అండమాన్ దీవులు మంచి పర్యాటక స్థలాలు అని అంటుంటారు.
వీటిని చూడ్డానికి మా ప్రయాణం చెన్నైనుండి ప్రారంభమైంది. అండమాన్ దీవులకే
అయితే భారతీయులకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదు. కానీ నికోబార్ ద్వీపాలను,
ఇతర ఆదివాసీ ప్రాంతాలకు మాత్రం అనుమతి తప్పనిసరి. పైగా అది అంత సులభంగా
దొరకదు.
మేం ఎక్కిన విమానంలో
ప్రయాణీకులు చాలా తక్కువమందే ఉన్నారు. అండమాన్‌కి ప్రతిరోజూ మాంసం, ఆహార
పదార్థాలు, వార్తాపత్రికలు విమానం ద్వారా అందుతాయి. సుమారు రెండు గంటల
ప్రయాణం తర్వాత వీర్‌సావర్కర్ విమానాశ్రయంలో దిగాం. అదో చిన్న అందమైన
ఎయిర్‌పోర్ట్. భద్రతరీతా దీన్ని సాయంత్రం మూడు గంటల తర్వాత భారతీయ వాయు
సేన తన అధీనంలోకి తీసుకుంటుందట. మళ్లీ మరుసటి ఉదయమే విమాన రాకపోకలు మొదలు. ఈ
చిట్టి ఎయిర్‌పోర్టుని 1947లో నిర్మించారట.
పోర్ట్ బ్లెయిర్‌లో
టాక్సీలు, ఆటోలు ఉంటాయి. అద్దెకు స్కూటర్లు, మోటార్ సైకిళ్లు కూడా
లభిస్తాయి. కాకపోతే ఇప్పుడు అవి బాగా తగ్గిపోయాయి.
అండమాన్ నికోబార్ ద్వీపాలు
భారత భూభాగం లోనివే. అయినా మయన్మార్, థారులాండ్‌కి మనకంటే దగ్గరగా
ఉంటాయి. ఇవి సుమారు 600 ద్వీపాల సమూహం (కొంతమంది 360 అంటుంటారు). మన
భూభాగానికి సుమారు 1400 కి.మీ దూరంలో ఉండే ఈ ద్వీపాలు తిరుగుబాటుదార్లను,
స్వతంత్ర సమరయోధులను 'శిక్షించడానికి' ఉపయోగపడేవి అనే పేరు
సంపాదించుకున్నాయి. బ్రిటీష్‌కాలంలో ఇక్కడి సెల్యులార్ జైల్ (కాలాపానీ)
బాగా 'ప్రసిద్ధి' పొందింది. కరడుగట్టిన నేరస్థుల నుండి స్వతంత్రం కోసం
తిరుగుబాటు చేసిన వారి వరకు ఇందులోనే ఖైదు! వారిని అతి దారుణంగా
హింసించేవారని చరిత్ర. అయితే అదంతా నిజమేనా అన్నంత అందంగా ఉంది ఇప్పుడు.
ఉదయం తొమ్మిదిన్నర నుండి సాయంత్రం నాలుగు వరకు సందర్శకుల కోసం తెరిచి
ఉంటుంది. సోమవారాలు సెలవు.
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో జపనీయులు
స్థావరం ఏర్పాటు చేసుకున్న భారత ప్రదేశం అండమాన్. ఇప్పటికీ
పోర్ట్‌బ్లెయిర్‌లో వారి బంకర్లు కనిపిస్తాయి. జపనీయుల రాకతో ఇక్కడి ఖైదీల
పట్ల హింస మరింత పెచ్చరిల్లిందట. ఆహారం తక్కువయిందనిపిస్తే ఖైదీలను,
ప్రజలను ఇతర ద్వీపాలకు తరిమి వేసేవారట. మరో మానవ మాత్రుడు లేని ఆ
ద్వీపాల్లో వారి చావు వారు చావాల్సిందే!
ఆ మరుసటి రోజు మూడు
ద్వీపాలు చూడ్డానికి ప్రయాణమయ్యాం. నిజానికి ఇన్ని వందల ద్వీపాలున్నా
వాటిలో పదింటిలో మాత్రమే మానవులు నివసిస్తున్నారంటారు. ముందుగా మేం రాస్
ద్వీపానికి వెళ్లాం. ఇది 1942లో రాజధానిగా ఉండేది. ఒకానొక భూకంపంలో పోయింది
పోగా మిగిలింది ఈ చిన్న భాగమే. అప్పటి కమీషనర్ ఆఫీసూ, శిధిలావస్థలో ఒక
చర్చ్ ఉన్నాయి. ఈ ద్వీపానికి వెళ్లడానికి పడవలే సాధనం. ఈ ద్వీపాలపై అడుగు
పెట్టడానికీ ప్రవేశరుసుము ఉంది. కెమెరాలకి అదనపు రుసుము. రాస్ ద్వీపంలో
'స్మృతిక' అనే ఓ చిన్న మ్యూజియం ఉంది. అందులో పురాతన బ్రిటీష్ కాలం నాటి
ఫొటోలున్నాయి.
మధ్యాహ్నం నార్త్ బేకి ప్రయాణమయ్యాం. ఇది కోరల్స్‌కి
ప్రసిద్ధి. నీటిలో దిగి, కోరల్స్‌ని చూడడం బావుంది. కానీ విపరీతమైన రద్దీ.
అక్కడో ప్రత్యేకమైన బోట్ ఉంది. దాని కింది భాగం పారదర్శకంగా, గాజువంటి
పదార్థంతో చేయబడింది. దానిద్వారా నీటిలోపలి కోరల్స్ చూడొచ్చు. అండమాన్‌లో
సాయంత్రం 5 కల్లా సూర్యాస్తమయం అయిపోతుంది. నార్త్‌బేలో ఒక ప్రాథమిక పాఠశాల
కూడా ఉంది. సుమారు 20 కుటుంబాలు మాత్రమే ఇక్కడ నివసిస్తాయట.
హావ్‌లాక్
ద్వీపం, నీల్ ద్వీపం కూడా కోరల్స్‌కి ప్రసిద్ధి. ఇంకా ఇక్కడ అటవీ
ప్రదర్శనశాల (అనేక రకాల కలప కళాఖండాలకు నెలవు), ఫిషరీస్ మ్యూజియం,
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యూజియం ఉన్నాయి. అండమాన్ వాటర్
స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జలక్రీడల సంరంభం ఉంటుంది. దానికి దగ్గర్లోనే ఒక
మరీనా పార్క్ ఉంది. మొక్కలంటే ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి దర్శనీయ స్థలం.
ప్రకృతిని
చూసి ఆనందించాలనుకునే వారికి నీల్ ద్వీపం స్వర్గధామం. అండమాన్‌లో చూడదగ్గ
ముఖ్యమైన ప్రదేశం. పోర్ట్ బ్లెయిర్‌కి దాదాపు 36 కి.మీ దూరంలో ఉంటుంది.
మొత్తానికి
మరీ అద్భుతం కాకపోయినా ఓ మోస్తరు ఆకర్షణీయమైన దీవుల సముదాయం అండమాన్.
చాలా టూరిస్టు స్థలాల్లోలాగే ఇక్కడా సరైన భోజనం దొరకదు. పైగా అన్నీ
బయటినుండి రావడం వల్ల ఖరీదూ ఎక్కువే. మనదేశ భూభాగమే అయినా ఏదో విదేశం
వెళ్లొచ్చిన అనుభూతి కలుగుతుంది. అందుకోసం సరదాగా అండమాన్ వెళ్లి రావచ్చు.
మూడు నాలుగు రోజులుండే విధంగా ప్లాన్ చేసుకుంటే బోర్ కొట్టదు. సముద్రమూ,
బీచులూ సరిపడని వారికి అండమాన్ యాత్ర కూడా సరిపడదు.



No comments:
Post a Comment