Sep 26, 2011

కదిలిన రైళ్లు... సడలని సమ్మె సమ్మెలోకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు

రైల్‌రోకోను పొడిగించరాదనితెలంగాణ జేఏసీ నిర్ణయం
అవసరమైతే నిరవధిక రైల్‌రోకో: కోదండరాం
ఆదివారం రాత్రి నుంచి తిరుగుతున్న రైళ్లు, ఆటోలు
సమ్మెలోనే ప్రభుత్వ, సింగరేణి, ఆర్టీసీ సిబ్బంది...
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగులు
తొలగిస్తామన్న ప్రభుత్వ హెచ్చరికలు బేఖాతర్
ఆర్టీసీ జేఏసీతో యాజమాన్యం చర్చలు విఫలం
దసరా సెలవులకన్నా తెలంగాణే మిన్న.. టీచర్ల జేఏసీ తీర్మానం

న్యూస్‌లైన్ నెట్‌వర్క్: తెలంగాణవ్యాప్తంగా సకల జనుల సమ్మె 13వ రోజు కూడా పూర్తిస్థాయిలో కొనసాగింది. రైల్ రోకో రాజధాని సహా తెలంగాణ జిల్లాల్లో రెండు రోజుల ఆటోల సమ్మె, రైల్‌రోకో ఆదివారంతో ముగిసినా రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, ఆర్టీసీ సిబ్బంది, సింగరేణి కార్మికుల సమ్మె యథాతథంగా కొనసాగుతోంది. అన్ని విభాగాల్లో కలిపి దాదాపు 6 లక్షల మంది సిబ్బంది సమ్మెలో ఉన్నారు. రైల్‌రోకోను మరో 48 గంటలు పొడిగించాలని ఉద్యమకారుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నా ఉద్యమ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఆదివారానికే పరిమితం చేసినట్టు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రకటించారు. అవసరమైతే నిరవధిక రైల్‌రోకోలకు దిగుతామన్నారు! మరోవైపు రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు సంఘీభావంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బంది సోమవారం ఒక రోజు సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రభుత్వ డ్రైవర్లు కూడా సోమవారం నుంచి సమ్మెకు దిగనున్నారు. సోమ, మంగళవారాల్లో తెలంగాణలోని పరిశ్రమల ఉద్యోగులు కూడా బంద్‌లో పాల్గొననున్నాయి. తెలంగాణలోని అన్ని ఆలయాల్లోనూ మంగళవారం ప్రసాదాలతో పాటు ఆర్జిత సేవలన్నింటినీ ఆపేస్తున్నట్టు తెలంగాణ అర్చక సమాఖ్య ప్రకటించింది. తెల్లవారుజామున దేవుళ్లకు నిత్యపూజలు, నైవేద్య సమర్పణ తర్వాత గర్భగుళ్లకు తాళాలేస్తామని పేర్కొంది. తెలంగాణ ఆర్టీసీ జేఏసీతో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమవడంతో సమ్మె ఉధృతి మరింత పెరిగేలా ఉంది. అయితే, సోమవారం విధులకు హాజరు కాకపోతే కాంట్రాక్టు కార్మికులపై కఠినచర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ ప్రసాదరావు హెచ్చరించారు. ప్రభుత్వమిచ్చే దసరా సెలవులు తమకొద్దని, తెలంగాణే కావాలని టీచర్ల జేఏసీ స్పష్టం చేసింది. తెలంగాణలోని 1.7 లక్షల మంది టీచర్లు మరింత చురుగ్గా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. సోమవారం నుంచి శుక్రవారం దాకా ఆందోళన కార్యక్రమాలనూ ప్రకటించింది. 24 గంటల్లో విధుల్లోకి రాకుంటే తొలగిస్తామని ప్రభుత్వం నోటీసులను కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగులు బేఖాతరు చేశారు. సమ్మెలోనే కొనసాగాలని నిర్ణయించారు. రెండో రోజు రైలు రోకో, ఆటోల బంద్‌తో ఆదివారం ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. సెట్విన్ బస్సులు కూడా రోడ్లపైకి రాలేదు. ప్రైవేట్ ఆపరేటర్లు ప్రయాణికుల నుంచి అడ్డగోలుగా దండుకున్నారు. తెలంగాణ అంతటా ఆదివారం రాత్రి నుంచి రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. సోమవారం ఉదయం హైదరాబాద్ రావాల్సిన రైళ్లన్నీ యథావిధిగా చేరుకుంటాయని రైల్వే అధికారులు చెప్పారు. ఆదివారం సాయంత్రానికే ఆటోలు కూడా రోడ్డెక్కడంతో, ఆర్టీసీ బస్సుల బంద్‌తో ఇబ్బందుల పాలైన ప్రయాణికులకు కాస్త ఊరట కలిగింది.

రైళ్ల పునరుద్ధరణ
48 గంటల రైల్‌రోకో ముగియడంతో ఆదివారం రాత్రి నుంచి దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను పునరుద్ధరించింది. సాయంత్రం ఆరింటికి ఉద్యమకారులు పట్టాలను వీడగానే పలు సెక్షన్లలో ముందు ఇంజన్లను నడిపి, భద్రతాపరమైన తనీఖీలు చేశారు. రాజధాని నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లను రాత్రి 10.30 తర్వాత; హైదరాబాద్‌కు వచ్చే, తెలంగాణ మీదుగా వెళ్లే రైళ్లను రాత్రి 9 తర్వాత పునరద్ధరించారు. ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్, హైదరాబాద్, లింగంపల్లి, బేగంపేట రైల్వేస్టేషన్లలో రిజర్వేషన్, సాధరణ బుకింగ్ కౌంటర్లను రాత్రి 8 దాకా తెరిచి ఉంచారు. రైల్‌రోకోను 72 నుండి 96 గంటల పాటు చేయాలని జేఏసీ తొలుత నిర్ణయించింది. ముందుగా 48 గంటలు ప్రకటించి, తర్వాత మరో 48 గంటలు పొడిగించాలనుకున్నారు. ఆ మేరకు ఆదివారం మధ్యాహ్నం ప్రకటన చేయాల్సి ఉంది. కానీ ప్రజలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయకపోవడంతో పొడిగింపు పట్ల వ్యతిరేకత రావచ్చని భావించారు. దీనిపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తోనూ కోదండరాం ఆదివారం చర్చించారు. ‘‘రైల్‌రోకోపై ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఉద్యమంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నేతలను అరెస్టులు చేస్తే ఉద్యమానికి విఘాతంక కలగవచ్చు. జేఏసీలో కొన్ని పార్టీలపైనే భారం పడుతోంది. ఇలాంటి లోపాలను సవరించుకున్నాక మళ్లీ రైల్‌రోకోకు దిగుదాం’’ అని జేఏసీ నిర్ణయించింది.

ఆదివారమూ అదే జోరు

ఆదివారానికి రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, సింగరేణి సమ్మె 13వ రోజుకు, ఆర్టీసీ సమ్మె ఏడో రోజుకు చేరింది. దాంతో సర్కారు సేవలు యథాతథంగా నిలిచిపోయాయి. జంటనగరాల్లో ఉద్యోగుల హాజరు కాస్త ఉన్నా ఫైళ్లు కదలడం లేదు. హైదరాబాద్ హయత్‌నగర్‌లో విజయవాడ వైపు వెళ్తున్న 4 బస్సుల అద్దాలను తెలంగాణవాదులు ధ్వంసం చేశారు. ప్రజాప్రతినిధులకు సద్బుద్ధి ప్రసాదించాలంటూ జిల్లాల్లో గాడిదలు, గొర్రెలు తదితరాలకు వినతిపత్రాలిచ్చారు. తెలంగాణకు పట్టిన శని వదలాలంటూ మహబూబ్‌నగర్ రైల్వేస్టేషన్లో టీఆర్‌ఎస్ నేతలు మహాయజ్ఞం నిర్వహించారు. అక్టోబర్ నుంచి జిల్లాలో సరుకులు పంపిణీ చేయబోమని రేషన్ డీలర్ల సంఘం ప్రకటించింది. 26 నుంచి 30 దాకా పలు ఆందోళన కార్యక్రమాలను టీచర్ల జేఏసీ ప్రకటించింది. చైర్మన్ పూల రవీందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘాల నేతలు ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయించారు. 27 నుంచి దసరా సెలవులున్నా, సోమవారం టీచర్లెవరూ విధులకు హాజరు కాబోరని తీర్మానించింది. 26న మండల కేంద్రాల్లో మోటారు సైకిల్ ర్యాలీలు, పాఠశాలల మూసివేత, 27న బతుకమ్మ, 28న తాలుకా కేంద్రాల్లో అమరవీరుల స్ఫూర్తి సభలు, 29న నిరాహార దీక్షలు, 30న కొవ్వొత్తుల ప్రదర్శనలకు నిర్ణయించారు. టీచర్లపై ఎస్మా ప్రయోగించినా బెదరబోమని తెలంగాణ గురుకులాల జేఏసీ కన్వీనర్ వెంకటరెడ్డి ప్రకటించారు.

సమ్మె విరమించేది లేదు: ఆర్టీసీ జేఏసీ
తెలంగాణ ఆర్టీసీ జేఏసీతో యాజమాన్యం ఆదివారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమ్మెతో ఆర్టీసీకి తీవ్ర నష్టాలొస్తున్నాయని, లాభాలొచ్చే పండుగ సీజన్ కావడంతో వెంటనే విరమించాలని ఎండీ ప్రసాదరావు, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు నాగరాజు, రమణయ్య కోరారు. ప్రయాణికులు ఇప్పటికే ప్రైవేట్ ఆపరేటర్ల వైపు వెళ్తున్నారని, సమ్మె కొనసాగితే వారిక ఆర్టీసీ వైపు రారని అన్నారు. తెలంగాణపై నిర్ణయం వచ్చేదాకా సమ్మె విరమించేది లేదని నేతలు దొంతు ఆనందం, అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి తదితరులు స్పష్టం చేశారు. సమ్మె సీరియస్‌గా జరుగుతోందని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని యాజమాన్యాన్ని కోరారు. 30 లోపు కార్మికులకు జీతాలివ్వాలని డిమాండ్ చేశారు. రోజుకు రూ.8 కోట్లు చొప్పున ఇప్పటికే రూ.55 కోట్ల దాకా నష్టం వచ్చినట్లు ఆర్టీసీ అంచనా వేసింది. గ్రూప్ 1 పరీక్ష కోసం హైదరాబాద్‌లో కొన్ని బస్సులను పోలీసు రక్షణ మధ్య నడిపారు. ఇక సింగరేణిలో ఆదివారం వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో బొగ్గు ఉత్పత్తి స్తంభించగా ఖమ్మం జిల్లాలో యథావిధిగా కొనసాగింది. 15,361 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 9,789 టన్నుల రవాణా జరిగాయి. ఆదివారం పని చేసిన వారికి యాజమాన్యం ప్రకటించిన రెండు రోజుల వేతనంతో పాటు ఆదివారం కావడంతో మరో రోజు వేతనం అదనంగా లభించింది.సమ్మె కారణంగా సింగరేణిలో 14.27 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయి సంస్థకు రూ.264 కోట్ల నష్టం వాటిల్లింది. కార్మికులు వేతనాలరూపంలో రూ.70 కోట్లు నష్టపోయారు.

No comments: