వినాయక చవితి పండగని దళితులు జరుపుకోవడానికి వీల్లేదట! అందరిలాగానే
తాము కూడా వినాయక చవితి విగ్రహం పెట్టుకుని పూజలు, పునస్కారాలు చేయడానికి
వీల్లేదని మెదక్ జిల్లాలోని చిన్నశంకరం పేట మండలం, గజగట్ల పల్లి గ్రామ
పెద్దలు చెబుతున్నారు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు ఆగ్రహించి
దళితులకు పాలు అందకుండా చేశారు గ్రామ పెద్దలు. 64 స్వాతంత్ర్య పాలన
దళితులకు ఒరగబెట్టినదేమిటో, అగ్రవర్ణాలకు నేర్పిన సంస్కారం ఏమిటో ఈ సంఘటన
తెలియజేస్తున్నది. ఈ వార్తను ఆంధ్రజ్యోతి పత్రిక సోమవారం రిఫోర్టు చేసింది.
దళితులు వినాయక విగ్రహం ఏర్పాటు చేసుకుంటున్నారని తెలుసుకున్న
గ్రామస్ధులు వీల్లేదన్నారు. ఇంకా ఘోరం ఏమిటంటే ఆ ఊళ్ళొ దళితులకు దేవాలయ
ప్రవేశం నిషేధం అని గ్రామస్ధుల మాటల్లోనే తెలుస్తోంది. “ఈ రోజు వినాయకుడిని
ఏర్పాటు చేస్తారు. రేపు గుళ్ళోకే వస్తామంటారు, మీకు మాకూ తేడా ఏంటి?” అంటూ
గ్రామస్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే గజగట్లపల్లి గ్రామంలో దళితులకు
ఆలయ ప్రవేశం నిషేధం అన్నమాట! గుడికి ఎలాగూ రానీయనందున తమ వాడలోనే గుడి
ఏర్పాటు చేసుకున్నా, అది కూడా అగ్రవర్ణాలకు కంటగింపుగా ఉండడం దారుణమైన
విషయం. ఈ పరిణామంతో స్ధానిక దళిత సంఘం ఆధ్వర్యంలో దళితులు చిన్నశంకరం పేట
తహశీల్దారుకీ, పోలీసులకీ ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వారిరువురినుండీ
స్పందన రాలేదు.ఫలితంగా దళితులు నిస్సహాయులుగా మిగిలిపోయారు. దళిత సంఘం తరపున మండల కేంద్రంలోనే దళితులు గత శుక్రవారం తమపై అగ్రవర్ణాల జులుంకు వ్యతిరేకంగా రాస్తోరోకో నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ వివాదం కొనసాగుతుండగానే గ్రామంలోని బిసి కులాలు దళితులకి పాలు పోయడం మానుకున్నారు. దళితులకు పాలు పోస్తే ఆరువేలు జరిమానా విధిస్తామనీ, కుల బహిష్కరణ కూడా చేస్తామనీ బెదిరించడంతో వారు దళితులకు పాలు అమ్మడం మానుకున్నారు. కులవివక్ష ఘటన తెలిసిన వెంటనే స్పందించాల్సిన తహశీల్దారు, పోలీసులు కూడా అగ్రవర్ణాలవారైనపుడు వారినుండి స్పందన ఆశించలేము. పత్రికలకెక్కి ప్రభుత్వాలు సీరియస్ విషయంగా తీసుకునెవరకూ గజగట్లపల్లి దళితులకు బహిష్కరణ తప్పదు.
గజగట్ల పల్లి ఘటన దళితులు, దళిత సంఘం ఆధ్వర్యంలో బైటికి
వచ్చి రాస్తారోకో తలపెట్టడం వల్లనే ఈ ఘటన లోకానికి తెలిసింది. దళిత సంఘమో,
మరొక సంఘమో ఉంటాయని తెలియని గ్రామాలు దేశంలో కోకొల్లలు. అటువంటి గ్రామాల్లో
ఉన్న కుల కట్టుబాట్లను దళితులు ఉల్లంఘించి వివాదం రగులుకుంటే తప్ప
కులపరమైన అణచివేత వెలుగు చూడని పరిస్ధితి నెలకోని ఉంది. గజగట్ల పల్లి వారు
నిరసించినందున అక్కడ తప్ప మిగతా గ్రామాల్లో వివక్ష లేదు అని భావించడానికి
వీల్లేదు. దళితులు తమ హక్కులను గుర్తించి వాటికోసం లేచి నిలబడినప్పుడల్లా
అగ్రవర్ణాలు వారిపై ఏదో ఒక అఘాయిత్యానికి పాల్పడుతున్నారు.




No comments:
Post a Comment