- విధుల్లో ఉన్నవారూ సర్టిఫికెట్లు ఇవ్వాలి
- యూనిట్‌కు 50 పైసల విద్యుత్ సర్‌ఛార్జీ వడ్డన
- ప్రభుత్వ నిర్ణయాలు
తెలంగాణా రాష్ట్ర డిమాండుతో సకలజనుల సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులకు జీతాలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 'నో వర్క్ ... నోపే' అంటూ గతంలో జారీచేసిన జీవో 177ను కచ్చితంగా అమలుచేయాలనే ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు ఈనెల 17వ తేదీనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులకూ, జిల్లా కలెక్టర్లకూ మెమో జారీ చేశారు. తాజాగా ఈ విషయమై ఏర్పాటుచేసిన మంత్రుల బృందం, ఉన్నతాధికారులతో గురువారం రాత్రి జరిగిన సమావేశంలోనూ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఇదే ఆదేశాలను జారీచేశారు. 'సమ్మె చేస్తున్న ఉద్యోగులకు జీతాలను నిలిపియండి' అని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది. విధులకు హాజరైన ఉద్యోగుల నుండి ఆ మేరకు సర్టిఫికెట్లు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 'విధులకు హాజరైన ఉద్యోగుల నుండి సర్టిఫికెట్లు తీసుకున్న తరువాతే వారి పేర్లను పే రోల్స్‌లో చేర్చాలి' అంటూ గురువారం నాడే ఆదేశాలు జారీఅయ్యాయి. మరోవైపు సమ్మె కారణంగా ఖజానాపై పడుతున్న అదనపు భారాన్ని ప్రజలపై మోపడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేస్తున్న బొగ్గు, విద్యుత్, గ్యాస్ సర్‌ఛార్జీ భారాన్ని ప్రజలపై మోపనున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం యూనిట్‌కు 50 నుండి 60 పైసల సర్‌ఛార్జీ భారాన్ని ప్రజలపై మోపనున్నారు. 'వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నందున సర్‌ఛార్జీ భారాన్ని రైతులపై వేయలేం. ఇతర తరగతులకు చెందిన ప్రజలు, పరిశ్రమల నుండి ఈ మొత్తాన్ని వసూలు చేస్తాం' అని ఉన్నతస్థాయి అధికారి ఒకరు ప్రజాశక్తితో చెప్పారు.
హైకోర్టు తీర్పు సాకుతో...!
'నోవర్క్ .. నోపే' విధానంతో జారీ చేసిన జీవో 177 అమలుకు హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం కారణంగా చెబుతోంది. ఒక రిట్ పిటిషన్‌పై ఆగస్టు 16న హైకోర్టు జారీచేసిన ఆదేశాల్లో జీవో 177ను నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 1677 అమలుపై స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో జీవో 177ను అమలుచేయక తప్పనిస్థితి ఏర్పడిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తమ అనుమతి లేకుండా జీవో 177లో ఎటువంటి మార్పులూ చేయకూడదని హైకోర్టు ఆదేశించిందని ఈ నేపథ్యంలో జీతాలు నిలిపివేయడం మినహా మరోమార్గం లేదని ఆ వర్గాలంటున్నాయి. వాస్తవానికి ఈ విషయాలను పేర్కొం టూనే 17న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 30389 మెమోను అన్ని ప్రభుత్వ
శాఖలకూ జారీ చేశారు. జీతాల డ్రాయింగ్ అధికారులు జీవో 177ను పూర్తిస్థాయిలో అమలుచేయాలని, పే బిల్స్ ట్రెజరీకి సమర్పించే సమయంలో ఆ మేరకు సర్టిఫికెట్లు సమర్పించాలని ఆ మెమోలో ఆయన ఆదేశించారు. దీంతో పే రోల్స్ తయారు చేయడం నత్తనడకగా మారింది. దీన్ని నివారించడానికి విధులకు హాజరైన వారి నుండి ఆ మేరకు సర్టిఫికెట్లు తీసుకోవాలని తాజాగా ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులకు రోజుకు 75 కోట్ల రూపాయల మేర జీతాలు చెల్లించాల్సుంది. తెలంగాణా ప్రాంతంలోని ఉద్యోగులకు రోజుకు 33 కోట్ల రూపాయలు జీతాలుగా చెల్లించాల్సుంది.
విద్యుత్ భారం ఇలా...!
విద్యుత్ కొరతను నివారించడానికి ఇప్పటివరకు 1,500 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అదిగాకుండా ఇతర రాష్ట్రాలనుండి పెద్దఎత్తున బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారు. బొగ్గును సరఫరా చేయడానికి మహారాష్ట్ర 33 కోట్ల రూపాయల మొత్తాన్ని అడ్వాన్స్‌గా అడిగినట్లు తెలిసింది. మిగిలిన సంస్థలు కూడా ఇదే రీతిలో డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు విద్యుత్‌ను 'బదులు' ప్రాతిపదికన సరఫరా చేయడానికి సంసిద్దత వ్యక్తంచేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికే మొగ్గుచూపుతోంది. లేనిపక్షంలో పీక్ సమయంలోనే ఆ రాష్ట్రాలు బదులు చెల్లించాలని డిమాండ్ చేస్తే కష్టమవుతుందని చెబుతున్నారు. బొగ్గు కోసం 40 నుండి 50 శాతం అధికంగా చెల్లించాల్సివస్తోందని, విద్యుత్ కొనుగోళ్ళు కూడా ఇదే మాదిరి సాగుతోందని, సహజవాయువు కోసం ఇంకా పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సివస్తోందని ఒక అధికారి వివరించారు. 'ఈ మొత్తాన్ని లెక్కిస్తే యూనిట్‌కు 50 నుండి 60 పైసలు అధికంగా ఖర్చవుతోంది' అని ఆయన చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఆ భారం ప్రజలపైనే పడనుంది.
సమ్మెలో లేని ఉద్యోగులకు సకాలంలో జీతాలు : సిఎం
సమ్మెలో పాల్గొనని ఉద్యోగులకు ఎటువంటి పరిస్థితుల్లోనూ సకాలంలో జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. గురువారం రాత్రి జరిగిన సమావేశంలో ఈ మేరకు సిఎం ఆదేశాలు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సమ్మె కారణంగా సాధారణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలని, వైద్య సేవలకు ఆటంకం కలగకుండా చూడాలని ఆయన ఆదేశించారు.
సమ్మెలో ఎందరు ...?
ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రభుత్వోద్యోగులు 34 నుండి 36 శాతంలోపే సమ్మెలో పాల్గొంటున్నారని ఒక ఉన్నతాధికారి తెలిపారు. అయితే ఉపాధ్యాయులతో పాటు సింగరేణి, ఆర్టీసీల్లో సమ్మె పెద్దఎత్తున జరుగుతోంది. ఈ సంస్థలకు చెందిన ఉద్యోగులు 85 శాతానికి పైగా సమ్మెలో భాగస్మాములవుతున్నారని ఒక ఉన్నతాధికారి తెలిపారు. సచివాలయంతో పాటు, హెచ్‌ఓడిల స్థాయిలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు విధులకు హాజరవుతుండటంతో ప్రభుత్వోద్యోగుల సంఖ్య తక్కువగా కనబడుతోందని ఆయన వివరించారు. జిల్లాల స్థాయిలో 80 నుండి 86 శాతం మంది ప్రభుత్వోద్యోగులు సమ్మెలో ఉన్నారని ఆయన చెప్పారు.
శాఖ మొత్తం ఉద్యోగులు సమ్మెలో ఉన్నవారు
ప్రభుత్వోద్యోగులు 252000 86800
ఉపాధ్యాయులు 141000 128000
సింగరేణి 67000 57100
ఆర్టీసి 66000 65192 



No comments:
Post a Comment