చింటు,
బంటు మంచి స్నేహితులు. చిన్నప్పటి నుండి ఒకే స్కూలులో కలిసి చదువుతూ
ఉండటంతో స్కూలు మొత్తం వీళ్ళ స్నేహం గురించి తెలుసు. టీచర్లంతా వీరి
స్నేహాన్ని చూసి ఎంతో ముచ్చటపడేవారు. చదువు నుంచి ఆటపాటల దాకా అన్నింటిలో
ఎంతో పోటాపోటీగా ఉండేవారు. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆటపాటల్లో ఎవరు
దేనిలో ప్రథములో చెప్పగలిగేవారే కానీ, చదువులో మాత్రం వారిరువురిలో ఎవరు
తెలివిగలవారో తేల్చి చెప్పటం ఎవరికీ సాధ్యం కాలేదు. ఏ పరీక్షలు జరిగినా ఒకే
శాతం మార్కులు తెచ్చుకునేవారు. అనారోగ్యకారణాల రీత్యా స్కూలుకు
రానిపక్షంలో మాత్రమే మార్కులలో ఎక్కువ తక్కువలు ఉండేవి. ఇదిలావుండగా ఆ
స్కూలుకు కొత్త తెలుగు మాస్టారు వచ్చారు. ఒకరోజు స్టాఫ్‌రూంలో ఉండగా మాటల
సందర్భంలో చింటు, బంటు విషయం తెలుసుకొన్నారు తెలుగు మాస్టారు. వారిద్దరిలో
ఎవరు తెలివైనవారో ఒక పరీక్ష ద్వారా తాను నిరూపిస్తానని అనటంతో మిగిలిన
టీచర్లంతా ఆయన మాటలకు నవ్వుకున్నారు. 'ఇన్ని పరీక్షల ద్వారా కూడా తాము
నిర్ణయించలేకపోయిన దాన్ని ఈయన ఒకే ఒక పరీక్షతో ఎలా తేల్చగలరు? అయినా
చూద్దాం..' అని అంతా ఆసక్తిగా ఎదురు చూడసాగారు.
ఇంతలో
పరీక్షరోజు రానే వచ్చింది. ఎప్పటిలాగే చింటు, బంటు ఎంతో పోటీగా పరీక్ష
రాశారు. మర్నాడు తెలుగు మాస్టారు చింటూను తెలివైనవాడిగా ప్రకటించారు. కానీ
మార్కులు చూసిన టీచర్లంతా తెల్లబోయారు. కారణం చింటూ కంటే ఎక్కువ మార్కులు
బంటూ సాధించటం. కానీ తెలుగుమాస్టారు చింటూను తెలివైనవాడిగా ఎందుకు
నిలబెట్టారో ఎవరికీ అంతుచిక్కలేదు. అది గమనించిన తెలుగుమాస్టారు తన
ప్రశ్నాపత్రం, వారి సమాధానపత్రాలను టీచర్ల చేతికి ఇచ్చారు. అవి పరిశీలించిన
టీచర్లకు ఆశ్చర్యంతో పాటు సమాధానం కూడా దొరికింది. విషయం ఏమిటంటే ఆ
ప్రశ్నాపత్రంలో ఉన్నవి రెండే ప్రశ్నలు. ఒకటి వారి పాఠ్యాంశాలకు సంబంధించిన
ప్రశ్న. రెండవది సామాజిక స్పృహకు సంబంధించి అభిప్రాయాలను
వ్యక్తీకరించవలసిందిగా అడిగిన ప్రశ్న. ఆ రెండింటిలో ఏదో ఒక ప్రశ్నకు
మాత్రమే సమాధానం ఇవ్వవలసిందిగా ఒక నిబంధన. చింటూ రెండవ ప్రశ్నను ఎంపిక
చేసుకొంటే, బంటూ మొదటి ప్రశ్నను ఎంచుకున్నాడు. పాఠ్యాంశాలకు సంబంధించిన
మొదటి ప్రశ్నను పక్కనపెట్టి సామాజిక అంశాల పట్ల అభిప్రాయాలను, ఉద్దేశాలను
తనకు తెలిసిన పద్ధతిలో, అర్థమైన రీతిలో సమాధానం రాసి, మార్కుల కోసం
చూడకుండా ఒక అడుగు ముందుకు వేశాడు చింటు. అలా ప్రశ్నను ఎంపిక చేసుకోవడంలోనే
చింటూ తన విజయం చాటుకున్నాడు.
మొదటి ప్రశ్నకు సమాధానం
పూర్తిగా తనకు తెలుసు. కానీ బంటూ రెండవ ప్రశ్నను ఎంపిక చేసుకొనే సాహ సం
కూడా చేయలేదు. 'విజ్ఞాన సముపార్జన కేవలం పాఠ్యాంశాల ద్వారా సంపాదించేది
కాదు. నిజజీవితంలో మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాల పట్ల కూడా కనీస అవగాహన
ఉండటం అవసరం. ఆ అవగాహన బంటూలో అసలే లేదనటం లేదు. లోపించింది. కాబట్టి
చింటూను తెలివైనవాడిగా ఎంపిక చేశాను' అని తెలుగుమాస్టారు చెప్పారు. అందరికీ
అది సబబుగా అనిపించి, తమ ఆమోదాన్ని హర్షధ్వానాల ద్వారా తెలియజేశారు.
అప్పటి నుంచి పిల్లలను కేవలం పాఠ్యాంశాలకే పరిమితం చేయకుండా సామాజిక
స్పృహతో కూడిన విద్యను అందిస్తూ ఉత్తమ విద్యార్థులను దేశానికి అందించే
విధంగా ఆ స్కూలు టీచర్లు కృషి చేయసాగారు. 



No comments:
Post a Comment