Sep 27, 2011

ఆత్మహత్యే పరిష్కారమా?

పరీక్షల్లో ఫెయిల్‌ అయినా, వ్యాపారంలో నష్టం వచ్చినా, భాగస్వామితో బేదాభిప్రాయం వచ్చినా, చేసేపనిలో అసంతృప్తి మొదలైనా, ఆరోగ్య సమస్యలు తలెత్తినా, ఒంటరితనం వెక్కిరించినా కొందరు ఆత్మహత్యను పరిష్కార మార్గంగా ఎంచుకుంటున్నారు. కానీ సమస్యకు 'అదే' పరిష్కార మార్గమా! 'ఇంకేమీ' లేదా! మనసుంటే మార్గాలుండవా?!
తాము ఎంతో ప్రేమించే కుటుంబ సభ్యులను నెమ్మదిగా మాటలతో ఒప్పించి ఆత్మహత్యలకు పాల్పడుతున్న కుటుంబాల గురించి మనం వార్తాపత్రికల్లో, టీవీల్లో చూస్తున్నాం. వీరంతా తమ జీవితాలకు లేదా తమ పిల్లల జీవితాలకు ఎటువంటి విలువనూ ఇవ్వడం లేదు. పెద్ద పెద్ద నగరాల్లో ఆత్మహత్యల రేటు పెరిగిపోతోంది. మన దక్షిణ భారతదేశంలో ఉత్తరాది కన్నా ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయి. దీనికి కారణం దక్షిణ భారతదేశంలో అక్షరాస్యత అధిక స్థాయిలో ఉండడమేనని అంటున్నారు. విద్యార్హతలు పెరిగేసరికి ఉన్నతావకాశాలు వస్తాయని ఎదురు చూస్తారు. వారి ఆశలు నెరవేరకపోవడంతో ఇటువంటి ఘాతుకానికి పాల్పడుతున్నారు. మరికొంతమందిలో ఒంటరితనం, ఉద్యోగపు ఒత్తిళ్లు, సామాజిక - ఆర్థిక సమస్యలు, ఇతరుల మీద విశ్వాసం లేకపోవడం వంటి కారణాలతో వ్యాకులతకు గురవుతున్నారు.
వ్యాకులత అంటే?
వ్యాకులత అంటే డిప్రెషన్‌. మనిషిలో దుఃఖం, పనికిమాలిన వారనే భావం, ఆకలి లేకపోవడం, నిద్ర పట్టక పోవడం, నిరుత్సాహంగా ఉండడం దీని లక్షణాలు. ప్రపంచం మొత్తం ఉత్సాహంగా ఉరకలు వేస్తుంటే వ్యాకులత చెందిన మనిషి నిరుత్సాహంగా విచారంతో ఉంటాడు. ఈ లక్షణాలు ఎవరిలోనైనా పగటిపూట కూడా రెండు వారాలకు మించి కనిపిస్తే వెంటనే ఆ వ్యక్తిని కౌన్సిలింగ్‌కు, వైద్య చికిత్సకు తీసుకువెళ్లాలి.
వ్యాకులతకు కారణాలేంటి? ప్రస్తుత ప్రపంచంలో మనిషి ప్రతి విషయాన్ని లాభదృష్టితో చూస్తున్నాడు. తాను ఆశించిన, లేదా అనుకున్న ఫలితాలు రాకపోతే వ్యాకులత చెందుతున్నాడు. జరిగిన నష్టాన్ని పూడ్చుకోలేమని ఆందోళన చెందుతారు. కోరుకున్నవి సాధించినంత కాలం జీవితాన్ని ఆస్వాదిస్తూ తమని తాము ప్రేమించుకుంటారు. అలాకాకపోతే జీవితం మీద విరక్తి మొదలవుతుంది. ఈ మధ్య వార్తాపత్రికల్లో ఒక వార్త వచ్చింది. పంతొమ్మిదేళ్ల కొడుకు తల్లిదండ్రులను కారు కొనిపెట్టమని అడిగాడు. వారు నిరాకరించడంతో సీసాడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లిదండ్రులూ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఇటువంటి సంఘటనలు మనసుల్లో గొప్ప అలజడిని సృష్టిస్తాయి.
సవాళ్లతో కూడిన జీవితం
జీవితసమరంలో ఎన్నో సవాళ్లు, విజయాలు, వైఫల్యాలు వుంటాయి. ఎప్పుడూ విజేతగా ఉండిపోవాలంటే సాధ్యమా? మన ఇష్టాయిష్టాల ప్రకారం జీవితం సాగడం లేదని, దానికి పరిష్కారం ఆత్మహత్య అనుకోవడం చాలా తప్పు. పొరపాట్లు ఎక్కడ జరిగాయి? పరాజయం వెనుక కారణాలను విశ్లేషణ చేసుకుని, భవిష్యత్తులో అటువంటి పొరపాట్లు జరక్కుండా జాగ్రత్త పడడం అలవరచుకోవాలి. ఒకగదిలోకి దుర్వాసన వస్తుంటే ఆ గదిని వాడడం మానేస్తామా? ఎక్కడ్నుండి ఆ వాసన వస్తుందో కనుక్కుంటాం. ఇంకేముంది? దుర్వాసన రాకుండా ఏం చెయ్యాలో మనకు తెలుసు. జీవితాన్ని కూడా ఇదే విధంగా సవరించుకోవాలి.
విచారం రుచి తెలిసిన వారే సంతోషాన్ని సంపూర్ణంగా అనుభవించగల్గుతారు. ఏ ఒక్కరి జీవితంలోనూ సుఖసంతోషాలు మాత్రమే నిండి ఉండవు. సుఖదుఃఖాలు జీవితంలో ఎత్తుపల్లాలు. ఓటమి రాగానే సర్వం కోల్పోయినట్లేనని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుకోకూడదు.
వ్యతిరేకత మనిషికి ఎంతో అవసరం. ఇది మనిషికి బోలెడంత వివేకాన్ని, అవగాహనని కలిగిస్తుంది. అనుభవాన్ని ఇస్తుంది. కోటీశ్వరుడు సంతోషంగా జీవిస్తున్నాడని ఊహించకూడదు. ఒంటరితనం, అనారోగ్యం, నమ్మకమైన వ్యక్తులు, ఆత్మీయనేస్తాలు దొరక్క అతడు నిత్యం బాధపడుతుండవచ్చు. మనిషికి శారీరక, మానసిక సంతోషాలున్నప్పుడే సంతృప్తిగా ఉంటాడు. ఇది సాధించాలంటే కోరికలను అదుపులో ఉంచుకోగలాగాలి. మనసులో కోరికలు సూక్ష్మజీవులు పెరిగినట్లు పెరిగి మనిషిని దురాశాపరుణ్ణి చేస్తాయి. అలాంటి వారు సంపాదనతో సంతోషం లభిస్తుందనుకుంటారు. ఇతరుల విజయాల పట్ల అసూయతో, వ్యతిరేక భావంతో ఉంటారు. కొంచెం సాహసం అలవరచుకుంటే జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించగలుగుతారు. పిరికితనానికి చోటిచ్చి ఆత్మహత్య చేసుకుంటే వారు జీవితంలో ఏం సాధించినట్లు?
ఇవి అవసరం
* ఎవరైనా మానసికంగా నలిగిపోతూ, విచార సముద్రంలో మునిగిపోతుంటే స్నేహితులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. * వ్యాపారంలో నష్టపోయి, అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారుంటారు. ఇటువంటివారిని భాగస్వామి పసిగట్టి వారికి తగిన మానసిక ధైర్యం ఇచ్చి, మళ్లీ కొత్త వ్యాపారం ప్రారంభించేటట్లు ప్రోత్సహించాలి. * నిరంతర శ్రమ, ప్రణాళికలు విజయాలను తెచ్చిపెడతాయి. చిన్న చిన్న వైఫల్యాలుంటాయి. వాటికి బెదిరి ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం పిరికితనమనే విషయం సమయం చిక్కినప్పుడల్లా వివరిస్తుండాలి. * 26 ఏళ్ల కూతురు మరణిస్తే తల్లిదండ్రులు కుంగిపోతే ఎలా? కడుపున పుట్టినవారు చనిపోతే బాధ కలగడం సహజం. కానీ పుట్టిన ప్రతిజీవీ గిట్టక మానదు. జననమరణాలు నిరంతరం జరుగుతుంటాయి. అవి సృష్టి నియమాలు. అయితే కుమార్తె జ్ఞాపకాలు ఎప్పుడూ తమతోనే వుంటాయని సమాధానపడాలి. ఇలాంటి ధోరణులు అలవరచుకుంటే ఆత్మహత్య ఆలోచన రాదు. * ఓటమిని ఎదుర్కోగల ధీరోదాత్తత తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాలి. వారిలో ఆత్మవిశ్వాసం పెరిగే విధంగా ప్రవర్తించాలి. * అపజయాలు విజయానికి సోపానాలనే విషయం యువతలో నాటుకునే విధంగా చెప్పాలి. * ఆత్మహత్య అనేది జబ్బు కాదు. అదొక ప్రవర్తనా సమస్య. * 'చావాలని లేదు. కానీ బతకాలనీ లేదు' అనే సందిగ్థతతో కొందరుంటారు. నచ్చజెప్పే వారుంటే క్షణికోద్రేకంలో తీసుకునే నిర్ణయాల నుండి వీరు బయటపడతారు.

No comments: