Sep 22, 2011

రూపాయికే కిలో బియ్యం

  • నవంబర్‌ 1 నుంచి అమల్లోకి
  • రైతు మహిళా సదస్సులో కొత్త పథకాలు
ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం కానుకలుగా ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పథకాలు ప్రకటించారు. నవంబర్‌ ఒకటి నుంచి రేషన్‌ బియ్యం కిలో రూపాయికే ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ పథకంతో రాష్ట్రంలోని 2 కోట్ల 25 లక్షల పేద కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. అలాగే కుల, ఆదాయ తదితర 25 రకాల సర్టిఫికెట్లను ఇ-సేవా కేంద్రాల్లో ఉచితంగా పొందేలా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. బుధవారం తిరుపతిలోని తారకరామ స్టేడియంలో రైతు మహిళా సదస్సు ఆర్భాటంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా వచ్చిన మహిళలను, రైతులనుద్దేశించి కిరణ్‌కుమార్‌ ఉత్సాహంగా ప్రసంగించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రైతు మహిళా సదస్సుల్లో కోటీ 20 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరేలా మూడువేల కోట్ల రూపాయలను రుణాలుగా పంపిణీ చేసినట్లు తెలిపారు. తహశీల్దార్‌ కార్యాలయాల్లో ఏదైనా సర్టిఫికెట్‌ పొందాలంటే లంచం అడుగుతున్నారని ఎక్కువగా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఇ-సేవా కేంద్రాల ద్వారా 25 సర్టిఫికెట్లను ఉచితంగా పది నిమిషాల్లోనే పొందేలా నవంబర్‌ ఒకటి నుంచి అమల్లోకి తేనున్నట్లు చెప్పారు.
2004కు ముందున్న ప్రభుత్వం డ్వాక్రా సంఘాలను కేవలం సభలు, సమావేశాలకే పరిమితం చేసిందని, తమ హయాంలో మాత్రం ఆర్థిక పరిపుష్టికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను చీఫ్‌విప్‌గా ఉండి పావలా వడ్డీపై సూచనలు చేసి అమలు చేసేలా ప్రయత్నించానని అన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు కలిపి మహిళలకు రూ.22 వేల కోట్లు బ్యాంకుల ద్వారా ఇస్తే, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే రూ.9 వేల కోట్లు ఇచ్చామనీ, ఆరు నెలలకు ఒకసారి మహిళా గ్రూపులకు పొదుపు వడ్డీ జమ అయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. మిల్క్‌మిషన్‌ పథకం కింద పాడిపరిశ్రమ అభివృద్ధికి రాష్ట్రంలో రూ.ఆరువేల కోట్లతో గేదెలను సబ్సిడీ ద్వారా ఇవ్వనున్నట్లు చెప్పారు.
ఈ సభలో కూడా మూడేళ్లలో 15 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఈ ఏడాది డిసెంబర్‌కల్లా లక్ష మందికి నియామక పత్రాలు ప్రధానమంత్రి చేతుల మీదుగా అందిస్తామని పునరుద్ఘాటించారు. అక్టోబర్‌ రెండో తేదీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌ ఆధ్వర్యంలో పది లక్షల మంది ఎస్‌సి, ఎస్‌టిలకు బోర్‌ డ్రిప్‌ ఇరిగేషన్‌ కింద మైక్రో ఇరిగేషన్‌ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. రచ్చబండలో వచ్చిన అర్జీలను పరిశీలించి 24 లక్షల రేషన్‌కార్డులను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బహిరంగ సభలో కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, రాష్ట్ర మంత్రులు రఘువీరారెడ్డి, గల్లా అరుణకుమారి, ఎంపి చింతామోహన్‌, ఎంఎల్‌ఏలు చిరంజీవి, గుమ్మడి కుతూహలమ్మ, షాజహాన్‌బాషా, సికె బాబు, ఎంఎల్‌సిలు రెడ్డెప్పరెడ్డి, జయచంద్రా నాయుడు, యండపల్లి శ్రీనివాసులురెడ్డి, టిటిడి ఛైర్మన్‌ కనుమూరి బాపిరాజు పాల్గొన్నారు.
ఉత్సాహంగా సిఎం
నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత సొంత జిల్లాలో ఐక్యంగా జరిగిన కార్యక్రమం మహిళా రైతు సదస్సే.. గతంలో ముఖ్యమంత్రి వచ్చిన ప్రతిసారీ ఎమ్మెల్యేలంతా ఎడమొహం పెడమొహంగా ఉండేవారు. ముఖ్యమంత్రి అంటే లెక్క లేకుండా, పత్రికల్లో బహిరంగంగానే విమర్శలు చేసేవారు. జగన్‌పై సిబిఐ దర్యాప్తు, గాలి జనార్ధన్‌రెడ్డి అరెస్టు నేపథ్యంలో గతంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గ్రూపుగా ముద్ర వేసుకున్న ఎమ్మెల్యేలు సైతం స్వాగతం పలకడంతో ముఖ్యమంత్రి ఉత్సాహంగా కనిపించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జిల్లాకు వచ్చిన ప్రతిసారీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గ్రూపు దూరంగానే ఉన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్‌బాషా, జిడి నెల్లూరు ఎమ్మెల్యే కుతూహలమ్మ ముఖ్యమంత్రిపై ఎదురుదాడి చేసేవారు. జగన్‌ దీక్షల సందర్భంగా కూడా షాజహాన్‌ బాషా వెళ్లి సంఘీభావం ప్రకటించారు. పెద్దిరెడ్డి మినహా అందరూ ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.

No comments: