Sep 26, 2011

మెర్వ్ మెరుపు ఇన్నింగ్స్

కోల్‌కతాపై సోమర్సెట్ విజయం
కలిస్, పఠాన్ శ్రమ వృథా
చాంపియన్స్‌లీగ్ టి20

ఉప్పల్ స్టేడియం ‘సొంత’ జట్టుకు కలిసిరాదని మరోసారి నిరూపితమైంది. ప్రత్యర్థిని సవాల్ చేసే స్కోరు సాధించినా కోల్‌కతా నెగ్గలేకపోయింది. సోమర్సెట్ తరఫున వాన్‌డెర్ మెర్వ్ మెరుపులు మెరిపించి లక్ష్య ఛేదన సునాయాసం చేశాడు.


హైదరాబాద్, న్యూస్‌లైన్: కెప్టెన్ గంభీర్ పునరాగమనం కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు విజయాన్ని అందించలేకపోయింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఆదివారం జరిగిన చాంపియన్స్ లీగ్ టి20 మ్యాచ్‌లో సోమర్సెట్ 5 వికెట్ల తేడాతో నైట్‌రైడర్స్‌ను ఓడించింది. కలిస్ (61 బంతుల్లో 74 నాటౌట్; 4ఫోర్లు, 4సిక్సర్లు) సమయోచిత బ్యాటింగ్, యూసుఫ్ పఠాన్ (21 బంతుల్లో 39 నాటౌట్; 4సిక్సర్లు) జోరుతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. అనంతరం సోమర్సెట్ 19.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు సాధించింది. ఓపెనర్ వాన్‌డెర్ మెర్వ్ (40 బంతుల్లో 73; 9ఫోర్లు, 2సిక్సర్లు) చెలరేగి ఆడటంతో ఆరంభంలోనే మ్యాచ్‌పై పట్టు బిగించిన సోమర్సెట్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది.


దుమ్మురేపిన పఠాన్
టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించిన బిస్లా (12 బంతుల్లో 17; 2ఫోర్లు, 1సిక్సర్) కొద్దిసేపటికే వెనుదిరిగాడు. ఆ తర్వాత తొలి బంతికే గంభీర్ (0) డకౌటై తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ దశలో కొద్ది సేపు నిలదొక్కుకున్న తివారీ (26 బంతుల్లో 20; 1ఫోర్) కూడా 71 పరుగుల జట్టు స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. అప్పుడు కలిస్‌తో పఠాన్ జత కలిశాడు. 14 ఓవర్లు ముగిసేసరికి నైట్‌రైడర్స్ స్కోరు 83 పరుగులు మాత్రమే.

అయితే 15వ ఓవర్లో మొదలైంది యూసుఫ్ తుఫాన్. ఒక్క ఇన్నింగ్స్‌లోనైనా అదరగొడతాడేమోనని చూస్తున్న అభిమానులను ప్రతీసారి నిరాశపరుస్తూ వచ్చిన పఠాన్ ఈ సారి మాత్రం తన సత్తా చూపించాడు. ఆ ఓవర్ వేసిన సుపయ్య తుప్పు వదలగొట్టేలా సిక్సర్లు కొట్టాడు. తొలి బంతిని కలిస్ సింగిల్ తీయగా, తర్వాత వరుసగా నాలుగు బంతులను పఠాన్ సిక్సర్లుగా మలిచాడు. వైడ్‌కు ఐదు పరుగులు సహా (1,6,6,6,6,5,0) ఆ ఓవర్లో మొత్తం 30 పరుగులు వచ్చాయి.


మరో వైపు అప్పటివరకు నెమ్మదిగా ఆడిన కలిస్ కూడా చెలరేగటంతో కోల్‌కతా స్కోరు 20 ఓవర్లలో 161 పరుగులకు చేరింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు అభేద్యంగా 90 పరుగులు జోడించారు. చివరి ఆరు ఓవర్లలో నైట్‌రైడర్స్ 78 పరుగులు చేసింది. సోమర్సెట్ బౌలర్లలో గ్రెగరీ రెండు ఓవర్లలో 9 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.


మెర్వ్ మెరుపులు...

పఠాన్ విధ్వంసంతో మ్యాచ్‌లో విజయంపై ఆశలు పెంచుకున్న నైట్‌రైడర్స్... మెర్వ్ ఎదురుదాడితో చేతులెత్తేసింది. రెండో ఓవర్ తొలి బంతికే జోన్స్ (6) అవుటైనా, మెర్వ్ వండర్ షాట్లతో విరుచుకుపడ్డాడు. షకీబ్ బౌలింగ్‌లో రివర్స్‌స్వీప్‌తో మెర్వ్ కొట్టిన సిక్సర్ మ్యాచ్‌కే హైలైట్. నైట్‌రైడర్స్ ఫీల్డింగ్ వైఫల్యాలు కూడా సోమర్సెట్‌కు కలిసొచ్చాయి. దాంతో గ్రౌండ్‌లో ఏ వైపు బంతిని పంపినా అది బౌండరీ దాటింది. పవర్‌ప్లే ఆరు ఓవర్లలోనే జట్టు స్కోరు 63 పరుగులకు చేరింది.

దాటిగా ఆడిన మెర్వ్ 25 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో అతనికి ట్రెగో (35 బంతుల్లో 28; 3ఫోర్లు )అండగా నిలిచాడు. రెండో వికెట్‌కు 105 పరుగులు జోడించిన తర్వాత వీరిద్దరూ జట్టును విజయానికి చేరువగా తెచ్చి ఇన్నింగ్స్ 14వ ఓవర్లో అవుటయ్యారు. చివర్లో కొంత ఉత్కంఠ రేగినా కామ్టన్ (17 బంతుల్లో 19నాటౌట్; 2ఫోర్లు) నిలబడి సోమర్సెట్‌ను గెలిపించాడు. కోల్‌కతా బౌలర్లలో భాటియాకు రెండు వికెట్లు దక్కాయి. బ్రెట్‌లీ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.


స్కోరు వివరాలు

కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: బిస్లా (సి)జోన్స్ (బి)గ్రెగరీ 17, కలిస్ (నాటౌట్)74, గంభీర్ (సి)థామస్ (బి)గ్రెగరీ 0, తివారీ (సి)డాక్‌రెల్ (బి)థామస్ 20, పఠాన్ (నాటౌట్) 39, ఎక్స్‌ట్రాలు 11, మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) 161.
వికెట్ల పతనం: 1-20, 2-21, 3-71
బౌలింగ్: థామస్ 4-0-34-1, కార్తీక్ 4-0-25-0, గ్రెగరీ 2-0-9-2, ట్రెగో 1-0-6-0, వాన్‌డెర్‌మెర్వ్ 4-0-21-0, డాక్‌రెల్ 4-0-32-0, సపయ్య 1-0-30-0
సోమర్సెట్ ఇన్నింగ్స్; జోన్స్ (సి)తివారీ (బి)అబ్దుల్లా 6, ట్రెగో రనౌట్ 28, వాన్‌డెర్‌మెర్వ్ (సి)అండ్ (బి)షకీబ్ 73, హిల్‌డ్రిత్ (సి)బిస్లా (బి)భాటియా 0, కామ్టన్ (నాటౌట్) 19, సపయ్య (బి)భాటియా 15, స్నెల్ (నాటౌట్) 6, ఎక్స్‌ట్రాలు 17, మొత్తం (19.4 ఓవ ర్లలో 5 వికెట్ల నష్టానికి) 164.
వికెట్ల పతనం: 1-15, 2-120, 3-121, 4-123, 5-141
బౌలింగ్: బ్రెట్‌లీ 4-0-27-0, అబ్దుల్లా 4-0-29-1, షకీబ్ 4-0-30-1, బాలాజీ 3-0-23-0, కలిస్ 1-0-16-0, భాటియా 3.4-0-27-2 .


నిరాశపరచిన గంభీర్

గౌతం గంభీర్ మైదానంలో కనిపించగానే ప్రేక్షకుల కేకలు...టాస్ గెలవగానే అరుపులు...ఇక అతను బ్యాటింగ్‌కు దిగే సరికైతే స్టేడియం మొత్తం ఒకటే గోల, హంగామా. టాస్ గెలిచాక మాట్లాడుతూ గంభీర్ ’ఇక నేను ఆగలేను...ఎప్పుడెప్పుడు బరిలోకి దిగుదామా అనే ఉత్సాహంతో ఉన్నాను’ అన్నాడు. ఫ్యాన్స్ కూడా అదే ఆలోచనతో ఉన్నారేమో బిస్లా అవుట్ తర్వాత గంభీర్‌ను ప్రోత్సహిస్తూ జోష్‌తో ఆహ్వానం పలికారు. ఇంతటి హర్షధ్వానాల మధ్య బ్యాటింగ్‌కు వచ్చిన గౌతీ మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. ఎదుర్కొన్న మొదటి బంతికే అవుటై వెనుదిరిగాడు. గ్రెగరీ బౌలింగ్‌లో మిడాన్‌లో థామస్‌కు క్యాచ్ ఇవ్వగానే మైదానం అంతా నిశ్శబ్దం ఆవరించింది.

No comments: