Sep 26, 2011

హేతువాదానికి, నాస్తికవాదానికి; హేతువాదులకు, కమ్యూనిస్టువాదులకు భేదం ?

ఈ నెల ఒకటవ తేదీన మీరిచ్చిన జవాబు బాగుంది. అయితే నాస్తికవాదుల కంటే మతవిశ్వాసు (ఆస్తికవాదు) లనే వామపక్షవాదులు ఎక్కువగా గౌరవిస్తారు అని రాయడం వల్ల నాస్తికవాదులను కించపర్చినట్లు అనిపించింది. అభ్యుదయవాదుల దృష్టిలో నాస్తిక వాదులు -హేతువాదులు సోదరుల వంటివారే కదా? అలా కాకపోతే హేతువాదానికి - నాస్తికవాదానికి ఉన్న మౌలికభేదం ఏమిటి? అలాగే హేతువాదులకు, కమ్యూనిస్టువాదులకు గల భేదం ఏమిటి? దయచేసి వివరించగలరు. - పి. ప్రభాకరరావు, ఆర్టీసి క్రాస్‌రోడ్స్‌, హైదరాబాద్‌-20
మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాస్తిక వాదులనబడే వితండవాదులకన్నా ఇలా శాంతియుతమైన మతవిశ్వాసాలున్న వారిపట్లనే వామపక్షవాదులకు గౌరవం ఎక్కువ అనడాన్ని మీరు నాస్తికవాదుల్ని మేము కించపరిచినట్లనిపిస్తోందని రాశారు. వితండవాదం చేసే నాస్తికవాదులపైనే ఆ అరమరిక. పైగా శాంతియుతమైన మత విశ్వాసాలున్న వారిపైనే గౌరవం ఎక్కువ అంటే అర్థం నాస్తికవాదులపైన గౌరవం ఏమీ లేదనీ ఉన్నదంతా అగౌరవమేననీ అర్థంకాదు కదా! సుందర్రావుకన్నా మన్మథరావు బాగుంటాడంటే అర్థం సుందర్రావుగారి సౌందర్యాన్ని కించపర్చినట్లు కాదు కదా? పైగా శాంతియుతమైన మతవిశ్వాసాలున్న వారిని మీరు కుండలీకరణాల్లో (బ్రాకెట్స్‌)లో ఆస్తికవాదులని అన్నారు. 'ఆస్తికులు' అనడం వేరు. ఆస్తికవాదులనడం వేరు. శాంతియుతమైన మత విశ్వాసాలున్న వారే వామపక్షవాదుల గౌరవానికి అర్హులు. వారు ఆస్తికులు మాత్రమే! ఆస్తికవాదులు కాదు.

అదేపనిగా మత ప్రచారాన్ని చేసే కార్యాచరణే ఆస్తికవాదం. తమ మతాన్ని ప్రచారం చేసుకోవడం కన్నా పరాయి మతాన్ని దూషిస్తూ కార్యాచరణను చేయడం మతఛాందసవాదం. మతాన్ని నమ్మే ప్రతిఒక్కరూ మతవాది కాదు. ప్రతి మతవాదీ మతఛాందసవాది కాదు. దేశానికి, శాంతికి, ప్రగతికి తొలి శత్రువు మతఛాందసవాది. ఆ తర్వాతే మిగతావారి అడ్డంకి. శాంతియుతమైన జన జీనవంలో శాంతియుతంగానే మతాన్ని ఆచరించేవారిని శాంతంగానూ, చర్చల ద్వారానూ, ఉద్యమాల ద్వారానూ మార్చగలమన్న ఆశావాదం వామపక్షవాదులకు ఉంటుంది. చాలామంది అలా వామపక్ష ఉద్యమాలలోకి వచ్చారు. వితండవాదుల్ని అంత తేలిగ్గా మార్చలేము. పైగా వారు గందరగోళాన్ని సృష్టిస్తారు. ప్రజల మనోభావాల్ని ఖాతరు చేయకుండా, వారి హృదయాంతరాళాల్లోకి వెళ్లి పదిలపడ్డ మత భావాల్ని కించ పరుస్తూ మాట్లాడతారు. ఇక వీరితో ఏమాత్రం సాహచర్యం చేయొద్దనిపించేలా ప్రజల్ని మరింత మతవిశ్వాసానికి అంటిపెట్టుకొనేలా చేస్తారు.


ఇది అభిలషణీయం కాదు. వితండవాదానికి, ఛాందసవాదానికి ఆట్టే తేడా లేదు. నాస్తికవాదులందరూ వితండవాదులు కాదు. నాస్తికులు, నాస్తికవాదులు పూర్తిగా ఒకే రకం కాదు. మీరు నన్ను నాస్తికుడా, ఆస్తికుడా అని అడిగితే 'నేను ప్రస్తుతానికి నాస్తికుణ్ణి' అంటాను. మీరు 'నాస్తికవాదా, లేక హేతువాదా?' అని అడిగితే 'నేను హేతువాదిన'ని ప్రకటించుకుంటాను. హేతువాద దృక్పథంతోనే నాస్తికులు ఏర్పడవచ్చును. కానీ హేతువాదులందరూ నాస్తికులు కారు. 'రేపు లేదా మరో విధంగా దైవం ఉన్నట్టు శాస్త్రీయపద్ధతి (Method of Science)ప్రకారం ఋజువైతే దైవ విశ్వాసాన్ని మనం ఆమోదించాలని హేతువాదం అంటుంది.


ప్రతి విశ్వాసాన్నీ శాస్త్రీయంగా ఋజువైన హేతువు(proven cause or rationale) ఆధారంగా ఏర్పర్చుకోవాలని హేతువాదం (Rationalism) చెబుతుంది. ప్రస్తుతానికి ఋజువు కాబడిన అన్ని శాస్త్రీయ ఆధారాలు ఏవీ దేవుని ఉనికిని చాటడం లేదు. ఒక వస్తువు ఉండడాన్ని పరీక్షించి, ఆ పరీక్షలకు నిలవకపోతేనే 'లేదంటాము'. నిలిస్తే ఉందంటాము. టేబుల్‌ మీద టి.వి. ఉందనుకోండి. టి.వి.కున్న లక్షణాలు ఆధారంగా అక్కడ 'టి.వి.' ఉందంటాము. 'టి.వి. అక్కడ ఉందనడాన్ని మీరు ఋజువు చేస్తారుకానీ లేదని ఋజువు చేయలేరు కదా? అలాగే దేవుడు ఉన్నాడని ఋజువు చేయలేనంత మాత్రాన లేడని మీకు ఋజువులున్నాయా?' అంటూ కొందరు ఆస్తికవాదులు యాగీ చేస్తారు. గాలికున్న లక్షణాలు లేని ప్రాంతాన్నే శూన్యం (vacuum) అంటారు.

అదే పద్ధతిలో చాలామంది హేతువాదులు దేవుడికి ఆపాదింపబడ్డ లక్షణాలు (ఉదా: అరచేతిలోంచి చీరలు రావడం, కళ్లు తెరిస్తే ఎదుటివ్యక్తి భస్మం కావడం, ఒకే సమయంలో 8 మంది భార్యలతో సంభోగించడం, శాపాలు పెట్టి మనుషుల్ని రాళ్లుగా మార్చడం, రాయిలాగా మారిన శిల్పాన్ని కాలి స్మర్శతో మనిషిని చేయడం, సముద్రాల్ని ప్రార్థనలతో చీల్చడం, శుక్రకణం లేకుండానే కన్యకు మగబిడ్డ పుట్టడం మొదలైన వేలాది అద్భుతాలు) ఎక్కడా ఈ సువిశాల ప్రపంచంలో ఎవరి దగ్గరా, ఎప్పుడూ కానరాలేదు. అలా ఉన్నాయన్న ప్రచారాలతో బాబాలుగా, దైవ సమానులుగా ప్రకటించుకున్న వారెవరూ ఆ అద్భుతాలు నిజంగా అద్భుతాలా లేదా మాయలూ, మోసాలా అని తేల్చుకునేందుకు ప్రయోగాలకు నిలబడడంలేదు.


'ఋజువులకు నిలబడనిది ఏదీ సత్యం కాదు (unless and until proven by an experiment, nothing is true)µ అని 4వ శతాబ్దాంలోనే హైపేషియా అనే మహిళా శాస్త్రవేత్త చెప్పారు. (అలా అన్నందుకు ఆమెను చిత్రహింసలు పెట్టి ముక్కలు ముక్కలుగా నరికినా వారు పాపులు కాలేదు. వారు దైవకార్యాన్ని చేసినవారుగా అప్పుడు గౌరవించబడ్డారు. అది వేరే విషయం) వైజ్ఞానిక ప్రతిష్టలో అత్యంత శిఖరాగ్ర స్థాయికి ఓ కొలమానం నోబెల్‌ బహుమతి. విజ్ఞానశాస్త్ర రంగాల్లో నోబెల్‌ బహుమతి పొందిన వారిలో దాదాపు 80 శాతం మంది నాస్తికులు. అందులో కొందరు నాస్తిక వాదులూ ఉన్నారు. కానీ ఎవరూ వితండవాదులు కారు. అయితే అందరూ హేతువాదులే!

'నాస్తికవాదులు, హేతువాదులు - సోదరుల వంటి వారే కదా!' అని మీరు అభిప్రాయం వెలిబుచ్చారు.

సబబే! కానీ నాస్తికవాదం కన్నా హేతువాదం ప్రస్తుత సమకాలీన సమాజంలో ప్రగతిపథ ఉద్యమాలకు ఎక్కువ సన్నిహితం. 'ఎందుకని?' అని ప్రజలు వేసే ప్రతి ప్రశ్నకు 'ఇందుకని!' అంటూ హేతువు చెబుతూ ప్రజల్ని తమకు తామే ప్రతి నడవడికనూ, ఆచరణనూ, అవగాహననూ తేల్చుకొమ్మంటుంది. 'అసలు దేవుడు లేడు గాక లేడు.. ముందు ఈ విషయం నువ్వు నమ్ము.. అపుడే నీవు బాగుపడ్తావు' అంటూ బండిని తీసుకొచ్చి గుర్రం ముందుపెట్టదు. కాబట్టి నాస్తికవాదానికీ, హేతువాదానికీ ఉన్న ఈ సూక్ష్మమైన తేడా ప్రజల్లోకి వెళ్లే, ప్రగతిమార్గ సారథులైన వామపక్షవాదులకు పెద్ద తేడానే. అంతెందుకు? మన రాజ్యాంగంలో 'శాస్త్రీయ దృక్పథం, ప్రశ్నించేతత్వం, అన్వేషణాసక్తి ప్రతి భారతపౌరుడిలోనూ ఉండాలి' అని ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి భారతపౌరుడు 'హేతువాద వైఖరి'ని కల్గి ఉండాలని దాని అర్థం! అలా డైరెక్టుగా రాసినా ఎవరూ ఆక్షేపించరు. అలాగని 'ప్రతి భారతీయపౌరుడు నాస్తికుడై ఉండాలి' అని రాజ్యాంగాన్ని సవరించాలనుకొంటే ఎంత పెద్దఎత్తున ప్రజల నుంచి నిరసన వస్తుందో ఆలోచించండి.


ఇక చివరగా 'హేతువాదులకు, కమ్యూనిస్టువాదులకు మధ్యగల భేదం కూడా వివరించగలరు' అని అడిగారు. ఆ విషయంలో గంభీరమైన వ్యాసాన్ని నేను రాయలేనుగానీ ఒక్క విషయం మాత్రం తేటతెల్లం. ప్రతి హేతువాదీ కమ్యూనిస్టు ్టకాదు. కానీ ప్రతి కమ్యూనిస్టు గొప్ప హేతువాది. ప్రతి హేతువాదీ అభ్యుదయవాది కానక్కర్లేదు. కానీ ప్రతి కమ్యూనిస్టు గొప్ప అభ్యుదయవాది. శుద్ధ అభ్యుదయవాది, శుద్ధ హేతువాది, శుద్ధ నాస్తికవాది, శుద్ధ సంస్కరణవాది సమాజాన్ని, చరిత్రను, మానవ భవితను, నాగరికతను విడివిడి అధ్యాయాలుగా మాత్రమే చూస్తారు. ఆ అధ్యాయాల ఆధారంగానే వారి కార్యాచరణ ఉంటుంది. మూలాల్లోకి వెళ్లరు. అధ్యాయాల సమాకలనాన్ని (integrated)తీసుకోరు. మొత్తం పుస్తకంలోని కథా వస్తువును, నీతిని గ్రహించరు.


కానీ కమ్యూనిస్టులు సమాజాన్ని, నాగరికతను, మానవ దైనందిన గమనాన్ని, గతితార్కిక భౌతికవాదపు (dialectical materialistic) దృక్కోణంలో చూస్తారు. సామాజిక గమనంలో ఆ సూత్రాలు నిబిడీకృతమై చారిత్రక భౌతికవాదమ (historical materialism) నే సాధనా (tool)న్ని ఇచ్చాయనీ, ఆ సాధనం ఆధారంగానే మానవ సమాజ గమనాన్ని పరిశీ లించాలనీ నిర్ధారణకు వస్తారు. మానవ సంబంధాలన్నీ ఉత్పత్తి సంబంధాలు (productive relations) గా గ్రహిస్తారు. ఉత్పత్తి సంబంధాలే ఆర్థిక, రాజకీయ సంబంధాల్ని నిర్దేశిస్తాయనీ, ఆ ఉత్పత్తి సంబంధాలు ఉత్పత్తి సాధనాలు ఎవరి ఆజమాయిషీలో ఉన్నాయన్న సత్యం ఆధారంగా ఉంటాయనీ ఆకళింపు చేసుకొంటారు.


ఉత్పత్తి సాధనాల మీద పట్టు ఉన్న కొద్దిమంది, ఆ ఉత్పత్తి సాధనాల మీద పట్టులేని అధికుల శ్రమతో ఉత్పత్తి సాధనాల ఉత్పత్తులకు విలువల్ని తీసుకొస్తారనీ ఆ విలువల్లో ఉన్న శ్రమాధికుల శ్రమ దోపిడీతో పీడితవర్గం (exploited class) పై ఆజమాయిషీ చేస్తూ లాభాలు దండుకొంటుందనీ తెలుసుకుంటారు. సమాజంలో ఉన్న వర్గ సంబంధాలు (class relations), ఈ వర్గ వైరుధ్యాల ప్రతిఫలం (manifestations) మేననీ తేల్చుకుంటారు. ఆ వర్గదోపిడీలో భాగం గానే పీడకవర్గం పీడితవర్గాన్ని వివిధ రూపాల్లో కార్యశూన్యతను ప్రోత్సహించేందుకు పన్నాగాలు చేస్తుందనీ, మతం కూడా అందులో భాగమనీ గ్రహిస్తారు. కాబట్టి వర్గ రహిత సమాజ స్థాపన ద్వారానే, ఆ పునాదుల్ని కూల్చడం ద్వారానే పూర్తిస్థాయి దోపిడీ రహిత సమాజాన్ని ఆవిష్కరించగలమన్న అవగాహనతో కార్యోన్ముఖులవుతారు.


గతి తార్కిక భౌతికవాదం అంటే అది అన్ని శాస్త్రాల తుది తాత్పర్యం (consolidated crux of all sciences). అంటే విజ్ఞానశాస్త్రాల సమిష్టి సారమ (extract of sciences) న్న మాట. విజ్ఞానశాస్త్రాల కళ్లద్దాల్లోంచి ప్రపంచాన్ని పరిశీలించే రాజకీయ వారసత్వం, సామాజిక జీవనం బహుశః కమ్యూనిస్టుల (వాదుల) కు తప్ప మరే ఇతర రాజకీయ పార్టీలకుగానీ, సంస్థలకు గానీ లేదు. అందుకే 'వేదన, నొప్పి, సర్వేజనా సుఖినోభవంతుః' అన్న మాటలకు పూర్తిస్థాయి ఆవిష్కరణను ఇవ్వగలిగింది కమ్యూనిస్టుల కార్యరూపమే. ఎందుకని ప్రజలు అశాస్త్రీయతలో ఉన్నారు? ఎందుకని ఎపుడూ కనిపించని దేవుణ్ణి అంత పెద్దస్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నమ్ముతున్నారు? ఎందుకని మనుషుల్లోనే వివిధ రూపాల్లో వైషమ్యాలున్నాయి? ఎందుకని ప్రజలు శాస్త్రీయ దృక్పథం కోల్పోయారు? వంటి ప్రశ్నలకు పూర్తిస్థాయి హేతువులతో 'ఇందుకని!' అంటూ జవాబు ఇవ్వగలిగిన కమ్యూనిస్టులు హేతువాదులకన్నా ఎన్నోరెట్లు అగ్రగణ్యులు. 'జబ్బుల్ని నయం చేసేవి' మిగిలినవాదాలు కాగా, 'జబ్బులే లేని ఆరోగ్యాన్ని ఇచ్చే కృషి' కమ్యూనిస్టులది.

No comments: