తనపై తెలంగాణ ఎంపీల ఒత్తిడి
అవాస్తవమని స్పష్టీకరణ
వారెవరూ తనతో మాట్లాడలేదని వివరణ
గ్యాస్ ఇస్తామని రాష్ట్ర అధికారులకు తెలిపినట్లు వెల్లడి... ఈ విషయంపై మీకు ఫోన్ కూడా చేశానని గుర్తు చేసిన జైపాల్
ఇప్పటికీ ఆ అవకాశముందని వెల్లడి
తెలంగాణ నేతల ఒత్తిడి ఫలితంగానే జైపాల్ లేఖ?
న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రి జైపాల్‌రెడ్డి అనూహ్య రీతిలో పెద్ద ఝలక్ ఇచ్చారు. రాష్ట్ర విద్యుత్ ప్లాంట్లకు గ్యాస్ కావాలని తాను జైపాల్‌ను తాను కోరగా, ఇవ్వొద్దంటూ తెలంగాణ నేతలు ఆయనపై ఒత్తిడి తెచ్చారని శనివారం కిరణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం తెలిసిందే. అయితే తెలంగాణ నేతలు గానీ, ఎంపీలు గానీ ఆ విషయంలో తనపై ఎలాంటి ఒత్తిడీ తేలేదని జైపాల్ స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎంకు ఆదివారం ఆయన ఓ లేఖాస్త్రం సంధించారు! దీనిపై ఆ నేతలెవరూ తనతో మాట్లాడనే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఎంపీల ఒత్తిడి వల్లే జైపాల్ ఈ లేఖ రాశారని సమాచారం. ‘‘బహిరంగంగా మీరెటూ మద్దతివ్వడం లేదు. ఇలాంటి విమర్శలనైనా అధికారికంగా తిప్పికొట్టకుండా చోద్యం చూస్తారా? మమ్మల్ని లక్ష్యం చేసుకుని కిరణ్ ఇష్టానికి విమర్శలు చేస్తుంటే తెలంగాణకు చెందిన మీరు స్పందించరా?’’ అంటూ ఎంపీలతో పాటు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు కూడా ఫోన్లలో జైపాల్‌ను నిలదీసినట్టు తెలుస్తోంది. శని, ఆదివారాల్లో కేంద్రమంత్రుల కార్యాలయాల నుంచి ఎలాంటి అధికారిక వర్తమానాలూ వెళ్లవు. అయినా అధికారులతో జైపాల్ లేఖ తయారు చేయించి, ఆదివారమే దాన్ని ఫ్యాక్స్‌లో సీఎం కార్యాలయానికి పంపి, పత్రికలకూ విడుదల చేశారని పెట్రోలియం శాఖ వర్గాలు పేర్కొన్నాయి. లేఖ పూర్తి పాఠమిదీ...
‘‘కిరణ్‌కుమార్‌రెడ్డి గారూ,
జీఎంఆర్ వేమగిరి మూసివేత వల్ల, దానికి కేటాయించిన గ్యాస్‌ను తక్షణం ఇతర ఐపీపీలకు మళ్లించాల్సిన ఆవశ్యకతపై సెప్టెంబర్ 19న మీరు నాతో ఫోన్లో మాట్లాడారు. మీకిచ్చిన హామీ మేరకు దానిపై వెంటనే చర్యలు చేపట్టాలంటూ నా శాఖ అధికారులను ఆదేశించాను. వారితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాధికారులు విస్తృతంగా సంప్రదింపులు జరిపారు. పలుసార్లు నన్నూ కలిశారు. కానీ, 75 శాతం పీఎల్‌ఎఫ్ పరిమితి కారణంగా వేమగిరి తాలూకు గ్యాస్‌ను ఇతర ఐపీపీలకు మళ్లించడం కుదరదని తేలింది. ప్రత్యామ్నాయంగా ఆర్‌ఎల్‌ఎన్‌జీని గెయిల్ వెంటనే అందుబాటులోకి తెస్తుందని ఆంధ్రప్రదేశ్ అధికారులకు తెలిపాం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. వారు కావాలనుకుంటే ఈ ప్రతిపాదనను ఇప్పటికైనా పరిశీలించవచ్చు. దీన్ని గురించి సెప్టెంబర్ 22న మీకు నేను ఫోన్‌లో కూడా వివరించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. వాస్తవాలిలా ఉంటే, గ్యాస్ కేటాయించొద్దంటూ తెలంగాణ ఎంపీలు నాపై ఒత్తిడి తెస్తున్నారని మీరు నమ్ముతున్నట్టు నాకు తెలియవచ్చింది. ఈ విషయమై వారెవరూ నాతో మాట్లాడనేలేదని మీకు స్పష్టం చేస్తున్నాను’’ |
|
No comments:
Post a Comment