- రైళ్లు, ఆటోలకు బ్రేక్
- పెట్రోల్ పంపులు మూత
- సెలూన్లు, వైన్ షాపులు కూడా
- సమ్మె విరమించండి : ఆర్టీసి ఎండి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి తెలంగాణ రాజకీయ జెఎసి, ఉద్యోగ సంఘాల జెఎసి చేపట్టిన సకల జనుల సమ్మె మరింత తీవ్రతరమైంది. ఈ నెల 13 నుండి తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యోగులు, 16 నుండి ఉపాధ్యాయులు, 19 నుండి ఆర్టీసి ఉద్యోగులు నిరవధిక సమ్మె ప్రారంభించారు. కాగా శుక్రవారం అర్థరాత్రి నుండి ఆదివారం అర్థరాత్రి వరకు రైళ్లు, ఆటోలు బంద్ కానున్నాయి. శనివారం పెట్రోల్ పంపుల బంద్‌కు నేతలు పిలుపునిచ్చారు. ఆర్టీసి సమ్మె కొనసాగుతున్న సమయంలోనే రైళ్లు, ఆటోలు, పెట్రోల్ పంపుల బంద్ వల్ల రవాణా పూర్తిగా స్తంభించనుంది. ప్రజా జీవనానికి తీవ్ర అంతరాయం కలగనుంది. శనివారం ఉదయం 6 గంటల నుండి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు 48 గంటల పాటు రైల్‌రోకో చేపడుతున్నట్టు తెలంగాణ రాజకీయ జెఎసి ప్రకటించింది. దీంతో రెండు రోజులపాటు తెలంగాణ జిల్లాల నుండి వెళ్లే అన్ని రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రైలు రోకో వల్ల తెలంగాణాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుంది. దీంతో పలు రైళ్లను అధికారులు రద్దు చేయగా కొన్నింటిని దారి మళ్లించారు. మరి కొన్నింటిని పాక్షికంగా నడుపు తున్నారు. మొత్తం 55 ఎక్స్‌ప్రెస్, 88 ప్యాసింజర్ రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. నగరం చుట్టుపక్కలకు
తిరిగే ఎంఎంటిఎస్ రైళ్లను కూడా 24, 25 తేదీల్లో అన్నింటినీ నిలిపేసినట్టు అధికారులు తెలిపారు.
24, 25 తేదీల్లో ప్రయాణానికి ముందుగా రిజర్వేషన్ చేయించుకున్న వారికి టిక్కెట్ డబ్బు మొత్తాన్నీ తిరిగి చెల్లిస్తామని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య పౌర సంబంధాల అధికారి సాంబశివరావు చెప్పారు. డబ్బు చెల్లింపునకు ఏర్పాట్లు చేశామన్నారు. కాగా రైలు రోకో వల్ల దక్షిణ మధ్య రైల్వేకి దాదాపు 60 కోట్లకు పైగా నష్టం వాటిల్లనుందని అధికారులు అంచనా వేశారు. ఇదిలా ఉండగా శుక్రవారం అర్థరాత్రి నుండి 48 గంటల పాటు ఆటోల బంద్‌ను పాటిస్తున్నట్టు తెలంగాణ ఆటో డ్రైవర్ల జెఎసి ప్రకటించింది. రెండు రోజులు జరిగే ఆటోల బంద్‌లో పది లక్షల మంది పాల్గొంటారని తెలిపింది. కేవలం హైదరాబాద్ నగరంలోనే సుమారు లక్ష 20 వేల ఆటోలు బంద్ కానున్నట్టు జెఎసి నేతలు తెలిపారు. తమ ఆందోళనలో భాగంగా పికెటింగ్‌లు, రాస్తారోకోల వంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. శనివారం పెట్రోల్ బంకులను మూసేయాలని తెలంగాణ విద్యార్థి జెఎసి పిలుపునిచ్చింది. పెట్రోలు పంపుల బంద్‌తో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆర్టీసి ఉద్యోగులు సమ్మెను విరమించాలని సంస్థ ఎమ్‌డి ప్రసాదరావు విజ్ఞప్తి చేశారు. సమ్మె వల్ల ఐదు రోజుల్లో సంస్థకు భారీగా నష్టం వాటిల్లిందన్నారు. రోజుకు 8 కోట్ల చొప్పున ఐదు రోజుల్లో 40 కోట్లకుపైగా సంస్థకు నష్టం జరిగిందని తెలిపారు. సంస్థ ఆర్థిక పరిస్థితి, ప్రయాణికుల అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని సమ్మెను విరమించాలని కోరారు. శుక్రవారం తెలంగాణాలో 360 బస్సులను తిప్పినట్లు ఆర్టీసి అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 254, సికింద్రాబాద్‌లో 104, ఖమ్మంలో రెండు బస్సులను నడిపినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సకల జనుల సమ్మెలో భాగంగా తాము సెలూన్లు బంద్ చేస్తున్నట్లు నాయి బ్రాహ్మణ సంఘం తెలిపింది. శని, ఆదివారాల్లో వైన్ షాపులను బంద్ చేయాలని తెలంగాణ జెఎసిలు విజ్ఞప్తి చేశాయి. 



No comments:
Post a Comment