Sep 26, 2011

ఒక ప్రపంచం ఒక ఇల్లు ఒక గుండె !


  • వర్షాలొస్తుంటే ఒక విధంగా ఆనందమే. కానీ మరో విధంగా చాలా జాగ్రత్త అవసరం. ఈ కాలంలోనే వ్యాధులు తీవ్రంగా ప్రబలుతుంటాయి. ప్రధానంగా ఈ వ్యాధులు రెండు రకాలుగా ప్రబలుతుంటాయి. కలుషిత నీరు తాగడం వల్ల, నివాస ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల ఇలా నీరు ఎక్కడబడితే అక్కడ గుంటల్లోగానీ, టైర్లు, ట్యూబులు ముక్కల్లాంటివి గానీ బయటపడేసే వాటిట్లోనూ, నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు ప్రబలి రకరకాల వ్యాధులు వ్యాపిస్తుంటాయి.


వర్షాకాలంలో దోమల వల్ల వ్యాపించే వ్యాధుల్లో ప్రధానంగా చెప్పు కోవల్సింది మలేరియా. నీరు నివాస ప్రాంతాల్లో నిల్వ ఉన్నప్పుడు, వాటిలోకి 'ఎనాఫిలస్‌ ఆడదోమలు' చేరి గుడ్లుపెట్టి, విస్తరించి మనుషుల్ని కుట్టడం ద్వారా మలేరియా వ్యాధిని విస్తరింపజేస్తాయి. జ్వరం వచ్చి తగ్గుతుండటం, చలి, శరీరంలో నొప్పులు, తలనొప్పులు లాంటి లక్షణాలతో మలేరియా ప్రారంభమవుతుంది.
దోమ కాటు నుంచి మనుషులు తప్పుకుంటే, మలేరియా వ్యాధి నుంచి తప్పుకోగలరు. కాబట్టి ఈ కాలంలో ఇళ్లల్లో దోమతెరలు, రెపలెంట్స్‌ వాడాలి. అలాగే పరిసరాలలో చిన్న చిన్న గుంతల్లో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇళ్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో డి.డి.టి. లాంటి పౌడర్లు చల్లడం అవసరం.
కలరా : లైబ్రియో కలరే అనే బ్యాక్టీరియా ద్వారా కలరా వ్యాపిస్తుంది. ఇలాంటి బ్యాక్టీరియా ఉన్న ఆహార పదార్థాల్ని తిన్నా, నీటిని తాగినా, వీళ్ల నుంచి, వీళ్ల మలపదార్థాల ద్వారా ఇందులోని బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. పచ్చివి, సరిగ్గా ఉడకని సీఫుడ్స్‌ తినే వారిలో కూడా వ్యాపించే ప్రమాదం ఎక్కువ. పేదత్వం కానివ్వండి మరే కారణం వల్ల అయినా కానివ్వండి పరిశుభ్రతను పాటించని వాళ్లకి ఈ ఇన్‌ఫెక్షన్స్‌ ఎక్కువగా కనిపిస్తాయి. ఆ పరిశుభ్రత నీటితో కూరలు, పళ్లు లాంటి వాటిని కడిగి తిన్నా కలరా రావొచ్చు. కలరా వ్యాపించకుండా ఉండాలంటే పరిశుభ్రమైన తాగునీరు లభిస్తుండాలి. వండుకునే తినే ఆహారం పరిశుభ్రంగా ఉండాలి. మల పదార్థాల్ని బహిరంగ ప్రదేశంలో విసర్జించకుండా వాటిని సమాజం నుంచి వేరుగా చేసే విధంగా జాగ్రత్తపడాలి.
టైఫాయిడ్‌ జ్వరం : సాల్మొనెల్లా అనే జాతి బ్యాక్టీరియా ద్వారా టైఫాయిడ్‌ వ్యాపిస్తుంటుంది. ఎక్కువ జ్వరం, కడుపులో నొప్పి, వాంతులు ప్రాథమిక లక్షణాలు. సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉన్నవాళ్లు అపరిశుభ్రత చేతులతో తయారైన డ్రింక్స్‌ కానీ, నీరు కానీ తాగడానికి వాడినా, ఆహారపదార్థాల్ని ఆ నీరుతో కడిగినా టైఫాయిడ్‌ రావొచ్చు. కాబట్టి చేతులు చక్కగా కడుక్కునే వారిలో ఈ బ్యాక్టీరియా ప్రబలే ప్రమాదం తక్కువ. అలాగే తాగే నీటిలో పరిశుభ్రమైన నీరు కలపడం వల్ల కూడా ఈ టైఫాయిడ్‌ జ్వరం వచ్చే ప్రమాదముంది. నీళ్లను వేడి చేసి చల్లార్చిన నీటినే తాగాలి. అలాగే వండటానికి అటువంటి నీరే వాడాలి. పాత్రలు శుభ్రం చేయడానికి ఈ నీళ్లనే వాడాలి. ఒక నిమిషం నీటిని వేడిచేసి చల్లార్చి తాగాలి. బాటిల్స్‌లో లభించే నీరు మామూలు నీరుకన్నా కొద్దిగా మెరుగ్గా ఉంటాయి. బాగా వండిన పదార్థాల్నే తినాలి. పచ్చి కూరల్ని, పండ్లని తినడం మంచిది కాదు. వీటిని నీటితో కడిగి వాడే ముందు శుభ్రంగా తుడవాలి. ఎందుకంటే వీధుల్లో అమ్మేవాళ్లు, ఈగలు, దోమలు, దుమ్ముపడకుండా జాగ్రత్తపడలేరు కాబట్టి.
వాంతులు, విరోచనాలు : వాంతులు విరోచనాల ద్వారా శరీరంలోని నీరు బయటికి వెళ్లిపోవడాన్ని డయేరియా అంటారు. ఆహారనాళంలో ఈ-కోలై అనే బ్యాక్టీరియా వ్యాపించడం వల్ల ఇన్‌ఫెక్షన్‌తో డయేరియా కలుగుతుంది. అపరిశుభ్రమ నీరు, ఆహారం తీసుకోవడం వల్ల సరిగ్గా ఉడకని ఆహార పదార్థాల్ని తీసుకోవడం ద్వారా ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశముంది. కడుపు నొప్పితో పాటు నీళ్ల విరేచనాలు, జ్వరం, వాంతులు లాంటివి ఈ ఇన్‌ఫెక్షన్ల లక్షణాలు. సాధారణంగా 10 రోజుల్లో ఈ ఇన్‌ఫెక్షన్స్‌ నుంచి చాలా మంది తేరుకుంటారు. కొంత మందిలో మాత్రమే ఇది ప్రాణాంతకమవుతుంది.
అమీబియాసిస్‌ : ఎంటమీబా హిస్టొలిటికా అనే బ్యాక్టీరియా వల్ల ఎమిబియాటిక్‌ డిసెంటి కలుగుతుంది. మ్యూకస్‌తో విరోచనాలు అవుతుంటాయి. జ్వరం, కడుపునొప్పి ఉంటాయి. అపరిశుభ్రనీటితో చేసిన ఆహారం తినడం వల్ల లేక ద్రావకాల్ని తాగడం వల్ల ఈ ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది. రక రకాల ప్రదేశాలు తిరుగుతుండే వాళ్లకి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. కారణం ఏమిటంటే వాళ్లు రకరకాల నీళ్లను తాగుతుంటారు కాబట్టి. సరిగ్గా ఉడకని ఆహారం, అలాగే అపరిశుభ్ర నీటితో కడిగిన పళ్లు, కూరల వల్ల కూడా ఇది ఎక్కువుగా వస్తుంటుంది. క్లోరిన్‌ నీళ్లతో అమీబిక్‌ సిస్టులు అంతరించవు. అయోడిన్‌ నీళ్లతో కడిగితే మంచిది.
హెపటైటిస్‌ : అపరిశుభ్ర పరిసరాలు, అపరిశుభ్ర నీళ్లు, అపరిశుభ్ర ఆహారం వల్ల హెపటైటిస్‌-ఎ, హెపటైటిస్‌-ఇ ఇన్‌ఫెక్షన్లు రావొచ్చు. కాబట్టి ఈ మూడు పరిశుభ్రంగా చూసుకోవడం అవసరం. జ్వరం, నీరసం, ఆకలిలేకపోవడం, తలతిరగడం, కడుపులో అసౌకర్యంతో పాటు క్రమంగా జాండిస్‌ లాంటి లక్షణాలు బయటపడొచ్చు. హెపటైటిస్‌-ఎ, ఇ ఇన్‌ఫెక్షన్లు తగ్గించడానికి మందులు లేవు. పరిశుభ్రతతో కాపాడుకోవచ్చు. కాబట్టి ఎక్కువగా ప్రయాణాలు చేసే వాళ్లు, రిస్క్‌ ఉన్న వాళ్లు హెపటైటిస్‌-ఎ రాకుండా వ్యాక్సినేషన్‌ తీసుకోవడం అవసరం.
దోమలతో వచ్చే వ్యాధులు : డెంగ్యు ఫీవర్‌ కూడా దోమ వల్లే వ్యాపిస్తుంది. ఈ వర్షాకాలంలో దోమల వల్ల రకరకాల వైరల్‌ జ్వరాలు వ్యాపించే అవకాశాలున్నాయి. కాబట్టి దోమలు వ్యాపించుకుండా చూసుకోవడం ఒక జాగ్రత్త అయితే, దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం మరో జాగ్రత్త. వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా చూసుకుంటూ వ్యక్తిగత పరిశుభ్రతను కాపాడుకుంటుండాలి. కాళ్లు, చేతులు మంచిగా కడుక్కుని, మంచి నీటితో ఆహారం వండాలి.

No comments: