Sep 27, 2011

30న హైదరాబాద్‌ బంద్‌ !

  • 28న రాస్తారోకోలు : కోదండరామ్‌
  • 29న తెలంగాణ మంత్రుల ఇళ్లు ముట్టడి : కెసిఆర్‌
  • 9 నుండి 11 వరకు మళ్లీ రైల్‌రోకో
  • నగరంలో బస్సులను అడ్డుకుంటాం


తెలంగాణ ప్రాంత మంత్రుల ఇళ్లను 29న ముట్టడించాలని తెలంగాణ రాజకీయ జెఎసి నిర్ణయించింది. దీంతోపాటు 28న రాస్తారోకోలు, 30న హైదరాబాద్‌ బంద్‌ చేయనున్నట్టు ప్రకటించింది. సోమవారం జరిగిన తెలంగాణ రాజకీయ జెఎసి స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో టిఆర్‌ఎస్‌, బిజెపి, సిపిఐఎంఎల్‌ (న్యూడె మోక్రసీ)నేతలతోపాటు, జెఎసి చైర్మన్‌ కోదండరాం, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం టిఆర్‌ఎస్‌ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. సకల జనుల సమ్మె వల్లనే రైతులకు, ప్రజలకు విద్యుత్‌ కష్టాలు వచ్చాయని అబద్ధాలు చెబుతున్నారన్నారు. ముఖ్యమంత్రి ఇంత మాట్లాడుతున్నా ఏమీ మాట్లాడకుండా ఉన్న తెలంగాణ ప్రాంత మంత్రుల ఇళ్ళను 29న ముట్టడిస్తామన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామాలు చేసి ఆమోదింపచేసుకోవాలని డిమాండ్‌ చేశారు. మంత్రులు రాజీనామాలు చేసి ముఖ్యమంత్రిని గద్దె దించాలన్నారు. ప్రభుత్వం కరెంటు కోతలు విధించాల్సి వస్తే ముందుగా గృహావసరాలకు, తరువాత పరిశ్రమలకు కట్‌ చేయాలన్నారు. అలా కాకుండా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా రైతులకు కరెంటు కోతలు విధించి సమ్మె చేస్తున్న వారిపై రైతులకు వ్యతిరేకత వచ్చేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇటువంటి ప్రకటనలను ముఖ్యమంత్రి మానుకోవాలని, వెంటనే రైతులకు కోతలు లేకుండా విద్యుత్‌ను సరఫరా చేయాలన్నారు. జెఎసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ మాట్లాడుతూ సకల జనుల సమ్మెను ఉధృతం చేస్తూ కార్యాచరణను నిర్ణయించినట్టు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆర్టీసి కార్మికులు భారీ ర్యాలీ చేయనున్నట్టు చెప్పారు. 28న హైదరాబాద్‌తోపాటు, తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకోలు జరుగుతాయన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ మంత్రులు రాజీనామా చేయాలంటూ 29న వారి ఇళ్ళను ముట్టడిస్తామన్నారు. 30 హైదరాబాద్‌ బంద్‌ నిర్వహిస్తామన్నారు. అక్టోబర్‌ 1న తెలంగాణ వ్యాప్తంగా భారీ కాగడాల ప్రదర్శన చేయాలని నిర్ణయించామన్నారు. 2న టోల్‌గేట్‌ రుసుం చెల్లించకుండా నిరసన తెలుపుతామన్నారు. 4 వ తేదీన బతుకమ్మ పండుగను జై తెలంగాణ అంటూ జరుపుకోవాలని నిర్ణయించామన్నారు. దసరా రోజు జమ్మిచెట్టు దగ్గర కూడా జై తెలంగాణ అంటూ పండుగ చేసుకోనున్నట్టు తెలిపారు. వచ్చే నెల 9, 10, 11 తేదీల్లో మరోసారి రైల్‌రోకో చేపట్టాలని నిర్ణయించామన్నారు. మంగళవారం నుండి హైదరాబాద్‌లో తిరిగే సీమాంధ్ర బస్సులను అడ్డుకుంటామని తెలిపారు. ఆ బస్సులను ఉపసంహరించుకోవాలని, ఒకవేళ అలా చేయకపోతే జరిగే పరిణామాలకు బాధ్యత తమది కాదని కోదండరాం అన్నారు. విద్యుత్‌ సౌధ దగ్గర మంత్రుల అరెస్ట్‌ను వారు తీవ్రంగా ఖండించారు. తన కెబినేట్‌ మంత్రినే అరెస్ట్‌ చేయించి కిరణ్‌కుమార్‌ సీమాంధ్రకే ముఖ్యమంత్రి అని నిరూపించుకున్నారని విమర్శించారు. హజ్‌కు వెళ్లే యాత్రికులకు జెఎసి శు భాకాంక్షలు తెలుపుతోందని, వారు అక్కడికి వెళ్లి తెలంగాణ రాష్ట్రం త్వరగా రావాలని అల్లాను ప్రార్ధించాలని కోరారు. సమావేశంలో బిజెపి సీనియర్‌ నేత సిహెచ్‌ విద్యాసాగరరావు, సిపిఐఎంఎల్‌(న్యూడెమోక్రసీ) నేత సూర్యం, ఉద్యోగ సంఘాల జెఏసి చైర్మన్‌ స్వామిగౌడ్‌, నేతలు దేవిప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌, విఠల్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments: