రైల్‌రోకో ముగియడంతో ఆదివారం రాత్రి నుండి రైల్వేశాఖ పలు రైళ్లను పునరుద్ధరించింది. సకల జనుల సమ్మెలో భాగంగా తెలంగాణ రాజకీయ జెఎసి ఇచ్చిన పిలుపు మేరకు 48 గంటల రైలు రోకో, ఆటోల బంద్ రెండో రోజు ఆదివారం కూడా కొనసాగాయి. రైలు రోకో నేపథ్యంలో రైల్వే అధికారులు ముందస్తుగా పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. దీంతో పట్టాలపై ఆందోళనకారులు బైఠాయించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి పట్ల నిరసన తెలిపారు. బస్సులకు తోడు రైళ్లు, ఆటోలు బంద్ కావడంతో రెండు రోజులుగా రవాణ పూర్తిగా స్తంభించింది. ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాగా రెండు రోజుల రైలు రోకో ముగియడంతో రైల్వేశాఖ ఆదివారం రాత్రి నుండి పలు రైళ్లను పునరుద్ధరించింది. బంద్ ముగియడంతో ఆటోలు కదిలాయి. ఇదిలా ఉంటే ఈ నెల 19 నుండి నిరవధిక సమ్మె చేపట్టిన ఆర్టీసి కార్మికులతో సంస్థ ఎమ్‌డి ప్రసాదరావు జరిపిన చర్చలు విఫలమ య్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు సమ్మెను విరమించేది లేదని జెఎసి నేతలు చెప్పారు. రైళ్లు, ఆటోల బంద్ ముగియడంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ బస్సుల బంద్ కొనసాగు తుండటంతో ప్రయాణీకుల ఇబ్బందులు ఇంకా సమసి పోలేదు. కాగా సకల జనుల సమ్మె, ప్రస్తుత పరిస్థితులపై టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్‌తో ఆయన నివాసంలో రాజకీయ, ఉద్యోగ జెఎసి నేతలు సమావేశ మయ్యారు.
తదుపరి కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. కాగా దసరా పండుగను పురస్కరించుకొని ప్రజలపై ప్రత్యక్షంగా సకల జనుల సమ్మె ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆ సమావేశంలో అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొంత సడలించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆదివారం తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో రైలు రోకో జరిగింది. కార్యకర్తలు రైలు పట్టాలపై బైఠాయించి ఆందోళన చేశారు. ఆందోళనల్లో టిఆర్‌ఎస్, రాజకీయ జెఎసి నేతలు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని మౌలాలి స్టేషన్‌లో పట్టాలపై శనివారం రాత్రంతా బైఠాయించారు. అక్కడే నిద్రించారు. పలు ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా ఆందోళనలు జరిగాయి. మౌలాలిలో ఆగి ఉన్న పాత గూడ్స్ బోగీకి దుండగులు నిప్పు పెట్టడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. రైల్వే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆటోల బంద్ రెండో రోజు కూడా కొనసాగింది. ఆటోవాలాలు ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీల వంటి కార్యక్రమాలు నిర్వహించారు. రెండు రోజుల రైలు రోకో, ఆటోల బంద్ ప్రశాంతంగా జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదని డిజిపి దినేష్‌రెడ్డి చెప్పారు. రైలురోకో, ఆటోల బంద్, గ్రూప్-1 పరీక్ష నేపథ్యంలో తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించినట్లు తెలిపారు.
రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాల మేరకు తెలంగాణాలో సమ్మె చేస్తున్న ఆర్టీసి కార్మిక సంఘాల నేతలతో సంస్థ ఎమ్‌డి ప్రసాదరావు ఆదివారం రెండో దఫా చర్చలు జరిపారు. బస్ భవన్‌లో దాదాపు రెండు గంటల పాటు జరిగిన చర్చల్లో కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. సమ్మె వల్ల గత ఏడు రోజులుగా ప్రయాణీకులు అసౌకర్యానికి గురవుతున్నారని ఎమ్‌డి నేతలకు వివరించారు. సంస్థకు భారీగా నష్టం వాటిల్లిందన్నారు. ప్రజల ఇబ్బందులు, సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కార్మికులు సమ్మెను విరమించాలని విజ్ఞప్తి చేశారు. సమ్మెను కొనసాగిస్తే సంస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు సమ్మెను విరమించేది లేదని కార్మిక సంఘాల నేతలు చెప్పారు. సమ్మె తమ చేతిలో లేదని పేర్కొన్నారు. సకల జనుల సమ్మెను ఉద్యోగ జెఎసి చేపట్టిందని, వారు విరమించే వరకు తామూ విరమించబోమని చెప్పారు. సమ్మె కొనసాగిస్తామని చెప్పడంతో దశల వారీగా కార్మికులపై కఠిన చర్యలకు ఆర్టీసి యాజమాన్యం సిద్ధమైనట్లు సమాచారం. కాగా ఆదివారం 379 బస్సులను తిప్పామని ఆర్టీసి తెలిపింది. 



No comments:
Post a Comment