Sep 27, 2011

‘ఈ’స్నేహాలు ఎలా ఉంటాయో తెలుసా ?

ఇంటి ముందు అరుగుపై ఇరుగుపొరుగు కుర్రాళ్ల ముచ్చట్లు..
వీధి చివర బడ్డీ దగ్గర సాయంత్రం వేళ నలుగురు యువకుల మాటామంతీ..
ఊరి చివర లాకుల దగ్గర అరడజను మంది ఆకతాయిల అల్లరి ఊసులు..
ఇరానీ చాయ్ హోటళ్లలో హస్కులు..
కాలేజీ హాస్టల్ రూముల్లో కబుర్లు..
ఇవన్నీ నిన్నటి సంగతులు..
****
సాగరానికీ ఫిష్షింగ్ నెట్టు..స్నేహించడానికి ఇంటర్నెట్టు..అని పాడుకునే రోజులొచ్చేసాయి. వచ్చేసాయేమిటి..వచ్చి చాలా కాలమైపోతోంది. నిన్న మొన్నటి ఆర్కుట్ పాతబడిపోయింది. కొత్త కొత్తగా గూగుల్ ప్లస్ పలకరిస్తోంది. ఫేస్‌బుక్ నేనున్నా అంటోంది. ఇవన్నీ చాలనట్లు..లక్షల కొద్దీ సోషల్ నెట్‌వర్క్ గ్రూపులు..మతాల వారీగా, కులాల వారీగా, అభిరుచులవారీగా..ఇలా ఎన్నో రకాల బ్లాగులు..
ఇప్పుడు స్నేహానికి ఎన్ని వేదికలో..స్పందించడానికి ఎన్ని సంఘటనలో..
****
అవును ఇప్పుడు స్నేహం..అడ్డా..అడ్రసు రెండూ ఇంటర్‌నెట్టే అయింది. ఇంటర్‌నెట్ పుణ్యమా అని స్నేహానికి ‘సరిహద్ధులు’ చెరిగిపోయాయి. ఎస్‌ఎమ్‌ఎస్ నుంచి ఎమ్మెమ్మెస్..ఆపై ఈ మెయిల్..ఇంకా చాలానట్లు, ఫేస్‌బుక్ కుటుంబాలు వెలిసాయి. మెయిల్ బాక్స్ తెరవడం ఆలస్యం..కొత్త కొత్త కబుర్లు ఘల్లుమని రాల్తున్నాయి. కాలేజీ ముగియడం ఆలస్యం..నెట్ కేఫే కేరాఫ్ అడ్రస్ అవుతోంది. యాహూలో గ్రూపుల సంఖ్య పది లక్షల పైచిలుకే అంటే నమ్మతరమా? ఒక్కో గ్రూపులో సభ్యుల సంఖ్య లక్ష నుంచి పది లక్షల వరకు వుంటుంది. వీరందరి నడుమ నిత్యం ఇటు అటు సర్క్యులేట్ అయ్యే మెయిళ్ల సంఖ్య లక్షలు దాటి కోట్లకు చేరింది. ఇక గూగుల్ గ్రూపుల సంఖ్య ఏడు వందల మిలియన్ల పైనే. ఆ గ్రూపుల యాక్టివిటీ,వాటి నడుమ సర్కులేట్ అయ్యే సమాచారం, అవి ఇచ్చి పుచ్చుకునే డేటాను ఇంతా అంతా అని లెక్కవేయడానికే అంతు చిక్కదు. ఇదంతా నెట్ స్నేహాల మహిమే. ఒక్క మంచి మెయిల్ ఏ ఒక్క నెట్‌వర్క్‌లో అయినా ప్రత్యక్షం అయిందంటే చాలు..అది ప్రపంచం నలుమూలలకూ పాకిపోవాల్సిందే. ఈ కార్యక్రమం నిర్వహించేదీ నెట్ స్నేహాలే. తమకు తెలిసింది..తాము చూసింది..తమకు నచ్చింది..తన నెట్ నేస్తాలందరికీ తెలియచేయాలన్న తపనే ఇందుకు కారణం. గ్రూపు నుంచి మెయిల్ అందుకోవాలి. నచ్చితే నలుగురికి తెలియచేయాలి..బాగుంటే డౌన్‌లోడ్ చేసి దాచాలి. ఎన్ని పనులు ఇవ్వాళ కుర్రాళ్లకి. సినిమా వచ్చిన మరుక్షణం..దాని మంచి చెడ్డలు ప్రపంచం నలుమూలలా తెలిసిపోతున్నాయి..ఓ సంఘటన జరిగిన మరుక్షణం దానిపై డిస్కషన్స్ నెట్ స్నేహితుల నడుమ మొదలైపోతోంది. ఎవరి అనుమతీ అక్కరలేదు. ఎవరి భయమూ లేదు. ఎవరికి ఎప్పుడు ఏది నచ్చితే అది నలుగురితో పంచేసుకోవచ్చు. ఇదే యువతకు కావాల్సింది. ఇదివరకు ఇరానీ అడ్డాల్లో జరిగిందీ ఇదే. స్వేచ్ఛగా తమ భావాలను పంచుకోవడం. అదే ఇప్పుడు నెట్‌లో జరుగుతోంది. అందుకే స్నేహాలు ఇంటిని దాటి, వీధిని దాటి, ఊరును దాటి నెట్ దారి పట్టాయి.
స్నేహాలు అభిరుచులు చిత్రంగా వుంటాయి. కొన్నాళ్ల స్నేహం తరువాత కానీ అవి బయటపడవు. కానీ నెట్‌లో అలాకాదు సోషల్ గ్రూప్‌లు రకరకాలుగా వుంటాయి. కొన్ని కథలు చెబుతాయి. కొన్ని వంటలు వండి వారుస్తాయి..కొన్ని చిత్రాలు చూపిస్తాయి. వీటి గురించి ముందే తెలుసుకొని వాటిల్లో చేరవచ్చు. అదీగాక తీరా చేరాక వాటి తీరు అనుకున్నట్లు లేకుంటే, అది నచ్చకుంటే, తక్షణం ఆ ‘నెట్‌స్నేహం’ నుంచి విత్‌డ్రా అయిపోవచ్చు. అదో సౌలభ్యం. ఫేస్‌బుక్, గూగుల్ ప్లస్ కూడా అంతే, నచ్చని వారిని నిర్మొహమాటంగా బ్లాక్ చేసేసుకోవచ్చు. ఇదే వ్యక్తిగతంగా కలిసే స్నేహంలో, నచ్చలేదని మొహం మీద చెప్పే అవకాశం తక్కువ. మొహమాటాలు ఎక్కువ. అందుకే ఆ స్నేహం కన్నా ఈ స్నేహం పెరిగింది.
ఆపదలో ఆదుకునేవాడు స్నేహితుడే అంటారు. నెట్ స్నేహాలు ఈ విషయంలో కూడా ముందుంటున్నాయి. ఎవరైనా ఆపదలో వున్నారని తెలిసిన తరువాత కచ్చితంగా స్పందిస్తున్నారు. ఆసుపత్రిలో వున్నవారికి, సమాచారం అవసరమైన వారికి, విషయసేకరణ అవసరమైన వారికి అన్నిటా గ్రూప్‌లో సహాయసహకారాలు లభిస్తున్నాయి. గూగుల్ తన గ్రూపులను విషయాల వారీ వర్గీకరించింది. పైగా ఏ గ్రూప్‌లో ఎంతమంది సభ్యులున్నారన్నది ముందే తెలుస్తుంది. ఈ సంఖ్యను బట్టి కూడా వాటి ఆదరణ ఎలా వుందన్నది అర్ధమవుతుంది.
అయితే స్నేహబృందాల వ్యక్తిగత స్నేహాలకు ఈ గ్రూపుల కన్నా, ఫేస్‌బుక్, గూగుల్ ప్లస్‌ల్లాంటి సోషల్‌నెట్ వర్క్‌లే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. తమ వివరాలు, తమ డే టు డే ఏక్టివిటీలు, తమ ఫొటోలు, వీడియోలు, సృజనలు అన్నింటినీ తమ స్నేహబృందంతో పంచుకునేందుకు వీలవుతోంది. ఒక విధంగా చెప్పాలంటే ఫేస్‌బుక్ వచ్చాక గ్రూపుల్లో ఏక్టివిటీలు కాస్త మందగించాయనే చెప్పాలి. అలా అని అవేమీ ఆగిపోలేదు. వాటిల్లో జరిగే ఏక్టివిటీ వాటిల్లో సాగుతోనే వుంది. అదే సమయంలో వ్యక్తిగత స్నేహానికి ఫేస్‌బుక్ తావిచ్చింది.
కొంతమంది వెరైటీ జనాలుంటారు. వారు జనంతో కలవలేరు. నిజానికి వారికీ స్నేహం చేయాలనే వుంటుంది. కానీ ఇమడలేరు. అటువంటి వారూ ఇప్పుడు ఈ విధంగా జనంతో మమేకమవుతున్నారు. ఇలా కొత్త స్నేహాలు..కొత్త కుటుంబాలు.. ఏర్పడుతున్నాయి. ఇంటర్ చదివేవాడు, ఇంటలెక్చ్యువల్స్‌తో కలవగలుగుతున్నాడు. ఏ చదువూ లేకున్నా, మంచి రచనలు చేసేవారు ఏ శషభిషలూ లేకుండా అందరితో తన రచనలను పంచుకోగలుగుతున్నారు. తమ రచనలు పత్రికలు ఆదరిస్తాయో, ప్రచురిస్తాయో లేదో అన్న ఆలోచన కూడా చేయడం లేదు. వాటిని నెట్ పరిథిలోకి నెట్టేస్తున్నారు.
***
గతంలో కలం స్నేహం అని కొంత కాలం తెగ సంచలం సృష్టించింది. ఒకే గ్రామం, ఒకే ప్రాంతం వారు కానవసరం లేదు. కలం స్నేహం పుణ్యమా అని ఉత్తరాల ద్వారా స్నేహాలు చేసుకునే వారు.
ఇదంతా నిన్నటి మాట ఇప్పుడు కాలం మారింది. పిట్టగోడ వద్దకు చేరుకుని మాట్లాడున్నదాని కన్నా సులభంగా ఇంటి నుండే ప్రపంచ వ్యాప్తంగా ఎవరితోనైనా స్నేహం చేసేయవచ్చు. కొత్త స్నేహాలు కోరుకునే వారికి ఇంటర్‌నెట్‌లో సోషల్ సైట్‌ల ద్వారా నిజంగానే జగమంత కుటుంబం మాది అని పాడుకునే అవకాశం లభించింది.
ఏరా లేచావా, తిన్నావా లేదా అంటూ లేపి అడగడానికి హాస్టల్‌లోని నీ స్నేహితుడే కానవసరం లేదు. ఇంటర్‌నెట్‌లో సోషల్ సైట్ల ద్వారా ని ఖండాంతరాలను దాటి స్నేహ హాస్తాన్ని చాచేస్తున్నారు. భువనగిరి లో ఉండే సుధాకర్ అమెరికాలో ఉండే అప్పాజీతో సరదాగా కబుర్లు చెప్పేసుకుంటున్నారు.
మహానగరాల్లో నీ పక్కింటి వాడి పేరు నీకు తెలియకపోవచ్చు కానీ ప్రపంచంలో ఎక్కడివాడితోనైనా స్నేహం చేసేయవచ్చు.
విషాన్ని ఔషధంగా వాడి రోగాన్ని నయం చేసి, ప్రాణాలు నిలపవచ్చు, విషంగానే ఉపయోగించి ప్రాణాలు తీయవచ్చు. ఆపరేషన్ చేసి ప్రాణాలు నిలపడానికి డాక్టర్లు కత్తినే ఉపయోగిస్తారు. ఆ కత్తితో ప్రాణాలు కూడా తీస్తారు. కత్తిని ఎలా అయినా ఉపయోగించవచ్చు. అలానే ఈ ఫేస్‌బుక్, ఆర్కుట్, గూగుల్ ప్లస్ వంటి సోషల్ సైట్స్‌ను బజ్, బ్లాగ్స్ వంటివాటిని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు.
వచ్చే నెల హైదరాబాద్ వస్తున్నాను, ఓ ప్లాట్ కొనాలని ఉంది ఎక్కడ కొంటే బాగుంటుంది ఒక తెలుగు గ్రూపులో అమెరికానుండి అడిగిన ప్రశ్నకు కొన్ని వందల మంది సలహాలు ఇచ్చేశారు. అలానే బెంగళూరు వెళుతున్నాను మంచి హోటల్ పేరు చెబుతారా? అని అడిగే వారొకరు. మా పిన్ని కొడుక్కు ఎంసెట్‌లో మంచి ర్యాంకే వచ్చింది ఇంజనీరింగ్ కాలేజీలో ఎక్కడ చేరితే బాగుంటుంది. ఇలాంటి ప్రశ్నలు మొన్నటి వరకు తెలిసిన ఒకరిద్దరిని మాత్రమే అడిగే అవకాశం ఉండేది ఇప్పుడలా కాదు సోషల్ సైట్‌లో మీ మిత్ర బృందాన్ని మీరీ ప్రశ్న అడగడమే ఆలస్యం వందల సలహాలు వచ్చేస్తాయి. వారిచ్చిన సలహాల్లో ఏది ఎందుకు మంచిదో కూడా చర్చ జరుగుతుంది. సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి సోషల్ సైట్‌లో బ్రహ్మాండంగా
ఉపయోగపడుతున్నాయి. లాడెన్‌ను అమెరికా సైన్యం మట్టుపెట్టినప్పుడు తన మిత్రులకే కాకుండా ప్రపంచానికి ఈ విషయం తొలుత చెప్పింది ఈ సోషల్ సైట్ ద్వారానే. ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య ఆగర్భ శతృత్వం ఉండొచ్చు, ఆ దేశానికి వెళ్లాలంటే మనకు అంత సులభంగా అనుమతి దొరక్కపోవచ్చు కానీ సోషల్ సైట్ ద్వారా భారతీయుడు, పాకిస్తానీతో స్నేహం చేయవచ్చు హాయిగా ముచ్చట్లు పెట్టుకోవచ్చు. ఇండియా, పాకిస్తాన్ స్నేహ బృందం చాలా చురుగ్గానే ఉంటోంది. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధం కోసం ఈ బృందం ప్రయత్నిస్తోంది. వారి శక్తి తక్కువే కావచ్చు కానీ ఏదో ఒక నాటికి తమ కల ఫలిస్తుందని వారు ఆశిస్తున్నారు. ఈ మధ్య కొన్ని ముస్లిం దేశాల్లో పాలకులపై ప్రజలు తిరుగుబాటు చేసింది ఈ సోషల్ సైట్‌లు కల్పించిన చైతన్యం వల్లనే. నిరంకుశత్వంలో విర్రవీగుతున్న పాలకులకు వ్యతిరేకంగా లక్షల మంది ప్రజలు సోషల్ సైట్‌ల ద్వారా ఒక చోట చేరి ఉద్యమించారు. ఆధునిక కాలంలో ఇదో అపూర్వమైన సంఘటన. ఇక మన రాష్ట్రంలో తెలంగాణ, సమైక్యాంధ్రల పేరుతో భారీ సంఖ్యలో గ్రూపులు ఉన్నాయి. అయితే కొన్ని సార్లు ఈ బృందాలు హద్దులు దాటుతున్నాయి. తమ అభిప్రాయాలను గౌరవంగా చెప్పుకోవచ్చు కానీ ఒకరినొకరు చులకన చేస్తూ, కించపరుస్తూ మాట్లాడుకోవడం మంచిది కాదు. చివరకు ఇండియా పాకిస్తాన్‌లు సైతం సుహృద్భావ వాతావరణంలో చర్చలకు సిద్ధపడుతున్న సమయంలో రాష్ట్రం విడిపోయినా, కలిసున్న ఇరుగు పొరుగు వాళ్లమే కదా! అనే విషయంట మరిచిపోవద్దు.
హిందీ ఫన్ గ్రూప్ సభ్యుల సంఖ్య 80వేలకు చేరుకుంది. చిత్రవిచిత్రమైన ఫోటోలు, జోక్స్ సేకరించడం, ఒకరికొకరు పంపుకోవడం ఈ గ్రూప్‌కు ఆసక్తి. ఈ స్నేహ బృందంలో చేరాలంటే ఆ రంగం గురించి బోలెడు జ్ఞానం ఉండాలనే అనుమానం కొందరికి ఉంటుంది. అలాంటిదేమీ లేదు. వ్యాపారంలో స్లీపింగ్ పార్ట్‌నర్, యాక్టివ్ పార్ట్‌నర్ ఉన్నట్టుగానే ఈ స్నేహ బృందంలో యాక్టివ్‌గా ఉండేవారుంటారు. స్లీపింగ్ పార్ట్‌నర్‌లు ఉంటారు. ఆ గ్రూపునకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే చాలు ఆ బృందంలో చేరిపోవచ్చు.
ఉద్యోగం చేస్తున్నప్పుడే తల్లిదండ్రులను పెద్దగా పట్టించుకోని కాలమిది. అలాంటప్పుడు రిటైర్ అయిన తరువాత వారిని పట్టించుకునే వారెంత మంది ఉంటారు. ఉమ్మడి కుటుంబంలో కుటుంబ పెద్ద తన జీవితానుభవాన్ని కుటుంబ సభ్యులకు పంచేవారు. ఏది మంచో ఏది చెడో చెప్పడానికి ఇంట్లో ఒక పెద్ద ఉండేవారు. ఇప్పుడు కనీసం తమ అనుభవం చెప్పాలని పెద్దవారు ప్రయత్నించినా వినేవారేరీ. అలాంటి వారికి అంతర్జాలంలోని గ్రూపులు, బ్లాగ్స్ నిజంగా ఒక వరం లాంటిదే. యువతతో పోటీ పడుతూ చాలా మంది సీనియర్స్ తమ అనుభవాలను బ్లాగ్స్‌లో పొందు పరుస్తున్నారు. 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమం కథనాలను, ఆ రోజుల్లో సినిమా నటులు ఎవరెవరు జై ఆంధ్రకు మద్దతు పలికారో సాహిత్య అభిమాని బ్లాగ్‌లో కప్పగంతుల శివరామప్రసాద్ వివరిస్తున్నారు. బులుసు సుబ్రమణ్యం నవ్వితే నవ్వండి అంటూ సరదా కబుర్లు చెబుతున్నారు. తెలుగు గ్రూపులన్నింటిలోనూ సీనియర్ సిటిజన్స్ చాలా మందే కొత్త స్నేహాలతో హడావుడి చేస్తున్నారు. స్నేహం అంటే సమాన వయసు వారి మధ్యనే ఉండాల్సిన అవసరం లేదు. 20- 60 మధ్య సైతం స్నేహం బ్రహ్మాండంగా ఉండగలదని ఈ గ్రూపులను చూస్తే అర్ధమవుతోంది. ఈ ప్రపంచంలో నేను ఒంటరిని కాదు, ఈ విశాల విశ్వంలో నాకోసం ఎక్కడెక్కడో ఎంత మంది ఉన్నారు అనే భరోసా ఇస్తున్నాయి ఈ గ్రూపులు. నీకు తెలిసిన విషయాన్ని నీ మిత్రులకు పంచు, వారు చెప్పిన విషయాలు నువ్వు తెలుసుకో అని చెబుతాయి ఈ గ్రూపులు. ఈ సోషల్ సైట్‌ల వల్ల ఈ కొత్త స్నేహాల వల్ల అన్నీ ప్రయోజనాలేనా? సమస్యలేమీ లేవా? అంటే ప్రయోజనాలు ఎన్నున్నాయో సమస్యలు అంత కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఇల్లాలి ముచ్చట్లు బ్లాగ్స్‌లో ఫేస్‌బుక్ తెస్తున్న సమస్యపై సుధారాణి పోస్ట్‌పై దీనికి సంబంధించి చర్చ జరిగింది.
అమెరికాలో జరిపిన ఒక సర్వేలో విడాకులు తీసుకుంటున్న ప్రతి ఐదుగురు దంపతుల్లో ఒక జంట కేవలం ఫేస్ బుక్ వల్ల విడాకులు తీసుకుంటుందని తేలింది. అంటే ఫేస్ బుక్ ద్వారా వివాహేతర సంబంధాలు ఏర్పాటుచేసుకోవడం వల్ల, లేక ఎక్కువ సమయం ఫేస్‌బుక్‌తో గడుపుతూ ఇంటిని పట్టించుకోకపోవడం వంటి వాటి వల్ల విడాకులు తీసుకుంటున్నారు.
గతంలో కవిత రాసి అచ్చులో చూసుకోవాలంటే తాతలు దిగి వచ్చేవారు. ఇప్పుడలా కాదు ఐదు నిమిషాల్లో బ్లాగ్‌లో కవితను పోస్ట్ చేయవచ్చు చదివిన వారు వెంటనే అభిప్రాయం చెప్పేస్తారు. కవితలు రాసే వారికే ప్రత్యేక గ్రూపు ఉంది. అంటే అక్కడంతా కవి మిత్రులే ఉంటారు. అప్పటికప్పుడే చర్చ జరుపుకోవచ్చు, సూచనలు వినవచ్చు, ఇవ్వవచ్చు. కవిత్వం రాయడం, జ్యోతిష్యం చెప్పడం, క్రికెట్ అదీ ఇదని కాదు కుక్కలు పెంచడం, పిల్లులను ప్రేమించడం, రోడ్లను సర్వే చేయడం, భార్యా బాధితులు, భర్త బాధితులు ఎలాంటి అభిరుచి కలవారైనా వారికి సంబంధించిన గ్రూపుతో కొత్త స్నేహాలు చేసుకునే అవకాశం సోషల్ సైట్‌ల పుణ్యమా అని అందరికీ అందుబాటులోకి వచ్చేసింది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మాజీ సంస్థానాదీశులంతా కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని అప్పుడప్పుడు కలిసి తమ బాధలు, గడిచిపోయిన వైభవాన్ని చెప్పుకునేవారు. కోర్టుల చుట్టూ తిరిగి అలసిపోయిన మాజీ రాజులు కొద్ది కాలానికే ఈ సంఘాన్ని ఎత్తేశారు. అప్పుడంటే సోషల్ సైట్‌లు లేవు కాబట్టి అలా జరిగింది కానీ ఇప్పుడైతే వీరంతా ఒక కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి తమ పాలన గురించి చెప్పుకుంటే చదవడానికి మనకు ఎంత బాగుండేదో.
మా కోడలు రాక్షసి అని అత్తగారు మెల్లగా చెబితే ఇంకా నయం మా కోడలు హింస ముందు మీ కోడలి హింస ఏపాటిది అని చెప్పుకుని మురిసిపోయేవారు ఇప్పుడు ఎవరైనా ఈ మాటలు వింటారేమో అనే భయం అవసరం లేదు. ఒక గ్రూపు ఏర్పాటు చేసుకుని కొత్త స్నేహితులకు మీ కబుర్లు చెప్పేసుకోవచ్చు.
ఆఫీసులో ఎవడితో ఏం మాట్లాడితే ఎవడేం మేసేస్తాడో అని భయపడేవారు పేరు మార్చుకుని కొత్త స్నేహాలతో ఇష్టం వచ్చినట్టు కబుర్లు చెప్పుకోవచ్చు.
కొన్ని సంస్థలు సోషల్ సైట్లపై కొన్ని ఆంక్షలు విధిస్తున్నారు. ఆఫీసు వ్యవహారాలపై బయట ఎలాంటి చర్చ చేయవద్దని పలు కార్పొరేట్ కంపెనీలు ఆంక్షలు విధించాయి. వాటిని పట్టించుకోనందుకు ఉద్యోగాలు తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి,. కొత్త స్నేహాల్లో ఇలాంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకోవాలి.
నా జీవితం తెరిచిన పుస్తకం అని పదే పదే చెప్పే రాజకీయ నాయకులు నిజానికి ఏమీ చెప్పరు అంతా గోప్యంగానే ఉంచుతారు. ఫేస్ బుక్‌లో ఖాతా ప్రారంభించిన ఉత్సాహంతో జీవితం అంటే తెరిచిన పుస్తకం భావించి అజాగ్రత్తగా ఉంటే దెబ్బతింటారు. ఆ మధ్య ఒక పెళ్లి సంబంధం పెళ్లి పీటల వరకు వచ్చి నిలిచిపోయింది. కారణం ఏమంటే అబ్బాయి ఫేస్‌బుక్‌లో తన అభిమాన నటుడు బ్రహ్మానందం అని రాశాడట! సల్మాన్‌ఖాన్, షారుఖ్ ఖాన్ అని రాయాలి లేదా మహేశ్ బాబు అనో జూనియర్ ఎన్టీఆర్ అనో రాసినా సర్దుకుపోయేదాన్ని కానీ బ్రహ్మానందం అని రాశాడు వద్దమ్మా నేనతనితో కాపురం చేయలేను అని అమ్మాయి పెళ్లికి నిరాకరించింది. ఒక మెతుకును చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పేయవచ్చుననే మాట నమ్మి ఫేస్‌బుక్‌ను చూసి మనిషిని అంచనా వేయవచ్చు అనుకుంటే తప్పులు కాలేసినట్టే! ఫేస్‌బుక్‌లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా తనలోని పాజిటివ్ అంశాలనే పేర్కొంటారు. పాతికేళ్లు కాపరం చేసిన తరువాత కూడా తన మొగుడి వ్యవహారాలు భార్యకు తెలియవు. అలాంటిది ఫేస్‌బుక్‌లోని సమాచారాన్ని చూడగానే ఆ వ్యక్తి ఎలాంటి వారో అంచనా వేయగలం అనుకోవడం సరికాదు. ఎవరికి వారు ముందు జాగ్రత్తతో ఉండడం, ఎంత వరకు నమ్మవచ్చునో ఒక అంచనా వేసుకోవడం అవసరం. ఏదైనా అతి పనికి రాదు. ఇంట్లో పక్కనున్న మనిషిని కూడా పట్టించుకోకుండా అంతర్జాలంలో సాలెగూడులో చిక్కుకున్నట్టు చిక్కుకుపోతున్న వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు- ఆమెకు పాటలంటే ప్రాణం అలా పాటలను ప్రేమించే వారి కోసం నెట్‌లో వెతికితే వేలాది మంది సభ్యులున్న డజన్ల కొద్ది గ్రూపులు కనిపించాయి. ఆమె ఆనందానికి అంతు లేకుండా పోయింది. అంతర్జాలం తన పాలిట వరం అనుకుంది. కొత్త స్నేహాలను మంచి కోసం... చెడు కోసం దేనికోసమైనా ఉపయోగించుకోవచ్చు. సోషల్ సైట్లు కొత్త స్నేహాలకు ఉపయోగపడుతున్నాయి. జీవితాలను నాశనం చేయడానికి ఉపయోగపడుతున్నాయి. ఎలా ఉపయోగించుకోవాలో నిర్ణయించుకునే అవకాశం మీ చేతిలోనే ఉంది. *
రెండు కెవ్వుల నెట్ ప్రేమ
దివా: కెవ్వు... విజ్జి మీ అభిమాన హీరో మహేష్ బాబునా? ఇంత వరకు నాకు ఎందుకు చెప్పలేదమ్మా!
విజ్జి: నేను కూడా కెవ్వు అంటే నువ్వు కూడా మహేష్ అభిమానివా దివా!
నాకు మహేష్ అంటే పిచ్చి అభిమానం. ఒక రోజు తిండి తినకుండా ఉండగలను కానీ మహి సినిమా చూడకుండా ఉండలేను. కొంపతీసి నవ్వు ఆ పొట్టి జూనియర్ అభిమానివేమో అనుకున్నాను.
దివా: అలా ఎలా అనుకున్నావు విజ్జి. చిత్రంగా నీకు నీలం రంగు అంటే ఇష్టం నాకు నీలం ఇష్టం. నీకు మహి ఇష్టం నాకూ ఇష్టం. మన అభిరుచులు ఎంత బాగా కలుస్తున్నాయో కదూ!
విజ్జి: ఔను దివా! ఇంతకూ నువ్వు అన్నం తిన్నాక నీళ్లుతాగుతావా? ముందు తాగుతావా?
దివా: అరే చిత్రంగా ఉందే ఇందులోనూ మనం ఒకటే.. మన పరిచయం రెండు రోజులైనా కనీసం ఐదు జన్మల పరిచయం అనిపిస్తోంది విజ్జి
విజ్జి: నాకూ అంతే దివా!మన అభిప్రాయాలు భలే కలుస్తున్నాయి.
నీతో చాటింగ్ చేస్తుంటే ప్రపంచానే్న మరిచిపోతున్నాను.
దివా: ఔను విజ్జి నా పరిస్థితి కూడా అదే మన అభిప్రాయాలు ఇంత బలంగా కలుస్తున్నప్పుడు మనం ఎందుకు కలవకూడదు విజ్జి
విజ్జి: కలవడమే కాదు దివా మనం కలిసి ఉండలేమా?
దివా: నా మనసులోని మాట చెప్పావు విజ్జి. అభిప్రాయాలు కలిసిన వారు జీవితమంతా చిలకా గోరింకల్లా కలిసి ఉండలరని మా బామ్మ చెప్పేది. ఐతే మగాన్ని కాబట్టి ముందు చెప్పడానికి ధైర్యం చేయలేకపోయాను. నీ పేరు తలుచుకుంటే నన్ను నేను మరిచిపోతున్నాను. చాటింగ్ చేస్తే ఆకాశంలో విహరించినట్టుగా ఉంది. ఇక మనం కలుసుకుంటే, కలిసి ఉంటే ఆలోచిస్తేనే మనసు ఎక్కడికో వెళ్లిపోతోంది.
విజ్జి: సరే రేపు కలుద్దాం. ట్యాంక్ బండ్‌పై బుద్దవిగ్రహం వద్ద ఉన్న బెంచ్‌పై ఈ విజ్జి నీకోసం వేయి కళ్లతో రేపు సాయంత్రం ఎదురు చూస్తుంటుంది.
మరుసటి రోజు..
దివాకర్ ముందుగానే వచ్చి బెంచ్‌పై కూర్చోని మక్క జొన్న కంకి తింటూ విజ్జికోసం రెండు కళ్లతో ఎదురు చూస్తున్నాడు. ఏంటో ఈ రోజు వాచి చాలా స్లోగా నడుస్తోంది అనుకున్నాడు. కొద్దిసేపటి తరువాత విజ్జి స్కూటీపై వచ్చింది. ఒకరి నొకరు చూసుకుని కెవ్వు... కెవ్వు... అనుకున్నారు.
ఇది బజ్జుల్లో కనిపించే సంతోషపు కెవ్వు కాదు...
వారిద్దరు భార్యాభర్తలు... ఒకరంటే ఒకరికి క్షణం పడదు. పండగ పూట కూడా పాత మొగుడే అనే సామెతలా పాపం వారిద్దరు పేర్లు మార్చుకుని నెట్ స్నేహం చేసినా ఆ దేవుడు వాళ్లిద్దరినే మళ్లీ కలిపాడు. దాంతో ఒకరిని చూసి ఒకరు కెవ్వు.. కెవ్వు ...మన్నారు.
----
ప్రమదావనం- ప్రమాదవనం
తెలుగులో గ్రూపుల సంఖ్య బాగానే ఉంది. ఫేస్‌బుక్‌లో పాటల రచనలో అభిమానం ఉన్నవారంతా పాటల గ్రూపు ఏర్పాటు చేస్తే గంటల్లోనే వందల మంది సభ్యులయ్యారు. వారంతా తెగ పాటలు రాసేస్తున్నారు. మహిళా బ్లాగర్స్ అంతా ప్రమదావనం పేరుతో ఒకటయ్యారు. ఇది ఆడ బ్లాగర్ల గుంపు. చిన్న చిన్న సమాజ సేవా కార్యక్రమాలు చేయడం, సరదా ఆటపాటలతో తెగ హడావుడి చేస్తారు. ఐనా ఇంటర్‌నెట్ ప్రపంచాన్ని గుప్పిటలోకి తీసుకు వస్తే ఆడ వాళ్లు మగవారిని తమ బ్లాగ్స్ వైపు రానివ్వకుండా ఈ వివక్ష చూపడం ఏమిటనేది కొందరి బాధ.
జ్యోతిష్యం, దైవ చింతన, ఆధ్యాత్మిక అంశాలను చర్చించుకునే గ్రూపు పంచవటి. ప్రమాదవనం అని మరో గ్రూపు ఉంది. వీరి రాతలు చదివితే ఒకవేళ వీరు ఒకరినోకరు ఎదుట పడితే కత్తులతో పొడుచుకుంటారేమో అనిపిస్తుంది. కెలుకుడు బ్లాగర్ల గుంపన్నమాట. ఆసక్తి ఉంటే పరవాలేదు లేకపోతే కెలుకుడు బ్లాగుల్లో వేలుపెట్టకపోవడమే ఉత్తమం.
మీ అభిరుచికి తగిన గ్రూపులో చేరండి. అలాంటి గ్రూపు కనిపించకపోతే మీరే ఒక గ్రూపు ఏర్పాటు చేయండి ఇంకెందుకాలస్యం.
కాలేజీల్లో గతంలో విద్యార్థులను ప్రోత్సహించడానికి కాలేజీ పత్రికలు నడిపేవారు. ఇప్పుడలాంటి వారు కాలేజీ తరుఫున ఒక బ్లాగును ఏర్పాటు చేస్తే విద్యార్థులతో కవితలు, వ్యాసాలు రాయించవచ్చు. తెలుగు భాషను బతికించడానికి మా వంతు కృషి చేశామనే తృప్తి ఉంటుంది. విద్యార్థుల్లో సాహిత్యాభిలాష పెరుగుతుంది.

No comments: