లోతుగిన్నె’ అని అర్థం. డాగాన్ల మీద పరిశోధన చేస్తున్న నంగబాను అనే వ్యక్తి 1770లో ఈ గ్రామాన్ని కనుగొన్నాడు. సముద్రమట్టానికి 500 మీటర్ల ఎత్తున, ఓ పెద్ద పర్వత ప్రాంతంలో ఉంది బందియాగరా.
నూట యాభై చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ గ్రామ జనాభా 25,000. వీరు పద్నాలుగో శతాబ్దంలో మాలికి వలస వచ్చారు. మొదట బందియాగరాలోని మైదాన ప్రాంతంలో నివసించారు. అయితే తరచుగా వచ్చే వరదల తాకిడి నుంచి తప్పించుకోవడానికి ఎత్తయిన ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.
డాగాన్లు మంచి కళాకారులు. మట్టి, అడవుల్లో దొరికే రకరకాల పూసలతో కళాకృతులను చేస్తారు. చెక్క శిల్పాలు చేయడంలో వీరు సిద్ధహస్తులు. వాటిని పక్కవూళ్ల మార్కెట్లలో అమ్మి జీవనం సాగిస్తుంటారు. గాఢమైన రంగులు, డిజైన్లు ఉన్న దుస్తులను ధరిస్తారు. పూసల దండలు వేసుకుంటారు.
కొండ శిఖరాల మీద డాగాన్లు నిర్మించుకున్న గృహాలే బందియాగరాను పర్యాటక ప్రాంతంగా మార్చాయి. మట్టి, ఇటుకలు, గెడలు, ఆకులతో నిర్మించిన ఈ ఇళ్లు ఎంతో చిన్నగా ఉంటాయి. కాస్త ఎక్కువమంది ఉన్న కుటుంబం అయితే రెండు భాగాలుగా నిర్మించుకుంటారు. వీరి ఇళ్లకు కిటికీలు ఉండవు. ఇంటి వెలుపలి గోడలపై అందమైన డిజైన్లు వేస్తారు. పుర్రెలతో ఇంటిని అలంకరించే సంప్రదాయం కూడా ఉంది. దానివల్ల దుష్టశక్తులు ఇంట్లో చేరవని వాళ్లు నమ్ముతారు.
వీరు కచ్చితంగా పాటించే పద్ధతేమిటంటే, నెలసరి సమయంలో డాగాన్ స్త్రీలు ఇళ్లలో ఉండకూడదు. ఆ సమయంలో ఉండటానికి ఊరి చివర కొన్ని గృహాలు నిర్మించారు. ఇవి ప్రత్యేకంగా తెలియాలని అన్ని ఇళ్లలా కాకుండా గుండ్రంగా కట్టారు. బందియాగరాలో గోదాములు, ఆలయాలు కూడా ప్రత్యేక శైలిలో నిర్మితమయ్యాయి. 1989లో యునెస్కో బందియాగరాను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. |
|
No comments:
Post a Comment