Oct 16, 2011

ఆట, పాటల మధ్య ‘ఓ మై ఫ్రెండ్’ ఆడియో

సిద్దార్థ్, శ్రుతిహాసన్, హన్సిక, నవదీప్ కాంబినేషన్‌లో వేణుశ్రీరామ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘దిల్’రాజు నిర్మించిన ‘ఓ మై ఫ్రెండ్’ ఆడియో ఆవిష్కరణ శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ సంస్థ ద్వారా పరిచయమైన దర్శకులు ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ -‘‘ప్రేమదేశం టైమ్‌లో నేను యూత్. నేను, శిరీష్, లక్ష్మణ్ కలిసి ఆ సినిమాకెళ్లాం. స్టన్ అయిపోయాను. స్టార్స్ లేకుండా థియేటర్లో డాన్స్ వేయించిన సినిమా అది. దాన్నెంత పెద్ద హిట్ చేశారో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరంలేదు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ‘హ్యాపీడేస్’ అనే సినిమా వచ్చింది. దానికీ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మళ్లీ నాలుగేళ్ల తర్వాత వస్తున్న సినిమా ‘ఓ మై ఫ్రెండ్’. ఇది కూడా అలా యూత్‌ని ఉర్రూతలూగిస్తుందని నా నమ్మకం. ప్రతి ఒక్కడికి ఒక ఫ్రెండ్ ఉంటాడు. కానీ సొసైటీలో ఫ్రెండ్‌షిప్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువైపోయాయి.


వీడితో స్నేహం చేస్తే ఏంటి లాభం? అని ఆలోచిస్తున్నారు. అసలు కల్మషం లేని స్నేహం అంటే ఏంటి? అనే ప్రశ్నకు సమాధానమే మా ‘ఓ మై ఫ్రెండ్’. మా సంస్థలో ‘బొమ్మరిల్లు’ అంత హిట్ అవుతుందని నమ్మకం’’ అని చెప్పారు. సిద్దార్ధ్ మాట్లాడుతూ -‘‘ధైర్యం, నమ్మకం, డబ్బు మూడింటినీ వెచ్చించి ‘దిల్’రాజు ఈ సినిమా తీశారు. ఆయన నాపై పెట్టిన నమ్మకాన్ని ఈ సినిమా తప్పక నిజం చేస్తుంది. శ్రుతి, హన్సిక, నవదీప్ వంటి వండర్‌ఫుల్ కోస్టార్స్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది. రాహుల్‌రాజ్ క్యూట్ కంపోజర్. ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు’’ అన్నారు. రాహుల్‌రాజ్ మాట్లాడుతూ -‘‘సంగీతం అనేది నా రక్తంలో, హృదయంలో ఉంది. తెలుగులో నాకిది మొదటి సినిమా. నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. ఇందులో సిద్దార్ధ్ రెండు పాటలు పాడారు. అవి రేపు యువతరాన్ని ఉర్రూతలూగిస్తాయి’’ అన్నారు.


‘‘ఈ సినిమా నాకొక వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. సిద్దార్థ్, నవదీప్, హన్సిక వీళ్లందరితో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా నా పాత్ర చాలా కొత్తగా ఉంది’’ అని శ్రుతిహాసన్ చెప్పారు. హన్సిక మాట్లాడుతూ- ‘‘నేను ఎంతో ఎంజాయ్ చేసి, చేసిన సినిమా ఇది. సిద్దార్థ్, శ్రుతిలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ‘దిల్’ రాజుగారుని ఇకనుంచి లక్కీ రాజుగారు అనాలి. డెరైక్టర్ వేణుశ్రీరామ్ ఈ సినిమాని గొప్పగా తీశారు’’ అన్నారు. వేణుశ్రీరామ్ మాట్లాడుతూ -‘‘ఈ బేనర్‌లో అసిస్టెంట్ డెరైక్టర్‌గా, అసోసియేట్ డెరైక్టర్‌గా పని చేశాను. ఇప్పుడు డెరైక్టర్‌గా చేశాను. నా కోరికని ఫుల్‌ఫిల్ చేశారు రాజుగారు. ఈ సినిమా సాధించబోయే సక్సెస్ క్రెడిట్ మొత్తం రాజుగారిదే. టెక్నీషియన్లందరూ మనసు పెట్టి పని చేశారు. అందరూ నాకు మంచి ఫెండ్స్. ఈ సినిమాలో స్పెషల్ విషయం ఉంది. అది రేపు మీరు స్క్రీన్ మీద చూస్తారు’’ అని చెప్పారు.

No comments: