Sep 20, 2011

సమ్మె హోరు

band1హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: సకల జనుల సమ్మె పతాక స్థాయికి చేరుకుంటోంది. తెలంగాణా జిల్లాల్లో ఉద్యమం రోజురోజుకూ మరింత ఉధృతంగా మారుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఉద్యమ తీవ్రత పెరుగుతోంది. సమ్మె తీవ్రత పెరుగుతుండడంతో సాధారణ ప్రజానీకంపై ఆ ప్రభావం ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. నానాటికీ వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, సంఘాలు సమ్మెలోకి వచ్చి చేరుతున్నాయి. ఉద్యోగులంతా విధులకు గైర్హాజరై ర్యాలీలు, ప్రదర్శ నలు, ధర్నాలు, రాస్తారోకోలు వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ నెల 16 నుంచి తెలంగాణా టీచర్లంతా సమ్మెబాట పట్టడంతో ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి.

ఈ పరిస్థితుల ప్రభావంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సైతం చేతులెత్తేశాయి. సకల జనుల సమ్మె నేపథ్యంలో, తెలంగాణాలో నెలకొన్న పరిణామాల మధ్య తాము పాఠశాలలు నడిపే పరిస్థితి లేదని నిర్ధారించుకు న్నాయి. తాము సైతం సకల జనుల సమ్మెలో పాల్గొంటున్నట్లేనని కొన్ని యాజమాన్యాలు స్వయంగా ప్రకటించాయి. మరికొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తమ స్కూళ్లను బంద్‌ పెట్టి విద్యార్థులను ఇంటి వద్ద చదివించాలని తల్లిదండ్రుల సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు పంపిస్తున్నాయి. సోమవారంనాడు తెలంగాణా జిల్లాల్లో ఒక్క టీచర్‌ కూడా బడికి పోలేదని, ఒక్క స్కూల్‌ కూడా తెరుచుకోలేదని టీజేఏసీ నేతలే స్వయంగా ప్రకటించారు.

స్థంభించిన రవాణా.. డిపోలు దాటని ఆర్టీసీ బస్సులు... రహదారుల దిగ్భంధం..
ఇక తాజాగా ఈ నెల 19 (సోమవారం) నుంచి సమ్మె ప్రారంభించిన తెలంగాణా ఆర్టీసీ ఉద్యోగులు పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టేంత వరకు సమ్మెను ఆపేది లేదంటున్నారు. తాడోపేడో తేల్చుకుంటామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. రవాణా శాఖలో ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించినా లెక్కచేసేది లేదని తెగేసి చెబుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు విధులు బిహ ష్కరించి సమ్మెలోకి దిగిన తొలిరోజు తెలం గాణా ప్రాంతంలోని పది జిల్లాల్లో దాదాపు 60 వేల బస్సులు డిపోల నుంచి కదలలేదు.

bandఅంతేగాక ఇదే రోజున టీజేఏసీ తెలంగాణా సరిహద్దు ప్రాంతాలలో జాతీయ రహదారుల దిగ్భంధం కార్యక్రమాన్ని కూడా చేపట్టడంతో ఎక్కడి వాహనా లక్కడే, ఎక్కడి వారక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోమ వారంనాడు తెల్లవారుజాము మొదలుకుని సాయం త్రం చీకటి పడే వరకు రహదారుల దిగ్భంధం కార్య క్రమం కొనసాగింది.

సింగరేణి సమ్మెతో... కరెంట్‌ కోతలు.. ప్రజల వెతలు ...
సింగరేణిలో కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయి ఈ ప్రభావం విద్యుదుత్పత్తిపై పడింది. మన రాష్ర్టంతోపాటు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, పాండిచ్చేరి, కేరళ, కర్నాటక రాష్ట్రాలకు సింగరేణి నుంచి పంపిణీ కావాల్సిన బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో మన రాష్ట్రంతోపాటు ఆయా రాష్ట్రాల్లోనూ విద్యుదుత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. మన రాష్ట్రంలో విద్యుదుత్పత్తి తగ్గిపోతున్న క్రమంలో కరెంటు కోతలు ఇప్పటికే ప్రారంభ మయ్యాయి.

ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలకోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నా సామాన్య ప్రజానీకానికి, రైతన్నలకు కరెంటు కోతలు తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మె ప్రారంభమై ఇప్పటికే వారం రోజులు గడిచిపోయాయి. సింగ రేణిలో ఇప్పటికే ప్రతిరోజు ఉత్పత్తయ్యే 1.58 లక్షల మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచి పోయింది. సకల సమ్మె ఇలాగే కొనసాగితే కరెంటు కోతలు మరింత తీవ్రతరమై.. లాంతర్లు, చమురు దీపాలపై ఆధారపడే రోజు ఎంతో దూరంలో లేదని స్పష్టమవుతోంది.

నేటినుంచి మునిసిపల్‌,... కాంట్రాక్టు ఉద్యోగులు..
ఈ నెల 20 (నేటి) నుంచి మునిసిపల్‌, కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు సైతం సమ్మెకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్ర సచివాలయం తో పాటు వివిధ శాఖాధిపతుల కార్యాలయాల్లో అంతంతమాత్రంగానైనా పనులు, ఫైళ్లు కదిలా యంటే అది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కారణంగానే. కానీ వారు సైతం సకల జనుల సమ్మెలో దిగుతున్నారని తాజాగా ఉద్యోగ టీజేఏసీ నాయకులు ప్రకటించారు. దీంతో సమ్మె మొదలైన నాటి నుంచి మందకొడిగానైనా నడుస్తున్న పాలనపై తీవ్ర ప్రభావం పడుతుందని ఉద్యోగ నేతలు అంచనా వేస్తున్నారు.

అత్యవసర సేవలనూ నిలిపేస్తాం...
తాజాగా రహదారుల దిగ్భంధం కార్యక్రమంపై కొందరు రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారంనాడు ఉద్యోగ టీజేఏసీ నాయకుడు శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు మానుకోకపోతే తెలంగాణా జిల్లాల్లో అత్యవసర సేవలను సైతం నిలిపేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. నిజాం కాలేజి, ఉస్మానియా యూనివర్సి టీలలో జరిగిన సంఘటనలపై ఉద్యోగటీజేఏసీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దమనకాండ ఆపాలన్నారు. పోలీసుల దాడులకు నిరసనగా మంగళవారంనాడు తెలం గాణా జిల్లాల్లో ఊరేగింపులు, ధర్నాలు, రాస్తా రోకోలు చేపడతామని టీజేఏసీ నేతలు ప్రకటిం చారు.

ఆర్‌ అండ్‌ బీలో అస్తవ్యస్తం...
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ప్రధాన కార్యాలయంతో సహా అన్ని అనుబంధ కార్యాలయా ల్లోనూ పరిపాలన పూర్తిగా స్తంభించింది. గత ఏడు రోజులుగా జరుగుతున్న ఉద్యమంలో ఆర్‌ అండ్‌ బీ ఉద్యోగులంతా పూర్తిస్థాయిలో పాల్గొంటున్నారు. దీంతో ఉన్నతాధికారులు సైతం చేసేది ఏమీ లేక కార్యాలయాలకు రావడం తగ్గించారు. దీంతో అసలే అంతంతమాత్రం నిధులతో నత్తనడకన సాగుతున్న ఆర్‌ అండ్‌ బీ విభాగంలో పనులన్నీ పూర్తిగా స్తంభించాయి.

No comments: