- సౌత్ ఆస్ట్రేలియన్ రెడ్‌బక్స్‌కు 50 పరుగుల ఓటమి
- మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ స్ముట్స్
ఛాంపియన్‌లీగ్స్ టి20 గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా క్లబ్ జట్టు వారియర్స్ భారీ విజయం సాధించింది. హైదారాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సౌత్ ఆస్ట్రేలియన్ రెబ్‌బక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో గెలిచింది. మొదట వారియర్స్ స్ముట్స్ 88 పరుగులతో (10 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగుల భారీ స్కోరు చేసింది. బదులుగా సౌత్ ఆస్ట్రేలియన్ రెడ్‌బక్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 121 పరుగులు మాత్రమే చేసింది. 34 పరుగులు చేసిన కిలింగర్ జట్టులో టాప్ స్కోరర్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ స్ముట్స్ దక్కించుకున్నాడు.
లక్ష్యానికి దూరంగా : 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆస్ట్రేలియన్ రెడ్‌బక్స్ ఏ దశలోనూ విజయానికి దగ్గరగా వెళ్లలేదు. రెడ్‌బక్స్‌కు వారియర్స్ బౌలర్ సోత్సెబె షాకిచ్చాడు. ఓపెనర్ హ్యారిస్ తొలి ఓవర్‌లో (4) సోత్సెబె బౌలింగ్‌లో కీపర్ బౌచర్‌కు చిక్కాడు. కూపర్ (3)ని కూడా సోత్సెబె పెవీలియన్ పంపాడు. ఫర్గూసన్ ఏడు పరుగులు చేసి థార్న్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రెడ్‌బక్స్ 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వారియర్స్ బౌలర్లతో ఒంటరి పోరాటం చేసిన కిలింజర్ 29 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 34 పరుగులు చేసి బోథాకు వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో జట్టు పరాజయం అంచున నిలిచింది. చివర్లో బొర్గాస్ (18), క్రిస్టియన్ (26 నాటౌట్), లుడ్మన్ (14) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. రన్‌రేట్ కొండలా పెరుగుతూ పోయింది. దాంతో రెడ్‌బక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 121 పరుగులు మాత్రమే చేసి విజయానికి 50 పరుగుల దూరంలో నిలిచింది.
స్ముట్స్ వీరవిహారం : టాస్ గెలిచి వారియర్స్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ ప్రిన్స్ 1.3వ ఓవర్లలో మూడు పరుగులకే టైట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. స్ముట్స్, ఇంగ్రామ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఆరంభం నుంచి స్ముట్స్ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మూడో ఓవర్‌లో ఒక సిక్స్, ఒక ఫోర్, నాలుగో ఓవర్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. ఇంగ్రామ్ కూడా దాటిగా ఆడాడు. పవర్‌ప్లే-1లో వారియర్స్ ఒక వికెట్ నష్టపోయి 59 పరుగులు చేసింది. 4.5 ఓవర్లలో 50 పరుగులు చేసింది. స్ముట్స్ 40 బంతుల్లో (5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఇంగ్రామ్ 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హ్యారిస్ బౌలింగ్‌లో వెనుతిరిగాడు. స్ముట్, ఇంగ్రామ్ మూడో వికెట్‌కు 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. క్రీజులోకొచ్చిన బౌచర్ మెరుపు వేగంతో ఆడాడు. స్ముట్స్ 18.5వ ఓవర్‌లో 88 పరుగుల (65 బంతుల్లో, 10 ఫోర్లు, 2 సిక్సర్లు) వద్ద హ్యారిస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. స్ముట్స్, బౌచర్ జోడీ నాలుగో వికెట్‌కు 80 పరుగులు జోడించింది. చివరి ఓవర్‌లో బౌచర్ (34), టైసన్ (3) ఔట్ కావడంతో వారియర్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. 



No comments:
Post a Comment