Sep 24, 2011

'108' సమస్యలపై ముఖ్యమంత్రి దాటవేత !

  • జివికెతోనే చర్చించాలని సూచన
  • 12వ రోజుకు సమ్మె
  • మద్దతుగా నేడు జూలకంటి దీక్ష
అత్యవసర వైద్య సేవలందించే '108' వాహనాల ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న సమ్మె శ-క్రవారం నాటికి 12వ రోజుకు చేరుకుంది. దీర్ఘకాలంగా అనేక సమస్యలు ఎదుర్కొంటూనే విధులు నిర్వహిస్తున్న వీరంతా ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ విజ్ఞప్తులను ఆలకించి పరిష్కారాలు చూపకపోవడం సమ్మెకు దిగారు. దీంతో ఎమర్జెన్సీ సర్వీసులు అందక ప్రజలు విలవిల్లాడుతున్నా సర్కార్‌ నుంచి స్పందన కరువైంది. సమస్యలపై చర్చించేందుకు సిపిఎం శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి ఆధ్వర్యాన శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వద్దకు వెళ్లిన '108' కాంట్రాక్టు ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రతినిధులకు నిరాశే ఎదురైంది. పరిష్కారం కోసం తామేమీ చేయలేమని, వాటి గురించి జివికె సంస్థతోనే చర్చించాలంటూ ముఖ్యమంత్రి దాటవేత వైఖరిని అవలంభించారని యూనియన్‌ నాయకులు చెప్పారు. జీవోనెం.3 ప్రకారం ఉద్యోగులకు కనీస వేతనాలు చెల్లించాలని, విధి నిర్వహణలో ప్రమాదం సంభవిస్తే ఉద్యోగులకు నష్ట పరిహారం చెల్లించాలని యూనియన్‌ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కోరారు. ఇందుకనుగుణంగా జివికె సంస్థను ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విషయాలపై సిఎం చెప్పిన సమాధానం తమకు అసంతృప్తిని కలిగించిందన్నారు.
ఉద్యోగుల, ప్రజల జీవితాలతో
ప్రభుత్వం ఆటలాడుతోంది : జూలకంటి
ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం విలేకరులతో జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ '108' వాహన ఉద్యోగుల, ప్రజల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతోందని తీవ్రంగా విమర్శించారు. ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలేమీ కోరటం లేదన్నారు. వాహనాల నిర్వహణ పేరిట జివికె సంస్థకు నూరు శాతం నిధుల్ని కేటాయిస్తున్న ప్రభుత్వం, ఉద్యోగులకు మాత్రం జీవోనెం.3 ప్రకారం వేతనాలివ్వటానికి నిరాకరిస్తోందని చెప్పారు. సకల జనుల సమ్మె నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆర్టీసి బస్సులు, ఆటోలు నిలిచిపోయాయని, ఇదే సమయంలో '108' వాహనాలు కూడా నిలిచిపోవటంతో ప్రజలు అత్యవసర వైద్య సేవలందక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించి వాహనాలు కదిలే విధంగా చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద దీక్షకు కూర్చుంటానని చెప్పారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని కోరారు. ముఖ్యమంత్రితో జరిగిన చర్చల్లో యూనియన్‌ అధ్యక్షులు ఎండి అబ్బాస్‌, నాయకులు హుస్సేన్‌, రాజు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. అంతకుముందు యూనియన్‌ నాయకులు కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ వై.శ్రీలక్ష్మితో కూడా చర్చలు జరిపారు.
వినూత్న నిరసన
తమ సమస్యల పట్ల స్పందించని ప్రభుత్వ తీరును నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద '108' ఉద్యోగులు ట్రాఫిక్‌లో నిలిచిన కార్లను, మోటారు సైకిళ్లను తుడిచి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ కాంట్రా క్టు, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ కన్వీనర్‌ శరత్‌, 108 కాంట్రాక్టు ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments: