- 2007లోనే ప్రధానికి లేఖ
2జి స్పెక్ట్రమ్ లైసెన్సుల కేటాయింపుల వల్ల భవిష్యత్తులో ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తుతాయని అప్పటి విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రధాని మన్మోహన్‌ను ముందుగానే హెచ్చరించారని తెలిసింది. ఈమేరకు 2007, డిసెంబర్ 26న ఓ 'అతి రహస్య' లేఖను ప్రణబ్ ప్రధానికి రాశారు. 2008, జనవరిలో 2001 సంవత్సరపు ధరకు నూతన టెలికం సంస్థలకు లైసెన్సులు మంజూరు చేయడానికి రెండు వారాల ముందే ఈ లేఖ రాయడం గమనార్హం. నూతన టెలికం లైసెన్సుల అనుమతులు, స్పెక్ట్రమ్ కేటాయింపులలో టెలి కమ్యూనికేషన్ల శాఖ(డాట్) వైఖరి భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతుందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. టెలికం లైసెన్సులు, స్పెక్ట్రమ్ అంశాలలో ప్రభుత్వానికి 'స్పష్టంగా ప్రకటించబడిన విధానం' అత్యవసరంగా ఉండాలని స్పెక్ట్రమ్ సంబంధిత అంశాలపై మంత్రుల బృందానికి నేతృత్వం వహిస్తున్న అప్పటి విదేశాంగ మంత్రి ప్రణబ్ ప్రముఖంగా ప్రస్తావించారు. 2003 నుంచి సెల్యూలర్ మార్కెట్ శాఖోపశాఖలుగా వృద్ధి చెందినప్పటికీ 1999లో రూపొందించిన విధానాన్ని డాట్ 2008లో అనుసరించిందని గుర్తు చేశారు. '(టెలికం) విధానం రూపకల్పన, పునఃపరిశీలన సవరించేందుకు ప్రభుత్వానికి విశిష్టాధికారం ఉన్నప్పటికీ, అవన్నీ పారదర్శక వైఖరితో చేయడం ప్రభుత్వ భాద్యత. అందువల్ల తక్షణమే నూతన విధానం జారీ చేయడం డాట్‌కు అవసరం.
తద్వారా స్పెక్ట్రమ్ కేటాయింపులు పారదర్శక వైఖరితో జరగాలి' అని ప్రధానికి రాసిన లేఖలో ప్రణబ్ అభిప్రాయపడ్డారు. ఆర్‌ర్‌టిఐ కార్యకర్త సుభాష్ చంద్ర అగర్వాల్ సేకరించిన ఈ లేఖ ప్రతి 'ది హిందూ' కు లభ్యమైంది. స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో టెలికం ఆపరేటర్లు దాఖలు చేసిన వివిధ కేసులను ఉదహరిస్తూ..ఈ విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన విధానం, నిబంధనలు లేనట్లయితే ఇబ్బందులు కలుగుతాయని ప్రణబ్ పేర్కొన్నారు.అమలులో ఉన్న విధానం పరిధిలోనే నూతన లైసెన్సులు జారీ చేస్తున్నందున, ఇందుకు సంబంధించిన అర్హతా ప్రమాణాలను బలోపేతం చేయాలని కూడా సూచించారు. 



No comments:
Post a Comment