Sep 26, 2011

'బొబ్బిలిపులి' విడుదలై 30 సంవత్సరాలు

ఎన్‌.టి.ఆర్‌.కు రాజకీయ జీవితానికి పునాది వేసిన చిత్రం 'బొబ్బిలిపులి'. ఇందులోని డైలాగ్స్‌, నటన జనాన్ని ఓ ఊపు ఊపింది. ఆవేశపూరిత సన్నివేశాల్ని దర్శకుడు దాసరి నారాయణరావు చాలా బాగా డీల్‌ చేశారు. మాటలు, పాటలు కథకు బలాన్ని చేకూర్చాయి. వడ్డే రమేష్‌ నిర్మించిన చిత్రం తెరమీదకొచ్చి, 30 సంవత్సరాలు అవుతోంది. ఆనాడు ఈ చిత్రాన్ని రూ. 50 లక్షల బడ్జెట్‌తో 50 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేశారు. అయినా మూడు నెలలు విడుదలకు నోచుకోలేదు. కారణం సెన్సార్‌ నుంచి ఆటంకాలేర్పడ్డాయి. ఆ సమయంలో ఎల్‌వి.ప్రసాద్‌ సెన్సార్‌ బోర్డు ఛైర్మన్‌గా ఉన్నారు.
అందులో క్లైమాక్స్‌లో కోర్టు సీన్లను కట్‌ చేయాలని బోర్డు కోరింది. ఇందుకు ఎన్టీఆర్‌, దాసరి ససేమిరా అన్నారు. సినిమాకు పతాక సన్నివేశం, అత్యంత కీలకమైన సన్నివేశాలవి. వీటిని కట్‌ చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పేశారు. అయితే సినిమాకు సెన్సార్‌ కష్టమన్నారు. దీంతో ఈ విషయం ఢిల్లీ వరకూ వెళ్ళింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ సలహాదారు పి.వి.నరసింహరావు. అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి. వీరిద్దరూ తెలుగువారు కావడంతో ప్రత్యేకంగా సినిమా చూపించారు. బాగుందని చిత్ర యూనిట్‌కు ప్రశంసలు దక్కాయి. దీంతో సెన్సార్‌ అడ్డంకులు తొలగాయి. వెంటనే సినిమా విడుదలైంది. 39 సెంటర్లలో 100 రోజులు ఆడింది. రెండు వారాలకే కోటి వసూలు చేసి రికార్డ్‌ సృష్టించింది. హైదరాబాద్‌ సుదర్శన్‌, విజయవాడ వెంకటేశ్వరలో 175 రోజులు ఆడి చరిత్ర సృష్టించింది.

No comments: