Sep 27, 2011

వైతిరి వృక్ష గృహాలు



అక్కడ ప్రతి గృహమూ సంపూర్ణంగా సహజ పదార్థాలతోనే నిర్మితమైంది. అన్ని వస్తువులూ అందంగా, ఆకర్షణీయంగా అమర్చబడ్డాయి. పైగా, టీవీలూ లేకపోవడంతో నగర జీవులు కోల్పోయిన ప్రశాంతత ఎంత మధురంగా ఉంటుంతో తెలిసొచ్చింది. చెట్లపై అతెంత్తులో, పక్షులతో సావాసంలా అనిపించింది. పక్షులు ఎంత అదృష్టమైనవి అని కూడా అనిపించింది. చీకటి పడుతుంటే ఇంట్లో కిరోసిన్‌ దీపాలూ, చీకటి పడ్డాక జోకొట్టినట్లు చెట్ల ఊయల.. ఎప్పటికీ అక్కడే ఉందిపోవాలన్నంత ఆశ.
విహార యాత్రల్లోనూ వింత అనుభవాల కోసం అన్వేషించే వారికోసం కేరళలోని వైతిరి ప్రాంతం అనువైనది. ఎందుకంటే ఇక్కడ యాత్రికుల కోసం ప్రత్యేకంగా కట్టిన ఇళ్లుంటాయి. అందులో విశేషమూ, వింతా ఏముందని అనుకుంటున్నారా? ఆ ఇళ్లు చెట్లమీద ఉండడమే విశేషం. ఆ చెట్లు దట్టమైన అరణ్యంలో ఉండడమే మరో విశేషం.
మేము కాలికట్‌ నుండి జీబులో ప్రయాణిస్తూ అరగంటలో వైతిరి చేరాం. అది కాలికట్‌ - మైసూర్‌ రహదారిలో ఉంది. ఇక్కడికి ఎర్నాకులం నుండి కూడా తేలికగా రావచ్చు.
వైతిరి చాలా ఎత్తైన ప్రదేశం. సుమారు 1,300 మీటర్ల ఎత్తున్న ఈ హిల్‌స్టేషన్‌, ఎటు చూసినా కాఫీ, తేయాకు, యాలకులు, మిరియాలు, రబ్బరు తోటలతో కనువిందు చేస్తుంది. కళ్లకే కాదు, ఆ తోటల నుండి వచ్చే వింత సువాసనలు విచిత్ర అనుభూతిని కలిగిస్తాయి. అరణ్యంలో కాలిబాటల గుండా అలా నడుస్తూ వెళ్లడం, పక్షుల సందడీ, గాలికి చెట్ల సవ్వడీ... నిజంగా అనుభవిస్తే గానీ అసలు ఆనందం కలగదు. ఈ వైతిరి రిసార్ట్‌ వయనాడ్‌ జిల్లా అరణ్యంలో ఉంది.
ఇక్కడికి సుమారు అరమైలు దూరంలో పూకోట్‌ సరస్సు ఉంది. చుట్టూ దట్టమైన వనసంపదతో, స్వచ్ఛంగా కనిపించే సరస్సులో బోటు షికారు బావుంది. ఈ సరస్సులో నీలిరంగు తామరపూలు అద్భుతంగా కనిపిస్తాయి. పడవలో ప్రయాణించేటప్పుడు వాటిని అందుకని కోసేసుకోవాలనిపించినా, వాటిని తాకడం కూడా నిషేధమని తెలిసి బాధపడ్డాం.
వైతిరి ప్రాంతంలోని తేయాకు తోటల్లో నుండి, అరణ్యం గుండా వెళ్లే మార్గంలో 'చెంబ్రా పీక్‌' అనే కొండ ఉంది. ఈ ప్రాంతంలో అదే ఎత్తైనదట. దాని ఎత్తు 2,100 మీటర్లు. దీని పైకి ఎక్కడానికి ఒక రోజు పడుతుందట. మేం ఎక్కలేదు (సమయాభావం వల్ల) కానీ దానిపైన కూడా ఒక సరస్సు ఉందట. దానిపేరు హృదయ సరస్సు - హృదయం ఆకారంలో!
ఇంకా ఇక్కడ పురాతన గుహలు, జలపాతాలూ వగైరాలు ఉన్నాయి గానీ చెట్లమీద నివాసం కోసమే మేం ఇక్కడికి వచ్చాం.
కేరళ అనగానే 'పడవల ఇళ్లు' గుర్తుకొస్తాయి. కానీ దట్టమైన అడవుల్లో, ఎత్తైన చెట్లపై ఇళ్లు కట్టి టూరిజాన్ని ఆకర్షణీయంగా చేయడం కొత్తగా ఉంది.
నేలకు సుమారు 80- 90 అడుగుల ఎత్తులో కనిపించే ఈ 'వృక్షగృహాల్ని' చూస్తుంటేనే అబ్బురంగా అనిపించాయి. ఒక వెదురు బుట్టలాంటి 'లిఫ్ట్‌'లో అంత ఎత్తుకి వెళ్లాం. విచిత్రమేమిటంటే ఈ లిఫ్టుకి విద్యుత్‌ సౌకర్యం లేదు, శబ్ద కాలుష్యమూ లేదు. మొత్తం అత్యంత సహజంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిసిపోతుంది. లిఫ్టు దిగాక, ఇంట్లోకి వెళ్లడానికి ఒక తాళ్ల వంతెన... ఆ దృశ్యమే మతి పోగొడుతుంది.
అక్కడ ప్రతి గృహమూ సంపూర్ణంగా సహజ పదార్థాలతోనే నిర్మితమైంది. అన్ని వస్తువులూ అందంగా, ఆకర్షణీయంగా అమర్చబడ్డాయి. పైగా, టీవీలూ లేకపోవడంతో నగర జీవులు కోల్పోయిన ప్రశాంతత ఎంత మధురంగా ఉంటుంతో తెలిసొచ్చింది. చెట్లపై అంతెత్తులో, పక్షులతో సావాసంలా అనిపించింది. పక్షులు ఎంత అదృష్టమైనవి అని కూడా అనిపించింది. చీకటి పడుతుంటే ఇంట్లో కిరోసిన్‌ దీపాలూ, చీకటి పడ్డాక జోకొట్టినట్లు చెట్ల ఊయల.. ఎప్పటికీ అక్కడే ఉండిపోవాలన్నంత ఆశ.
భోజనాలు సాదాసీదాగా ఉన్నాయి. స్పూన్లూ, ఫోర్కులూ ఉండవు. మంచినీళ్లు దగ్గరలోని వాగునుండి తెచ్చి ఫిల్టర్‌ చేసి ఇస్తారు. అక్కడ కూడా సౌరశక్తి తప్ప జనరేటర్లూ గట్రా లేవు. ఆహార పదార్థాలు అన్నీ సేంద్రియ పద్ధతిలో బయోగ్యాస్‌ పైనే వంట! అచ్చంగా పల్లెలు అనుభవమున్న వారికి కూడా ఈ బస కొత్తగా అనిపిస్తుంది.
మనకి ఆసక్తి ఉంటే అడవిలో అలా నడుచుకుంటూ వెళ్లొచ్చు. లేదా చెట్లపైనే కాళ్లు చాపుకుని ఒక కొత్త కోణంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉండొచ్చు (మేం చేసినట్లు).
మాలో దుబారు చూసొచ్చిన ఒకతను ''ఈ ప్రదేశం ఉందని తెలిస్తే అక్కడికి వెళ్లి ఉండేవాడిని కాదు. అక్కడిదంతా డబ్బు చేసిన విన్యాసం. ఇక్కడంతా అచ్చమైన ప్రకృతి'' అన్నాడు.

No comments: