మనలో
చాలామందికి ఎదుటివారిని వెనుకా ముందూ ఆలోచించకుండా విమర్శించడం అలవాటు.
నేనూ ఇందుకు మినహాయింపు కాదు. ఓసారి నేను అమెరికాలో ఉన్నప్పుడు మా
అమ్మాయితో వరలక్షివ్రతం పేరంటానికి వెళ్లాను. అక్కడికి చాలామంది తెలుగు
వాళ్లు వచ్చారు. అందరూ మన సాంప్రదాయబద్ధమైన దుస్తులు అంటే చీరలూ, పంజాబీ
డ్రెస్సులూ వేసుకొని ఉన్నారు. కానీ ఓ అమ్మాయి మాత్రం జీన్స్
వేసుకొచ్చింది. నాకెందుకో కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది.
ఇంటికెళ్లేటప్పుడు దారిలో ఉండబట్టలేక మా అమ్మాయితో, ''అదేంటే ఆ అమ్మాయి అలా
జీన్స్ వేసుకొచ్చింది. శుభ్రంగా చీర కట్టుకురాక'' అన్నాను. అందుకు మా
అమ్మాయి, ''అది కాదమ్మా, నీకు తెలుసు కదా ఇక్కడ ఆడ మగా ఉద్యోగం చేయడం
తప్పనిసరి. ఈ రోజు శుక్రవారం కదా (అమెరికాలో ఆఫీసులలో శుక్రవారంనాడు
మాత్రమే జీన్స్ వేసుకోవడానికి అనుమతి ఉంది) అందుకే ఆ అమ్మాయి ఆఫీసుకి
జీన్స్ వేసుకుని వచ్చుంటుంది. కానీ ఆఫీసునుంచి నేరుగా ఇంటికెళ్లి బట్టలు
మార్చుకోడానికి టైం లేక నేరుగా ఆఫీసునుంచే పేరంటానికి వచ్చుంటుంది. కదా!
అందుకే మనం ఎవరినైనా కామెంట్ చేసేముందు మన కోణంనుంచే కాకుండా అవతలి వారి
తరపునుంచి కూడా ఆలోచించాలమ్మా'' అంటూ నాకు క్లాసు పీకింది. మా అమ్మాయి అలా
చెప్పడంతో నాకు కనువిప్పు కలిగినట్లైంది. అప్పటినుంచీ నేను ఎవరినైనా
విమర్శించేముందు ఆలోచించడం నేర్చకున్నాను.
అలాగే ఒక్కొక్కసారి
మనం ఎవరింటికైనా వెళ్లినప్పుడు, వారు మనకు కాఫీ, టీ లేక కూల్‌డ్రింక్
లాంటివి ఆఫర్ చేయకపోతే, చూడమ్మా ఫలానా వాళ్లింటికి వెళ్తే కాఫీ, టీ
సంగతటుంచు కనీసం మంచినీళైనా అడగలేదు అనేస్తాం. ఆలోచిస్తే నిజానికి ఆ
సమయానికి వారింట్లో పాలు లేకపోయి ఉండవచ్చు. మరేదైనా కారణం కావచ్చు. కాబట్టి
మనం తొందరపడి ఇంత చిన్న విషయానికి ఎదుటి వారిని విమర్శించడం తగదు. మరొక
ఉదాహరణ. ఇంట్లో మనుమరాలి పెళ్లి పనులు జరుగుతున్నాయి. కొడుకు కోడలూ పెళ్లి
పనుల్లో నిండా తలమునకలవుతున్నారు. అదే సమయంలో ఆ తల్లి (అత్తగారు)
తీర్థయాత్రలకు వెళ్లవలసి వచ్చింది. ఇంట్లో మరో పెద్ద దిక్కు లేకపోవడంతో,
వంటపని దగ్గరనుంచీ, షాపింగ్ పనులవరకూ కోడలే చూసుకోవలసివచ్చింది. దానివల్ల
ఆమెకు ఇల్లు నీట్‌గా పెట్టుకోవడం కుదరలేదు. సమయానికి వంట మనిషి కూడా
దొరకలేదు. అంతా ఒంటి చేతిమీద కోడలే సమర్థించుకోవలసి వచ్చింది. అందుచేత ఈ
సదరు అత్తగారు తిరిగొచ్చేటప్పటికే కిచెన్ అంతా అస్తవ్యస్తంగా ఉంది.
ఫ్రిజ్‌లో అన్ని వస్తువులూ... అంటే పాలు, పెరుగూ, మీగడలూ పళ్లూ కూరలతో
కిక్కిరిసినట్లుగా తయారైంది.
అప్పుడా అత్తగారు, అయ్యో! కోడలు
ఒంటి చేతిమీద ఈ వారం రోజులూ ఎలా నెట్టుకొచ్చిందోనని కాస్త కూడా సానుభూతి
చూపకుండా ''మీ ఆవిడకి సమర్థత లేదురా, చూడు వారం రోజులు నేనింట్లో
లేకపోయేసరికి ఇల్లంతా ఎలా తయారయిందోనని' కోడలిని విమర్శిస్తూ కొడుకుతో
అన్నది. అలా కాకుండా అయ్యే పాపం నేనులేక పోవడంవల్ల కోడలు ఎంత ఇబ్బంది
పడిందోనని ఆ అత్తగారు ఆలోచించి ఉంటే ఎంత బాగుండేది.
మాకు
తెలిసినాయన ఒకాయన ఉన్నాడు చాలా పొదుపరి. ఆ పొదుపుని ఆయన అన్నిటిలోనూ
చూపిస్తాడు. ఓ రోజాయన మాకు ఫోను చేసాడు. చేసి ఆయన చెప్పాల్సింది. చెప్పేశాక
మేము ఓ ముఖ్య విషయం చెప్దామనుకుంటుండగా ఆయన ఫోను పెట్టేసాడు. అప్పుడు ఈ
పొదుపు బంగారంగానూ మనం చెప్పేది వినకుండా పెట్టేశాడనుకుంటూ ఆయన్ను
తిట్టుకున్నాం.
తరువాత మాకు తెలిసింది. ఆ సమయంతో ఆయన ఏదో అర్జంటు
పనిమీద బయటకు వెళ్లవలసి వచ్చిందని. అప్పుడు మేమంతా ఆయనని అపార్థం
చేసుకున్నందుకు ఎంతో నొచ్చుకున్నాము. అందుకే ఎవరినైనా విమర్శించేముందు,
కొంచెం ఆగి ఆలోచించడం మంచిది.
మరి కొంతమంది, ఫలానావిడకి గర్వం
అని సులువుగా అనేస్తారు. ఆమెకు నలుగురిలోకి రావడానికి ఏం సమస్యలు ఉన్నాయో,
ఎందుకని అందరితోనూ ఆమె కలివిడిగా ఉండడంలేదోనని ఆలోచించరు. ఆవిడ నలుగురిలోకి
రాకపోవడానికి సవాలక్ష కారణాలు ఉండవచ్చు. ఇంట్లోని పనివల్ల రాలేకపోవచ్చు.
లేక ఆమె భర్తకి అభ్యంతరం ఉండవచ్చు. ఇలా ఎన్నో కారణాలు ఉండవచ్చు. అందుకే
అవతలి వారి ఇబ్బందులు ఏమిటో తెలుసుకోకుండా విమర్శించడం సంస్కారం
అనిపించుకోదు.




No comments:
Post a Comment