Sep 27, 2011

వ్యసనాలకు బానిస

  • ఐద్వా అదాలత్‌
సగటు భారతీయ సంస్కృతిని ఒంటబట్టించుకున్న భార్య తన భర్తలోని తప్పులను ఓపిగ్గా భరిస్తుంది. ఈరోజు కాకున్నా రేపైనా మారతాడు లెమ్మనుకుంటుంది. కానీ అవలక్షణాలే పరమావధిగా భావించి, సంసారాన్ని నిర్లక్ష్యంచేయడం తట్టుకోలేదు. తన ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి వ్యసనాలకు బానిస కావడం అంతకన్నా భరించలేదు. ప్రభుత్వం పుణ్యమాని యేరులై పారుతున్న మద్యం ప్రతి ఒక్కరినీ రారమ్మని ఆహ్వానిస్తోంది. పగలల్లా కష్టపడి సంపాదించిన కాస్త మొత్తాన్నీ ఇంటికోసం ఉపయోగించకుండా తాగడానికే ప్రేరేపిస్తోంది. తాగి ఒళ్లు గుల్ల చేసుకోవడం తప్ప మరో ఆలోచనలేకుండా చేస్తోంది. ఆ మైకంలో అన్ని బాధలూ మర్చిపోయి సేదతీరుతున్నాననే అనుకుంటున్నారు తప్ప... ఆరోగ్యం, కుటుంబం, పిల్లల భవిష్యత్తూ అన్నీ ఆ వ్యసనానికి ఎరగా వేస్తున్నానని అనుకోరు.

రాజేశం ఆ కోవకు చెందినవాడే! మెకానిక్‌గా రోజంతా కష్టపడతాడు. అందుకు తగ్గ ఫలాన్ని సాయంత్రానికి జేబులో వేసుకుంటాడు. కానీ ఏం ప్రయోజనం?! తిన్నగా మందు దుకాణానికి దారితీస్తాడు. రాజేశం భార్య వాణి. పేదింటిలో పుట్టినా కుదురైన పిల్ల. పెళ్లికి ముందే మిషను పని నేర్చుకుంది. పెళ్లయ్యాక జాకెట్లు కుడ్తూ కుటుంబానికి ఆసరాగా, వేణ్ణీళ్లకు చన్నీళ్లుగా నిలుద్దామనుకుంది. కానీ మొత్తం కుటుంబ భారమంతా వాణిమీదే పడింది. రాత్రీపగలూ అదేపనిగా జాకెట్లు కుట్టేది. వచ్చిన డబ్బులతో ఇంటద్దె చెల్లించేది. సరుకులు కొనుక్కొచ్చి ఇంటిని నడిపేది. ఇద్దరు పిల్లలు పుట్టినా రాజేశానికి బాధ్యత తెలిసిరాలేదు. ఇటు వాణికి కష్టమూ తప్పలేదు.

పోనీ వాణి కష్టంవల్ల కుటుంబం నడిచిపోతుందా అంటే అదీ లేదు. నెల మధ్యలోనే చేతిలోని డబ్బులు అయిపోయేవి. కానీ అవసరాలు ఆగవుగా! రాజేశానికి ఇల్లు, ఇల్లాలు, పిల్లల బాధ్యత ఎలాగూ పట్టదు. కనీసం అతన్ని కనీ పెంచిన తల్లిదండ్రులపట్ల కూడా బాధ్యత లేనట్లుగా ప్రవర్తించేవాడు. ఇంటిని పట్టించుకోవాల్సిన కొడుకు రోడ్ల వెంబటి తిరుగుతుంటే... కోడలిపై ఆధారపడి బతకడం వారికి సిగ్గుగా ఉండేది. ఇప్పటికైనా బాధ్యత తెలుసుకుని ప్రవర్తించమని నెత్తీ నోరు కొట్టుకునేవారు. అయినా, అతనిలో మార్పు రాలేదు. వాణికి ఏం చేయాలో పాలుపోలేదు.

కుట్టుపని చేసి పిల్లల్ని పోషించడం వాణి కష్టంగా భావించడంలేదు. కానీ, భర్త వీసమెత్తయినా సాయపడకపోవడం చాలా కష్టమనిపించేది. పైసా ఇవ్వకపోయినా, పెత్తనానికి లోటులేని భర్తతో ఎన్నాళ్లని కాపురం చేయాలి? తాగుడుతో ఒళ్లు గుల్ల చేసుకుంటుంటే ఎలా చూస్తూ ఊరుకోవాలి? ఎదుగుతున్న పిల్లలను ఎలా కడతేర్చాలి? కన్నీరు కార్చే అత్తమామలను ఎలా ఓదార్చాలి? ఇవన్నీ వాణి ముందు కదలాడే ప్రశ్నలు. దీనికి సమాధానం ఆశిస్తే రాజేశంనుండి శాపనార్థాలు, బూతులు తప్ప మరో మాట ఉండదు. కనీసం నీ ఆరోగ్యం గురించైనా ఆలోచించుకొమ్మనీ... రేపు నీకేదైనా రోగమొస్తే ఈ స్నేహితులెవరూ నీ మొహమైనా చూడరని చెవినిల్లు కట్టుకుని పోరింది. ఇవన్నీ విని రాజేశం, ''ఛీ! ఇంటికొస్తే మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు'' అంటూ చీదరించుకునేవాడు. సందు దొరికిందే చాలని మళ్లీ మందును వెతుక్కుంటూ వెళ్లిపోయేవాడు. ఇక భరించలేని వాణి బయల్దేరి 'ఐద్వా లీగల్‌సెల్‌'కు వచ్చింది. తన భర్త వ్యవహారాన్ని చక్కబెట్టి పుణ్యం కట్టుకోమని ప్రాధేయపడింది. రాజేశంను సభ్యులు పిలిపించారు. కన్నవారి ఆక్రోశాన్ని, కట్టుకున్నదాని ఆవేదనను, కన్నబిడ్డల బాధ్యతలను విస్మరించి బావుకుంటుందేమిటో చెప్పమన్నారు. సంపాదించినదంతా తాగి తగలేసి వాడివి, తిండికి మాత్రం ఇంటికెలా వస్తున్నావని ప్రశ్నించారు.

తోడునీడగా ఉండాల్సిన వాడివి తోడుకు తింటుంటే ఒంటి రెక్కమీద వాణి సంసారాన్ని ఎలా ఈదుతుందన్న ఇంగితం లేకుండా ఎలా ఉంటున్నావని నిలదీశారు. ఇలా ప్రవర్తించడం గొప్పనుకుంటున్నావా అంటూ సంధించిన సభ్యుల ప్రశ్నల పరంపరకు రాజేశం ఉక్కిరిబిక్కిరయ్యాడు. తాగుడుతో మైకం కమ్మిన కళ్లు మెల్లగా పొరలువీడాయి. మనసుకు పట్టిన మబ్బులు మెల్లగా తొలగసాగాయి. కానీ తాగుడుకు లొంగినవారు అంత సులభంగా అలవాటు మానుకుంటాడని సభ్యులు నమ్మలేదు. కానీ కుటుంబం ముఖ్యమనుకున్న వారికి అదేమీ అసాధ్యం కాదు. దానికి పట్టుదల కావాలి. ఇంటిఖర్చులకు డబ్బివ్వాలి. వారం వారం వచ్చి ఇక్కడ కనిపించాలి. నువ్వు మారావన్న మాటలు నీ నోటినుండి కాక వాణి నోటినుండి వినాలి అని సభ్యులు చెప్పారు. అందుకు రాజేశం మరో మాటలేకుండా సమ్మతించాడు.

No comments: