Sep 23, 2011

పంట కరెంట్‌కు సర్కారు స్విచాఫ్!

రైతు ప్రయోజనాలు పణం
*లోటును సాకుగా చూపుతూ ఉచిత కరెంటుకు కోత
*సకలజనుల సమ్మెపై సమీక్షలో సీఎం కిరణ్ ఆదేశాలు!
*సమ్మె పరిష్కారాన్ని గాలికి వదిలేసి..ప్రజల్ని మరింత ఇబ్బందులకు గురిచేసే నిర్ణయాలు
*సాధారణంగా, కొరత ఉంటే ముందు పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటిస్తారు... గత వేసవిలో సర్కారు చేసిందదే
*పరిశ్రమలకు వారానికి 3 రోజుల కోత అమలు చేశారు
*ఇప్పుడు వ్యవసాయానికే ముందుగా కరెంటు కోత
*లోటు పూడకుంటే పరిశ్రమలకు ఒక రోజు పవర్ హాలిడే
*అదే జరిగితే వర్షాకాలంలో ఇదే తొలి పవర్ హాలిడే అవుతుంది
*సర్కారు అలక్ష్యం.. ముందు జాగ్రత్త లోపమే సమస్యకు కారణం
*45 రోజుల ముందే సమ్మె నోటీసందినా చర్యలు శూన్యం
*విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే బొగ్గు నిల్వలపై నిర్లిప్తత...
*తగ్గుతున్న థర్మల్, గ్యాస్, జల విద్యుదుత్పత్తి
*గ్రామాలు, పట్టణాల్లోనూ కోతల వెతలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఒకవైపు తెలంగాణలో సకల జనుల సమ్మె 10 రోజులుగా ఉధృతంగా సాగుతోంది. నానాటికీ తీవ్ర రూపు దాలుస్తోంది. జన జీవనాన్ని పూర్తిగా స్తంభింపజేస్తోంది. బాధ్యత గల ఏ ప్రభుత్వమైనా ఇంత పెద్ద సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో అన్ని రకాలుగా ప్రయత్నించాలి. కానీ ఆ బాధ్యతను మొదటి నుంచీ విస్మరిస్తూ ప్రేక్షక పాత్ర పోషిస్తూ వస్తున్న కిరణ్ సర్కారు... తాజాగా ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేసే నిర్ణయాలు తీసుకుంటోంది. ఎప్పుడూ లేని విధంగా వ్యవసాయానికి ఇస్తున్న 7 గంటల ఉచిత కరెంటుకు శుక్రవారం నుంచి కోత విధించడానికి సిద్ధపడుతోంది. మద్దతు ధర మొదలుకుని ఎరువుల దాకా ఏదీ అందక ఇప్పటికే నానా ఇబ్బందుల్లో ఉన్న రైతులను మరిన్ని కష్టాల్లోకి నెడుతోంది. గురువారం మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

ఆ మేరకు శుక్రవారం నుంచి ఉచిత సాగుకు గంట పాటు కరెంటు కోత అమలు చేయనున్నారు. ప్రస్తుతం సాగుకు అధికారికంగా పగలు 4 గంటలు, రాత్రి 3 గంటలు అధికారికంగా కరెంటు సరఫరా జరుగుతుండగా; ఇకపై మూడేసి గంటలకు పరిమితం చేస్తారు. అనధికారిక కోతలు దీనికి అదనం! ప్రభుత్వ నిర్ణయం పట్ల విద్యుత్ శాఖ వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి! లోటును అధిగమించాల్సి వచ్చినప్పుడు ముందుగా పరిశ్రమలకిచ్చే కరెంటుపైనే కోత విధించడం పరిపాటి. గత వేసవిలో కరెంటుకు తీవ్ర కటకట వచ్చినప్పుడు కిరణ్ సర్కారే పరిశ్రమలకు వారానికి ఏకంగా మూడు రోజుల పాటు పవర్ హాలిడే అమలు చేసిన విషయం తెలిసిందే. అప్పటికీ లోటు తీవ్రంగా ఉంటే వాణిజ్య, గృహావసరాల కరెంటును కోత విధిస్తారు.

అంతే తప్ప సాగుకు ఇచ్చే ఉచిత కరెంటుకు కోత పెట్టిన సందర్భం ఇప్పటిదాకా ఎప్పుడూ లేదని ట్రాన్స్‌కో అధికారులే చెబుతున్నారు! అలాంటిది ఈసారి మాత్రం అన్నింటినీ వదిలి నేరుగా ఉచిత కరెంటునే లక్ష్యంగా చేసుకుంది! సకల జనుల సమ్మె పరిష్కారంలో ఘోర వైఫల్యంతో ఇంటా బయటా అభాసుపాలవుతున్న కిరణ్ సర్కారు... ఇప్పటికైనా పరిష్కారానికి ప్రయత్నించాల్సింది పోయి ఒకటి తర్వాత ఒకటిగా అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నష్టాలను తాళలేక ఇప్పటికే పంట విరామం ప్రకటించిన అన్నదాతలను ఆదుకోవాల్సింది పోయి... ప్రయోజనాలను పణంగా పెడుతూ... లోటు సాకుతో నేరుగా సాగుకే కరెంటును కట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడుతున్న తీరు అందరికీ విస్మయం కలిగిస్తోంది. సాగుకు కోత అనంతరం కూడా కరెంటు లోటు పూడని పక్షంలో పరిశ్రమలకు కోత విధించాలని కిరణ్ ఆదేశించినట్టు తెలిసింది. అప్పుడు వాటికి వారానికి ఒక రోజు పవర్ హాలిడే ప్రకటిస్తారని సమాచారం.

అదే జరిగితే వర్షాకాలంలో పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించడం కూడా రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అవుతుంది! అవసరాన్ని బట్టి రెండు మూడు రోజుల్లో అది అమలయ్యే అవకాశముంది. తద్వారా విద్యుత్ డిమాండ్ ఏ మేరకు తగ్గుతుందో నివేదిక తయారు చేయాల్సిందిగా డిస్కంలను ఇంధన శాఖ ఇప్పటికే ఆదేశించింది. రోజుకు 700 నుంచి 900 మెగావాట్ల దాకా తగ్గుతుందని అంచనా వేసినట్టు సమాచారం. పవర్ హాలిడే వల్ల దినసరి వేతన కార్మికుల జీవనోపాధి కూడా దెబ్బతింటుంది. ఒకవేళ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా డీజిల్‌ను వాడేందుకు పరిశ్రమలు సిద్ధపడితే ఉత్పత్తి వ్యయం కాస్తా పెరుగుతుంది. అది తిరిగి అధిక ధరల రూపంలో వినియోగదారులపైనే పడుతుంది!

ప్రభుత్వానిది అడుగడుగునా అసమర్థతే...

ప్రస్తుత కరెంటు కష్టాలకు సర్కారు అలసత్వం, అసమర్థతలే ప్రధాన కారణం. ప్రభుత్వం అడుగడుగునా అంతులేని నిర్లక్ష్యంతో వ్యవహరించి ప్రజలపై కరెంటు సమస్యను చేజేతులా రుద్దింది! సకల జనుల సమ్మెకు ఏకంగా 45 రోజుల ముందే ఉద్యోగ సంఘాలు నోటీసిచ్చినా, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల విషయంలో అంతులేని నిర్లక్ష్యం చూపింది. అవసరమైన మేరకు బొగ్గు, గ్యాస్ నిల్వల కోసం ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు.

ముఖ్యంగా సింగరేణి సమ్మె నేపథ్యంలో బొగ్గు కొరతను అధిగమించేందుకు వీలైనన్ని అదనపు నిల్వలను ముందుగానే విద్యుత్ ప్లాంట్లకు తరలించే అవకాశమున్నా పట్టించుకోకుండా చోద్యం చూసింది. పరిస్థితి చేయిదాటే దాకా వచ్చాక ఇప్పుడు తీరిగ్గా కేంద్రానికి లేఖలు రాయడం మొదలు పెట్టింది. విదేశీ బొగ్గును బహిరంగ మార్కెట్‌లో కాస్త ఎక్కువ ధరకైనా తక్షణం దిగుమతి చేసుకునే అవకాశమున్నా ఇంతకాలం పాటు పట్టించుకోలేదు. దాన్ని కొనుగోలు చేయాలని కూడా మూడు రోజుల క్రితమే నిర్ణయం తీసుకుంది.

No comments: