Sep 21, 2011

48 గంటలు రైల్ రోకో

24, 25 తేదీల్లో పట్టాలపైకి సకల జనుల సమ్మె
*తెలంగాణ జేఏసీ నిర్ణయం
*అక్టోబర్ మధ్యలో హైదరాబాద్ దిగ్బంధనం
*ఉద్యమం మరింత ఉధృతం చేయాలని తీర్మానం
*సమ్మె చేస్తున్న కార్మికులపై సర్కారు కన్నెర్ర
*1,355 మంది ఆర్‌టీసీ కాంట్రాక్టు కార్మికులపై వేటు
*ఆర్‌టీసీ కాంట్రాక్టు సిబ్బంది విధులకు హాజరైతే పర్మనెంట్ చేస్తామంటూ తాయిలం
*సకల జనుల సమ్మెలోకి మరిన్ని రంగాల కార్మికులు
*నేటి నుంచి విద్యుత్ కార్మికుల ప్రత్యక్ష కార్యాచరణ
*తెలంగాణ దేవాలయాల్లో నేడు, రేపు అర్చకుల సమ్మె
*ప్రొఫెషనల్ కాలేజీలు మరో 4 రోజుల పాటు బంద్
*23 నుంచి జిల్లా స్థాయి రెవెన్యూ అధికారుల సమ్మె
*సమ్మె నేపథ్యంలో రేపటి నుంచే స్కూళ్లకు దసరా సెలవులు!
*తెలంగాణ అంతటా ఉధృతంగా ఆందోళనలు, ధర్నాలు, ర్యాలీలు
న్యూస్‌లైన్ నెట్‌వర్క్: ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా ఎనిమిది రోజులుగా జరుగుతున్న సకల జనుల సమ్మె రోజు రోజుకూ ఉధృతమవుతోంది. సమ్మెలోకి వచ్చి చేరుతున్న ప్రభుత్వ విభాగాలు, ఉద్యోగులు, కార్మికులు, ప్రజా సంఘాల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా.. ఉద్యమాన్ని కూడా తీవ్రతరం చేసే దిశగా తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా ఈ నెల 24, 25 తేదీల్లో తెలంగాణ అంతటా 48 గంటల పాటు రైల్ రోకో చేపట్టాలని నిర్ణయించింది. అలాగే అక్టోబర్ మధ్యలో బాన్సువాడ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ దిగ్బంధనం చేపట్టాలని కూడా ప్రాథమికంగా నిర్ణయించింది. మరోవైపు సమ్మె చేస్తున్న కార్మికులపై ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఉద్యోగ భద్రత లేని ఆర్‌టీసీ కాంట్రాక్టు కార్మికులపై తొలివేటు వేసింది. సమ్మె కాలంలో విధుల్లో పాల్గొనే కాంట్రాక్టు కార్మికులకు రెగ్యులరైజేషన్ తాయిలాలూ ఇవ్వజూపింది. ఈమేరకు వెయ్యి మంది ఆర్‌టీసీ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు వెల్లడించింది.
తెలంగాణలో కొనసాగుతున్న సకల జనుల సమ్మెలో చేరుతున్న ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, అధికారులు, ఇతర ప్రజా సంఘాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, సింగరేణి కార్మికుల సమ్మె ఎనిమిదో రోజుకు చేరుకోగా.. ఆర్‌టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కూడా పూర్తిస్థాయిలో జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని తెలంగాణ ఆర్‌టీసీ జేఏసీ ఉద్ఘాటించింది. తెలంగాణ అంతటా ప్రభుత్వ పాలన, ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోగా.. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు రెండో రోజు కూడా మూతపడ్డాయి. జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులైన ఆర్‌డీఓలు, డీఆర్‌ఓలు, అదనపు జాయింట్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు కూడా 23 నుంచి సమ్మెలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.
ఇంజనీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కాలేజీల బంద్‌ను మరో 4 రోజుల పాటు కొనసాగిస్తామని ఆయా కాలేజీ సంఘాల యాజమాన్యాలు ప్రకటించాయి. తెలంగాణ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్స్ అందరూ బుధవారం నుంచి సమ్మెలో పాల్గొంటున్నట్లు ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్స్ సంఘం ప్రకటించింది. తెలంగాణ జిల్లాల్లోని దేవాలయాల్లో బుధ, గురువారాల్లో అర్చక సేవలు బంద్ చేస్తున్నట్లు తెలంగాణ అర్చక సంఘం ప్రకటించింది. విద్యుత్ కార్మికులు కూడా సమ్మెకు సంఘీభావంగా కార్యాచరణ ప్రకటించారు. తాము బుధవారం నుంచి విద్యుత్ వినియోగ బిల్లులను జారీచేయబోమని, వినియోగదారుల నుంచి బిల్లులు కట్టించుకోబోమని స్పష్టంచేశారు.

సచివాలయం వద్ద మానవహారం

రాష్ట్ర రాజధాని నగరంలో ప్రభుత్వ ఉద్యోగుల హాజరు శాతం అంతో ఇంతో ఉన్నా.. మిగిలిన తెలంగాణ జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ బోసిపోయి, తాళాలు పడి కనిపిస్తున్నాయి. మంగళవారం సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు ఏర్పాటు చేసిన మానవహారం వల్ల ముఖ్యమంత్రి దొడ్డిదారిన తన కార్యాలయంలోకి ప్రవేశించాల్సి వచ్చింది. సకల జనుల సమ్మె వల్ల వారం రోజులుగా వాహన పర్మిట్లు, రిజిస్ట్రేషన్లతోపాటు భూములు, స్థలాలు, భవనాల క్రయవిక్రయ రిజిస్ట్రేషన్లు కూడా ఆగిపోయాయి. రెవెన్యూ అధికారులతో సహా ఈ శాఖ ఉద్యోగులంతా సమ్మెలో ఉన్నందున తెలంగాణలో వచ్చే నెల చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీకి అవరోధం తప్పదని అధికారులు చెప్తున్నారు.

22న ఖమ్మంలో బహిరంగ సభ

ఖమ్మంలో 22న న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బహిరంగసభను విజయవంతం చేయాలని, ఆ సభకు కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్, బీజేపీ నేతలంతా హాజరు కావాలని తెలంగాణ జేఏసీ భేటీలో నిర్ణయించారు. సమ్మె ఉధృతంగా సాగుతున్న ఈ కీలక తరుణంలో రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రుల పాత్ర పెరగాల్సిన అవసరముందని జేఏసీ భావించింది. ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఉద్యమానికి మద్దతు ఇవ్వని ఎమ్మెల్యేలు, మంత్రులను టార్గెట్ చేసుకుని వారి నియోజకవర్గాల్లో ప్రచార సభలు విస్తృతం చేయాలని తీర్మానించింది.
గన్‌పార్కు వద్ద కవిత అరెస్ట్
సకల జనుల సమ్మెలో భాగంగా నాంపల్లిలోని గన్‌పార్కు వద్ద మంగళవారం నిరసన తెలియజేసేందుకు వచ్చిన తెలంగాణ జాగృతి సమితి అధ్యక్షురాలు కవిత, తెలంగాణ రాష్ట్ర లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు మధుసూదన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి గోషామహాల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

జిల్లాల్లో ఉధృతంగా ఆందోళనలు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ జిల్లాల్లో ఉద్యోగులు చైతన్యయాత్రలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకాచౌదరిల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో బస్సు నడిపించిన స్థానికేతర డ్రైవర్లను ఉద్యోగులు చితకబాదారు. సింగరేణి జేఏసీ కన్వీనర్ మాదాసు రాంమూర్తితోపాటు కార్మిక సంఘాల నాయకుల అరెస్టులను నిరసిస్తూ గోదావరిఖని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. సింగరేణి సంస్థ రామగుండం డివిజన్-2 పరిధిలోని ఓసీపీ-3 ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తి చేసేందుకు వేరే ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన ఆపరేటర్లను అడ్డుకొన్న జేఏసీ నాయకులు వారిని వెనక్కి పంపారు. ఖమ్మంలో ఆర్‌టీసీ కార్మికుల సమ్మె విషయమై రెండు యూనియన్ల మధ్య తలెత్తిన ఘర్షణ ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది.
భద్రాచలంలో మైథిలీ కళాశాల విద్యార్థినులు బతుకమ్మలతో నిర్వహించిన భారీ ర్యాలీకి ఎమ్మెల్యే కుంజా సత్యవతి హాజరయ్యారు. వరంగల్ జిల్లా హసన్‌పర్తిలో విజ్ఞాన్ విద్యాసంస్థ కిటికీ అద్దాలు పగులగొట్టారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో సాగర్ రహదారిపై ధర్నాకు దిగినవారిపై పోలీసులు లాఠీచార్జి చేయగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మెదక్ జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఇంటి ముట్టడికి యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రజలను మోసం చేస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు గ్రామాలకు రావద్దంటూ నిజామాబాద్ జిల్లా బర్దిపూర్, పెంటకలాన్, భూలక్ష్మిక్యాంప్, ఏరాజ్‌పల్లి గ్రామస్తులు బ్యానర్లు కట్టారు.

హైదరాబాద్ శివారులో ఆరు బస్సులు ధ్వంసం

సమ్మెకు విరుద్ధంగా నడుస్తున్నాయంటూ ఆరు బస్సులపై తెలంగాణ వాదులు హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం వద్ద ధ్వంసం చేశారు. ఇందులో నాలుగు ప్రైవేటు ట్రావెల్స్ చెందినవి నాలుగు కాగా ఆర్టీసీకి చెందినవి రెండు ఉన్నాయి. బస్సులలో ఉన్న ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు.

1355 మంది కాంట్రాక్టు కార్మికులపై సర్కారు వేటు

తీవ్ర స్థాయిలో సాగుతున్న సకల జనుల సమ్మె మీద సర్కారు తొలి వేటు వేసింది. ఆర్‌టీసీలో రెండు రోజులుగా విధులకు హాజరు కాని 675 మంది కాంట్రాక్టు డ్రైవర్లు, 680 మంది కాంట్రాక్టు కండక్టర్లను (మొత్తం 1355 మందిని) విధుల నుంచి తొలగిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. సమ్మె కాలంలో విధులకు హాజరయ్యే కాంట్రాక్టు కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించింది. సీనియారిటీ ప్రాతిపదికన క్రమబద్ధీకరణకు అర్హులైన 248 మంది కాంట్రాక్టు డ్రైవర్లు, 651 మంది కాంట్రాక్టు కండక్టర్లను విధులకు హాజరైన రోజు నుంచే పర్మినెంట్ ఉద్యోగులుగా పరిగణించనున్నట్లు ఆర్టీసీ ఎండీ ప్రసాదరావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. అలాగే.. అత్యవసరంగా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించాలని ఆర్టీసీ నిర్ణయించింది.

బుధవారం నుంచి రీజనల్ మేనేజర్ల కార్యాలయాల్లో నియామకాల ప్రక్రియ మొదలు పెట్టనుంది. దానితో పాటు.. తెలంగాణ జిల్లాల్లో ఆర్‌టీసీ అద్దె ప్రాతిపదికన నడిపిస్తున్న 1,600 బస్సులను రాజధాని నగరంలో తిప్పాలని భావిస్తోంది. అద్దె సర్వీసులను హైదరాబాద్‌కు తీసుకురావాలని అద్దె బస్సుల యజమానులను యాజమాన్యం ఆదేశించింది. మరోవైపు యాజమాన్యంతో చర్చలను తెలంగాణ కార్మికసంఘాలు బహిష్కరించాయి. ఇదిలావుంటే.. సకల జనుల సమ్మె నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకోవాలని డీజీపీ దినేష్‌రెడ్డిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. తాజా పరిస్థితులపై ఆయన మంగళవారం పోలీసు, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న కేంద్ర బలగాలకు అదనంగా 25 కంపెనీల బలగాలను రప్పించే అంశంపై కూడా చర్చించారు.

22 నుంచి దసరా సెలవులు!

రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 22వ తేదీ నుంచే దసరా సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. షెడ్యూలు ప్రకారం ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల (అక్టోబర్) 9వ తేదీ వరకు దసరా సెలవులు ఇవ్వాలని గతంలో నిర్ణయించారు. అయితే, సకల జనుల సమ్మెలో పాల్గొంటున్న ఉపాధ్యాయులను హెచ్చరించే క్రమంలో భాగంగా దసరా సెలవులను ముందుకు జరిపినట్లు సమాచారం.

No comments: