Oct 11, 2011

రజనీ చిత్రాలను రీమేక్‌ చేయలేం : షారూక్‌ఖాన్‌

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తనకంటూ ఒక ఇమేజ్‌ సృష్టించుకున్నారని, ఆయన చిత్రాలను రీమేక్‌ చేయడం సాధ్యం కాదని బాలీవుడ్‌ నటుడు షారూక్‌ఖాన్‌ అంటున్నారు. ఈరోస్‌ ఇంటర్‌నేషనల్‌ మరియు రెడ్‌ ఛిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అనుభవ్‌ సిన్హా దర్శకత్వంలో షారూక్‌ఖాన్‌, కరీనాకపూర్‌ జంటగా రూపొందించిన చిత్రం 'రా.వన్‌'. తమిళ, తెలుగు, హిందీ భాషలలో ఈనెల 26న దీపావళి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్ర తమిళ ఆడియోను సోమవారం చెన్నరు సత్యం ధియేటర్‌ జరిగిన కార్యక్రమంలో నటుడు షారూక్‌ఖాన్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మణిరత్నం, నటి సుహాసిని మణిరత్నం, రజినీకాంత్‌ కుమార్తె సౌందర్య రజినీకాంత్‌, అభిరామి ధియేటర్స్‌ అధినేత అభిరామి రామనాథన్‌ పాల్గొన్నారు. ఈ సంధర్బంగా చిత్రంలోని ఒక పాట చరణానికి స్టెప్పులేసిన షారూక్‌ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
కమల్‌, రజనీ, మణిరత్నంతో పనిచేయడం అదృష్టం....
తాను దక్షణాదిన పరిచయం కావడానికి ముఖ్యకారణం దర్శకుడు మణిరత్నం. ఆయన నిర్మించిన చిత్రాలు దక్షణాదినే కాక దేశమంతటా మంచి విజయాన్ని అందుకున్నాయి. కమల్‌హాసన్‌, రజినీకాంత్‌లతో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. కమల్‌తో 'హేరామ్‌' చిత్రంలో పనిచేశాను. నటన పరంగా ఆయనను నుంచి ఎంతో నేర్చుకున్నా. రజినీకాంత్‌ మానవతావాది. వ్యక్తిగతంగా కూడా ఆయనంటే ఎంతో గౌరవం. వీరిద్దరి నుండి ఎన్నో విషయాలను నేర్చుకున్నా. తమిళ సినీ రంగంలో ఎంతోమంది నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు వున్నారు. వీరు అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతి పొందారు. విదేశీ పర్యటనలో కూడా ఈ విషయాన్ని చెబుతా.
రజినీ పాత్ర గురించి...
అది ఇప్పుడే చెబితే సస్పెన్స్‌ పోతుంది. రా.వన్‌ చిత్రంలో రజినీకాంత్‌ నటించారు. షూటింగ్‌ సమయంలో ఎంతో ఉల్లాసంగా కన్పించారు. కొన్ని సాంకేతిక పరమైన అంశాలు వుండటంతో ట్రైలర్‌లో ఆయనను చూపించలేకపోయాం. తన పిల్లలు సైతం ఎంతో ఇష్టంగా 'చిట్టీ...చిట్టీ(రోబోలో రజినీ పోషించిన పాత్ర పేరు) అని పిలుస్తున్నారు. చెన్నరులో ఇప్పటివరకూ ఆయన్ని కలువలేదు. తప్పకుండా కలిసి ఆశీస్సులు తీసుకుంటా.
రొమాంటిక్‌ నుంచి యాక్షన్‌ వైపు...
నిజమే...నా చిత్రాలన్నీ రొమాంటిక్‌ తరహాలోనే రూపొందాయి. కానీ ఇందులో కాస్త రొమాంటిక్‌ టచ్‌తో కూడుకున్న యాక్షన్‌ పాత్ర. ఇందులో రెండు రకాల పాత్రలు చేశాను. ఒకటి యాక్షన్‌ పాత్ర కాగా మరొకటి శేఖరన్‌ సుబ్రమణియన్‌ పేరుతో అమాయకపు నాన్న. పిల్లలు ఎప్పుడూ తన తండ్రిని అమాయకంగా వుండాలని కోరుకోరు. నాన్నలోని ధైర్యాన్ని చూడాలని పిల్లలు కోరుకుంటారు. ఈ తరహా సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. మా పిల్లలు కూడా ఈ పాత్రల్ని ఇష్టపడ్డారు. చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నాం. ప్రపంచవ్యాప్తంగా 3,200 ప్రింట్లు సిద్దం కాగా ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.

No comments: