Sep 27, 2011

అజంతా గుహలు ఆకట్టుకునే చిత్రాలు



ఎల్లోరా గుహలు చూసిన ఆనందంతో, ఇక్కడేం చూడబోతున్నామనే ఆత్రుతతో అజంతా బయల్దేరాం. తెల్లవారుజామునే బయల్దేరామేమో చుట్టుపక్కలంతా మంచు తుంపర పడుతోంది. దారికిరువైపులా ఉన్న చెట్లు కలిసిపోయి ఆర్చిలా స్వాగతం చెబుతున్నాయి. రోడ్డుకి ఒకవైపు పెద్ద పెద్ద కొండలుంటే మరోవైపు అగాధంలాంటి లోయ... మధ్య మధ్యలో చిన్న చిన్న ఊళ్లు... అంటే ఓ పది, పదిహేను ఇళ్లు మాత్రమే... ఎల్లోరా నుండి అజంతా వరకు దారిమొత్తం ఇలా చేలమధ్యలోనే ఇళ్లు కనిపించాయి. పచ్చని పొలాల మధ్య ఆ పొదరిళ్లు ముచ్చటగా ఉన్నాయి.
ఎల్లోరా నుండి 100 కిలోమీటర్ల దూరంలో అజంతా గుహలున్నాయి. వీటి నిర్మాణం తర్వాత ఎన్నో ఏళ్లు నిర్లక్ష్యానికి గురై తిరిగి 18వ శతాబ్దంలో బయటపడ్డాయి. అజంతా అనే ఊరి నుండి 8 కిలోమీటర్ల దూరంలో వున్నాయి. గుహలు మరో 4 కిలోమీటర్ల దూరంలో ఉండగానే మనం తీసుకెళ్లే వాహనాలు ఆపేస్తారు. అక్కడ్నుండి వారి వాహనాల్లోనే వెళ్లాలి. అక్కడ కూడా ఎ.సి, నాన్‌ ఎ.సి బస్సులున్నాయి. ఎల్లోరా గుహల దగ్గర కంటే ఇక్కడ ఇంకా ఎక్కువ జన సందోహం ఉంది.
చుట్టూ చాలా పెద్ద అడవి... పర్వత శ్రేణులు, పచ్చని ప్రకృతి మధ్య గుర్రపునాడా ఆకారంలో ఈ గుహలున్నాయి. అయితే ఎల్లోరా కంటే ఇవి తక్కువ వైశాల్యంలో ఉండడం వల్ల ఎక్కువ దూరం నడిచేపని ఉండదు. అక్కడి లాగే ఇక్కడ కూడా కొండని తొలిచారు. వీటిలో కొన్ని క్రీస్తుపూర్వానికి చెందినవి కూడా ఉన్నాయి. వీటి ముందు అందమైన పెద్ద లోయ ఉంది. ఈ గుహలన్నిటిలో శిల్పకళ కన్నా చిత్రకళ అమితంగా ఆకర్షిస్తుంది. ఆ చిత్రాలవల్లే ఈ గుహలకి ఇంతటి పేరు ప్రఖ్యాతులొచ్చాయి.
మొత్తం 30 గుహల్లో కొన్ని అసంపూర్ణంగా ఉన్నాయి. ముఖ్యంగా చూడాల్సినవి 1,2,16,17,19,26,29 గుహలు. వీటిలో చాలా వరకు చిన్న చిన్న లైట్లు ఏర్పాటు చేశారు. రెండు మూడు గుహల్లో పెద్ద లైట్లు కూడా ఉన్నాయి. అన్ని గుహల్లో ఫొటోలు తీసుకోవచ్చు కానీ ఫ్లాష్‌ వెయ్యనివ్వరు.
1వ గుహ ఐదవ శతాబ్దం నాటిది. దీని ముఖద్వారం చక్కటి నగిషీలతో దర్శనమిస్తుంది. వరండా లాంటి ముందు భాగం దాటి లోపలికెళ్తే విశాలమైన గది ఉంది. అందులో మళ్లీ చిన్న చిన్న గదులున్నాయి. కానీ లోపలంతా చీకటి. వారు ఏర్పాటు చేసిన లైట్లే లేకపోతే ఏమీ కనిపించదు. ముఖద్వారానికి ఎదురుగా ఉన్న గదిలో పెద్ద బుద్ధుడు, ఆయన మొదటి ఐదుగురి శిష్యుల విగ్రహాలున్నాయి. ఇక చుట్టూ ఉన్న గోడలు, పై కప్పంతా అనేక కథలు చిత్రించిన ఆనవాళ్లు కనిపించాయి. కానీ వీటిలో సగానికిపైగా ఇప్పుడు కనిపించడం లేదు. రంగు వెలిసిపోయి, ఊడిపోయినట్లున్నాయి. ఉన్నవాటి వరకు మాత్రం చాలా బాగున్నాయి.
కనిపించే కొద్ది చిత్రాల్లో చాలా వరకు జాతక కథలే. వాటిలో ముఖ్యమైనవి మనందరికీ తెలిసిన శిబి చక్రవర్తి కథ, గౌతముడు ఏడేళ్ల అన్వేషణ తర్వాత జ్ఞానోదయం పొందుతున్న చిత్రం ముఖద్వారానికి ఎడమవైపు గోడకి ఉన్నాయి. కుడివైపు గోడమీద చిత్రించిన కథ విషయానికొస్తే... దుష్టుడైన మార గౌతముడికి అడుగడుగునా ఆటంకాలేర్పరుస్తాడు. చివరికి గౌతముని తపస్సును భగం చేయమని తన కూతుళ్లనే పంపించే ఇతివృత్తం చిత్రించారు. మిగతా గోడలకి బుద్ధుని జీవితంలో ముఖ్యమైన సంఘటనలకు చెందిన అనేక చిత్రాలు కనిపిస్తాయి. ఇంకా వీటి మధ్యలో కోతులు, నెమళ్ల చిత్రాలూ ఉన్నాయి.
2వ గుహలో గౌతముని పుట్టుకకు సంబంధించిన అనేక సంఘటనలు చిత్రించారు. గౌతముని తల్లి మాయకు ఒక కల రావడం, దాన్ని ఆమె భర్తతో చెప్పడం, అతను బ్రాహ్మణులను ఆస్థానానికి పిలిపించి మాయకు వచ్చిన కలకు అర్థమేంటని అడగడం, వారు ఆమెకు గౌతమోత్తముడు జన్మిస్తాడని చెప్పడం... అక్కడ చిత్రించారు. ఈ గుహలో పైకప్పుకి ఒక చోట బారులు తీరిన హంసలు కనిపించాయి. ముందున్న గోడకు మరో చక్కని చిత్రం... రాజు ఒక స్త్రీని ఖడ్గంతో శిక్షిస్తున్నట్లు, ఆమె భయపడి రాజుని వేడుకుంటున్నట్లు వుంది.
అజంతాలో అన్నింటికంటే పెద్ద గుహ నాల్గవది. ముఖద్వారం దాటి లోపలికెళ్తే 28 స్థంభాలున్న పెద్దగది ఉంది. కుడివైపు గోడకి బుద్ధుణ్ణి ప్రార్థిస్తున్న భక్తులు, ఒక జంటని తరుముకొస్తున్న ఏనుగు, ఉడుతతో ఆడుకుంటున్న స్త్రీ చిత్రాలు కనిపిస్తాయి. 6వ గుహలో అనేక భంగిమల్లో బుద్ధుని విగ్రహాలున్నాయి.
9వ గుహ క్రీస్తుపూర్వం ఒకటవ శతాబ్దం నాటిది. ఇందులో రోజువారీ జీవితంలో జరిగే సంఘటనలను చిత్రించారు. 10 వ గుహ క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం మొదటి భాగానికి చెందినది. ఇది చూడ్డానికి తొమ్మిదవ గుహలాగే ఉంటుంది. కానీ దానికంటే పెద్దది. ఇక్కడున్న అన్ని గుహలకంటే ఇదే ప్రాచీనమైంది. ఇందులో రాజు తన సైన్యంతో పాటు, నృత్యకళాకారులు, ఆస్థాన గాయకులతో కొలువుతీరి ఉన్నాడు. ఇందులో వారు ధరించిన దుస్తులు, నగలు, కేశాలంకరణ ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తుంది. వేయి సంవత్సరాల తర్వాత కూడా ఇంతందంగా కనిపిస్తున్నాయంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాలు గీచారో! గోడకు రెండు వైపులున్న చిత్రాలు పాడైపోకుండా కొంత వరకు అద్దాలు బిగించారు. ఈ గుహలోని గోడలమీద, స్థంభాలమీదున్న పెయింట్లు చాలా వరకు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే లైట్లు వేస్తేనే అవి కనిపిస్తాయి.
13వ గుహని పురావస్తు శాఖవారు స్టోర్‌ రూమ్‌గా వాడుతున్నారు. 16వ గుహని సన్యాసుల కోసం నిర్మించారట. ఇందులో గౌతముడికి బాల్యంలో ఎదురైన అనేక సంఘటనలను చిత్రించారు. ముఖ్యంగా 'మరణిస్తున్న రాకుమారి' చిత్రం అందరినీ ఆకట్టుకుంది. రాకుమారి మృత్యుముఖంతో ఉంటే, ఆమె చెలికత్తెలు దుఃఖిస్తున్నట్లున్న చిత్రం చూపరులను కట్టిపడేస్తుంది. ఈ చిత్రం బుద్ధుని పినతండ్రి కొడుకు భార్యదట. నందుడు సన్యాస జీవితం కోరుకున్న సందర్భంలోనిది ఈ చిత్రం. ఆమె పడుతున్న హృదయ వేదనను అలా చిత్రించారు. 16వ గుహ దగ్గరి నుండి లోయలోకి (ఈ లోయ ఒకప్పటి నది) మెట్లున్నాయి.
17వ గుహ ముందు భాగంలో అందమైన నగిషీలు చెక్కారు. ఇందులో మానవ చిత్రాలు, గంధర్వులు, అప్సరసల చిత్రాలున్నాయి. కుడివైపు గోడమీద బుద్ధుడు మదపుటేనుగును అదుపులోకి తెస్తున్న చిత్రం అద్భుతంగా ఉంటుంది. జాతక చిత్రాల్లో ఆత్మ బలిదానం ఎక్కువసార్లు కనిపించింది. అందులో ఒకదాని వృత్తాంతం... ఒక జన్మలో బోధిసత్వుడు తనకున్నవన్నీ దానం చేయాలనే తపనతో ఉంటాడు. తన దగ్గరున్న అద్భుత శక్తిగల ఏనుగును దానం చేస్తాడు. తన దగ్గరున్న రథాన్ని, గుర్రాల్నీ దానం చేస్తాడు. చివరికి పిల్లల్ని కూడా దానం చేసే దృశ్యాలు మనసుకు హత్తుకుంటాయి. ఆ చిత్రాల్లోని ముఖ కవళికలు కూడా చాలా స్పష్టంగా కన్పిస్తాయి. బుద్ధుని ముందు ఓ తల్లీ కొడుకులు నమస్కరిస్తున్న చిత్రం, రాజమహలు ముందు బుద్ధుడు భిక్షాటన చేసే చిత్రం మరో గోడమీద వున్నాయి.
19వ గుహ ముందుభాగంలో చాలా బుద్ధ విగ్రహాలు అనేక వరుసలుగా ఎదురెదురుగా ఉన్న రెండు గోడల మీద చెక్కారు. ఇందులో బుద్ధుడి విగ్రహాలు అనేక ముద్రల రూపంలో ఉన్నాయి. లోపలున్న పెద్ద బుద్ధ విగ్రహం పైన ఒకదానిమీద ఒకటి మూడు గొడుగులున్నాయి. ఇవి బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి..... తెలుపుతాయట.
ఈ గుహల తవ్వకాలన్నింటిలో 24వ గుహ పెద్దది. కానీ ఇది పూర్తికాలేదు. 26వ గుహలో శయనిస్తున్న బుద్ధుడు కనిపిస్తాడు. ఈ విగ్రహం చాలా పెద్దది. ఇక్కడి గోడపై కూడా బుద్ధుని తపోభంగం చిత్రించారు.
అజంతా గుహలకు సోమవారం సెలవు. ఈ గుహలకు వెళ్లే బస్టాపులో పెద్ద షాపింగ్‌ కాంప్లెక్స్‌ కూడా ఉంది. ఇక్కడ అడుగడుగునా కమర్షిలైజేషన్‌ కనిపించింది. ఈ గుహల్లో ముఖ్యమైన వాటన్నింటి దగ్గరా క్యూ పద్దతి ఉంది.

No comments: