Sep 26, 2011

సమాధిలోని శవం గాలి పీల్చి వదులుతుందా?

  • విశ్వాసాలు.. వాస్తవాలు...
నాలుగైదేళ్ళ కిందటి మాట. చిత్తూరు జిల్లా కార్వేటినగర్‌ దగ్గర ఒక అరేబియన్‌ ముస్లిం దర్గా ఉంది. ఆ అరేబియన్‌ దాదాపు 200 ఏళ్ళ కిందట జీవించాడట. ఆయన చనిపోయిన తర్వాత ఆయనను ఖననం చేసిన చోట ఒక దర్గా వెలిసింది. చాలామంది ప్రజలు మతాలకు అతీతంగా ఆ దర్గాను సందర్శిస్తున్నారు. ఆ ముస్లిం బాబా సమాధిపై పూలు ఉంచి నమస్కరిస్తున్నారు. ఒక రోజున ఆశ్చర్యకరంగా ఆ సమాధిపై ఉంచిన పూలు వాటంతట అవే పైకి ఎగిరి కిందపడసాగాయి. వెంటనే భక్తులందరూ సమాధిలో ఖననం చేయబడిన బాబా మరల బతికాడనీ, ఆయన ఊపిరి పీల్చి వదులుతున్నాడనీ, అలా వదులుతున్నప్పుడు ఆ గాలి వేగానికి పూలు పైకి లేస్తున్నాయనీ, మరల గాలి పీలుస్తున్నప్పుడు, ఆ వేగానికి పూలు కిందపడి పోతున్నాయనీ, ఇది ఆ బాబా మహత్యమనీ నమ్మసాగారు. అయితే చిత్తూరు జిల్లా జనవిజ్ఞానవేదిక అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు అమీర్‌ మరియు ప్రొ.ఎన్‌.వేణుగోపాల రావు ఆ అంశంలో ఇమిడి ఉన్న శాస్త్రీయ విషయాల్ని తెలుసుకోవాలని నిర్ణయించు కొని, ఎస్‌.వి.యూనివర్శిటీలో భూగర్భశాఖలో ప్రొఫెసర్‌ హనుమంతునీ, మరో ప్రొఫెసర్‌ కృష్ణారెడ్డినీ తీసుకుని కార్వేటి నగరం వెళ్ళారు. ఆ ప్రొఫెసర్లు ఆ ప్రాంతమంతా పరిశీలించి, అక్కడ పూలు పైకెగిరి, కిందపడటానికి గల శాస్త్రీయ కారణాన్ని గుర్తించి ఇలా వివరించారు.

భూమి పైభాగమంతా రాతిపొరలు పొరలుగా ఉంటుంది. అది అనేక జోన్లుగా భూగర్భ శాస్త్రవేత్తలు విభజించారు. వాటిలో 'ఫ్రాక్చర్డ్‌ జోన్‌' అనేది ఒక విభాగం. ఈ భాగంలోని భూమి శిలలు నెర్రెలుగా పగిలి ఉంటాయి. వాటిలో గాలి నిండి ఉంటుంది. వానలు పడ్డప్పుడు ఆ నెర్రెలలో నీరు చేరి, వాటిలోని గాలి వేగంగా బయటకు వస్తుంది. చిత్తూరు జిల్లాలో అనేక ప్రాంతాలలో భూమి ఫ్రాక్చర్డ్‌జోన్‌లోనే ఉంది. ప్రత్యేకించి దర్గా, దాని చుట్టుపక్కల ప్రాంతాలు ఆ జోన్‌లోనే ఉన్నాయి. అందువలన దర్గా ప్రాంతంలో వానబడితే, నెర్రెలలో గాలి బయటకు వేగంగా వస్తోంది. సమాధి పక్కనున్న నెర్రెలలో అలా జరిగి, సమాధిపైని పూలు పైకి ఎగిరి, ఆ గాలి ఆగగానే గురుత్వాకర్షణ శక్తికి మరల కిందపడుతున్నాయి. సమాధికి దూరంగా అలా గాలిపైకి వచ్చినా, అక్కడ ఎవరూ పూలు ఉంచరు కాబట్టి దానిని గమనించలేదు. అంతేకాని 200 ఏళ్ళ కిందట మరణించిన బాబా సమాధిలో బతికి ఉన్నాడనటం అశాస్త్రీయం. ఇదీ భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనతో తెలియజెప్పిన వాస్తవం.

No comments: