Sep 26, 2011

నేపాల్‌లో కూలిన విమానం

  • 10 మంది భారతీయులు సహా 19 మంది మృతి
నేపాల్‌లోని కొటండా పర్వత పంక్తుల్లో ఆదివారం ఓ విమానం కూలిపోయిన ఘటనలో అందులోని మొత్తం 19 మంది ప్రయాణీకులూ మృతి చెందారు. వారిలో పది మంది భారతీయులున్నట్లు అధికారులు తెలిపారు. వారంతా ఎవరెస్ట్‌ శిఖర సందర్శనకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు నేపాల్‌ పౌర విమానయాన అధికారులు ప్రకటించారు. నేపాల్‌లో అతిపెద్ద ప్రైవేటు విమాన సంస్థయిన బుద్ధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బీచ్‌క్రాఫ్ట్‌ 1900డి విమానం ఆదివారం ఉదయం 7-30 గంటలకు కూలిపోయినట్లు వారు చెప్పారు. ఖాట్మండ్‌ నగరానికి 20 కిమీ దూరంలోని కొటండా పర్వతపంక్తిలోని బిషంకు నారాయణ్‌ దేవాలయానికి సమీపంలో కూలిన ఈ విమానం నుంచి గాయాలతో బయటపడిన ఒక నేపాలీ ప్రయాణీకుణ్ణి అధికారులు ఆస్పత్రికి తరలించినప్పటికీ అతడు అక్కడ మృతి చెందాడు. ఆ విమానంలో 13 మంది విదేశీ ప్రయాణీ కులతో పాటు ముగ్గురు నేపాలీలు, ముగ్గురు విమాన సిబ్బంది ఉన్నట్లు త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్ర యంలోని సహాయ సమన్వయ కేంద్రం అధికారులు తెలిపారు. విమానశకలాల నుంచి మృతదేహాలను వెలికితీసిన సహాయక బృందాలు వాటిని తరలించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన భారతీయుల పేర్లను నేపాల్‌లోని భారత దౌత్యకార్యాలయం వెల్లడించింది.
మృతుల్లో పంకజ్‌ మెహతా, ఆయన భార్య ఛాయ మెహతా, ఎంవి మరతాచలం, మం మణిమారన్‌, విఎం కనకసబేశన్‌, ఎకె కృష్ణన్‌, ఆర్‌ఎం మీనాక్షీ సుందరం, కె త్యాగరాజన్‌, టి ధనశేకరన్‌, కట్టూస్‌ మహాలింగం ఉన్నారు. భారతీయులు మృతి చెందడంపై భారతీయ రాయబార కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢసానుభూతిని తెలియచేసింది. మృతదేహాల తరలింపు కోసం తాము అన్ని విధాలా సహకారమందిస్తామని ప్రకటించింది. పంకజ్‌ మెహతా ఖాట్మండ్‌లోనే యునెసెఫ్‌లో పనిచేస్తున్నారు. ఆయనతో పాటే ఆయన భార్య అక్కడే ఉంటు న్నారు. మిగిలిన ఎనిమిది మందీ తమిళనాడుకు చెందిన పర్యాటకులు. నేపాల్‌ పర్యటించేం దుకోసం వీరంతా శనివారం సాయంత్రం ఖాట్మండ్‌ చేరుకున్నారు. అక్కడ గ్రాండ్‌ హోటల్‌లో బస చేశారు. ఈ విషయమై ఆ హోటల్‌ యజమాని ఫుర్బా షెర్పా 'ద హిందూ' ప్రతినిధితో మాట్లాడారు. 'ఎనిమిది మంది పర్యాటకులూ తిరుచిరాపల్లి సెంటర్‌ బిల్లడర్స్‌ అసోసియేషన్‌కు చెందినవారు. ఆగస్టు 21న మమ్మల్ని సంప్రదించారు. మూడు రాత్రులు, నాలుగు పగటి పూటలు బస చేసేందు కోసం గదులు బుక్‌ చేసుకున్నారు. శనివారం సాయంత్రం ఐదుగంటలకు హోటల్‌కు చేరుకున్నారు. 27న తిరిగి వెళ్లాల్సివుంది. పర్వత వీక్షణ కోసం వారంత పర్వత విమానం కోసం ఆదివారం ఉదయం 5.45 గంటలకు హోటల్‌ విడిచి వెళ్లారు. ఎన్నటికి తిరిగిరాకుండా వెళ్లిపోయారు' అని ఉద్వేగంగా అన్నారు.
బ్లాక్‌ బాక్స్‌ గుర్తింపు
కాగా ప్రమాదానికి గురైన విమానం బ్లాక్‌బాక్స్‌ను గుర్తించారు. ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేసేందుకు నేపాల్‌ పౌర విమానయాన మాజీ సంచాలకులు నేతృత్వంలోని త్రిసభ్య కమిటీని నేపాల్‌ ప్రభుత్వం నియమించింది.

No comments: