- మంత్రి సమక్షంలో ఉన్నతాధికారిపై దాడి
- సచివాలయానికి వస్తున్న బస్సుల ధ్వంసం
- విద్యుత్‌సౌథ వద్ద రోడ్డుపై బైఠాయింపు
- మంత్రి, ఎంపీలతో పాటు పలువురి అరెస్ట్
- ఎమ్మార్ కార్యాలయంపై దాడి
- సిఎం ఆఫీసు వద్ద ఆటపాట
- రక్షణ కల్పించండి : సిఎస్‌కు ఎపి ఎన్జీఓల సంఘం వినతి
ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోరుతూ సాగుతున్న సకల జనుల
సమ్మె 14వ రోజైన సోమవారం రాష్ట్ర రాజధానిలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త
పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు లాఠీఛార్జీ, అరెస్టులు చేశారు. సోమవారం
ఉదయం నుండి సాయంత్రం వరకు నగరంలోని ఏదోఒక ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతూనే
ఉంది. విద్యుత్‌సౌథ వద్ద రోడ్దుపై భైఠాయించిన మంత్రి కోమటిరెడ్డి
వెంకటరెడ్డి, ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, రాజయ్యతో పాటు పలువురు
నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం పది గంటల ప్రాంతంలో ఎన్జీఓ కాలనీ
నుండి సచివాలయానికి ఉద్యోగులతో బయ లుదేరిన బస్సులను నిరసనకారులు
అడ్డుకున్నారు. ఉద్యోగులను దించేసి బస్సు లపై రాళ్ల దాడి చేశారు. ఆ తరువాత
కొద్ది సేపటికే రవాణా కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సమక్షంలోనే సహాయకమిషనర్‌పై చేయిచేసు కున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల
ప్రాంతంలో సచివాలయంలో సిఎం కార్యాలయం ఎదురుగా ఉద్యోగులు ఆటపాట
నిర్వహించారు. వారికి మంత్రితో పాటు, ఎంపీలు, టిఆర్‌ఎస్ నేతలు మద్దతుగా
నిలిచారు. ఉద్యోగులకు నోటీ సులు జారీ చేసిన గ్రామీణాభివృధ్ది శాఖ
అధికారులను నిలదీశారు. రెండన్నర గంటల ప్రాంతంలో విద్యుత్‌సౌధా వద్ద ఆందోళన
తీవ్రస్థాయికి చేరింది. భారీ ఎత్తున ట్రాఫిక్‌జామ్ కావడంతో పోలీసులు
రంగంలోకి దిగి అరెస్ట్‌లు చేశారు. సాయంత్రం ఎమ్మార్ కార్యాలయంపై తెలంగాణా
యునైటెడ్ ఫ్రంట్ కార్యకర్తలు దాడిచేశారు. ఉదయం నుండి చోటుచేసుకున్న
పరిణమాల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓల సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
ఎస్వీ ప్రసాద్‌ను కలిసి విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు రక్షణ
కల్పించాలని కోరారు. మంత్రి వెంకటరెడ్డితో పాటు కాంగ్రెస్ ఎంపీలు, తెరాస
నేతలు ఒకే వాహనంలో తిరుగుతూ సోమవారం ఉదయం నుండి ఆందోళన కార్యక్రమాలను
పర్యవేక్షించడం విశేషం. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో మంత్రి కోమటిరెడ్డి
వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత మంత్రివర్గంలో సభ్యునిగా ఉండటం తన
దౌర్భాగ్యమని వ్యాఖ్యా నించారు. ఎంపి మధుయాష్కీ ప్రభుత్వాన్ని కూల్చి
వేయడానికి సైతం వెనకాడమని ప్రకటించారు.
'రవాణా'లో ఉద్రిక్తత...
సకల
జనుల సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులు 24 గంటల్లోపు విధులకు హాజరు కావాలని,
లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటా మని రవాణాశాఖ కమిషనర్ హీరాలాల్
సమారియా ఇచ్చిన నోటీసులు దుమారాన్ని రేపాయి. సోమ వారం ఉదయం నుండే ఉద్యోగ
సంఘాల నేతలు అక్కడ ఆందోళనకు దిగారు. కార్యాలయం బయట ధర్నా నిర్వహించారు.
ఉదయం 11.30 గంటల ప్రాంతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు
మధుయాష్కీ, రాజయ్య, పొన్నం ప్రభాకర్, టిఆర్‌ఎస్ నేతలు కెటిఆర్, ఈటెల
రాజేందర్‌తో పాటు తెలంగాణా నగరా సమితి నేత నాగం జనార్ధనరెడ్డి అక్కడకు
చేరుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నాయకులతో కలిసి
ఉద్యోగులు ఒక్కసారిగా కమిషనర్ కార్యాల యం లోకి దూసుకువెళ్ళి షోకాజ్
నోటీస్ వెనక్కి తీసు కోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి
కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, రవాణాశాఖ కమిషనర్ హిరాలాల్ సమారియాకు మధ్య
తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. అదే సమయంలో షోకాజ్ నోటీసులకు జారీ
చేయడానికి అసిస్టెంట్ డైరక్టర్ శ్రీనివాస్ కారణమంటూ కొందరు ఆయన్ను
చుట్టుముట్టి చేయిచేసుకున్నారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. రవాణాశాఖ
మంత్రి బొత్స సత్యనారాయణతో మాట్లాడిన కమిషనర్ నోటీసులను వెనక్కి
తీసుకుంటున్నామంటూ ప్రకటించారు. ఉద్యోగుల డిమాండ్ మేరకు అప్పటికప్పుడే
రాతపూర్వక ఉత్తర్వులను అందచేశారు. అక్కడినుండి నాయకులందరూ కలిసి ఇదే తరహాలో
ఉత్తర్వులు జారీ చేసిన గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయానికి
వెళ్లారు.ఐకెపిలో తెలంగాణా ప్రాంత కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ జారీ
చేసిన ఉత్తర్వులపై సెర్ప్ సిఇఓను నిలదీశారు. దాదాపు అరగంటపాటు అక్కడ
వాగ్వివాదం జరిగింది. తొలగింపు ఉత్తర్వులను రద్దు చేస్తామని సెర్ప్ సిఇఓ
రాజశేఖర్ ప్రకటించారు.
సచివాలయంలోనూ ఉత్కంఠ
సచివాలయంలోనూ
ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ముందుగా ప్రకటించిన విధంగానే కొందరు
ప్రభుత్వ డ్రైవర్లు, లిఫ్టు ఆపరేటర్లు విధులకు హాజరు కాలేదు. దీంతో
ఉన్నతస్థాయి అధికారులు సచివాలయానికి రావడానికి ఇబ్బందులు పడ్డారు. మరోవైపు
సచివాలయ తెలంగాణా ఉద్యోగుల సంఘం ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి ముఖ్యమంత్రి
కార్యాలయం ముందే ఆటపాట నిర్వహించింది. అంతకుముందు సచివాలయంలో పాదయాత్ర చేసి
ఉద్యోగులు విధులకు హాజరుకావద్దంటూ మిగిలిన వారిని కోరారు. సిఎం కార్యాలయం
వద్ద దాదాపు గంటపాటు బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. గ్రామీణాభివృద్ధి
కార్యాలయం నుండి బయలుదేరిన నాయకులు అక్కడి నుండి నేరుగా సచివాలయానికి
చేరుకున్నారు. ఉద్యోగులకు మద్దతు ప్రకటించారు. పరిస్థితి చేయిదాటేటట్లు
కనిపించడంతో పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. సచివాలయంలోకి రాకపోకలను
అడ్డుకున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు ఉద్యోగుల నుద్దేశించి నాయకులు
మాట్లాడారు. ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
విద్యుత్ సౌథ వద్ద అరెస్ట్‌లు
సచివాలయం
నుండి బయలు దేరిన నాయకులు అక్కడి నుండి నేరుగా విద్యుత్‌సౌథ వద్దకు
చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఆందోళన చేస్తున్న ఉద్యోగులతో కలిసి రోడ్డుపై
భైఠాయించారు. అంతకుముందు విద్యుత్ కోతలపై సిఎండి అజరుజైన్‌తో చర్చించారు.
చర్చలు విఫలమయ్యాయని ప్రకటించిన నేతలు రోడ్డుపై భైఠాయింపు ప్రారంభించారు.
దాదాపు గంటకు పైగా ఈ భైఠాయింపు కొనసాగింది. దీంతో పెద్దఎత్తున ట్రాఫిక్
జామ్ అయ్యింది. ఆందోళన విరమించాలంటూ పోలీస్ అధికారులు చేసిన విజ్ఞప్తులను
నేతలు ఖాతరు చేయలేదు. దీంతో వారిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్
పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, రాజయ్య,
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, టిఆర్‌ఎస్ నాయకులు కెటిఆర్, ఈటెల
రాజేందర్ అరెస్టయిన వారిలో ఉన్నారు.
టిడిపి ఎంఎల్‌ఏ అరెస్ట్
ఎన్జీఓ
కాలనీ నుండి సచివాలయానికి ఉద్యోగులతో బయలు దేరిన బస్సులను తెలంగాణా వాదులు
అడ్డుకున్నారు. ఉద్యోగులను దించివేసి బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. ఈ
ఆందోళనలో పాల్గోన్న టిడిపి ఎంఎల్‌ఏ మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని పోలీసులు
అరెస్ట్ చేశారు. అనంతంరం ఎంఎల్‌ఏ మాట్లాడుతూ సకల జనుల సమ్మెను అందరూ
జయప్రదం చేయాలని కోరారు.
ఎమ్మార్ కార్యాలయంపై దాడి
సాయంత్రం
నాలుగు గంటల ప్రాంతంలో తెలంగాణా యునైటెడ్ ఫ్రంట్ కార్యకర్తలు
మణికొండలోని ఎమ్మార్ కార్యాలయంపై దాడిచేశారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.
కార్యాలయ అద్దాలను పగల గొట్టారు. కార్యాలయం పై అంతస్తుకు చేరుకుని నినాదాలు
చేశారు. సోమవారం ఉదయం సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులను సైతం విధులు
బహిష్కరించమనికోరుతూ కొందరు ప్రచారం చేశారు. అయితే ఈ విజ్ఞప్తికి పాక్షిక
స్పందన మాత్రమే లభించింది. దీంతో సాయంత్రం దాడి జరిగిఉంటుందని
భావిస్తున్నారు.



No comments:
Post a Comment