Pages

Oct 28, 2011

పిల్ల జమిందార్‌...అల్లరి...

యాక్షన్‌ సినిమా అయినా, ఫ్యాక్షన్‌ స్టోరీ అయినా బోలెడంత వినోదముంటే బాక్సాఫీసు పండినట్టే. కథేంటన్నది ఆలోచించే పరిస్థితిలో ఉన్నారా ! లేదా ! అనేది విషయమే కాదు. ఒత్తిడి నుంచి రిలీఫ్‌ పొందటానికి వీక్షకుడు వినోదాన్ని ఆశ్రయిస్తున్నాడు. ఇందుకు కొంత కథా బలం తోడయితే సక్సెస్‌ పక్కా. ఆ కోవలో వచ్చిన చిత్రమే 'పిల్ల జమిందార్‌'. కొన్ని మానవీయ విలువల్ని జోడించి కథను నడపటంలో దర్శకుడు అశోక్‌ సక్సెస్‌ అయ్యాడు. పిల్ల జమిందార్‌గా నాని చేసిన అల్లరి ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. నటనకు స్కోపున్న సబ్జెక్ట్‌ కూడా. ప్రతీ నటుడికి భాగం కల్పించటం మెచ్చదగింది. కాలేజీ అధ్యాపకుల్నీ, వారి ఆలోచనల్నీ సందర్భానుసారంగా చూపారు.
బ్యానర్‌ : శ్రీ శైలేంద్ర సినిమాస్‌, సంగీతం : సెల్వ గణేష్‌
సంభాషణలు : చంద్రశేఖర్‌,
కథ, స్క్రినప్లే, దర్శకత్వం : అశోక్‌.జి, నిర్మాత : మాస్టర్‌ బుజ్జిబాబు
తారాగణం : నాని, హరిప్రియ, బిందు మాధవి, రావు రమేష్‌, యం.ఎస్‌.నారాయణ, శ్రీను అవసరాల, వెన్నెల కిషోర్‌,
ఇదీ కథ : పిల్ల జమిందార్‌ అలియాస్‌ పిజె (నాని) వేలకోట్ల ఆస్తికి కాబోయే వారసుడు. ఇదంతా తాత సంపాదించిన ఆస్తే. వెండి పళ్లేంలో తినడం, రోల్స్‌ రాయల్‌ కార్లో తిరగటం మినహా వేరే పనేమీ లేదు. చేతినిండా డబ్బు, దీనికి వందరెట్లు డబ్బుందన్న పొగరు. ఎవర్నీ లెక్కచేయనితనం, పెద్దవాళ్లని పలకరించి మరీ అవమానపర్చటం, బోర్‌ కొడితే కాలేజీకి వెళ్లటం ఈయనగారి సలక్షణాలు. తాత, తండ్రుల ఆస్తిపాస్తులున్నాయి కానీ, పిజె ఆలనాపాలనా చూసే గార్డియన్‌ అంటూ ఎవరూ లేరు. మంచీచెడ్డ వివరించే పెద్ద మనిషి లేకపోవటంతో పిజె ఇష్టమున్నట్టు వ్యవహరిస్తాడు. తాను మేజర్‌ అవటంతో ఇక తాత సంపాదించిన ఆస్తినంతటికీ వారసుడ్ని తానేనని, ఇక తన ఇష్టారాజ్యమని ఊరూవాడా చాటింపేస్తాడు. అయితే ఇది నిజం కాదని, తాత ఓ విల్లు రాశారని, అందులో కొన్ని షరతులున్నాయని, వాటిని పూర్తిచేస్తేనే పిజె ఆస్తికి వారసుడు అవుతాడని ట్రస్ట్‌కు సంబంధించిన లాయర్‌ చెబుతాడు. ఆ షరుతలేంటి ! వాటిని పిజె పూర్తిచేశాడా ! అన్నది మిగతా కథ !
ఒక ఆర్టిస్టుకు సరైన సమయంలో సరైన పాత్ర దొరికితే ఎలా ఉంటుందో...ఇందులో నాని చూపించాడు. ఇదే పాత్ర నానికి మొదటి సినిమా అయితే జనాలకి ఎక్కడం కష్టం. కానీ నాని గత చిత్రాలతో మంచి నటుడిగా గుర్తింపు అందుకున్నాడు. దీంతో పిల్ల జమిందారుగా నాని చూపిన అల్లరి బాగా క్లిక్‌ అయింది. డైలాగ్‌ చెప్పటంలో టైమింగ్‌, హావభావ విన్యాసంలో పర్‌ఫెక్షన్‌ చూపాడు. బ్యాడ్‌ బారు నుంచి జెంటిల్‌మన్‌ వైపు పాత్ర మరలిని తీరుకు నాని బాగా సూటయ్యాడు. ఇలాంటి స్క్రిప్ట్‌కు మంచి అభినయాన్ని చూపగలిగిన నటుడు కావాలి. ఇందులో ఏమాత్రం తేడా రానీయకుండా, క్లాస్‌, మాస్‌కు అర్థమయ్యేట్టు నటనా కౌశలం చూపగలగాలి...ఈ విషయంలో దర్శకుడు అశోక్‌కు తప్పకుండా వాటా ఇవ్వాల్సిందే.
హీరోయిన్‌ హరిప్రియ, బిందుమాధవి, రావు రమేష్‌, శ్రీను అవసరాల, యం.యస్‌.నారాయణ...తదితరులంతా పాత్ర పరిధి మేరకు చేశారు. కాలేజీ చదువును, అధ్యాపకుల్ని ఉన్నతంగా చూపటం బాగుంది. ఇక కథ విషయానికొస్తే...'ఎ మిలియనీర్‌' అనే కొరియన్‌ సినిమాను దర్శకుడు ప్రేరణగా తీసుకున్నాడు. ఈ సినిమా 2006లో వచ్చింది. మన నేటివిటికి మార్చటం, ఎంటర్‌టైన్‌ కోల్పోకుండా చూపటం చేశారు. కొన్ని సెంటిమెంట్‌ సన్నివేశాలు డ్రమెటిక్‌గా ఉన్నాయి. ఎలాంటి భీభత్సమైన ఫ్లాష్‌బ్యాక్‌లు లేకుండా, స్క్రిన్‌ప్లే చాలా క్లియర్‌గా అల్లుకున్నారు. 'అయ్యయో చేతిలో డబ్బులు పోయెనే...' అన్న ట్యూన్‌ను చాలా బాగా ఇంజెక్ట్‌ చేశారు. అందుకు ఎంచుకున్న సన్నివేశాలు కూడా నవ్విస్తాయి. చంద్రశేఖర్‌ రాసిన డైలాగ్స్‌ సినిమాకు ప్రాణం పోశాయి. మొదటి సగభాగంలో వినోదం, తర్వాత కాస్త సెంటిమెంట్‌ కలిపారు. అయితే సెకండ్‌ హాఫ్‌లో చూపిన సన్నివేశాలు నేటి ఫాస్ట్‌ కల్చర్‌కు ఎక్కడం కష్టమే. డ్రామా పాలు ఎక్కువైందనే చెప్పొచ్చు. 
నాని కథానాయకుడిగా అశోక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పిల్ల జమిందార్‌'. హరిప్రియ, బిందుమాధవి కథానాయికలు. శైలేంద్ర సినిమా పతాకంపై మాస్టర్‌ ఎస్‌.ఎస్‌. బుజ్జిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డి.ఎస్‌.రావు సమర్పకుడు. సినిమా చిత్రీకరణ పూర్తయింది. విజయదశమికి ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సమర్పకుడు మాట్లాడుతూ, నాని హీరోగా మా సంస్థలో నిర్మిస్తున్న వినోదాత్మక కుటుంబకథా చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చేవారంలో ఆడియోను విడుదల చేస్తున్నాం. నాని కెరీర్‌లో ఉత్తమ చిత్రంగా నిలుస్తుందని చెప్పారు.
దర్శకుడు అశోక్‌ చెబుతూ... కొన్ని కారణాల దృష్ట్యా ఓ జమిందారీ కుర్రాడు సాధారణ జీవితం గడపాల్సి వస్తుంది. అది దేనికోసమనేది తెరమీద చూడాల్సిందే. ఆద్యంతం వినోదాన్ని అందించే యూత్‌ఫుల్‌ చిత్రమిది. సెల్వ అందించిన పాటలు హైలైట్‌గా నిలుస్తాయని తెలిపారు.
నాని మాట్లాడుతూ, అన్ని వర్గాల వారిని అలరించే కథాంశమిది. ఇప్పటివరకు చేయని కొత్తపాత్రను పోషిస్తున్నాను అన్నారు.
ఇంకా ఎం.ఎస్‌. నారాయణ, డా. శివప్రసాద్‌, నాగినీడు, రావురమేష్‌, సమీర్‌, రణధీర్‌, వెన్నెల కిషోర్‌, ధనరాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: చంద్రశేఖర్‌, కెమెరా: సాయిశ్రీరామ్‌, కూర్పు: ప్రవీణ్‌.
నాని, హరిప్రియ, బిందుమాధవి కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'పిల్ల జమిందార్‌'. అశోక్‌ దర్శకత్వంలో డి.ఎస్‌.రావు నిర్మిస్తున్నారు. ఆడియో విడుదల సోమవారం రాత్రి జరిగింది. 'ఒక్క ఆంగ్ల పదం మాట్లాడకుండా తెలుగులోనే మాట్లాడాలని సభకు హాజరైన వారిని అడిగినా, చాలా మంది ఆంగ్ల పదాలు ఉపయోగించారు. కానీ ఒక్క తరుణ్‌ మాత్రం జాగ్రత్తగా తెలుగులో మాట్లాడారు. సరదాగా సాగిన ఈ ఫంక్షన్‌లాగానే సినిమా కూడా ప్రేక్షకులకు ఆనందాన్ని పంచుతుంది' అని హీరో నాని అన్నారు.
చిత్ర దర్శకుడు అశోక్‌ మాట్లాడుతూ...'సినిమాలో 60 మంది నటీనటులు పనిచేశారు. నాని ఒప్పుకోవడం వల్లే ఈ చిత్రం చేశాం. ఈ సినిమాకు నాని విలన్‌. ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవడమే ఈ సినిమా. సమ్మె ప్రభావంతో షూటింగ్‌ ఆలస్యమైనా నిర్మాత ముందుకు నడిపారు. త్వరలో ఈ సినిమాను విడుదల చేయనున్నా'మని తెలిపారు.
నిర్మాత డిఎస్‌రావు మాట్లాడుతూ...'ముందుగా నానితో వేరే సినిమా చేద్దామనుకున్నాం. కుదరలేదు. అశోక్‌ చెప్పిన కథ నానికి నచ్చడంతో చేశాం. సినిమాకు సమ్మెతోపాటు పలు ఆటంకాలు ఎదురయ్యాయి. విజయదశమికి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. సంగీత దర్శకుడు సెల్వగణేశ్‌ కొత్త తరహాలో సంగీతాన్ని అందించారు. పదేళ్ల నుంచి హిట్‌ కోసం ఆకలిగా ఉన్నాను. అది ఈ చిత్రంతో తీరుతుందనే నమ్మకముంది' అని తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన రాజమౌళి, బెల్లంకొండ సురేష్‌, తరుణ్‌, వరుణ్‌సందేశ్‌, తనీష్‌ నిఖిల్‌, కృష్ణుడు తదితరులు చిత్రం విజయవంతం కావాలనికోరారు.
నాని, హరిప్రియ జంటగా తెరకెక్కిన చిత్రం 'పిల్ల జమిందార్‌'. ఇటీవలే విడుదలై ప్రేక్షకాదరణ చూరగొంటోందని నిర్మాత డి.ఎస్‌.రావు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ...'ఈ చిత్రాన్ని నా కిచ్చిన బహుతిగా భావిస్తున్నా. పది సంవత్సరాల తర్వాత నాకు తొలి సక్సెస్‌ వచ్చింది. దర్శకుడు మంచి సినిమా తీశాడు. సినిమాలో పనిచేసిన వారందరికీ మంచి పేరు వస్తుంది. సినిమాను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా'నని పేర్కొన్నారు.
హీరో నాని మాట్లాడుతూ...'చిత్రం మళ్ళీ మళ్ళీ చూడాలనేవిధంగా ఉంది. ఎమోషనల్‌ సీన్స్‌ చాలా బాగా నచ్చాయి. అందరూ డైలాగ్స్‌లు నెమరేసుకుంటున్నారు. మంచి చిత్రాన్ని ఆదరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా'నని అన్నారు. ఒక సక్సెస్‌ఫుల్‌ సినిమాలో నటించానన్న ఆనందం కలుగుతోందని నటి హరిప్రియ పేర్కొంది.

No comments:

Post a Comment