Sep 20, 2011

టీమ్‌ ఇండియా పయనమెటు ?

ఇంగ్లండ్‌ పర్యటన భారత జట్టు వాస్తవ పరిస్థిని తేటతెల్లం చేసింది. ఆధునిక క్రికెట్‌లో గంగూలీ, అనిల్‌ కుంబ్లే వేసిన బలమైన పునాదులతో పురోగమనం వైపు పయనించిన భారత క్రికెట్‌ ఇప్పుడు తిరోగమిస్తున్న ఛాయలు కనిపిస్తున్నాయి. భారత జట్టు మితిమీరిన క్రికెట్‌ ఆటగాళ్లకు చేటు చేస్తోందని వారికి విశ్రాంతి దొరకడం లేదన్న వాదనకు బలం చేకూరుతోంది. భారత జట్టు గాయాల భారతంగా మారింది. గత ఐదు సంవత్సరాల్లో ఇంత మంది ఆటగాళ్లు గాయపడం తాను చూడలేదని కెప్టెన్‌ ధోనీనే షాకయ్యాడు. రోటేషన్‌ విధానం మళ్లీ తెరపైకి వచ్చింది. టీమ్‌ ఇండియా రిజర్వ్‌బెంచ్‌ బలం పెరగకపోతే యువ ప్రతిభకు పదునుప్టెకపోతే భారత క్రికెట్‌ మనుగడే ప్రశ్నార్ధకం అవుతుంది. ప్రపంచ క్రికెట్‌కు భారత దేశమే ఆయువు పట్టు. క్రికెట్‌ ప్రపంచలో 'అనంత' ధనం సంపద ఉన్న బిసిసిఐ మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైంది. క్రికెట్‌ పెద్దన్న ఇప్పటికైనా కళ్ళుతెరవపోతే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు తప్పవు...

28 సంవత్సరాల తర్వాత వన్డే ప్రపంచ కప్‌ నెగ్గిన ఆనందాన్ని ధోనీ సేన పూర్తిగా ఆస్వాదించలేకపోయింది. విశ్వ విజేత జట్టు అప్పుడే చెల్లాచెదుర అయ్యింది. గంభీర్‌, సెహ్వాగ్‌, యువరాజ్‌ గాయాలతో జట్టుకు దూరమయ్యారు. పేసర్‌ జహీర్‌ శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడు. సీనియర్ల స్థానాలు భర్తీ చేయడానికి యువతరం పోటీపడుతోంది. గతంలో కొందరు యువ క్రికెటర్లకు ఒకటి రెండు అవకాశాలు లభించినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. వారు దేశియంగా సత్తా చాటి మరో అవకాశం కోసం టీమ్‌ ఇండియా తలుపు తడుతున్నారు. యువ యోధులకు మరో అవకాశం ఇవ్వాల్సిన తరుణం ఆసన్నమైంది. తాజాగా ఇంగ్లండ్‌లో వన్డే సిరీస్‌లో యువ క్రికెటర్‌ ఆజిక్య రహానె సత్తా చాటాడు. మరి కొందరు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. సర్‌ గ్యారీసోబర్స్‌, ఇయాన్‌ బోథమ్‌, జాక్వస్‌ కల్లీస్‌, ఫ్లీంటప్‌, కపిల్‌ దేవ్‌ లాంటి ఆల్‌ రౌండర్‌ నైపుణ్యం కలిగిన ఆటగాళ్లు భారత జట్టుకు అవసరం. ధోనీ సేన ఒక్క ఆల్‌రౌండర్‌ లేడు. కానీ యువ టాలెంట్‌ దేశియ స్థాయిలోనే కనుమరుగవుతోంది. యువ క్రికెటర్లకు సరైన అవకాశాలు దక్కడం లేదు.
ఐపిఎల్‌ రూపు దిద్దుకోకపోతే ఇర్పాన్‌ పఠాన్‌, రవీంద్ర జడేజా, ఓఝా, తివారిల ప్రతిభ వెలుగులోకి వచ్చేది కాదు. యువ ప్రతిభను శోధించేదుకు బోర్డు తగిన ఏర్పాట్లు చేయాల్సిన తరుణం ఆసన్నమైంది.
అంబటి రాయుడు : వన్డేల్లో యువ క్రికెటర్లలో ఉత్తమ టెక్నిక్‌ ఉన్న ఆటగాళ్లు ఇద్దరి పేర్లే వినిపిస్తాయి. ఒకరు రోహిత్‌ శర్మకాగా మరొకరు అంబటి రాయుడు. అండర్‌-19లో తన తోటి ఆటగాళ్లు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా రాయుడు మాత్రం టీమ్‌ ఇండియాలో సుస్థిర స్థానం ఏర్పర్చుకోలేకపోయాడు. క్రికెట్‌ రాజకీయాలు రాయుడు భారత జట్టులో చోటును ఆలస్యం చేశాయి. ఐపిఎల్‌-4లో ముంబయి ఇండియన్‌ తరుపున రాణించి కెప్టెన్‌ సచిన్‌ చేత శభాష్‌ అనిపించుకున్నాడు. కానీ ఇంగ్లండ్‌ పర్యటనకు రాయుడును సెలక్టర్లు ఎంపిక చేయలేదు. కీపింగ్‌ రాయుడు అదనపు అర్హత. టెస్టుల్లో నాలుగో స్థానాకి సరిపోతాడు.
చటేశ్వర పూజార : నైపుణ్యం గల భావి టెస్టు ఆటగాడు పూజార. ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపికైనా గాయంతో సిరీస్‌ నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో రైనా చోటు దక్కింది. ద్రావిడ్‌ తర్వాత మిడిలార్డర్‌లో రాణించగల సత్తా ఉన్న ఆటగాడు. స్వదేశంలో 2010లో ఆసీస్‌తో జరిగిన టెస్టులో అరంగేట్రం మ్యాచ్‌లో 72 పరుగులు చేశాడు.
అశోక్‌ మనేరియా : రవీంద్ర జడేజాలాగే మనేరియా కూడా ఆల్‌రౌండర్‌. బ్యాటింగ్‌లో స్పిన్‌ బౌలింగ్‌లో మెరవగలడు. కానీ జడేజా, యూసుప్‌ పఠాన్‌ ఇతడికి పోటీగా ఉన్నారు. భవిష్యత్‌లో జట్టు చోటు దక్కించుకునే అవకాశం ఉంది. అండర్‌ -19 ప్రపంచ కప్‌లో కెప్టెన్‌గా వ్యవహరించాడు.
మనోజ్‌ తివారి : ఈ బెంగాలీ రంజీ కెప్టెన్‌ది దూసుకుపోయే తత్వం. టెస్టుల్లో ఆరో స్థానానికి సరిపోతాడు. గంగూలీ వారసుడు. తివారి ఇప్పటి వరకు నాలుగు వన్డేల్లో మాత్రమే ఆడాడు.
భార్గవ్‌ భట్‌ : 21 సంవత్సరాల ఈ లెప్ట్‌ ఆర్మ్‌ ఆర్థోడక్స్‌ స్పిన్నర్‌ ఈ సంవత్సరం రంజీ మ్యాచ్‌ల్లో 47 వికెట్లు తీశాడు. తన స్పిన్‌ మ్యాజిక్‌తో బరోడానాను ఫైనల్‌కు చేర్చాడు. ఐపిఎల్‌లో కింగ్స్‌ఎలెవెన్‌ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భట్‌ ప్రతిభకు కెప్టెన్‌ గిల్‌క్రిస్ట్‌ ముగ్ధుడయ్యాడు. వచ్చే ఐపిఎల్‌లో భట్‌పై గిల్‌ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం భారత జట్టులో స్పిన్నర్ల మధ్య పోటీ నెలకొంది. హర్భజన్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అమిత్‌ మిశ్రా, ప్రజ్ఞాన్‌ ఓఝా, ఇక్భాల్‌ అబ్దుల్లాలు ప్రధాన పోటీ దారులుగా ఉన్నారు. వీరందరి మధ్య తన ప్రతిభను భట్‌ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఐపిఎల్‌ ద్వారా బౌలింగ్‌లో మరింత రాటు తేలాలి.
అభిమన్యు మిథున్‌ : మిథున్‌ పాస్ట్‌ బౌలర్‌. భుజబలం, కష్టపడే తత్వం ఉంది.
వరుణ్‌ ఆరోన్‌ : ఈ యువ జార్ఘండ్‌ డైనమెట్‌ ఇంగ్లండ్‌ పర్యటనలో ఇషాంత్‌ గాయపడడంతో జట్టు నుంచి పిలుపు వచ్చింది. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడించలేదు. పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ వాసిం అక్రమ్‌ నుంచి ప్రశంసలు అందుకున్నాడు. నైపుణ్యమున్న మీడియం పేస్‌ బౌలర్‌. బంతిని స్వింగ్‌ చేయగలడు.

No comments: