skip to main |
skip to sidebar
బిడియం వద్దురా కన్నా..!
కొందరు
పిల్లల్లో బిడియ స్వభావం పసితనంనుంచే ఏర్పడుతుంది. వారు తమ తల్లి, తండ్రి,
కుటుంబసభ్యులు తప్ప ఇతరులు, అపరిచితులు ఎత్తుకుంటే వెంటనే
ఏడుపందుకుంటారు.. తిరిగి తల్లి ఎత్తుకునేవరకూ వారి రాగాలాపన ఆగదు. అటువంటి
పిల్లలు పెరుగుతున్నప్పటికీ, వారిలోని ఆ స్వభావం వారిని అంటిపెట్టుకునే
ఉంటుంది. ఇంటికి అతిథులొచ్చినా, బంధువులొచ్చినా అక్కడనుంచి పారిపోతారు.
లేకుంటే తల్లి వెనుక నక్కి తొంగి చూస్తుంటారు. అవతలవారు పలకరిస్తే సమాధానం
చెప్పకుండా సిగ్గుతో ముడుచుకుపోతారు. లేదా తలవంచుకుని, వారివైపు చూడకుండా
మాట్లాడతారు. పిల్లలలోని ఆ స్వభావాన్ని పెద్దలు బాల్యంలోనే తొలగించాలి.
లేకపోతే ఈ మనస్తత్వం వారి భవిష్యత్తుకు, పురోభివృద్ధికి వారిలోని
అవరోధమవుతుంది. ఇటువంటి బిడియపు స్వభావం ఉన్న పిల్లలు తోటిపిల్లలతో
కలవలేరు. దానివల్ల స్నేహితులను ఏర్పరచుకోలేరు. ఆ కారణంచేత ఒంటరిగా
ఉండిపోతారు. చిన్నప్పటినుంచీ ఒంటరితనానికి అలవాటుపడిన పిల్లలు పెద్దవారయినా
ఆ లక్షణాన్ని వదులుకోలేరు. నలుగురితో కలవలేకపోవడంవల్ల వారికి ఎదుటివారితో
ఎలా ప్రవర్తించాలో, ఎలా మాట్లాడాలో నేర్చుకోలేరు. మాటల్లో తడబాటు వచ్చి,
తాము చెప్పాలనుకున్న విషయాన్ని సరిగ్గా వ్యక్తం చేయలేకపోతారు.... కేవలం
బిడియం వల్ల ఎన్నో అమూల్య అవకాశాలను జారవిడుచుకునేవారు కూడా ఉన్నారు.
పిల్లలుగా ఉన్నప్పుడు కన్నా పెద్దయ్యేకొద్దీ అది వారికి సమాజంలో ఎదుగుదలకు ఓ
ఆటంకంగా మారుతుంది.
పిల్లల్లో ఏర్పడే ఈ స్వభావాన్ని గుర్తించిన
పెద్దలు ఆదిలోనే వారి బిడియాన్ని పోగొట్టాలి. ఒంటరిగా ఉండకుండా వారిని
తోటిపిల్లలతో ఆడుకోమని ప్రోత్సహించాలి. అందరితో మాట్లాడటం అలవాటు చెయ్యాలి.
నలుగురిలోకి తీసుకెళ్తుండాలి. బిడియంగా ఉంటే, జీవితంలో ఎందులోనూ ధైర్యంగా
ముందడుగు వేయలేరన్నమాట వాస్తవమేగా! తల్లిదండ్రులు ఈ విషయాన్నే అర్థమయ్యేలా
వారికి బోధించాలి. వారిలోని సిగ్గరితనాన్ని పోగొట్టి... నలుగురితో
కలవగలిగేలా, అపరిచితులతోనూ మాట్లాడగలిగేలా వారి ప్రవర్తననను, స్వభావాన్ని
సరిదిద్దాలి. సమాజంలో నెట్టుకురాగలిగేలా వారిలో మార్పుతేవాలి. బిడియం
అన్నది బాల్యంలోనే తొలగించుకోలేకపోతే, భవిష్యత్తులో వారు పైకి ఎదగలేరు.
అందువల్ల, పిల్లలోని బిడియపు స్వభావాన్ని, ఆదిలోనే అరికట్టాలి. అందుకు
పెద్దలు తమ వంతు కృషిచేయాలి.
No comments:
Post a Comment