ఆధునిక యుగకర్త గ్రాంథిక భాషను పక్కకి తోసి వ్యవహారిక భాషకి పట్టం కట్టడానికి గిడుగు రామ్మూర్తి పంతులుతో మరికొందరితో కలిసి ఆయన 1910లో వ్యవహారిక భాషోద్యమాన్ని లేవనెత్తారు. పలు ప్రాంతాల్లో చర్చల్లో పాల్గొంటూ వ్యవహారిక భాషను సాహిత్యంలోనే కాక, విశ్వవిద్యాలయాల్లో బోధనా భాషగా తీసుకురావడానికి పెద్ద ఎత్తున కృషి చేశారు. తనకన్నా సంవత్సరం చిన్నయిన గిడుగు రామ్మూర్తి గారికి శాసనభాషను చదవడం నేర్పినవారు గురజాడవారే.
1910 సంవత్సరానికి ఓ ప్రత్యేకత వుంది. వ్యవహారిక భాషోద్యమం తీవ్రస్థాయినందుకున్న సంవత్సరం అది. వందేళ్ళయిందన్నమాట! గురజాడ వేంకట అప్పారావు ఈ ఉద్యమంలో ముఖ్యపాత్ర వహించారు. ఆధునిక సాహిత్యాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభమైన 'ఆంధ్రభారతి' మాసపత్రికలో ఆధునిక కథలు, ఆధునిక గేయాలు విస్తృతంగా రాసిన సంవత్సరం ఇది. తెలుగు వ్యవహార భాషోద్యమం ప్రారంభమై వంద సంవత్సరాలైన సందర్భంలో మనం కొన్ని విషయాల్ని మననం చేసుకోవడం అవసరం.
చనిపోయి బ్రతికే అవకాశం సాహితీవేత్తకు ఉంటుంది. చనిపోయిన తర్వాత ఎంత ఎక్కువకాలం ప్రజల నోళ్ళలో, హృదయాలలో బ్రతికుంటే అంత గొప్ప రచయితగా, గొప్ప రచనగా లెక్క!.''గురజాడ అప్పారావుగారు మరణానంతరం ప్రజల మనస్సులో జీవించడం ప్రారంభించారు'' అన్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి.
ఆధునిక సాహిత్యం ఉన్నంత కాలమే కాదు, ఆధునిక భాషని ప్రజలు మరచిపోలేనంతకాలం ఆయన మన మనస్సులో ఉంటారు. భాషాపరంగా నన్నయ్య మనకి ఎంతటి చిరస్మరణీయులో, గురజాడ వేంకట అప్పారావూ అంతటి చిరస్మరణీయులు! తెలుగులో భాష అసంపూర్ణంగా ఉన్నప్పుడు కొత్త పదాల్ని సృష్టించి మహా భారత రచనకు పూనుకుని ఆదికవి అయ్యాడు నన్నయ్య. ప్రజలు మాట్లాడుకునే భాషలో కాక కేవలం కొందరికే తెలిసిన భాషలో రచనలు సాగుతుంటే... మనం మాట్లాడుకోవడానికి ఒక భాష. గ్రంథ రచనకి వేరే భాషా? మాట్లాడుకునే భాషలో గ్రంథ రచన ఎందుకు సాగించకూడదంటూ అలాంటి భాషకు శ్రీకారం చుట్టి, చుట్టూ వున్న సమాజమే వస్తువుగా, మాట్లాడుకునే భాషే భాషగా ఆధునిక సాహిత్యానికి శ్రీకారం చుట్టి యుగకర్త అయ్యారు.
ఆ రోజుల్లో అక్షరాస్యులు తక్కువ. తను చెప్పదలచుకున్న విషయం, ముఖ్యంగా నిరక్షరాస్యులకు కూడా చెప్పాలనుకున్నారు. సమాజమంతటినీ సంస్కరించాలన్నది ఆయన తపన! అందుకు నాటక రచనే సరైన ఆయుధమని భావించారు గురజాడ. ఎందుకంటే భిన్న ప్రాంతాలలో మనుషులు మధ్యకు వెళ్ళి ఈ నాటకాన్ని ఆడితే, అందరిలో పరివర్తన వస్తుందని భావించారు. ప్రజల మధ్యకు వెళ్ళి, వాళ్ళ సమస్యల్ని వాళ్ళు అర్ధం చేసుకునేట్టు చెప్పాలంటే ఆయా పాత్రల ద్వారా, ఆయా వ్యక్తులు మాట్లాడే భాషనే పలికించాలనే నిర్ణయానికొచ్చారు. వాడుక భాషలో వ్యంగ్యాన్ని పండించగలమనేది కూడా ఆయన భావన. అందుకే వాడుక భాషలో వచ్చిన మొదటి రచనైంది కన్యాశుల్కం.
కేవలం వాడుక భాషలో సామాజిక రుగ్మతల్ని ఎండగట్టాలనే కాదు, అప్పట్లో తెలుగు భాష నాటక రచనకు పనికిరాదనే అపోహ ఉండేది. దానిని పోగొట్టి, తెలుగు భాష నాటక రచనకు బాగా పనికొస్తుందని నిరూపించాలనే తపన 'కన్యాశుల్కం' రాయడం వెనుక వుంది. ఈ విషయాన్ని 'కన్యాశుల్కం' రచన ద్వారా సాధించి చూపించారు. ఈ నాటకం తెలుగు సాహిత్యంలోనే కలికితురాయి. దాదాపు నూట ఇరవై ఏళ్ళు కావస్తున్నా, ఇప్పటి సమాజం కోసమే రాశారా అనిపిస్తుంది. కొద్దో గొప్పో మార్పులతో ఆ సమస్యలు, ఆ పాత్రలు ఇప్పటికీ మన మధ్య ఉండటమే అందుక్కారణం.
కన్యాశుల్కం రెండవ పీఠికలో ''మన కళాశాలల్లో ఇంకా సాహిత్య బోధన లోపభూయిష్టంగా ఉండటం దురదృష్టం. ఇంకా ప్రొఫెసర్లు, విద్యాధికారులు విధి నిర్వహణ నిరతితో, దేశ భాషల పట్ల అభిమానం వహించేంత వరకు ఈ పరిస్థితి బాగుపడుతుందని ఆశించలేం'' అంటూ తెలుగు భాష బోధనా సంస్కరణ సమాజాన్ని ప్రారంభించిన పి.టి. శ్రీనివాస్ అయ్యంగారిని, ఈ సంస్థకి అధ్యక్షులుగా ఉండటానికి అంగీకరించిన జె.ఎ.ఏట్స్ గార్ల అభినందించారు. వాడుక భాషలో వెలువడిన నాటకం నా కన్యాశుల్కమే అనుకుంటాను'' అని కూడా పేర్కొన్నారు. ''మనమెవ్వరం సిగ్గుపడటం లేదు. కానీ మాట్లాడుకునే భాషలో రాయడానికి మనలో కొందరు సిగ్గుపడుతున్నారు'' అని బాధపడ్డారు.
''ఈ కన్యాశుల్కం నాటకాన్ని అచ్చువేయడంలో నేనొక చిక్కుని ఎదుర్కోవలసి వచ్చింది. వ్యవహారిక భాషలో అనేక ఉచ్ఛారణలు తెలుగు వర్ణమాలలో లేవు. తెలుగు శబ్ద శాస్త్రం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి ఉచ్ఛారణలను, దానికి సన్నిహితంగా ఉండే అక్షరాలపై ఒక అడ్డగీత ద్వారా సూచించడంతో నేను తృప్తి పడవలసి వచ్చింది. అనునాసిక తోడుగా అర్ధానుసారం ఉంచాను'' అంటూ పేర్కొన్నారు మొట్టమొదటిగా వ్యవహారిక భాషలో తాను రాయడంలో పడ్డ కష్టనిష్టూరాల్ని మనముందుంచుతూ గురజాడ.
గ్రాంథిక భాషకు వ్యాకరణం వున్నట్లే వ్యవహారిక భాషకు వ్యాకరణాన్ని రాయాలనుకున్నారు గురజాడ. కానీ మన దురదృష్టవశాత్తు అనారోగ్య కారణాన ఆ పని పూర్తి చేయకుండానే వెళ్ళిపోయారు.
కన్యాశుల్కం ముఖచిత్రం మీద గురజాడ వారు 'ఎపిగ్రఫాలజిస్ట్' అని పేర్కొన్నారు. ఆయన శాసన పరిష్కర్త కూడా! 1887లో మొదటి ప్రచురణ జరిగినప్పుడు ఆయన శాసన పరిష్కర్తగానే ఉన్నారు. ఆయన 30వ ఏట... 1898లో కన్యాశుల్కం మొదటి ప్రదర్శన జరిగింది. అప్పటికి ఆయన రాజవారి ఆస్థానంలో శాసన పరిష్కర్తగా పనిచేస్తున్నా అంతకుముందు రాజవారి కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నపుడే ఈ నాటకాన్ని రచించినట్లు అర్ధమవుతోంది.
''ముక్కుపచ్చలారని బాలికల దుస్థితిని, విరుచుకుపడ్డ జీవనభారంతో పుడమికంటా అంటుకొనిపోయిన అనాధలను చూసి వలవలా వాపోయి, మొరకు మానవుల మీద గుడ్లెర్రజేశాడు గురజాడ. ఆ ఎరుపు మంటల్లోనుంచే కన్యాశుల్కం 'ఢాం' అంటూ పేలింది. ఈ దెబ్బ దేశానికే కాకుండా, ఇనుప గొలుసులతో కట్టిన తెలుగు సారస్వతం మీదా పడి, లింకులని వదులు చేసింది. ఒక్కసారి అందరూ ఆ దిక్కుకేసి చూశారు. అప్పారాయ కవీంద్రుని చేతుల్లో ముత్యాల సరాలు తళా తళా మెరిసినవి. ఇవే నవ్యాంధ్ర వాఙ్మయానికి తలకట్టులు, మేల్‌బంతులు, విజ్ఞానకోశాలు... రాజారామ్మోహనరారు, వీరేశలింగం విజ్ఞుడు దిక్కులు పిక్కటిల్లేటట్లు కేక పెట్టి చెప్పిన మహా సందేశం గడుసు అప్పారాయ కవి ఘాటుగా - త్రిసూత్రిలో ముద్రించినారు. మనిషి చేసిన రాయి రప్పకి మహిమ కలదని సాగి మొక్కుతూ మనుషులంటే రాయి రప్పలకంటే కనికష్టం అన్నారు. అప్పారాయ కవీంద్రుడు రససిద్ధుడు. ఏ పాత్రను సృష్టించినా అమరుణ్ణి చేసి వదులుతాడు. ఈయన కలం ఇంద్రజాల పింఛిక. కథను చూపుతుంది కాని చెప్పదు. హాస్యం కోసమని ఎట్టి కృతకమైన రాతా రాయడు. ఒక రచన ముఖ్యంగా సాగుతూ ఉంటే పక్క నుంచి హాస్యం పరిమళిస్తుంది'' అన్నారు ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి రాజమండ్రిలో ఓ సభలో మాట్లాడుతూ.
'కన్యాశుల్కంలోని ప్రతీ వాక్యానికి కొన్నేసి పేజీల వ్యాఖ్యానం చేయగల మనిషిని నేనెరుగుదును. వారు భమిడిపాటి కామేశ్వరరావు. కన్యాశుల్కం పేరు చెవిన పడితే ఆపాదమస్తకం పులకరిస్తుంది'' అన్నారు హాస్యబ్రహ్మ కన్యాశుల్కాన్ని ఎలా అభిమానిస్తున్నారో చెబుతు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు.
'గురజాడను కవిగా గుర్తించలేని 'వెదవాయను' మనిషిగా నేను గుర్తించలేను. మనవాళ్లు ఉత్త వెధవాయలోరు అని గిరీశం చేత ఊరికే అనిపించలేదు గురజాడ' అన్నారు శ్రీశ్రీ.ఇలా గురజాడ గురించి ఎందరో ఎన్నో విధాలుగా కీర్తించారు. గురజాడ ఒంటిచేత్తో తెలుగు సాహిత్యాన్ని ఆధునికత వైపు తిప్పారు. మొదటి ఆధునిక సాంఘిక నాటకం కన్యాశుల్కం అయితే, సరళమైన భాషలో చెప్పిన గేయాలు ముత్యాలసరాలు, అయిదే కథానికలు రాసారు ఆధునిక కథ కథానిక సృష్టికర్త.
చిన్న చిన్న వ్యవహారిక పదాల ద్వారా తన గేయాలలో పెద్ద పెద్ద విషయాన్ని చెప్పిన గురజాడ - మంచి విషయాల్ని ఇతరుల మనస్సులో సూటిగా నాటడానికి భాషా పటాటోపాలు అక్కర్లేదనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఆంగ్ల భాషమీద గురజాడకున్న ప్రవేశంతో - అక్కడి మంచి ధోరణుల్ని తెలుగులోకి తీసుకురావడంలో ప్రధాన పాత్రని పోషించారు. 'షార్ట్ స్టోరి' చాలా క్లుప్తంగా స్పష్టంగా ఉండి - ముగింపుతో పాఠకుణ్ణి ఒక విషయం గురించి లోతుగా ఆలోచించేట్టు చేసేది. అలా తెలుగులోనూ కథను తీర్చిదిద్దాలని 'దిద్దుబాటు' ఆధునిక కథకు రూపమిచ్చారు. ఇది అంతకు ముందు వచ్చిన కథలకు భిన్నంగా, ఉండడమే కాకుండా ముందు ముందు ఇలాంటి ఆధునిక కథలు రావడానికి స్ఫూర్తినిచ్చింది. 1910లో ఈ కథని వాడుక భాషలో తిరగరాయడమే కాక, రాముడి పాత్ర ద్వారా పాత్రోచితమాండలికాన్ని ప్రవేశపెట్టారు.
ఈ స్థాయిని తర్వాతి తరం రచయితలు అందుకోవడానికి దాదాపు ఇరవయ్యేళ్లు పట్టిందంటే గురజాడ ఎంత ముందు చూపుగలవారో అర్థం చేసుకోవచ్చు. ఆధునిక కథని గురజాడ ఎక్కడ విడిచిపెట్టారోఆ స్థాయిని అందుకోడానికి దాదాపు 20 ఏళ్ళు పట్టిందన్నమాట! శ్రీపాద, చింతా, వేలూరి, శ్రీశ్రీ లాంటివారందరూ ముందు గ్రాంథికంలోనే కథనాలని ప్రారంభించి, తరువాత గురజాడ రచనల స్ఫూర్తికి లోనయి వ్యవహారిక భాషలో రాయడం మొదలుపెట్టారు.
ఆధునిక యుగకర్త గ్రాంథిక భాషను పక్కకి తోసి వ్యవహారిక భాషకి పట్టం కట్టడానికి గిడుగు రామ్మూర్తి పంతులుతో మరికొందరితో కలిసి ఆయన 1910లో వ్యవహారిక భాషోద్యమాన్ని లేవనెత్తారు. పలు ప్రాంతాల్లో చర్చల్లో పాల్గొంటూ వ్యవహారిక భాషను సాహిత్యంలోనే కాక, విశ్వవిద్యాలయాల్లో బోధనా భాషగా తీసుకురావడానికి పెద్ద ఎత్తున కృషి చేశారు. తనకన్నా సంవత్సరం చిన్నయిన గిడుగు రామ్మూర్తికి శాసనభాషను చదవడం నేర్పినవారు గురజాడవారే. గ్రాంధిక, వ్యావహారిక భాషా వివాదాన్ని పరిష్కరించడానికి మద్రాస్ విశ్వవిద్యాలయం 1911 సెప్టెంబర్ 8వ తేదీన ఒక సంఘాన్ని నియమించింది. వాళ్ళలో ముగ్గురు గ్రాంథికవాదులు+ నలుగురు వ్యవహారిక వాదులు + ఒక తటస్థవాది (అధ్యక్షుడు). ఈ సంఘం శిష్ట వ్యావహారిక భాషకు అనుకూలంగా తీర్పిచ్చింది. గ్రాంథికవాదులు, వ్యతిరేకించారు. వేదం, కొమర్రాజు, గురజాడలతో ప్రాచీన వర్తమాన రూపాల్ని వింగడించమన్నారు. ఇద్దరూ 2,3 మినహా మిగతావన్నీ ప్రాచీన రూపాలేనన్నారు. గురజాడ తమ అసమ్మతి తెలిపారు.
1910లో వ్యవహార భాషోద్యమం తీవ్రతరమైంది. గురజాడ శాసన పరిష్కర్త, సాహితీవేత్త, భాషా శాస్త్రవేత్త కూడా. గిడుగు రామ్మూర్తిగారితో కలిసి పలు ప్రాంతాలలో చర్చలలో పాల్గొనడం, గ్రాంథిక భాష వాడుక లోపాల్ని చెప్పడంతో బాటు, వ్యవహారిక భాషలో రచనలు చేయడం వల్ల లాభాల్ని వివరిస్తూ, అంతటితో వూరుకోకుండా విశ్వవిద్యాలయాల్లో బోధనా భాషగా వ్యవహారిక భాష ఉండాలని ఉద్యమరీతిలో కృషి చేశారు. గిడుగు 1913లో 'మోమోరాండం ఆఫ్ మోడర్న్ తెలుగు, గురజాడ 1914లో 'మినిట్ ఆఫ్ డిసెంట్' పుస్తకాల్ని ప్రచురించారు. వ్యవహారిక భాషను ప్రామాణిక భాషగా గుర్తించడం వల్ల ప్రాథమిక పాఠశాలల్లోనూ, మాధ్యమిక పాఠశాలల్లోనూ, ఉన్నత పాఠశాలల్లోనూ దీనిని వాడడానికి అనుమతించడం వల్ల కలిగే లాభాలు వివరించడం వీరిద్దరి ప్రధానోద్దేశం.
విద్యార్థులకు నిర్ణయించే పాఠ్యపుస్తకాలు సులువుగా అర్థమయ్యే భాషలో రాసినవే రావాలి కాని, పరిచయం లేని కావ్యశైలిలో రాసినవి కాకూడదు అంటూ 'ది ఇండియన్ ఎడ్యుకేషన్ పాలసీ'లో స్పష్టం చెయ్యడం జరిగింది. దేశంలో వివిధ వర్గాల వారి పిల్లలు, వివిధ మాండలికాలు మాట్లాడుతుంటారు కాబట్టి ఏకరూపత, ప్రామాణిక కొరవడతాయని చెప్పి వాడుక భాషను నిరసించేవాళ్లకు గురజాడ సహేతుకమైన సమాధానాన్నిచ్చారు. ఇంగ్లండులో కూడా క్రింది తరగతుల ప్రజలు తమ తమ మాండలికాల్లో మాట్లాడుకుంటారు. కానీ వాళ్ళందరికీ ప్రామాణిక భాషలో బోధిస్తున్నారు. అలాగే తెలుగులో కూడా ప్రామాణిక భాషను వాడవచ్చన్నారు.
పండితుల నిరంకుశత్వం వల్లనే తెలుగులోకి విజ్ఞానం రాకుండా పోయిందని అన్నారు.తెలుగు బోధన - సామాన్యము, ఐచ్చికము అని రెండు విధాలుగా ఉండాలని, ఐచ్ఛికము కేవలం ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చెయ్యదల్చుకున్న వాళ్ళకి బోధిస్తే చాలని - సామాన్య విద్యార్థులందరికీ మాట్లాడుకునే భాషలో బోధించాలని సూచించారు. విద్యార్థుల వాచక పుస్తకాల్లో శృంగార రస ప్రధానమైన కావ్యాల్ని ఎంపిక చేయడాన్ని విమర్శించారు.
వేదం వేంకటరాయశాస్త్రి, కొమర్రాజు వేంకట లక్ష్మణరావు, ప్రొ. రామానుజాచారి, జి. వెంకట రామారావు, జయంతి రామయ్య, గురజాడలాంటివారు తెలుగు కాంపోజిషన్ కాంట్రవర్సీ సబ్ కమిటీ, ముందు వ్యవహారిక భాషలో విశ్వవిద్యాలయ బోధన జరపడానికి అంగీకరించినా మరికొందరు సభ్యులు చేరిన తరువాత గ్రాంథిక భాషలోనే విద్యాబోధన జరగాలని కమిటీ నిర్ధారించింది. దాంతో విభేదించిన గురజాడ దాదాపు 150 పేజీల 'మినిట్ ఆఫ్ డిసెంట్'ని వ్యవహారిక భాషలోనే విద్యాబోధన ఎందుకు జరగాలో, గ్రాంథిక భాష ఎందుకు కూడదో - సోదాహరణ వివరాలతో రూపొందించారు. ఆ తర్వాత క్రమంగా విశ్యవిద్యాలయాలలో వ్యవహార భాష బోధనా భాష కావడం జరిగింది.
గురజాడవారు రాజావారి ఆస్థానంలో ఉద్యోగరీత్యా ఎప్పుడూ తీరిక లేకుండా వుండేవారు. ఈ కారణం చెప్పి ఆయన తాము చేయాలనుకున్న కార్యక్రమాల్ని వాయిదా వేసుకోలేదు. తమ ఉద్యోగ ధర్మాల్ని ఉన్నత స్థాయిలో నిర్వర్తిస్తూనే ఒంటిచేత్తో తెలుగు సాహిత్యాన్ని ఆధునికత వైపు మళ్ళించారు.
అలాగే ఆరోగ్యం బాగోకపోయినా 52 సంవత్సరాల లోపలే ఇన్ని కార్యక్రమాల్ని నిర్వహించారు. సంకల్పబలం ఉంటే తీరిక లేకపోయినా, ఆరోగ్యం బాగుండకపోయినా గొప్ప గొప్ప పనుల్ని ఒంటరిగా, అవలీలగా నిర్వహించవచ్చని నిరూపించారు గురజాడ వేంకట అప్పారావు.
(2011 సెప్టెంబర్ 15, గురజాడ 150వ జన్మదినోత్సవం)



No comments:
Post a Comment