స్టాండర్డ్ అండ్ పూర్ కంపెనీ పరపతిని
తగ్గించటానికి కారణం ఏదైనప్పటికీ పైకి మాత్రం నీవు నేర్పిన విద్యయే
నీరజాక్షా అన్నట్లుగా ఉంది. చెప్పుకోలేని చోట తగిలిన ఈ దెబ్బతో అమెరికా
మింగా కక్కా లేకుండా తయారైంది. తమ పరపతి తిరపతి కావటానికి త్వశుంఠ త్వశుంఠ
అన్నట్లుగా డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీలు తమ రాజకీయ చతురతను
ప్రదర్శించి లబ్ది పొందేందుకు ప్రయత్నించాయి. అప్పు తీసుకున్నవాడి కంటే
వారికి ఇచ్చిన వారికి నిదురబట్టదన్నట్లు అమెరికాకు అప్పులిచ్చిన వారందరూ
డాలర్ డొల్లయితే తమ ఇల్లు గుల్లవుతుందని భయపడ్డారు. ఒక కంపెనీ పరపతిని
తగ్గించినంత మాత్రాన అమెరికాకు ఏం జరుగుతుంది. అసలు కంపెనీల రేటింగ్‌లు
వాస్తవాలేనా, వాటివెనుక ఉన్న అసలు కథలేమిటి?. ఇంకెందుకు ఆలస్యం ! కంచికి
తరువాత వెళుదురు, ముందు ఈ వారం అట్టమీది కథలోకి వెళతారు కదూ !!
'ప్రపంచంలో
రెండు సూపర్ పవర్లు ఉన్నాయి. ఒకటి, అమెరికా అని వేరే చెప్పనవసరం లేదు,
రెండవది బాండ్ రేటింగ్ ఏజన్సీస్' అని థామస్ ఫ్రైడ్‌మాన్ 1996లో
పేర్కొన్నారు. ఆయన ప్రపంచ జర్నలిజంలో అసమాన ప్రతిభ చూపినందుకు అందచేసే
పులిట్జర్ బహుమతి గ్రహీత. 'బాంబులు వేసి అమెరికా నిన్ను నాశనం చేయగలిగితే
మూడీస్ పరపతిని తగ్గించి బాండ్లను నాశనం చేస్తుంది. అంతే కాదు నన్ను
నమ్మండి కొన్ని సార్లు ఎవరు అత్యంత శక్తివంతులో తెలియదు' అని ఫ్రైడ్‌మాన్
అన్నారు. ఇప్పుడు స్టాండర్డ్ అండ్ పూర్(ఎస్ అండ్ పి) కంపెనీ విషయంలో
అదే జరిగింది. గత నెల ఎనిమిదవ తేదీన అమెరికా పరపతిని తగ్గించటంతో ఒబామా
సర్కార్ దిమ్మ తిరిగి పోయింది. ప్రపంచ దేశాలన్నీ ఒక్క కుదుపుతో ఉలిక్కి
పడ్డాయి. అమెరికా ఆర్థిక ఆధిపత్యం కుప్పకూలటానికి నాంది పలికిందా అన్నట్లు
పరిస్థితి తయారైంది.
అలాంటి కంపెనీకి అధ్యక్షుడిగా ఉన్న భారత
సంతతికి చెందిన దేవేన్ శర్మను యాజమాన్యం ఒక్క కలంపోటుతో బాధ్యతల నుంచి
తొలగించింది. ఏ లక్ష్యంతో పరపతి తగ్గించినప్పటికీ అనూహ్య పరిణామంగా మారటంతో
ఒబామా సర్కార్‌ను మంచి చేసుకొనేందుకు ఈ పని చేశారన్నది వేరే చెప్పనవసరం
లేదు. ఆయన చేసిందల్లా సిబ్బంది లెక్కలు సరిగా చూడలేదని నెపాన్ని వేరేవారి
మీదకు నెట్టకుండా బహిరంగంగా పరపతి తగ్గింపును సమర్ధించటమే. అయితే దీనికి,
శర్మను తప్పించటానికి సంబంధం లేదని చెప్పటం వేరే విషయం అనుకోండి. త్వరలో
కంపెనీని రెండుగా విభజించనుండటం, దానిలో ప్రాధాన్యత లేని దాని బాధ్యతను
తనకు అప్పగించనున్నారని గ్రహించిన శర్మ ముందుగానే బయటపడాలని
నిర్ణయించుకొన్నట్లు చెబుతున్నారు. అందుకే రేటింగ్‌ను తగ్గించటాన్ని
గట్టిగా సమర్థించారా? తనను కాదనుకొంటున్న కంపెనీ ఏమైతే తనకేం అనుకున్నారా?
ఏమో? డబ్బు విలువలు అలాంటివే మరి.
యాంటీ సెక్యూరిటీ అనే సైబర్
'హాక్టివిస్ట్' గ్రూప్ కంప్యూటర్ల భద్రతా పరిశ్రమకు వ్యతిరేకంగా పని
చేస్తోంది. ఇటీవల అమెరికాకు చెందిన వాన్‌గార్డ్ డిఫెన్స్ ఇండిస్టీస్
(విడిఐ) కంపెనీ కంప్యూటర్లలోకి చొరబడి వేలాది ఇ-మెయిళ్ల సమాచారాన్ని
సేకరించింది. ఈ కంపెనీ యుద్ధాల్లో వినియోగించే మానవ రహిత విమానం లేదా
డ్రోన్స్‌ను తయారు చేస్తోంది. ఆ ఈమెయిళ్లలో బయటకు రాని కీలక రహస్య సమాచారం
చాలా ఉంది. సూదికోసం సోదికి పోతే పాత వ్యవహారాలన్నీ బయటకు వచ్చినట్లుగా
విడిఐ ఉపాధ్యక్షుడు రిచర్డ్ టి గార్సియా ఎస్‌అండ్‌పికి ఏప్రిల్25న పంపిన
ఇమెయిల్ కూడా బయట పడింది. దానిలో మెరిల్‌లించ్ కంపెనీ సలహాదారు ఒకరు
'ఎస్‌అండ్‌పి అమెరికా బాండ్ రేటింగ్‌ను తగ్గించే అవకాశం ఉందని' తనకు సలహా
ఇచ్చినట్లు గార్సియా పేర్కొన్నాడు. అంటే ఈ విషయం బయటి వ్యక్తులకు ముందే
తెలిసిందన్నమాట. క్రెడిట్ రేటింగ్ ఏజన్సీస్ సంస్కరణల చట్టం 2006 ప్రకారం
ఏదైనా ఏజన్సీకి చెందిన సమాచారం బహిరంగంగా వెల్లడించటానికి ముందే లీకైనట్లు
రుజువైతే అలాంటి కంపెనీల లైసెన్సు రద్దు అవుతుంది. ఆ లెక్కన ఎస్‌అండ్‌పి
లైసెన్సు రద్దు కావాలి. ఆ ఇమెయిల్‌లో మెరిల్ లించ్ సలహాదారు ఇంకా ఇలా
చెప్పినట్లు ఉంది. 'ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దటానికి వారు అమెరికా
ప్రభుత్వానికి రెండు సంవత్సరాల గడువు ఇచ్చారు.అయితే రిపబ్లికన్లు,
డెమోక్రాట్లు రెండు పార్టీలు 2012లో జరగాల్సిన ఎన్నికల కారణంగా ఎస్‌అండ్‌పి
చెప్పిన గడువు రెండు సంవత్సరాలలో పరిస్థితిని చక్కదిద్దటానికి
చేయాల్సినదానిని చేయవు'. అంటే ఇప్పుడు అమెరికా సర్కారు చెబుతున్నట్లు
లెక్కలు తప్పు అనే అవకాశమే లేదు. ఎస్‌అండ్‌పి కంపెనీ అంచనా ఎంతో పక్కాగా
రూపొందించిందన్నది స్పష్టం.
స్టాండర్డ్ అండ్ పూర్ కంపెనీ
ప్రకటనపై మండి పడిన ఒబామా సర్కార్ అది గతంలో చేసిన సిఫార్సులపై దర్యాప్తు
జరపాలని న్యాయశాఖను ఆదేశించింది. ఇటలీ రేటింగ్‌ను మరింత తగ్గిస్తామని
ప్రకటించటంతో రేటింగ్ ఏజన్సీల కార్యాలయాలపై పోలీసులు దాడులు చేశారు.
ఎందుకయ్యా అంటే నిబంధనలను సరిగా పాటిస్తున్నాయా లేదా అని చూసేందుకని
చెప్పారు. పోర్చుగల్ రేటింగ్‌ను తగ్గించినపుడు ఐరోపా దేశాలు ఇది
'ఆంగ్లో-శాగ్జన్'(ఆంగ్లం మాట్లాడేదేశాలు) దేశాల సంస్థల విధ్వంసకాండ అని
వర్ణించాయి. వాటి గుత్తాధిపత్యానికి గండికొట్టాలని జర్మనీ పేర్కొన్నది.
అయితే ఈ సంస్థలు అమెరికాను కూడా వదల్లేదు. అనేక చోట్ల లేని పరపతిని
తగ్గించి దెబ్బతీస్తే అమెరికాలో లేని పరపతిని ప్రకటించి ఆర్థిక
సంక్షోభాన్ని రుద్దాయంటే అతిశయోక్తి కాదు. అమెరికా సంక్షోభం తనఖా
కుంభకోణంతో ప్రారంభమైన విషయం తెలిసినదే. దానిలో భాగస్వాములైన సంస్థల పరపతి
'భేషుగ్గా' ఉందని సిఫార్సు చేసిన రేటింగ్ సంస్థలలో ఈ కంపెనీ కూడా ఒకటి.
తాజా దర్యాప్తు అమెరికా పరపతి రేటు తగ్గింపునకు ముందే ఆదేశించినట్లు
ప్రభుత్వం చెప్పటం విశేషం.తాము అందచేసిన గణాంకాల కూడికలు తీసివేతల మదింపులో
ఎస్‌అండ్‌పి కంపెనీ సిబ్బంది తప్పిదాన్ని తాము కనుగొన్నట్లు అమెరికా
ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. తనఖా బాండ్ల రేటింగ్‌ను తగ్గించి
చెప్పాలన్న తమ కోర్కెను ఎస్‌అండ్‌పి గతంలో ఖాతరు చేయలేదని ఇప్పుడు
అధికారులు చెవులు కొరుకుతున్నారు. అయితే మూడీస్, ఫిచ్ అనే రెండు సంస్థల
రేటింగ్స్‌ను కూడా ఈ విచారణలో భాగం చేసేదీ లేనిదీ వెల్లడి కాలేదు. తనఖా
బాండ్లను కొనుగోలు చేయటంలో ఎలాంటి రిస్కు లేదని సిఫార్సు చేసేందుకు వాటిని
జారీ చేసిన ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో సొమ్ము వసూలు
చేసి మిగతా రేటింగ్ సంస్థల కంటే రికార్డు స్థాయిలో లాభాలు
సంపాదించిందన్నది అమెరికా సర్కారు ఆరోపణ.
రేటింగ్ సంస్థల
'రేటింగ్‌లపై' విచారణ జరపనున్నారనే వార్తలు జూన్‌లోనే వెలువడిన మాట
వాస్తవం. అయితే ఇవి కూడా అమెరికా పరపతి రేటింగ్‌ను తగ్గించాల్సి వస్తుందని
ఎస్ అండ్ పి హెచ్చరించిన తరువాతే అని గమనించాలి. నిజానికి అమెరికా
సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే తనఖా కుంభకోణంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైన మూడు
సంవత్సరాల నాడే అలాంటి విచారణకు ఆదేశించి ఉండాల్సింది. ఇంతకాలం ఒబామా
సర్కార్ ఏ గుడ్డిగుర్రానికి పళ్లు తోముతున్నట్లు?
నిష్పక్షపాతంగా
ఉన్నవిషయాలను ఉన్నట్లు చెప్పి తటస్థంగా వ్యవహరించాల్సిన సంస్థలు మంచి
రేటింగ్‌లు ఇచ్చేందుకు బాండ్లు విక్రయించే సంస్థల నుంచి పెద్ద మొత్తంలో
సొమ్ము గుంజటం బహిరంగ రహస్యమే. అందువలన ఆయా కంపెనీలపై కూడా దర్యాప్తు
జరిపితేనే వాటి మధ్య ఉన్న అక్రమ బంధం బయటకు వస్తుంది. రేటింగ్ ఏజన్సీలు
అక్రమ పద్ధతుల్లో అగ్రశ్రేణి రేటింగ్‌లు ఇవ్వటమే కాదు, ఆర్థిక వ్యవస్థలు
కుప్పకూలిపోయే విధానాల రూపకల్పనలో కూడా అవి సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి.
అలాంటి మూడు పెద్ద సంస్థల్లో ఎస్‌అండ్‌పి మరింత దూకుడుగా ఉంటుందని
రూజ్వెల్ట్ ఇనిస్టిట్యూట్ పరిశోధకుడు మాట్ స్టోలర్ అంటారు. కెనడాలో
ఆరోగ్య, నిరుద్యోగబీమా పథకాలను గనుక రద్దు చేయనట్లయితే ప్రభుత్వ బాండ్ల
రేటింగ్‌ను తగ్గిస్తామని 1990 దశకంలో ఎస్‌అండ్‌పి, మూడీస్ బెదిరించాయని
స్టోలర్ పేర్కొన్నారు. ఇప్పుడు అమెరికా వ్యవహారంలో కూడా ఎస్‌అండ్‌పి
లక్ష్యం సామాన్య ప్రజల పథకాల ఖర్చు తగ్గించటమే అన్నారు. గత మూడు
సంవత్సరాలలో ధనిక దేశాలు, వాటి విధానాలకు బలైన ఇతర దేశాల ఆర్థిక సంక్షోభ
తీరు తెన్నులను చూస్తే రేటింగ్ కంపెనీలు 'రాజకీయపాత్ర'ను కూడా
పోషించినట్లు చూడవచ్చు. వాటి రేటింగ్‌లను బట్టే తెల్లవారేసరికి గ్రీసు,
ఐర్లండ్, పోర్చుగల్ వంటిదేశాలు తమ ఆస్తులను కారుచౌకగా తెగనమ్ముకోవాల్సి
వచ్చిందంటే అతిశయోక్తి కాదు. అనేక దేశాలలో అమెరికా రాజకీయ ప్రయోజనాలకు
అనుగుణంగా ఆయాదేశాల రేటింగ్‌లను నిర్ణయించి వత్తిడి పెంచిన ఉదంతాలు కూడా
ఉన్నాయి.
నోబెల్
బహుమతి గ్రహీత జోసెఫ్ స్టిగ్లిజ్, ఆర్థిక సంక్షోభంలో రేటింగ్ ఏజెన్సీలు
కీలకమైన అపరాధులు, ఎఫ్ రేటున్న బాండ్లను ఏ రేటు బాండ్లగా మార్చటంలో తమ
వంతు పాత్ర పోషిస్తాయి.రేటింగ్ ఏజన్సీల తోడ్పాటు లేకుండా బ్యాంకులేమీ
చేయజాలవు' అన్నారు. తమ కంపెనీలో జరుగుతున్న కథలన్నీ ఎస్‌అండ్‌పి సిబ్బందికి
తెలుసన్నది 2006లో ఒక విచారణ సందర్భంగా సాక్ష్యంగా సమర్పించిన అంతర్గత
ఇమెయిల్స్ వెల్లడించాయి. రేటింగ్‌ను నిర్ణయించే అధికారులకు ఉన్న ప్రమాదాల
గురించి పేర్కొంటూ' ఈ తప్పుడు పేక మేడ కూలిపోయే సమయానికి మనమందరం తగినంత
సంపాదించుకొని ఉద్యోగవిరమణ చేయాలని ఆశిద్దాం' అని ఉంది.
రేటింగ్
ఏజన్సీలు ఎంత అడ్డగోలుగా వ్యవహరిస్తాయనడానికి మరో ఉదాహరణ. మనందరకు
ఎన్రాన్ కంపెనీ గురించి తెలిసినదే. మహారాష్ట్రలోని దబోల్ అనే చోట
విద్యుత్ కేంద్రాన్ని నిర్మించి ఉత్పత్తి చేయకుండానే లాభాలు మూటగట్టుకొని
దానిని మనకు వదలి పెట్టి వెళ్లింది.దాని మాతృసంస్థ అమెరికాలో ఉంది. దాన్ని
దివాలా తీయిస్తున్నారని తెలిసినప్పటికీ మూడీస్ ఏజన్సీ పదేళ్ల క్రితం
కంపెనీ పరిస్థితి భేషుగ్గా ఉందని రేటింగ్ ఇచ్చిన 24 గంటల్లోనే అది
కుప్పకూలిపోయింది. తాజా ఉదంతానికి వస్తే ఫ్రెడ్డీమాక్ అనే కంపెనీ వాటాల
కొనుగోలుపై మూడీస్ కంపెనీ ట్రిపుల్ ఏ రేటింగ్ ఇచ్చింది. అయితే ప్రపంచ
డబ్బు జలగ వారెన్ బఫెట్ ఒక టీవీలో ఫ్రెడ్డీ కంపెనీ గురించి మాట్లాడిన 24
గంటలలోనే మూడీస్ రేటింగ్‌ను తగ్గించేసింది. ఈ ఏజన్సీలు బ్లాక్ మెయిల్
చేయటంలో కూడా దిట్టలే. హానోవర్ రే అనే కంపెనీ ముడుపులు ముట్టచెప్పనందుకు
మూడీస్ సంస్థ 2004లో రేటింగ్‌ను తగ్గించింది. దాంతో కంపెనీ విలువ
17.5కోట్ల డాలర్లు పడిపోయింది.
గతంలోకి వెళితే 1936లో అమెరికాలో
న్యూడీల్ సంస్కరణలలో భాగంగా రేటింగ్ కంపెనీల సిఫార్సులను
'స్పెక్యులేటివ్'గా పరిగణించి చట్టబద్ధత లేని వాటి ఆధారంగా బాండ్లను కొన
వద్దని బ్యాంకులు, ఆర్థిక సంస్థలను నిషేధించారు.
రేటింగ్
ఏజన్సీలు ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు తమ వనరులు పెంచుకోవటమా, అప్పుచేసి
పప్పుకూడు తినటం ఏది మంచిదో సలహాలు ఇవ్వవు. స్థానిక సంస్థలకు అప్పులు
పెరిగి బ్యాంకులు గట్టిగా చెల్లించాలని కోరినపుడు అందుకోసం సంస్థలు తమ
ఆస్తులను అమ్ముకొని తీర్చేందుకు సిద్ధపడతాయి. వాటిని కొనుగోలు చేయటం లాభమా
కాదా అని రేటింగ్ సంస్థలు సలహాలను ప్రకటిస్తాయి. ఎవరైనా తాము కోరిన
మొత్తాన్ని చెల్లించకపోయినా, ఇతరత్రా లావాదేవీల్లో పేచీ వచ్చినా ఆస్తులను
కొనుగోలు చేస్తే రిస్కు అని చివరి గ్రేడ్ ఇచ్చాయనుకోండి వాటి మీద రూపాయి
పెట్టి అమ్మితే పది పైసలకు కూడా ఎవరూ కొనుగోలు చేయరు.
మన దేశంలో ఏం జరగబోతోంది?
రేటింగ్
కంపెనీలు కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థలతో పాటు కార్పొరేట్ కంపెనీలకు
కూడా రేటింగ్‌లు ఇస్తాయి. మన దేశంలో కూడా మున్సిపాలిటీలను పెద్ద పెద్ద
కార్పొరేషన్లుగా మార్చి వాటికి అవసరమైన నిధుల కోసం బాండ్ల జారీ వంటి
విధానాలను అనుసరించాలని ప్రపంచబ్యాంకు ఆదేశించింది. దానిలో భాగమే
జవహర్‌లాల్ నెహ్రూ పట్టణ పునరుద్ధరణ పథకం. ముందుగా చెత్తతో మొదలు పెట్టి
ప్రతిసేవకూ పన్నులు పెంచటం ప్రారంభించారు. అందుకోసమే ఇటీవలి కాలంలో కొత్త
కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఏర్పాటు చేయటంలో ప్రభుత్వాలు చురుకుగా
కదులుతున్నాయి. రేటింగ్ సంస్థలు అమెరికానే కాదు గ్రీస్ వంటి దేశాల
విషయంలోనూ ఇదే విధంగా వ్యవహరించి రేటింగ్ తగ్గించి రుణాలను తీర్చేందుకు
ప్రయివేటీకరణ ద్వారా ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మటంలో తమ వంతు పాత్రను
పోషిస్తున్నాయి.
అప్పులివ్వకుండా
తొలిసారిగా ఓహియో నగరాన్ని దివాళా తీయించారు. రేటింగ్‌లను తగ్గించటంతో నగర
ఆస్తులను తెగనమ్మి అప్పులు తీర్చాల్సి వచ్చింది. 1979లో తమ మాట వినని
కుసినిచ్‌కు వ్యతిరేకంగా మరొకరిని బ్యాంకర్లు రంగంలోకి తెచ్చారు. చివరికి
'మునీలైట్' కంపెనీ తన పంతాన్ని నెగ్గించుకొని 'మున్సిపల్‌లైట్'
ప్రభుత్వరంగ కంపెనీని మింగివేసింది. 2003 మునీలైట్ అక్రమాల కారణంగా
విద్యుత్ సరఫరా కుప్పకూలిపోయి మొత్తం 5కోట్ల మంది పౌరులు నానా ఇబ్బందులు
పడ్డారు.
భారత్‌లో రేటింగ్ ఏజన్సీలు
క్రిసిల్,
ఇక్రా, కేర్, డిసిఆర్ ఇండియా, అనిక్రా. ఇవన్నీ ఆ కంపెనీల పొట్టి పేర్లు.
ఉదాహరణకు క్రిసిల్ పూర్తి పేరు క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్
సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.
రేటింగ్‌లకు అర్ధం
ఏఏఏ: తిరుగులేని రక్షణ
ఎఎ-: పక్కా రక్షణ
ఎ-: తగినంత రక్షణ
బిబిబి: రక్షణ ఫర్వాలేదు
బిబి-: ఫర్యాలేదు
సి-: రిస్కు చాలా ఎక్కువ
డి-: దివాళా స్థితి
అయితే
ఒక్కొక్క దేశంలో, సంస్థ సంస్థకూ రేటింగ్ పదజాలంలో తేడాలుంటాయి. ఉదాహరణకు
అమెరికా రేటింగ్‌ను స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్‌అండ్‌పి) కంపెనీ ఏఏఏ
నుంచి ఏఏ+ స్థాయికి తగ్గించింది. ఇలా మైనస్‌లు, ప్లస్‌లు, అంకెలు తోడవటం
అంటే గ్రేడ్‌ల సంఖ్య పెరుగుదలకు సూచిక. ఇదే విధంగా ఒక సమయంలో ఒక దేశానికి
రేటింగ్ అన్ని సంస్థలూ ఒకే రేటింగ్‌ను ఇవ్వవు. ఎందుకంటే ఎవరి అంచనా
వారిదే.
ఇలాంటి కంపెనీలు ప్రకటించే రేటింగ్‌లు
కేవలం సలహాలు మాత్రమే.ఎవరైనా వాటి ఆధారంగా వాణిజ్య లావాదేవీలు జరిపి
నష్టపోయామని ఎవరైనా కోర్టుకు ఎక్కితే చెల్లదు. అయితే ఇవి ఇచ్చే రేటింగ్‌లతో
చిన్నచిన్న దేశాలు, సంస్థలు ఒక్కొక్కసారి ప్రభావితం కావచ్చుగాని అమెరికా
వంటి వాటికి ఎలాంటి ఢోకా ఉండదనేందుకు ఎస్‌అండ్‌పి ప్రకటన తరువాత ఎలాంటి
ఉత్పాతం జరగకపోవటమే నిదర్శనం.
ఆర్థిక అక్రమాలను అడ్డుకుంటే ఊరుకోవు
ఏ
ప్రభుత్వమైనా ఆర్థిక అక్రమాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటే రేటింగ్
ఏజన్సీలు సహించవు. ఎందుకంటే వాటి అక్రమాలు ఎంతగా జరిగితే వాటి ఆదాయం అంతగా
పెరుగుతుంది కనుక. అమెరికాలోని జార్జియా రాష్ట్రం ఆర్థిక అక్రమాల నివారణకు
2003 జనవరి 12న ఒక బిల్లును ఆమోదించింది. నాలుగురోజుల తరువాత స్టాండర్డ్
అండ్ పూర్ కంపెనీ బహిరంగంగా ఒక ప్రకటన చేసింది. అవినీతి తనఖా బ్రోకర్లు,
రుణం ఇచ్చిన వారిపై పెద్ద మొత్తంలో జరిమానాలు విధించే ఈ బిల్లును చట్టంగా
మార్చితే తాము రాష్ట్రానికి ట్రిపుల్ ఏ రేటింగ్ ఇవ్వబోమని స్పష్టం
చేసింది. తరువాత మూడీస్, ఫిచ్ సంస్థలు కూడా ఇదే రకంగా బెదిరించాయి.
ఎస్ అండ్ పి ఇలా ఏర్పడింది
స్టాండర్డ్
అండ్ పూర్ కంపెనీ అమెరికా కేంద్రంగా 150 సంవత్సరాల క్రితం ఏర్పడింది.
1860 ప్రాంతాలలో అమెరికాలో రైలు మార్గాల నిర్మాణంలో పాలు పంచుకున్న వివిధ
కంపెనీలలో దేనిలో పెట్టుబడులు పెడితే మదుపుదార్లకు లాభాలు వస్తాయనే సలహాలు
ఇచ్చేందుకు ఇది ప్రారంభమైంది. ఇప్పుడు 23 దేశాలలో దాదాపు పదివేల మంది
సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. గతేడాది కాలంలో ఈ కంపెనీ
ప్రకటించిన కొత్త రేటింగ్‌లు 1,62,418 కాగా రెండోసారి మదింపు వేసినవి
5,56,872 ఉన్నాయి. ఈ కంపెనీ రేటింగ్ ఇచ్చిన రుణ విలువ 32లక్షల కోట్ల
డాలర్లు. మన దేశంలో బాంబేస్టాక్ ఎక్సేంజ్ మాదిరి ఇది కూడా స్టాక్
మార్కెట్ లావాదేవీలను నిర్వహిస్తోంది. వాటి విలువ దాదాపు ఆరులక్షల కోట్ల
డాలర్లు. ఈ ఒక్క కంపెనీ లావాదేవీల మొత్తమే ఇంత ఉంటే అన్ని కంపెనీల
మొత్తాన్ని ఊహించుకోవాల్సిందే.
అమెరికా పరపతి తగ్గింపు వెనుక.....
అమెరికా
ప్రభుత్వ పరపతిని తగ్గించి దానిని ఇబ్బందులలో పెట్టాలని స్టాండర్డ్ అండ్
పూర్ కంపెనీ కలలో కూడా తలపెట్టదు. మరి అలాంటిది ఆగస్టు 8న ఎందుకలా
ప్రకటించింది? ప్రభుత్వ విధానాలు గనుక ఇదే విధంగా ఉంటే తాను రేటింగ్‌ను
తగ్గిస్తానని అంతకు ముందే ప్రకటించింది. దీనికి వెనుక పెద్ద రాజకీయమే ఉంది.
బడ్జెట్‌లోటు తగ్గింపు గురించి పార్లమెంట్ ఉభయ సభలు మల్లగుల్లాలు పడిన
విషయం తెలిసినదే. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రిపబ్లికన్లు
ధనికులపై పన్ను పెంచకుండా, పేదలపై భారం మోపకుండా బడ్జెట్‌లోటు తగ్గించాలని
చెప్పారు. పేదలపై భారం మోపటం, సామాజిక భద్రత, మెడికేర్ పథకాలకు నిధుల కోత
వంటి చర్యల ద్వారా బడ్జెట్‌లోటు పూడ్చుకోవాలని ఒబామా సర్కారుపై వత్తిడి
తెచ్చేందుకే రేటింగ్‌ను తగ్గిస్తానని ఎస్‌అండ్‌పి బెదిరించింది. రాబర్ట్
బరో అనే నయాఉదారవాద ఆర్థిక వేత్త వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రికలో రాసిన
వ్యాసంలో ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కార్పొరేట్ కంపెనీలు,
ధనికులపై పన్నురేటు తగ్గించాలని ఇటీవలి కాలంలో ఒబామా సర్కార్‌పై వత్తిడి
పెరిగింది. ప్రపంచమంతటా ఇదే ధోరణి. తానెందుకు రేటింగ్ తగ్గించిందీ
వివరిస్తూ ఎస్‌అండ్ పి కంపెనీ ఎనిమిది పేజీల వివరణ ఇచ్చింది.' ఆదాయాలను
పెంచే ఏ చర్యనైనా పార్లమెంట్‌లోని మెజారిటీ రిపబ్లికన్లు అడ్డుకుంటున్నారు.
చట్టాన్ని పక్కన పెట్టే ఇటువంటి స్థితి పార్లమెంట్‌లో ప్రబలిందని మేం
నమ్ముతున్నాం, అందువలన పరపతిపై మా అంచనాను మార్చుకున్నాము.' రుణపరిమితి
పెంపుదల ఒప్పందపై సంప్రదింపులకు ఏర్పాటు చేసిన ముగ్గురు సెనెటర్లతో కూడిన
ఒక కమిటీలో సభ్యుడుకొరు ఎస్‌అండ్‌పూర్ వైఖరితో ఏకీభవిస్తూ సామాజిక భద్రతా
పధకాలను నిలిపివేయటం కూడా ఒక విధమైన సంక్షేమ పథకమే అంటూ వాటిని అమలు జరిపి
ప్రభుత్వం బొక్కసాన్ని ఖాళీ చేసుకుంటే వాల్‌స్ట్రీట్‌లో పెద్దలను
గట్టెక్కించటం ఎలా అని ప్రశ్నించాడు. వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక వ్యాఖ్యానం
చేస్తూ ' అన్నీ సక్రమంగా ఉండే ప్రపంచంలో ఎస్‌అండ్ పూర్ కంపెనీ ఉనికే
ఉండదు, అదొక్కటే ఏమిటి దాని ప్రత్యర్ధులైన మూడీస్,ఫిచ్ కంపెనీలు కూడా
ఉండవు, మిగతా విషయాల్లో ఎలా ఉన్నా కనీసం కార్పొరేట్, ప్రభుత్వ బాండ్లకు
ప్రపంచ న్యాయమూర్తులు, న్యాయపీఠాలుగా ఉండలేవు.' అంటే రేటింగ్ ఏజన్సీలు
కార్మికులు, ఉద్యోగులు, మొత్తం పేదలకు వ్యతిరేకమైన నిర్ణయాలు
తీసుకొనేందుకు'అభిప్రాయం' పేరుతో ప్రభుత్వాలను వత్తిడి కూడా చేస్తాయన్నది
స్పష్టం.



No comments:
Post a Comment