- తొలి రోజు 69 శాతం మంది హాజరు
- పటిష్ట భద్రత మధ్య నిర్వహణ
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సీ) గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. తొలిరోజు జరిగిన ఇంగ్లీష్ పేపర్‌కు 69.55 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. పోలీస్ పహారాలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించి పటిష్ట భద్రత మధ్య నిర్వహించింది. రాష్ట్రంలో ఐదు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖపట్నం, విజయ వాడ, తిరుపతి, వరంగల్‌లో మొత్తం 35 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,504 మంది అభ్యర్థులు గ్రూప్-1 మెయిన్స్‌కు అర్హత సాధించారు. అందులో 8,464 మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆదివారం తొలిరోజు జరిగిన పరీక్షకు 5,887 మంది అభ్యర్థులు హాజరయ్యారు. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న వారిలో రాష్ట్రవ్యాప్తంగా 69.55 మంది హాజరయ్యారని ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌లో 69.45 శాతం, విశాఖపట్నంలో 68.33 శాతం, విజయ వాడలో 71.25 శాతం, తిరు పతిలో 71.46 శాతం, వరంగల్‌లో 66.96 శాతం నమోదైందని పేర్కొంది. గ్రూప్-1 పరీక్షలకు గతంలో కంటే ఈసారి 20 శాతం హాజరు అధికంగా ఉందని పేర్కొంది. 2005లో 38.09 శాతం, 2007లో 53.05 శాతం అభ్యర్థులు గ్రూప్-1 పరీక్షలకు హాజరయ్యారని పేర్కొంది.
రాష్ట్ర వ్యాప్తంగా 210 పోస్టుల కోసం 11,504 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచిమధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ పరీక్ష జరిగింది. ఈ పరీక్షలు ఈనెల 26,27,29, అక్టోబర్ 1,3 తేదీల్లో జరుగుతాయి. ఆదివారం జరిగిన సాధా రణ ఆంగ్లం పరీక్షను అభ్యర్థులు తప్పని సరిగా రాయాల్సి వుంటుంది. నేడు హాజరు కాకుంటే నిబంధనల ప్రకారం గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల పోటీ నుంచి వైదొలి గినట్లే అని ఎపిపిఎస్సీ అధికారులు తెలిపారు.
ఊపిరిపీల్చుకున్న పోలీసులు
తెలంగాణా ఆందోళనకారుల నుండి ఎటువంటి ఆటంకం ఏర్పడకుండా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిఆర్‌పిఎఫ్ బలగాల సహాయంతో పరీక్షా పత్రాలను, సమాధాన పత్రాలను తరలించారు. రంగారెడ్డి జిల్లాలో ఎల్బీనగర్‌లోని మహాత్మాగాంధీ లా కాలేజీలో జరుగుతున్న గ్రూప్-1 పరీక్షను కలెక్టర్ వి శేషాద్రి స్వయంగా పరిశీలించారు. ఆయన వచ్చి వెళ్లిన తర్వాత అడ్డుకునేందుకు సుమారు 30 మంది న్యాయవాదులు ప్రయత్నిం చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకొని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పరీక్షా కేంద్రాల్లో ఫర్నీచర్ లేకపోవడం, మంచినీటి సౌకర్యం, ఫ్యాన్లు, కరెంటు వసతి సరిగా లేకపోవడంతో విశాఖ పట్నంలో అభ్యర్థులు కొంత అసౌకర్యానికి గురయ్యారు. వరంగల్ నగరంలోని మార్కాజి ప్రభుత్వోన్నత పాఠశాల, మల్టీపర్పస్ హైస్కూల్, ప్రాక్టీసింగ్ హైస్కూళ్లలో 768 మంది అభ్యర్థులకు పరీక్షాకేంద్రాల్లో ఏర్పాటు చేశారు. 563 మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో హాల్ టిక్కెట్లను పొందారు. వీరిలో 377 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ 15 మంది ఇన్విజిలేటర్లు, ఒక ఛీప్ సూపరింటెండెంట్, ఒక అడిషినల్ సూపరింటెండెంట్, ఒక లిజెనింగ్ ఆఫీసర్, ఒక అసిస్టెంట్ లిజెనింగ్ ఆఫీసర్‌లను నియమించారు. నేటి పరీక్ష కోసం ప్రధాన రహదారిని పూర్తిగా మూసివేసి పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు, 144 సెక్షన్‌ను అక్టోబర్ మూడవ తేదీ వరకు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.
గ్రూప్-1 వాయిదా వేయాలని హౌజ్‌మోషన్
గ్రూప్-1 పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో తెలంగాణ న్యాయవాదుల జెఎసి ఆదివారం హౌజ్‌మోషన్ దాఖలు చేసింది. కటాఫ్ మార్కులతో అర్హత పొందిన అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద ఈరోజు దాఖలు చేసిన ఈ హౌజ్‌మోషన్‌ను హైకోర్టు సోమవారం విచారణకు స్వీకరించనుంది.



No comments:
Post a Comment