Sep 3, 2011

మహేష్‌బాబు ‘బిజినెస్’ మొదలైంది !

‘పోకిరి’తో సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అనిపించుకున్న మహేష్‌బాబు, పూరి జగన్నాథ్ కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం ‘బిజినెస్ మేన్’. ఆర్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శుక్రవారం హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆరంభమైంది. ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ -‘‘ప్రేక్షకులు, అభిమానులు ఆశించే అన్ని అంశాలున్న కథ ఇది. ‘పోకిరి’ తర్వాత మళ్లీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉంది.

వెంకట్‌గారి బేనర్‌లో ఇది భారీ స్థాయి సినిమా అవుతుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో మహేష్‌బాబు కేరక్టరైజేషన్, ఆయన చెప్పే డైలాగ్స్ సూపర్‌గా ఉంటాయి. ఆర్.ఆర్. మూవీ మేకర్స్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు’’ అని పూరి జగన్నాథ్ చెప్పారు. వెంకట్ మాట్లాడుతూ - ‘‘మహేష్, పూరి కాంబినేషన్‌లో ఇంత భారీ చిత్రం నిర్మించడం ఆనందంగా ఉంది. ఈ నెల 10 వరకు హైదరాబాద్‌లో షూటింగ్ చేసి, 11 నుంచి డిసెంబర్ 25 వరకు ముంబై, హైదరాబాద్, విదేశాల్లో షూటింగ్ చేస్తాం.

జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. మహేష్‌బాబు, కాజల్ అగర్వాల్, ప్రకాష్‌రాజ్, సాయాజీ ఇండే, ధర్మవరపు, బ్రహ్మాజీ, రాజా మురద్, జహంగీర్‌ఖాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్ ఎస్., సినిమాటోగ్రఫి: శ్యామ్ కె.నాయుడు, ఫైట్స్: విజయ్, ఆర్ట్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, డాన్స్: దినేష్, లైన్ ప్రొడ్యూసర్: నీరజ్ శర్మ, కో-ప్రొడ్యూసర్: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.

No comments: