Sep 27, 2011

నిజాలు కక్కించే 'నార్కో'



మైనింగ్‌ మాఫియా కింగ్‌ గాలి జనార్థన్‌రెడ్డిని సిబిఐ వారు కస్టడీలోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించారు. 'అవసరమైతే నార్కో టెస్టులు నిర్వహిస్తాం...' అని సిబిఐ ఉప సంచాలకులు లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఈ మాటలు మనకు చాలా కేసుల్లో వినిపించేవే. నిఠారీలో బాలల మేధం, ముంబాయి పేలుళ్లు, ఆయేషా హత్య కేసు, స్టాంపు పేపర్‌ కుంభకోణం వంటివాటన్నిటిలో ..ఘరానా నేరస్తులైనా కరుడుగట్టిన హంతకులైనా, టెర్రరిస్టు రాక్షసులైనా అంత తేలిగ్గా నోరు విప్పరు. జరిగిన దారుణంలో మీ పాత్ర ఏమిటని అడిగి అడిగి అధికారులు అలసి పోవలసిందే. అదిగో అలాంటప్పుడు ఆదుకునేది నార్కో టెస్టులు అనబడే పరీక్షలు, పరికరాలే. ఇవి నిజం కక్కిస్తాయని ఒక నమ్మకం. ఎన్నో కేసుల్లో వీటివల్ల నిజాలు బయటకు వచ్చాయి. ఇంతకీ ఈ టెస్టులేంటి.. వాటికి సంబంధించిన న్యాయపరమైన... శాస్త్రపరమైన అంశాలేంటి? ఈ వారం 'అట్టమీది కథ'లో తెలుసుకుందాం.- బి. అమరనారాయణ
చిన్నాచితకా కేసులయితే ..నాలుగు తగిలిస్తే దోషులు అసలు నిజం కక్కేస్తారు..ఇంకా మొండి ఘటాలైతే పోలీస్‌ మార్కు థర్డ్‌ డిగ్రీ పద్ధతులుండనే వుంటాయి. కానీ కోట్లకు పడగలెత్తిన 'ఘనులు', పచ్చి నెత్తురు తాగే నేరస్తులు నిజాలు అంత ఈజీగా చెప్పరు. ఈ క్రమంలోనే సాంకేతిక సత్య శోధన పరీక్షలు..నార్కో ఎనాలసిస్‌, పాలీగ్రాఫ్‌ టెస్ట్‌, బ్రెయిన్‌ మ్యాపింగ్‌ వంటివి తెరపైకి వచ్చాయి. నిఠారి వరుస హత్యలు, ముంబయి రైలు పేలుళ్లు వంటి అత్యంత తీవ్రమైన కేసుల్లో నిందితులను ఈ పరీక్షల ద్వారా విచారించారు. వీటిని పశ్చిమ దేశాల్లో ట్రూత్‌ సీరమ్స్‌గా పిలుస్తారు. అయితే వీటికి న్యాయబద్ధతే లేదని మానవ హక్కుల రక్షకులంటే..99 శాతం సత్యాలు వెల్లడవుతాయని దర్యాప్తు రంగ నిపుణులు వాదిస్తారు. చాలా దేశాలు వీటికి దూరంగా ఉన్నాయి. గతేడాది మే 5న సుప్రీం కోర్టు ఈ పరీక్షలు రాజ్యాంగ విరుద్ధమంటూనే ఏదైనా కేసులో నార్కో పరీక్షలు నిర్వహించాలంటే తప్పనిసరిగా సదరు వ్యక్తి అనుమతి తీసుకోవాలని చెప్పింది. ఇంత వివాదాస్పదమైన ఈ పరీక్షల ప్రక్రియ ఎలా వుంటుందో ఇప్పుడు చూద్దాం.
నార్కో ఎనాలసిస్‌

మనిషిని సుప్తచేతనలోకి తీసుకెళ్లే మందును వినియోగించడాన్ని నార్కో సింథసిస్‌ లేదా నార్కో ఎనాలసిస్‌ అంటారు. మూడు లీటర్ల సజల నీటిలో మూడు గ్రాముల సోడియం పెంటోథాల్‌ లేదా సోడియం అమైథాల్‌ కలిపి ద్రావకాన్ని తయారు చేస్తారు. దీనిని ఇతర రసాయనాలతో మిశ్రమ మందు తయారు చేసి విచారించాల్సిన వ్యక్తి శరీరంలోకి ఎక్కిస్తారు. పశ్చిమ దేశాల్లో ఈ మందులను ట్రూత్‌ సీరమ్స్‌ అంటారు. శరీరంలోకి మందు చేరిపోగానే నిందితుడు సగం అపస్మారకస్థితిలోకి వెళ్లిపోతాడు. నిద్రావస్థలోకి జారుకున్నట్లు ఉంటుంది. ఈ పరిస్థితిలో ఏం అడిగినా ఆ వ్యక్తి దాచుకోకుండా బదులిచ్చే అవకాశముంటుంది. మాములుగా అయితే ఊహించుకొని అబద్ధాలు ఆడే వీలుంటుంది. కానీ ఈ స్థితిలో అలా ఊహించి చెప్పే వీలుండదు. లోపల దాచుకున్న విషయాన్ని నిరాటంకంగా చెప్పేలా ఆ వ్యక్తిని ఉసిగొల్పుతుంది. అదే సమయంలో భ్రమల్లో తేలియాడేలా చేస్తుంది. వీటిని ఆధారంగా తీసుకొని విశ్లేషించగలిగే నిపుణులు నిందితుడిని ప్రశ్నిస్తారు. చాలా తీవ్రమైన నేరాల్లో దర్యాప్తును వేగవంతం చేసేందుకు ఈ పరీక్షలకు చాలా ప్రాధాన్యత ఉంటుందని సంబంధిత నిపుణులు పేర్కొంటారు. నిందితుల నుంచి నిజాలు రాబట్టడంలో ఈ పరీక్షలు స్వర్ణావకాశంగా భావిస్తారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం ఈ విధంగా విచారణ జరపడం వేధించడంగానే పరిగణిస్తారు. ఈ మందు మోతాదు మించి ఎక్కిస్తే ఆ వ్యక్తి కోమాలోకి వెళ్లిపోయి మరణానికి కూడా దారి తీసే ప్రమాదముంది. జీవక్రియలపైనా ప్రభావముంటుంది.
మానసిక రోగులకు వైద్యమందించేందుకు ఈ మందును వినియోగించే పద్ధతిని 1930లో డాక్టర్‌ విలియం బ్లెక్‌వెన్‌ వెలుగులోకి తెచ్చారు. ఇప్పటికీ ఎంపికచేసిన సందర్భాల్లో ఈ మందును వినియోగిస్తున్నారు. తీవ్ర మానసిక రుగ్మతలతో బాధపడేవారికి ఆ వ్యాధి తీవ్రతను అంచనా వేసేందుకు లేదా దానికి సంబంధించిన కీలక సమాచారాన్ని గుర్తించి తద్వారా రోగికి ఉపశమనం కలగించేందుకు కూడా ఈ మందును వినియోగిస్తారు. ఈ నార్కో ఎనాలసిస్‌ పద్ధతులను 20వ శతాబ్దం ప్రారంభంలోనే వినియోగించినట్లు చెబుతారు. ప్రప్రథమంగా 1922లో నిందితుల విచారణకు ఈ పద్ధతి వినియోగించినట్లు తెలుస్తోంది. అమెరికా కూడా తొలుత ఈ 'నార్కో'ను వినియోగించింది. యుద్ధఖైదీలను ఈ పద్ధతిలోనే విచారించేవారు. అయితే 1989లో న్యూజెర్సీ అత్యున్నత న్యాయస్థానం దీన్ని నిషేధించింది. సోడియం అమైథాల్‌ నార్కో ఎనాలసిస్‌ పరీక్షల్లో వెల్లడైన ఫలితాలు శాస్త్రీయంగా రుజువు కానందున ఆ పద్ధతి ద్వారా జరిపే విచారణను పరిగణనలోని తీసుకోలేమని చెప్పింది. అయితే సెప్టెంబర్‌ 11 దాడుల తర్వాత అమెరికా రహస్యంగా ఈ ట్రూత్‌ సీరమ్స్‌ పరీక్షలను కొనసాగిస్తోందని చెబుతారు. నిజానికి పశ్చిమ దేశాల్లో అనేక రహస్య పద్ధతులలో నిందితులను హింసించడం కద్దు. అయితే చాలా దేశాల్లో వీటిపై నిషేధం వుంది. మనదేశంలో ఈ పరీక్షలను మనోవిశ్లేషణ నిపుణుడు, ఫిజియోథెరపిస్ట్‌, ఫోరెన్సిక్‌ సైకాలజిస్టు, ఆడియో-వీడియో గ్రాఫర్‌, నర్సులతో కూడిన బృందం ఈ పరీక్షలను నిర్వహిస్తుంది.
పాలీగ్రాఫ్‌
ఈ విధానం పాలీగ్రాఫ్‌ గా కంటే లైడిటెక్టర్‌గా సుపరిచితం. అయితే ఇది మందు కాదు. ఒక పరికరం. రక్త పీడనం, నాడి, శ్వాసక్రియ, శరీర కదలికలను ఈ పరికరం గుర్తిస్తుంది. నిందితుడిని ఈ పరికరానికి సంధానం చేసి ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు అతనిలో పై శరీర ప్రక్రియల స్పందనలను బట్టి ఒక అంచనాకు వస్తారు. నిజం చెప్పినప్పుడు శరీర ప్రక్రియల్లో వచ్చే స్పందనలు, తప్పుదారి పట్టించే జవాబులిచ్చినప్పుడు శరీర ప్రక్రియల్లో వచ్చే స్పందనలు వేర్వేరుగా ఉంటాయి. ఇలా స్పందనలను అంచనా వేసి నిపుణులు మదింపు చేసుకుంటారు. అయితే దీనిని చాలా వరకు వ్యతిరేకిస్తారు. 1921లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని జాన్‌ అగస్టస్‌ లార్సన్‌ అనే విద్యార్థి ఈ విధానాన్ని కనుగొన్నారు. బ్రిటనికా ఎన్‌సైక్లోపిడియా 2003లో రూపొందించిన 'మానవ జీవితంపై మంచి లేదా చెడు ప్రభావాలు చూపే గొప్ప ఆవిష్కరణల జాబితా'లో ఈ పాలీగ్రాఫ్‌కు కూడా చోటు దక్కింది. మనదేశంతో పాటు అమెరికా పోలీసులు, నిఘా విభాగాలు ఈ పరిజ్ఞానాన్ని వినియోగిస్తాయి. అయితే కోర్టులు వీటిని సాక్ష్యాలుగా అంగీకరించకపోయినా ఇజ్రాయిల్‌, ఆస్ట్రేలియా, యూరప్‌, కెనడాలలో ఈ పద్ధతి ఆచరణలో ఉంది.
బ్రెయిన్‌ మ్యాపింగ్‌

ఈ విధానానికి బ్రెయిన్‌ ఫింగర్‌ ప్రింటింగ్‌, పి 300 టెస్ట్‌ అనే పేర్లు కూడా వున్నాయి. 1995లో డాక్టర్‌ లారెన్స్‌ ఎ ఫర్వెల్‌ అనే న్యూరాలజిస్టు ఈ విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ పద్ధతిలో మొదట నిందితుడిని ఇంటర్వ్యూ చేస్తారు. సమాచారం నిక్షిప్తం చేస్తారు. ఆ తర్వాతి దశలో నిందితుడి తలకు సెన్సర్లను అమర్చి సంబంధిత నేరానికి దగ్గరగా ఉన్న చిత్రాలను చూపించడం, శబ్దాలను వినిపించడం చేస్తారు. అప్పుడు అతని మెదడు నుంచి వెలువడే పి300 విద్యుత్‌ తరంగాలను సెన్సర్‌ నమోదు చేస్తుంది. ఆ చిత్రాలకు, శబ్దాలకు నిందితుడితో సంబంధముంటేనే ఈ పరికరం తరంగాలను గ్రహించి నమోదు చేస్తుంది. వాటిని విశ్లేషించి దర్యాప్తు సంస్థలు విచారణ సాగిస్తాయి.
'అ'శాస్త్రీయమే!
శాస్త్రీయ సత్య శోధన పరీక్షలుగా వీటికి పేరున్నా..అంతగా విశ్వసించదగ్గ పరీక్షలేమీ కాదని పలువురు నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే ఇవన్నీ కూడా నిందితుడిని శారీరకంగా, మానసికంగా ప్రేరేపించి..సాధారణ స్థితిలో లేనప్పుడు నిర్వహించే పరీక్షలు. ఒకవేళ ఉన్నపళంగా ఉఛ్వాసనిశ్వాసలు, లేదా హృదయస్పందనలు, రక్త పీడనంలో మార్పులు అధికంగా చోటుచేసుకుంటే సదరు వ్యక్తి అసత్యాలు చెబుతున్నా..పాలీగ్రాఫ్‌లో రికార్డు అవుతాయి. మామూలుగా నిజాలు చెప్పినప్పుడే ఈ పరికరం ఇలాంటి రికార్డులు నమోదు చేస్తుంది. అదే సమయంలో ఏ వ్యక్తి అయినా ఆరోగ్యం సరిగాలేక అతని శ్వాస, రక్తపీడనం, ఇతర శరీర కదలికల్లో పెద్దగా స్పందన లేకపోతే అతను సత్యాలు చెబుతున్నా..పరికరంలో ఆ స్పందనలు రికార్డు కావు. అందువల్ల ఏ వ్యక్తి అయినా ఈ పరీక్ష విఫలమైతే అతను అబద్ధం చెప్పినట్లుగా పరిగణించేందుకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే ఇందులో అబద్ధం చెప్పడానికి కేవలం ఐదు శాతం మాత్రమే ఆస్కారం ఉంటుందని విచారణ, వైద్య రంగ నిపుణులంటారు. వీటిలో శాస్త్ర, న్యాయ సమ్మతుల విషయమెలా ఉన్నా అంతర్జాతీయంగా చాలా దేశాలు ఈ టెస్టులను అంగీకరించడం లేదన్న విషయం ఇక్కడ గమనార్హం. ఈ పరీక్షలు నిర్వహించే తీరుపైనా, వీటి న్యాయబద్ధతపైనా దశాబ్దాల తరబడి వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నాయని కొందరంటే..దోషులను శిక్షించేందుకు సహకరిస్తున్నందున కొనసాగించడమే మేలని మరికొందరి వాదన. ఈ పరీక్షలపై న్యాయబద్ధతను తేల్చాలంటూ అనేక మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాటిని పరిశీలించిన సుప్రీంకోర్టు 2008 జనవరిలో 25న తీర్పు ను వెలువరించకుండా రిజర్వు చేసింది. రెండున్నరేళ్లు గడిచిన అనంతరం గత ఏడాది మే5న ఈ పరీక్షలన్నీ రాజ్యాంగ విరుద్ధమని తేల్చి సంచలనాత్మక తీర్పు వెలువరించింది. నార్కో ఎనాలసిస్‌, బ్రైయిన్‌ మ్యాపింగ్‌, పాలీగ్రాఫ్‌ పరీక్షలు రాజ్యాంగ విరుద్ధమని తమ 251 పేజీల తీర్పులో ప్రధానన్యాయమూర్తులు జస్టిస్‌ కెజి బాలకృష్ణన్‌, జస్టిస్‌ ఆర్‌వి రవీంద్రన్‌, జెఎం పంఛాల్‌తో కూడిన ధర్మాసనం విస్పష్టంగా తేల్చిచెప్పింది.
సుప్రీం తీర్పు
'క్రిమినల్‌ కేసుల్లోగానీ, ఇంకా ఏ ఇతరంగానైనా బలవంతపు పద్ధతుల్లో విచారణ చేయడమంటే అది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే. ఇలాంటి పద్ధతులు ఉపయోగించడం వల్ల స్వీయ రక్షిత హక్కుకు విఘాతం కల్గించినట్టే. బలవంతంగా రాబట్టిన ఈ తరహా పరీక్షల ఫలితాలను సాక్ష్యాధారాలుగా అంగీకరించలేం. నేరం చేసినట్లుగా లేదా చేయనట్లుగా ఆ ఫలితాలు ధృవపర్చినా..రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 20(3) (''ఏ నేరం కిందనైనా నిందితునిగా ఉన్న వ్యక్తి తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం ఇచ్చేందుకు బలవంతపెట్టరాదు'') కింద మాట్లాడటమా/మౌనంగా ఉండిపోవడమా ఎంచుకొనే వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించాలి. సమాచారాన్ని రాబట్టడంలో బలప్రయోగం నుంచి ఆర్టికల్‌ 20(3) రక్షణ కల్పిస్తుంది, అందువల్ల ఇలాంటి పరీక్షల ఫలితాలను సాక్ష్యాలుగా పరిగణించలేం. ఒక వేళ నిందితుని అనుమతితోనే ఈ పరీక్షలు నిర్వహించినా కూడా వాటి ఫలితాలను సాక్ష్యాలుగా పరిగణించరు. అయితే సాక్ష్యాధారాల చట్టంలోని సెక్షన్‌ 27 ప్రకారం నిందితుని అనుమతితో చేసిన పరీక్షల ఫలితాల సహకారంతో ఏదైనా సమాచారం, మెటీరియల్‌ను అగీకరించవచ్చు' అని పేర్కొంది. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం తనకు వచ్చిన అనేక ఫిర్యాదులు, విజ్ఞప్తులను పరిశీలించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి తీర్పు రాస్తూ 'ఒక వ్యక్తి అనుమతి లేకుండా ఇలాంటి పద్ధతులు ప్రయోగించడం అతని వ్యక్తిగత స్వేచ్ఛ హద్దులను ఉల్లంఘించినట్లు అవుతుంది. ఒక మనిషి మానసిక ప్రక్రియలో జోక్యం చేసుకొనేందుకు ఏ శాసనమూ సమ్మతించదు. తన నిర్దోషిత్వాన్ని కాపాడుకునే స్వేచ్ఛను హరించివేయడమే అవుతుంది' అన్నారు.
స్వచ్ఛంద పరీక్షలకు ఓకే
దర్యాప్తు సంస్థలకు, పోలీసులకు సుప్రీంకోర్టు తీర్పు తీవ్ర నిరాశ కలిగించినా..కాస్త ఉపశమనమూ ఇచ్చింది. స్వచ్ఛందంగా ఈ శాస్త్రీయ పరీక్షలకు అంగీకరించిన సందర్భంలో పరీక్షలు జరపవచ్చని తెలిపింది. ఇలా స్వచ్ఛంద అంగీకారం తెలిపేవారికి పాలీగ్రాఫ్‌, నార్కో ఎనాలసిస్‌, బ్రైయిన్‌ మ్యాపింగ్‌ పరీక్షల నిర్వహణకు జాతీయ మానవ హక్కుల సంఘం రూపొందించిన మార్గదర్శకాలను పాటించాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ పరీక్షల్లో వెలువడే ఫలితాలనూ సాక్ష్యాలుగా పరిగణించమని స్పష్టం చేసింది.
జాతీయ మానవ హక్కుల సంఘం మార్గదర్శకాలు
తగిన అనుమతి లేకుండా ఏ పరీక్షనూ నిర్వహించరాదు.
నిందితుడు పరీక్షలకు అంగీకరిస్తే వాటివల్ల కలిగే శారీరక, మానసిక, ఉద్వేగ ప్రభావాలను, న్యాయపర చిక్కులను అతనికి వివరించేందుకు ఆయన తరపు న్యాయవాదిని కచ్చితంగా అనుమతించాలి.
దర్యాప్తు తీరును జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట రికార్డు చేయాలి.
పరీక్షలకు అంగీకరించిన వ్యక్తి విచారణ సమయంలో తన న్యాయవాదితో సంప్రదింపులు చేయొచ్చు.
పోలీసులు సాధారణంగా తీసుకొనే నిందితుల వాంగ్మూలానికి సాక్ష్యాధారంగా గుర్తింపు వుంటుంది. అయితే ఈ పరీక్షల్లో వెల్లడైన ఫలితాలను సాక్ష్యాధార వాంగ్మూలంగా పరిగణించబడదు.
న్యాయవాది సమక్షంలో స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ మాత్రమే ఈ పరీక్షలు నిర్వహించాలి.
పూర్తిస్థాయి వైద్య, విచారణ సాగిన తీరు, సేకరించిన సమాచారాన్ని కచ్చితంగా నమోదు చేయాలి.
మానవ హక్కులకే పెద్ద పీట
అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ పరీక్షల శాస్త్రీయతను ఏవిధంగానూ ప్రశ్నించకపోవడం విశేషం. కేవలం మానవునిగా తన ప్రాథమిక హక్కులకు విఘాతం కలగకూడదన్న దృక్పథంతోనే ఉన్నతన్యాయస్థానం తన తీర్పునిచ్చింది. పలు అంతర్జాతీయ మానవ హక్కుల వేదికలు కూడా ఇదే విధంగా ఉద్ఘోషిస్తున్నాయి. మానవ హక్కులపై అంతర్జాతీయ ఒప్పందంలోని ఆర్టికల్‌ 3లో 'జీవించడానికి, స్వేచ్ఛగా తన వ్యక్తిత్వ భద్రతను పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉంది' అని పేర్కొనగా అదే ఒప్పందంలోని ఆర్టికల్‌ 5లో 'భౌతికంగా లేదా మోటు పద్ధతుల ద్వారా లేదా శిక్షించడం ద్వారా ఎవరినైనా వేధించేందుకు, క్రూరంగా హింసించేందుకు ఏ ఒక్కరికీ అధికారం లేదు' అని స్పష్టంగా తెలిపింది. అలానే పౌర మరియు రాజకీయ హక్కులుపై అంతర్జాతీయ ఒడంబడిక-1966 (ఐసిసిపిఆర్‌)లోని ఆర్టికల్‌ 6(1) ప్రకారం..'ప్రతి మానవుడు తనకు తనుగా సగౌరవంగా జీవించే హక్కు కలిగివుంటాడు. న్యాయం ఈ హక్కును పరిరక్షించాలి. అతని జీవితాన్ని నిరంకుశంగా నాశనం చేసే హక్కు ఎవ్వరికీలేదు' అని పేర్కొంది. ఏ వ్యక్తికైనా అతను స్వేచ్ఛగా అనుమతి ఇవ్వనిదే వైద్య, శాస్త్రీయ పరీక్షలు నిర్వహించరాదని ఇదే ఒడంబడికలోని ఆర్టికల్‌ 7 చెబుతుంది. ఈ ఒప్పందంలోని ఆర్టికల్‌ 14(2) ప్రకారం..క్రిమినల్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి చట్టబద్ధంగా అతను దోషిగా నిరూపితమయ్యేవరకు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే హక్కు కలిగివుంటాడు. నిర్బంధ లేదా శిక్ష అనుభవిస్తున్న ఖైదీల రక్షణ కోసం ఐక్యరాజ్యసమితి 1988లో రూపొందించిన మార్గదర్శకాల్లోనూ హక్కుల రక్షణకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు.. వాటి ప్రకారం నిర్బంధంలో లేదా ఖైదుగా ఉన్న వ్యక్తిని తన నేరాన్ని, లేదా ఇతరుల నేరాలను ఒప్పుకునేలా..అతని పరిస్థితిని అనుచిత అవకాశంగా తీసుకోరాదు. అలాగే అదుపులో ఉన్న వ్యక్తిని హింసకు గురిచేసి, లేదా బెదిరించి, లేదా అతని సామర్థ్యానికి మించిన స్థాయిలో విచారించడం కానీ చేయరాదు. అదుపులో ఉన్న ఏవ్యక్తినైనా అతని అనుమతి ఉన్నా..అతని ఆరోగ్యానికి కీడు చేసే వైద్య, శాస్త్రీయ పరీక్షలు నిర్వహించరాదు.
శాస్త్రీయత, అశాస్త్రీయత పక్కనబెడితే మానవ హక్కులకు భంగం కలిగించకుండా దోషులను గుర్తించే సరికొత్త పద్ధతులు విచారణ రంగంలో ఆవిష్కృతం కావాలని ఆశిద్దాం.
ఇక థర్డ్‌ డిగ్రీ బాట!
ఈ శాస్త్రీయ పరీక్షలకంటే ముందు రాజులకాలంలో లాగా ఖైదీలను శారీరకంగా హింసించి నిజాలు చెప్పించేవారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సత్య శోధన పరీక్షలకు ఆస్కారం చాలా తక్కువైనందున విచారణాధికారులు థర్డ్‌ డిగ్రీ పద్ధతులు అవలంభించే అవకాశాలూ ఉన్నాయన్న ఆందోళన ఇప్పుడు వ్యక్తమవుతోంది. ఇలాంటి పద్ధతులు కొనసాగుతూనే ఉన్నాయని తరచూ పత్రికల్లో వార్తలు దర్శనమిస్తుంటాయి. శారీరకంగా, మానసికంగా తీవ్ర హింసకు గురిచేసి సమాచారం కక్కించడమే థర్డ్‌డిగ్రీ పద్ధతి. పట్టుకారతో గోళ్లు గుంజడం, జననాంగాలపై కాల్చడం, రక్తం చిమ్మేలా చితకబాదడం, ఒంటరిగా చీకటిగదిలో వేసి మనోవ్యధకు గురిచేయడం, ముళ్లగదతో బాదడం వంటివి. తలికిందులుగా వేళ్లాడదీసి ఎలుకలున్న సంచిని మూతికి కట్టడం వంటివి, చేతులు-కాళ్లు కట్టేసి, వంటిపై నూలుపోగు లేకుండా చేసి చిత్రవధ చేయడం వంటి వన్నీ థర్డ్‌డిగ్రీ కిందకే వస్తాయి. ఈ దృశ్యాల్లో అమెరికా జైళ్లలో సర్వసాధారణంగా కనిపిస్తుంటాయని ప్రతీతి. యుద్ధ ఖైదీలు, ఉగ్రవాద ముద్ర వేసి అమెరికా నిఘా సంస్థ సిఐఎ చేసిన వికృత చేష్టలకు ప్రపంచ మీడియా నివ్వెరపోయిన ఘటనలెన్నో ఉన్నాయి. ఈ థర్డ్‌ డిగ్రీ దృశ్యాలను మనం హాలీవుడ్‌ సినిమాలతో పాటు తెలుగు చిత్రాల్లోనూ చూడొచ్చు. ఆ మధ్య వచ్చిన 'అపరిచితుడు'లో హీరో విక్రమ్‌ను విలన్‌ ప్రకాశ్‌రాజ్‌ హింసించి నిజాలు చెప్పించడం వంటి ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు థర్డ్‌ డిగ్రీకి చక్కని ఉదాహరణలు. అదేవిధంగా హాస్యనటులు బ్రహ్మానందం విచారణాధికారిగాను, అలీ చిత్రకళాకారుడిగా నవ్వులు పూయించిన 'సూపర్‌' చిత్రంలోని 'అబద్ధాల మిషన్‌' దృశ్యం ఎంతగా ఆకట్టుకుందో తెలియంది కాదు. ఈ హాస్యసన్నివేశాన్ని పాలీగ్రాఫ్‌ పరీక్షలకు ఉదాహరణగా చెప్పవచ్చు.
ఎక్కడెక్కడీ
నార్కో ఎనాలసిస్‌, బ్రెయిన్‌మ్యాపింగ్‌, పాలీగ్రాఫ్‌ పరీక్షలు నిర్వహించేందుకు ప్రస్తుతం అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, బెంగళూరులోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లే అందుబాటులో ఉన్నాయి. దేశమంతటికీ ఈ మూడు కేంద్రాలే ఉండటంతో వీటిపై అధిక భారం పడుతోంది. కాగా ఈ భారాన్ని తగ్గించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ తరహా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గతేడాది ఆగస్టులోనే నిర్ణయించింది. సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఇది పూర్తయితే ఉత్తర భారతావనిలో ఇదే మొదటిది అవుతుంది.
ఎవరెవరికి?
2003లో స్టాంపుల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన అబ్దుల్‌ కరీం తెల్గీకి నార్కో ఎనాలసిస్‌ పరీక్షలు నిర్వహించారు. అలాగే ముంబయి వరుస బాంబు పేలుళ్ల-1993 కేసులో నిందితుడు, అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం ప్రధాన అనుచరుడైన అబు సలేంకు 2005 డిసెంబర్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు. అనుమానిత ఉగ్రవాది ఇమ్రాన్‌ అలియాస్‌ బిలాల్‌కు 2007లో ఈ టెస్టులు జరిపారు. ఇదే సంవత్సరం నిఠారి హత్య కేసులో ప్రధాన నిందితుడైన సురేంద్ర కొలీకి ఈ తరహా పరీక్షలు నిర్వహించారు. కేరళలో సిస్టర్‌ అభయ హత్య కేసులో 2007 ఆగస్టులో ఫాదర్‌ థామస్‌ కొట్టూర్‌, జోష్‌ పూథ్రిక్కాయిల్‌, సెఫీ తదితరలకు నార్కో ఎనాలసిస్‌ పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన దృశ్యాలను ఎడిట్‌ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇటీవల కాలంలో గతేడాది అరుషి హత్యకేసులో ఆమె తల్లిదండ్రులైన రాజేష్‌ తళ్వార్‌ దంపతులకు, నల్లధనం కేసులో కీలకపాత్రధారి అయిన గుర్రాల వ్యాపారి హసన్‌ అలికీ ఈ టెస్టులు నిర్వహించాలని సిబిఐ సంబంధిత కోర్టులకు విజ్జప్తి చేసింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం ఈ పరీక్షల నుంచి వీరితో పాటు చాలా మందికి ఉపశమనం లభించిందని చెప్పవచ్చు. ఇలా ఉపశమనం పొందినవారిలో రూ.ఏడు వేల కోట్ల అర్థిక కుంభకోణానికి సంబంధించిన సత్యం కంప్యూటర్స్‌ మాజీ అధినేత సత్యం రామలింగరాజు, అతని సన్నిహితుడు వి శ్రీనివాసన్‌ ప్రముఖంగా ఉన్నారు. వీరి తర్వాత సోహ్రబుద్దీన్‌ నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో నిందితుడైన డిజి వంజరా, అరుషి హత్య కేసులో రాజేష్‌, నుపుర్‌ తళ్వార్‌కు, కృషి బ్యాంకు దివాలా కుంభకోణం కేసులో కొసరాజు వెంకటేశ్వరరావు తదితరులతో పాటు మావోయిస్టు నేత కోబాడ్‌ గాంధీ, గుజరాత్‌ ఆధ్యాత్మిక గురువు సంతోక్‌బెన్‌ జడేజా ఈ పరీక్షల నుంచి తప్పించుకునే వెసులుబాటు కలిగింది.
సబ్‌-కాన్షస్‌ స్థితిలో అబద్ధం చెప్పలేరు
అబద్ధం చెప్పేటప్పుడు మానసికంగా, శారీరకంగా కొన్ని మార్పులు జరుగుతుంటాయి. అయితే ఇవి అందరికీ జరుగుతుంటాయని చెప్పలేం. మార్పులు మనిషి మనస్తత్వంపై ఆధారపడతాయి. కొంత మంది మానసిక స్థితి బలహీనంగా ఉంటుంది. అటువంటి వారిలో ఈ మార్పులు కనిపిస్తాయి. ముందుగా లైడిటెక్షన్‌ పరీక్ష చేస్తారు. ఆ తర్వాత నార్కో అనాలసిస్‌ పరీక్ష చేస్తారు.
లైడిటెక్షన్‌ పరీక్ష సందర్భంగా వీరిలో కనిపించే మార్పులు....
విచారణలో భాగంగా ప్రశ్నించినప్పుడు చెమటలు పడతాయి. ఎంత చెమట పట్టింది, చెమటలో ఎంత సోడియం, పొటాషియం ఉందో విశ్లేషిస్తారు. గుండె కొట్టుకునే వేగంలో మార్పులుంటాయి. శ్వాస తీసుకోవడంలోనూ మార్పులుటాయి. బేసిక్‌ మెటబాలిక్‌ రేటు శారీరక మార్పుల్లో ముఖ్యమైంది. మిగతా అవయవాలకు రక్తం ఎలా సరఫరా అవుతుందో బేసిక్‌ మెటబాలిక్‌ రేటు సూచిస్తుంది. ఒక మనిషి కచ్చితంగా అబద్ధం ఆడుతున్నాడని చెప్పలేం. ఇతను అబద్ధం ఆడే అవకాశముందని మాత్రమే చెప్పే వీలుంది. ఒక కేసులో లభించిన సాక్ష్యాల ఆధారంగా లైడిటెక్షన్‌ పరీక్షపై ఆధారపడకూడదు.
నార్కో అనాలసిస్‌ టెస్ట్‌
ఏ సమయంలో ఈ పరీక్ష చేశారనేదానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు రకరకాల ప్రశ్నలు అడిగితే అతని మానసిక స్థితి ఆ ప్రశ్నలతోపాటు అటువంటి జవాబులకే అలవాటుపడుతుంది. అకస్మాత్తుగా ఒక వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని మళ్లీ మళ్లీ అదే ప్రశ్నలు సంధిస్తే అనుకున్న సమాధానం రాదు. నార్కో అనాలసిస్‌ పరీక్షలో ఆ వ్యక్తికి నిద్ర వచ్చేందుకు ఒక విధమైన రసాయనం ఉన్న ఇంజక్షన్‌ను రక్తంలోకి ఎక్కిస్తారు. ఇది నిష్ణాతులైన మత్తు మందు వైద్యనిపుణులతో చేయిస్తారు. మనిషి మానసిక స్థితిని మూడు దశలుగా విభజించవచ్చు. కాన్షస్‌, అన్‌ కాన్షస్‌, సబ్‌-కాన్షస్‌. ఇంజక్షన్‌ ద్వారా ఆ వ్యక్తిని సబ్‌-కాన్షస్‌ స్థితిలోకి తీసుకొస్తారు. ఈక్రమంలో రసాయనం వేగంగా ఇస్తే పడుకుంటారు, నెమ్మదిగా ఇస్తే తెలివితో ఉంటారు. జాగ్రత్తగా పరిశీలిస్తూ ఎక్కించాలి. సబ్‌-కాన్షస్‌ స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి అబద్ధం చెప్పడం చాలా కష్టమవుతుంది. నిద్ర మాత్రలు, మద్యపానం అలవాటున్న వ్యక్తులకు నార్కోఅనాలసిస్‌ పరీక్ష అంతగా పనిచేయకపోవచ్చు. ఇంజక్షన్‌ ఇస్తున్న సమయంలో ఆ వ్యక్తి మత్తులోకి వెళ్లినట్లుగా ప్రవర్తిస్తే వెంటనే పసిగట్టొచ్చు. రక్తపోటు, గుండె పల్స్‌రేటు, శ్వాస తీసుకునే రేటు తెలుసుకునే యంత్రాల ద్వారా వారు నిజంగానే మత్తులోకి వెళ్లారా లేదా నటిస్తున్నారా అనేది తెలుసుకోవచ్చు. సాధారణంగా యోగా, ప్రాణాయామపై గట్టి పట్టు ఉన్నవారు సబ్‌-కాన్షస్‌ స్థితిలో కూడా అబద్ధాలు చెప్పగలిగే అవకాశముంది. వీళ్లు అబద్ధాలు చెప్పినా శరీరంలో ఎలాంటి మార్పులుండవు. మొత్తం మీద నార్కో ద్వారా 80 నుంచి 90 శాతం నిజాలు రాబట్టే అవకాశముంది.

No comments: