Oct 23, 2011

రాజేంద్రుని హల్‌చల్

ఉదయం అన్నపూర్ణా స్టూడియోలో ‘లవ్లీ’ షూటింగ్... మధ్యాహ్నం ఫిల్మ్ సిటీలో ‘నిప్పు’ షూటింగ్... రాత్రి రామానాయుడు స్టూడియోలో ‘మొగుడు’ డబ్బింగ్. ఉదయం ఏడు గంటలకు బయలుదేరితే రాత్రి తొమ్మిది గంటలకు ఇంటికి చేరుతున్నారు డా.రాజేంద్రప్రసాద్. కెరీర్ తొలి దశ నుంచి ఆయన ఇలాగే బిజీ. రోజూ షూటింగులే షూటింగులు. ఒక దశలో హీరోగా ఏడాదికి పన్నెండు, పధ్నాలుగు సినిమాలు చేసేవారు. ఇలా 24x7 పని చేయడం ఆయనకు చాలా ఇష్టం. కష్టేఫలి సిద్దాంతాన్ని రాజేంద్రప్రసాద్ బాగా నమ్ముతారు.

‘ఆ నలుగురు’ సినిమా తర్వాత ఆయన కెరీర్‌లో ఓ సందిగ్ధత అలుముకుంది. ఎలాంటి సినిమాలు ఒప్పుకోవాలో తెలియని పరిస్థితి. తనమీద ఒకే బ్రాండ్ పడిపోవడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ‘మొగుడు’లో ఆంజనేయప్రసాద్ పాత్ర వెతుక్కుంటూ వచ్చింది. ఏదో ఫ్రెష్‌నెస్... ఓ కొత్త ఎనర్జీ... కృష్ణవంశీ వర్కింగ్ స్టయిల్... వీటితో రాజేంద్రప్రసాద్ ఫుల్ చార్జ్ అయిపోయారు. కట్‌చేస్తే... గుణశేఖర్, త్రివిక్రమ్, బి.జయ తదితర సృజనాత్మక నిర్దేశకులకు రాజేంద్రప్రసాద్ రూపంలో ఓ కొత్త ఆలంబన. ఎస్... తమ పాత్రలను రీచార్జ్ చేసే ఆర్టిస్టు తమ ముందు ఉన్నాడు. బాలీవుడ్ నుంచో, కోలీవుడ్ నుంచో దిగుమతి చేసుకోవాల్సిన పనేలేదు.


బాపు, జంధ్యాల, వేజెళ్ల, వంశీ, రేలంగి నరసింహారావు, ఈవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డి తదితర దర్శకులతో పనిచేసిన రాజేంద్రప్రసాద్ ఈ తరం దర్శకులతో పని చేయడాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ‘‘అసలే ఆకలి మీద ఉన్నాను. ఎప్పుడెప్పుడు ఇలాంటి విభిన్న పాత్రలు చేయాలా అని మంచి వేదిక కోసం చూస్తున్నాను. ఈ విషయంలో కృష్ణవంశీ అందరికీ ఓ మార్గం చూపించాడు. ‘మొగుడు’ రిలీజైతే నన్ను తనెలా మలిచాడో మీకే తెలుస్తుంది. ఓ సన్నివేశంలో అయితే తను కట్ చెప్పడం కూడా మరిచిపోయాడు.


అప్పుడు తన కళ్లల్లో కన్నీళ్లు చూసి... ఓ నటునికి ఇంతకన్నా పురస్కారం ఏముంటుందని చాలా ఆనందించాను’’అని రాజేంద్రప్రసాద్ చెప్పారు. మొగుడు, నిప్పు, లవ్లీ, డ్రీమ్స్, ఓనమాలు సినిమాల్లో ఆయన రకరకాల గెటప్స్‌లో కనిపిస్తూ హల్‌చల్ చేయనున్నారు. హిందీ, తమిళ భాషల నుంచి కూడా అనేక అవకాశాలు ఆయనను వెదుక్కుంటూ వస్తున్నాయి.

No comments: