Oct 21, 2011

శ్రీరామరాజ్యం కోసం ఎదురుచూపులు...

అగ్నిలో దూకమన్నప్పుడే ఆలోచించకుండా దూకిన సీతమ్మ... అడవులకు వెళ్లమంటే వెళ్లకుండా ఉండేదా..? మరి ఆ మహాసాధ్వికి నిజం చెప్పకుండా రాముడంత దారుణం ఎందుకు చేశాడు. సీతారాముడి హృదయం కరుణకు ఆలవాలం. రఘురాముడి హృదయం కాఠిన్యానికి మరోరూపం. ముళ్లకిరీటాన్ని తలపై పెట్టుకొని తనకు తాను హింసించుకుంటూ రాముడు సాధించిందేమిటి? నరుడుగా పుట్టిన రాముడు నారాయణుడు ఎందుకయ్యాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే బాపూ రమణీయం ‘శ్రీరామరాజ్యం’.
నందమూరి బాలకృష్ణ శ్రీరామునిగా నటించిన ఈ చిత్రాన్ని యలమంచిలి సాయిబాబు నిర్మించారు. ఆ మధ్య భద్రాచలంలో ఆడియో వేడుకను భారీ ఎత్తున నిర్వహించారు. ప్రస్తుతం ప్రతిచోటా ఈ సినిమా పాటలే వినిపిస్తున్నాయి. ఇళయరాజా స్వరాలు శ్రోతలను భక్తిసాగరంలో ముంచెత్తుతున్నాయనేది పలువురి అభిప్రాయం. ఈ దృశ్యకావ్యం విడుదల రోజు కోసం ప్రేక్షకులందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. నవంబర్ 10న విడుదల చేయాలనేది నిర్మాత సంకల్పం. ఆ తేదీని నిర్మాత అధికారికంగా ప్రకటించారు కూడా.

అయితే అత్యున్నత స్థాయిలో రూపొందిస్తున్న స్పెషల్ ఎఫెక్ట్స్ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దాంతో సినిమా నవంబర్ 10న కాకుండా 17న ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. అయితే... నిర్మాత ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సివుంది. శ్రీరామునిగా బాలయ్య నట వైదుష్యాన్ని, అగ్నిపునీత సీతగా నయనతార అభినయకౌశలాన్ని చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

No comments: