పిల్లలు కాలక్షేపం కోసం టీవీ ముందు కూర్చుంటే- టామ్ అండ్ జెర్రీ తెర నిండా పరుగులు తీస్తూనే ఉంటాయి. ఇక సూపర్‌మేన్లూ, స్సైడర్ మేన్ల పరుగూ, వేగాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీడియో గేముల్లో కార్లూ బైకులూ ఎంత వేగంగా పరుగెడితే అంత క్రేజు! పిల్లలు ఆ గేముల్లో విపరీత వేగంతో దూసుకుపోతుంటే- పెద్దలం కూడా తెగ సంబరపడిపోతాం. 'వెనక నుంచి వచ్చేస్తున్నాడు... వెళ్లు వెళ్లు..' అని తొందరపెడతాం. పిల్లలు నరాల తెగే ఉత్కంఠను, వేగంగా దూసుకుపోవాలన్న కసిని అనుభవిస్తూ ... బైకును ముందుకు ఉరికిస్తారు.. మధ్యలో మనుషులు అడ్డొచ్చినా, రాళ్లూ రప్పలూ తారసపడ్డా డోంట్‌కేర్ ! వేగమే వేదం... గెలుపే లక్ష్యం ...'వేగం లేని జీవితం శుద్ధ వేస్టు' అన్న ఫిలాసఫీ నరనరాన జీర్ణించుకుపోతుంది. వీడియో బొమ్మల స్థానే నిజం బైకులు చేతికొచ్చాక కూడా అదే వేగమూ, అదే ధోరణీ కొనసాగుతుంది. కంప్యూటర్లో ప్రమాదం జరిగితే- లేచి చేతులు దులుపుకొని మళ్లీ ముందుకు ఉరకవచ్చు. అయ్యో ... జీవితం అలా కాదే ..!!!
'వేగం' అనేది జీవితాన్ని సుఖమయం చేసిందనటంలో సందేహం లేదు. వేగం పెరగటంవల్ల ప్రయాణ దూరాలూ, భారాలూ భారీగా తగ్గాయి. 'కాశీకి వెళ్లినవాడు కాటికి వెళ్లినవాడితో సమానం' అన్న సామెత చెల్లకుండా పోయింది. ఒకేరోజు హైదరాబాదులో టిఫెనూ, లండన్లో లంచ్, వాషింగ్టన్ డిసిలో డిన్నరూ చేసే అవకాశం ప్రయాణ వేగంవల్లే సాధ్యమవుతోంది. అయితే, వేగం జీవితాన్ని సుఖవంతం, సౌకర్యవంతం చేయాలి తప్ప అథోగతికి ఈడ్చకూడదు. విషాదానికి హేతువు కాకూడదు. అందుకనే- 'అతి వేగం' ఒకటే జీవితం అనుకుంటున్న ఈ తరానికి మళ్లీ 'నిదానం' గురించి బోధించాలి. 'జీవితం' అనేది పరుగు కన్నా, అమిత వేగం కన్నా గొప్పది అని చెప్పాలి!




No comments:
Post a Comment