తమ కాళ్లమీద తాము నిలబడితే ఉండే ఆనందమే వేరు!
దానినుండి వచ్చే ఆత్మవిశ్వాసం తీరే వేరు! ముఖ్యంగా మహిళలకు అదెంతో
గర్వకారణం! తలెత్తుకు నిలబడటానికి, తామేంటో నిరూపించుకోవడానికి, సమాజంలో ఓ
హోదాను ఏర్పరచుకోవడానికి ఇదో చక్కని మార్గం! అంతేకాదు, జీవితంలో ఆటుపోట్లు
ఎదురైన సమయంలో ఆర్థిక స్వావలంబననుండి వచ్చే ఆత్మస్థైర్యమే స్త్రీ
వెన్నెముక. వాటిని అధిగమించినపుడు కలిగే ఆత్మసంతృప్తి అతివకు ఓ విజయ కానుక.
వీటన్నింటి మేళవింపుల తాంబూలం తాలూకు విజయ దరహాసం నారీ పెదాలపై తటిల్లతలా
తళుకులీనుతుంది.
. సరిగ్గా అలాంటి దరహాసమే రజని
పెదాలపై తారాట్లాడింది. ఇతర రాష్ట్రీయులు తయారుచేసిన ఉత్పత్తుల స్టాల్స్
హైదరాబాదులో ఏర్పాటుచేశారు. అక్కడున్న వారందరిలో జూట్ ఉత్పత్తులు
అమ్ముతున్న రజని ప్రత్యేకంగా ఆకట్టుకుంది. వెళ్లి పలకరిస్తే, ''నా పేరు
రజని, ఫ్రమ్ కేరళ... అంటూనే మరలా 'సూపర్‌స్టార్ రజని...'' అంటూ ఫక్కున
నవ్వింది. ఆమె సెన్సాఫ్ హ్యూమర్‌కు నవ్వుతూనే, ''కేరళలో ఎక్కడినుండి
వచ్చారు?'' అనగానే ''నేను కేరళలోని కన్యాకుమారినుండి వచ్చాను'' అని
తెలుగులో సమాధానమిచ్చారు. దానికి ఆశ్చర్యపోతూ, ''అరె, మీకు తెలుగు
వచ్చే...'' అనడంతోనే, ''మావారి ఉద్యోగరీత్యా మేం ఐదారేళ్లు వైజాగ్‌లో
ఉన్నాం. అందుకే మీ అంత రాకపోయినా తెలుగు మాట్లాడగలను. నిజానికి నాకు తెలుగు
వచ్చు కనుకనే హైదరాబాదుకొచ్చాను'' అన్నారు రజని. ''అదేం, ఈ ఉత్పత్తులు
మీవి కావా?'' అన్న ప్రశ్నకు, ''నాతోపాటూ, నా స్నేహితురాలు జమీలాది.
నిజానికి ఈ ఉత్పత్తులు తయారుచేయాలన్న ఆలోచనకు అంకురం ఏర్పడింది జమీలా
మదిలోనుండే. ఆరంభించి విజయం సాధించడంలోని ఘనతకూడా దానిదే!'' అంటూ నిర్మలంగా
నవ్వింది.
''ఈ ఆలోచన ఎలా ఏర్పడింది, అందులో మీరెలా భాగస్వామిగా
మారారు?'' అడగడంతోనే చెప్పడం ప్రారంభించారు రజని. ''జెమీలా నా
స్నేహితురాలు. మేం పక్కా కేరళీయులం. జెమీలా తమిళనాడునుండి వచ్చి స్థిరపడిన
ముస్లిం. మతాలు వేరైనా అది మా ఇద్దరి స్నేహానికి ఆటంకంకాలేదు. ఒకరిపట్ల
మరొకరం ఎంతో అభిమానంగా ఉంటాం. నేను వృత్తిరీత్యా టీచర్‌ని. జెమీలా ఇంట్లోనే
ఉండేది. అయితే జెమీలాకు తన కాళ్లపై తాను నిలబడాలని ఎంతో ఆశ! ఎప్పుడూ అదే
ఆలోచించేది. తనకొచ్చిన నార ఉత్పత్తులనే ఆదాయమార్గంగా మార్చుకుంది. దానికి
డబ్బులు కావాలిగా! అందుకే బ్యాంకునుండి లోన్ తీసుకుంది. వచ్చిన డబ్బుతో
నారకొని టేబుల్‌మ్యాట్స్, కర్టెన్స్ తయారుచేయసాగింది. కేవలం తాను
ఒక్కర్తే కాకుండా... గ్రామంలో ఇంట్లో ఉండే స్త్రీలతో మాట్లాడింది. వంటపని
పూర్తయ్యాక కాలక్షేపంగానే కాకుండా ఆదాయవనరుగా అనిపించేసరికి వారంతా వెంటనే
ఒప్పుకున్నారు. వీరుకాక గ్రామంలో ఉండే పేద మహిళలు, వితంతువులు ఈ
పనిచేయడానికి ముందుకొచ్చారు. దాంతో జెమీలా వస్తువులు చేయడం సులభతరం
అయ్యింది.
అప్పుడే జెమీలా నన్నూ తన వ్యాపారంలో భాగస్వామికమ్మంది.
కానీ నాకవి ఎలా తయారుచేయాలో తెలీదు. మరి ఇందులో నేనేం చేయగలననే అనుమానం
నాకు కలిగింది. దానికి జెమీలా నీలో ఉండే ఆలోచనలు మాకు చెప్పు. కొత్త కొత్త
డిజైన్లు, ఐడియాలను ఆవిష్కరించు అని సూచించింది. అవికాక మార్కెటింగ్
వ్యవహారాలు చక్కబెట్టమంది. ఆ సలహా నాకు నచ్చింది. దాంతో నేను టీచరుగా
పనిచేస్తూనే వీటిపై దృష్టిసారించాను. సరికొత్త రూపాలు, కొంగొత్త వర్ణాల
మేళవింపులు, ఆకర్షణీయ సెట్లు రూపొందించే ఐడియాలు చెప్పాను. నూతనత్వం
సంతరించుకుంటే వినియోగదారుల దృష్టిని ఆకర్షించవచ్చని మాకు అమ్ముడవుతున్న
సరుకును బట్టే అర్థమైంది. ఇవికాక థ్రెడ్, కాటన్ వీవింగ్‌మిషన్లు
ఏర్పాటుచేశాం. సమిష్టి ఆలోచన ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తుందని మరోసారి
రుజువైంది. ఆ ధైర్యంతోనే ఇప్పుడు మేం ఏ రాష్ట్రానికైనా వెళ్లి మా
ఉత్పత్తులు అమ్ముకోగలుగుతున్నాం'' అంటూ మరోసారి నవ్వులు విరబోసింది రజని.
నవ్వు మనిషిని మరింత దగ్గరచేస్తుంది. ముఖ్యంగా వ్యాపారంలో నవ్వు ప్రధాన
పాత్ర వహిస్తుంది. అది రజని ఉత్పత్తుల అమ్మకాల్లో ప్రస్ఫుటించింది కూడా!
''నారను
ఎలా తయారుచేస్తారు?'' అని అడగడం ఆలస్యం రజని చకచకా చెప్పుకుపోయింది.
''తాటినారను తీసి ముందు కొన్ని గంటలు నీటిలో నానబెడ్తారు. తరువాత తీసి
ఎండబెడతారు. అలా ఎంత ఎక్కువసార్లు చేస్తే అంతగా ఆ నార దృఢంగా మారుతుంది.
వాటిని ఉపయోగించి మేం ఇవి తయారుచేస్తాం. అలాగే కేరళలో చాపలకు ఉపయోగించే
మేలురకం గడ్డి దొరుకుతుంది. అవి బాగా గట్టిగా ఉంటాయి. వాటితోనూ మేం
టేబుల్‌మాట్స్, కర్టెన్స్ తయారుచేస్తాం''
''మా ఉత్పత్తులు ఏ
రాష్ట్రంలోనైనా బాగా అమ్ముడుపోతాయి. కారణం మన్నిక. వీటి నాణ్యత చాలామందికి
నచ్చుతుంది. ఈ మ్యాట్స్‌వేస్తే టేబుల్‌కే మంచి లుక్ వస్తుంది. కిటికీలకు
తెరలుగా వేస్తే అందంగా ఉండటమే కాదు, ఎండసోకకుండా చల్లగా ఉంటుంది. కొనడానికి
వచ్చినవాళ్లు వీటి వివరాలన్నీ అడుగుతారు. అన్నీ తెలుసుకుని కొంటారు. అది
మాకెంతో నచ్చుతుంది. ఇప్పటికే వీటి గురించి తెలిసినవాళ్లు మరో ఆలోచనలేకుండా
వెంటనే కొనేస్తారు. మామూలుగా ఇతర రాష్ట్రాలకు మా ఇద్దరిలో ఎవరో ఒకరం
వస్తాం. నాకు తెలుగు వచ్చు కనుక నేను హైదరాబాదుకొచ్చాను''
''రాష్ట్రం
మారడంవలన మీరేం ఇబ్బందిపడలేదా?'' అనడిగితే..., ''ఊ... ఇక్కడ బియ్యం చాలా
సన్నగా ఉంది. అదే కష్టంగా ఉంది(మనం కేరళలో లావు బియ్యం, మింగుడుపడదు బాబూ
అని తెగ ఫీలయిపోతాం కదా..! ఏదయినా అలవాటును బట్టే ఉంటుందేమో!) అలాగే మాకు
కొబ్బరినూనె వంటలు ఇష్టం. ఇదికాక కొబ్బరినూనె మేం తలకే కాదు, శరీరానికీ
రాసుకుంటాం. ఇక్కడేమో ఆ అలవాటు లేదు. మేం మా ఉత్పత్తులు అమ్ముకోడానికి
వచ్చాం. మా అలవాటు ప్రకారం ముస్తాబైతే జిడ్డుముఖాలు అనుకుంటూ మా స్టాల్‌కు
రారని, మేం కొబ్బరినూనె అసలు రాసుకోవడమేలేదు. ఇలా ఉండటం అలవాటులేక ఎట్లానో
ఉంది. అయితే అలవాటుకన్నా మాకు అమ్మకాలు ముఖ్యం కదా..!'' అంటూ ఫక్కున
నవ్వేసింది.
''ఇంతదూరం రావడం ఏం కష్టంగా అనిపించదా?'' అన్న నా
అనుమానాన్ని తృటిలో తీర్చేసింది రజని. ''ఏదైనా సాధించాలనుకున్నాక దూరాభారం
చూస్తామా? అసలు మగాళ్లకన్నా స్త్రీలే ఎక్కడైనా నెట్టుకురాగలరు తెలుసా?
మహిళలకు ఓర్పు, నేర్పూ రెండూ ఎక్కువే. ఇంటాబయటా రాణించగలగడం అతివకు వెన్నతో
పెట్టిన విద్య. ఎంత తీరుగా వీటిని తయారుచేస్తామో, అంతే చక్కగా
వినియోగదారులతో మాట్లాడతాం. వ్యాపారంవల్ల మనుషులతో ఎలా మెలగాలో
నేర్చుకున్నాం. అంతేనా, వివిధ ప్రాంతాలు తిరగడంవల్ల ఎన్నో కొత్త విషయాలు
నేర్చుకున్నాం. స్త్రీ కేవలం వంటింట్లోనే కాదండీ... ప్రపంచంలో ఏమూలకెళ్లినా
గెలుపు సాధించగలదు'' అంటూ పలికింది ధీమాగా!
''ఇద్దరు కలిసి
వ్యాపారం కదా? ఎలాంటి తేడాలూ రాలేదా?'' అనగానే..., ''అస్సలు రాలేదు. నేను,
జెమీలా ఇరు మతాలకు చెందినవారం మాత్రమే కాదు, ఇరు రాష్ట్రాలకు చెందినవారం
కూడా! అయినా మా మధ్య ఎన్నడూ అభిప్రాయబేధాలు, తేడాలు రాలేదు. పైగా మా ఇద్దరి
అభిరుచులు, భావాలు ఒక్కటే. ఒకరికి ఒకరం తోడుగా ఉంటాం. వ్యాపారంలోనే కాదు,
మంచీచెడ్డా అన్నింటిలోనూ!'' అంది ఎంతో ఆర్థ్రంగా. అప్పుడూ రజని కళ్లు
నవ్వుతూనే ఉన్నాయి.
స్నేహంతో మొదలైన తోడ్పాటు వ్యాపారంలో
కొనసాగించి... కలిసికట్టుగా విజయపథంలో దూసుకుపోతున్న వీరిరువురూ
ఎదుటివారికి కేవలం వ్యాపార విలువలు మాత్రమే నేర్పడంలేదు. ''స్త్రీ
తల్చుకుంటే ఎంతటి కష్టాన్నైనా అధిగమించి గెలుపు సాధించగలదు. తాను
నిలదొక్కుకోవడమే కాదు, మరెందరినో ఆ బాటలో నడిపించగలదు. అన్నిటికన్నా
మిన్నగా కులమత బేధాలు, ప్రాంతీయ అభిమానాలు వదిలి ఐకమత్యంతో కలిసి నడిస్తే
అనంత దిగంతాలవైపు సాగిపోవడం ఎవరికైనా ఇట్టే సాధ్యం''... అని నిరూపించారు.
వీరిని చూస్తూ ఈ విషయాలు నిజంకాదని ఎవరమైనా అనగలమా?! 



No comments:
Post a Comment