Sep 27, 2011

ఖరీదైన నిరాహారం

ఇదో చిత్రవిచిత్ర విశ్వం. వింతలూ, విడ్డూరాలకు కొదవే వుండదు. ఆహారం కావాలన్నా పైసలు కావాలి. నిరాహారం వుండాలన్నా కాసులు కావాలి. కడుపుకు తిన్నా తినకున్నా ఖర్చు చేయాల్సిందేనా? ఇదెక్కడి చిక్కు అనిపిస్తుంది. ఎందాకో ఎందుకు! ఒక్క పొద్దు పద్దే చూద్దాం. విచిత్రంగా పస్తు వుంటే ఖర్చు తగ్గాల్సింది పోయి పెరుగుతుంది. మరి ఆ సాయంత్రం పళ్లూ పాలూ ఫలహారాలు మాత్రమే పుచ్చుకుంటే అంతే కదా. ఇది సామాన్యుల సంగతి. అదే స్వామీజీలు, మాతాజీలు, బాబాలకైతే వేల రూపాయల్లో ఖర్చవుతుంది. పాలకవర్గ పార్టీల నాయకులే కనక నిరాహారం వుంటే అయ్యే ఖర్చు లక్షలు, కోట్లు. మరి వారి ఏర్పాట్లు మామూలుగా వుంటాయా! దీక్ష వేదిక కోసం స్థలం బుక్‌ చేయాలి. ఆకాశమంత పందిరి వేయాలి. నేలంతా పరుపులు పరవాలి. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, మైకులు, మీడియాకు మంచెలు ఎట్సెట్రా ఎట్సెట్రా కావాలి. స్టార్‌ ఆస్పత్రి వైద్యం అందుబాటులో వుండాలి. పత్రికల్లో, టీవీ చానళ్లలో ఫొటోలు ఇంటర్వ్యూలు వచ్చేలా చూసుకోవాలి. తోటి రాజకీయ నాయకులు, పార్టీలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల నేతలు, కార్యకర్తలు వేలాదిగా వచ్చి పరామర్శించేలా ఫిక్స్‌ చేయాలి. భద్రత కోసం కంపెనీలకు కంపెనీలు బలగాలు కావాలి. ఆ పరిసరాల్లో పదే పదే ట్రాఫిక్‌ జామ్‌ గట్రా అయి వీరి దీక్ష గురించి చర్చించుకునేలా చూడాలి. పైగా పరామర్శించడానికి వచ్చేవారి స్వాగత సత్కారాలు, సాగనంపే ఏర్పాట్లు చూసుకోవాలి. ఇదంతా 'మామూలు' వ్యవహారమా!
తమిళనాట మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిగారు ఆరుబయట తల్పంగిల్పం వేయించుకొని, ఫ్యాన్లుఏసీలు పెట్టించుకొని దీక్ష చేయడం చూశాం. మన యోగా బాబా చేసిన దీక్షను ఎలా మరుస్తాం? పదివేల మందికి భోజనాలు పెట్టగలిగేంత పందిరి, ఎత్తైన వేదిక, మలయమారుతాలను అందించే విద్యుత్‌ పరికరాలు, వీడియోలు, కెమెరాలు...ఆ స్వాములోరి అట్టహాసమే వేరు. ఇక అన్నా హజారే నిరాహారం వుంటే ఎంత హంగామా? ఎంత ప్రచారం? ఆ పదిరోజులూ ఆయన వేసిన ప్రతి అడుగునూ టీవీ చానళ్లు చూపించాయి. మొత్తమ్మీద ఆ ఏర్పాట్లన్నిటికీ మూడు పదులకుపైగా లకారాలు ఖర్చయ్యాయని పత్రికలు గోలపెట్టేశాయి. గుజరాత్‌ సీఎం నరేంద్రమోడీదైతే మరీ విడ్డూరం. ముచ్చటగా మూన్నాళ్లపాటు దీక్ష చేసినందుకు అక్షరాలా అరవై కోట్ల రూపాయలు ఖర్చయ్యాయట. అదీ సర్కారువారి డబ్బట. పస్తులుండే జనం కోసం ఖర్చు చేయని సర్కారువారు ముఖ్యమంత్రి పస్తును 'జయప్రదం' చేయడానికి రు.60 కోట్ల ప్రజల సొమ్మును ఉపయోగించడం ఎంత విడ్డూరం? తిండి తినకుండా వున్నందుకు రోజుకు 20 కోట్ల రూపాయల ఖర్చా!

No comments: