Sep 27, 2011

బీదర్‌ పోదామా



కొన్ని ప్రదేశాలు పర్యాటక స్థలాల్లా అనిపించవు. అక్కడికి వెళ్లి చూస్తేనే వాటి ప్రత్యేకత తెలుస్తుంది. అటువంటి వాటిలో హైదరాబాద్‌కి దగ్గర్లోలోని కర్నాటక ప్రాంతమైన బీదర్‌ ఒకటి. కొన్నేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో మద్యనిషేధం ఉన్నప్పుడు 'బీరు బాబులు' తరచూ బీదర్‌కి ప్రయాణం కడుతుండేవారు. దురదృష్టవశాత్తు బీదర్‌ అలా మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. మా ప్రయాణం ఆ సందడి సద్దుమణిగిన కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిందనుకోండి!
హైదరాబాద్‌ నుండి సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉంది బీదర్‌. 9వ జాతీయ రహదారి మీద ఓ మూడు గంటల ప్రయాణం. పటాన్‌ చెరు, సదాశివపేట దాటి, జహీరాబాద్‌ చేరాం. అక్కడ్నుండి కుడివైపుకి జాతీయ రహదారి వదిలి మల్కాపూర్‌ గుండా బీదర్‌ చేరాం. జహీరాబాద్‌ కంటే ముందే రోడ్డు పక్క ఎర్రటి మట్టి మన దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ నేలలు 'లాటరైట్‌' అనే రకానికి చెందినవి. వాటిలో ఇనుము అధికంగా ఉంటుంది. అందుకే 'రస్టు' పట్టిన ముదురు ఎరుపు రంగు కనిపిస్తుంది. దారిలో (ముంబై హైవేలో) రెండు చోట్ల ఘోర ప్రమాదాలు జరిగిన దాఖలాలు కనిపించాయి. ఆ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయట. ముఖ్యంగా లోడుతో ఉన్న లారీలు. జహీరాబాద్‌లో ద్విచక్రవాహనాలకి కాస్త విశ్రాంతినిచ్చి రిలాక్సయ్యాం. రోడ్డు పక్క స్టాల్‌లో చారు, బిస్కట్‌, సమోసాలతో కాలం వెళ్లదీశాం.

అరగంట విరామం తర్వాత మా వాహనాల ఇంజన్లు వేగం పుంజుకున్నాయి. బీదర్‌ పట్టణం ఒకప్పుడు విదురా నగరం పేరుతో ఉండేదట. మహాభారతంలోని విదురుడు ఇక్కడే ఉండేవాడట. అయితే అది పురాణం. చరిత్ర ప్రకారం 1429లో బహమనీ రాజు ఒకటవ అహ్మద్‌ షా దీన్ని రాజధానిగా చేసుకున్నాడు. 'అహ్మదాబాద్‌ బీదర్‌' అని పేరు మార్చాడు. దాదాపు ఒక శతాబ్దం పాటు బహమనీ రాజుల పాలనలో ఉన్న బీదర్‌, 1527లో దక్కను పాలకులైన బరీద్‌ షాహీల చేతుల్లోకి వెళ్లింది. మరో రెండు వందల సంవత్సరాల తర్వాత ఔరంగజేబు బీదర్‌ని ఆక్రమించాడు. అతను 1713లో ఆసఫ్‌ జాహీని దక్కను ప్రాంత సుబేదారుగా నియమించాడు. ఆసఫ్‌ జాహీ 1724లో నైజాం ప్రభుత్వాన్ని నెలకొల్పాడు.
ఇంతమంది చేతులు మారినా, బీదర్‌లో మనకు కనిపించే శిధిల కట్టడాల్లో చాలా వరకు బహమనీ రాజులవే కావడం విశేషం. బీదరంతా శిధిలమౌతున్న మహా నిర్మాణంలా అనిపించింది. ఈ పట్టణానికి అయిదు ద్వారాలున్నాయి. వాటిలో ఒక దాని గుండా ప్రయాణించి 'పాత నగరానికి చేరాం. అక్కడ 15వ శతాబ్దపు బీదరు కోట ఉంది. దానికి చేరే ముందు ఒక అద్భుత నిర్మాణం కనిపించింది. అదే ఎనభై అడుగుల ఎత్తున్న పహారా గోపురం. దానిని చౌబారా అంటారు. అయిదు శతాబ్దాల క్రితం దాని పైన సైనికులు పహారా కాస్తూ పట్టణానికి రక్షణగా ఉండేవారట. ఇప్పుడు మాత్రం అది ట్రాఫిక్‌ ఐలాండ్‌లా ఉంది!

ఇటీవలి కాలంలో ఈ మహాగోపురంపై ఓ భారీ గడియారం అమర్చారు. చాలా క్లాక్‌ టవర్లలాగే అదీ పనిచేయడం లేదు. ఆ పహారా గోపురం పైకి వెళ్లే మార్గం తాళం వేసి ఉంది. ఎప్పుడూ తీయరట. ఎవరూ పట్టించుకోరట కూడా!బీదరు కోట అంత శిధిలావస్థలో ఉన్నా, నాకెందుకో హైదరాబాద్‌లోని గోల్కొండ కంటే మెరుగే అనిపించింది. కిలోమీటర్ల కొద్దీ పాకిన గోడలు, వాటిపై అక్కడక్కడా టవర్లు ఇంకా గత కాలపు రాజసాన్ని చూపుతున్నాయి. అద్భుతమైన 'ఆర్చీలు', ఒక భారీ మర్రి చెట్టు చూడ్డానికి వింతగా వున్నాయి. ఆ చెట్టుకి సమీపంలో 'రంగీన్‌ మహల్‌' ఉంది. దీన్ని 1487లో ఒకటవ మహ్మద్‌షా నిర్మించాడు. దీనిలో ఇంకా రంగురంగుల పలకలు, ముత్యాలు అమర్చిన నగిషీలున్నాయి. దాని పక్కనే ఒక చిన్న మ్యూజియం ఉంది. ఒకప్పుడు అది రాజుల స్నానశాల! రాతియుగం నాటి పరికరాలు, విగ్రహాలు, ఆభరణాలు ఇక్కడ ప్రదర్శనలో ఉన్నాయి.
ఇవన్నీ ఒక ఎత్తైతే, కాస్త దూరంలో ఉన్న 'సోలా కుంభ్‌ మసీదు' మరో ఎత్తు. దీన్ని 1423లో నిర్మించారట. దీని మధ్య భాగంలో 16 స్తంభాలున్నాయి. అందువల్లే ఆ పేరు. ఈ మసీదుకి తాళం వేసి ఉంటుంది. కానీ మ్యూజియంలో వారిని అడిగి తీయించవచ్చు. మసీదు చుట్టూ అందమైన గార్డెన్‌ కూడా ఉంది.మసీదు నుండి బయటికి వస్తుంటే కోట తాలూకు గాంభీర్యం ఇంకా కనిపించింది. అసలు ఈ కోట మూడవ శతాబ్దంలో యాదవులు, కాకతీయులకు చెందినదని పురాతత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆ తర్వాత దీన్నే సుల్తాన్‌ అహ్మద్‌ షా బహమనీ తన కోటగా మార్చుకుని, టర్కీ-పర్షియా నుండి కళాకారులను పిలిపించి పునర్నిర్మించాడు. చౌబారా గోపురానికి సమీపంలోనే మహమూద్‌ గవన్‌ మదరసా ఉంది. ఇది దాదాపుగా శిధిలమైపోయినట్లే. అప్పట్లో ఇది మూడంతస్థుల భవనమట. దీనికి నాలుగు ఎత్తైన మినార్లూ ఉంటేవట. ఇప్పుడొక్కటే మిగిలింది. దానిపై తాపడం చేసిన నీలం, తెలుపు, పసుపు రాళ్లు ఇరాన్‌ నుండి తెప్పించారట.
ఇక్కడికి దగ్గర్లోనే బహమనీ సుల్తానుల సమాధులున్నాయి. అయితే ఇవన్నీ అత్యంత హీనావస్థలో ఉన్నాయి. సుల్తాన్‌ హుమయున్‌ సమాధి మాత్రం పిడుగు వల్ల రెండుగా చీలిపోయింది. ఇవన్నీ చూస్తే చరిత్ర ఎంత ఘనంగా ఉండేదో అనిపిస్తుంది. ఈ ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా చేసి పర్యాటకులను రప్పించవచ్చనిపిస్తుంది కూడా.బీదర్‌లో శతాబ్దాలనాటి శిధిలాలూ, సుల్తానుల సమాధులే కాదు... అద్భుతమైన 'బిద్రీ' కళ కూడా కనిపిస్తుంది. నల్లటి లోహపు పాత్రలపై తెల్లటి వెండి దారాలతో అందమైన చిత్రాలుగా అమర్చడం బిద్రీ ప్రత్యేకత. ఆ కళాకారుల వేళ్లు సున్నితంగా కళాఖండాలు సృష్టించడం చూస్తుంటే అబ్బురపోక తప్పదు. బీదర్‌ వెళ్తే మాత్రం కచ్చితంగా ఒక బిద్రీ పాత్ర తెచ్చుకుంటారు. అంత బావుంటాయవి!

No comments: