ధనమూర్తనే కోళ్లఫారం యజమాని వద్ద అబ్దుల్లా అనే అమయాక
డ్రైవరు ఉండేవాడు. ఉదయం లేవగానే కోళ్ల వ్యాన్‌లో 200 వరకూ కోళ్లను
నింపుకుని, గ్రామాల్లో చికెన్ సెంటర్ల వారికి వేసి వస్తుండేవాడు. ఒకనాడు
మిడతనపల్లి వెళుతుంటే దారిలో దాహమైంది. చుట్టూ వేరుశనగ చేలు. రోడ్డు పక్కన
వ్యాన్ ఆపి, దగ్గరలో ఉన్న బావిలో నీళ్లు తాగడానికి వెళ్లాడు.
ఆహారం
కోసం బయలుదేరిన నక్కకు కోళ్ల అరుపులు వినపడి, పరిగెత్తుకుంటూ వచ్చింది.
చూడగానే కడుపు నిండిపోయినంత ఆనందమైంది. కానీ, అది ఎక్కువ సేపు నిలువలేదు.
కోళ్లన్నీ భద్రంగా ఇనుప జాలి మధ్య ఉన్నాయి. అందుకోడానికి వీలులేకుండా ఉంది.
నక్కను చూడగానే రంధ్రాల్లోంచి తల బయటకు పెట్టిన కోళ్లన్నీ లోపలకు
లాక్కున్నాయి. ఒక కోడి మాత్రం అలాగే తల వెలుపలకు పెట్టి నిద్రపోసాగింది.
నక్క గభాల్న ఎగిరి తల వరకూ అందుకుంది. కోడి మిగతా భాగమంతా వ్యాన్‌లోనే
ఉండిపోయింది.
ఇంతలో అబ్దుల్లా రావడంతో నక్క దూరంగా పరిగెత్తింది.
గ్రామాల్లో కోళ్లను పంచేసిన అబ్దుల్లాకు చివరకు తలలేని కోడి కనిపించిది.
'ఇటువంటి కోడిని తనెప్పుడూ చూడలేదే?' అనుకుంటూ దాన్ని దుకాణదారుడుకి
వేయబోయాడు. తలలేని కోడిని వేసుకోడానికి అతను ఒప్పుకోలేదు. ఈ కోడి గురించి
యజమానికి చెబితే ప్రశ్నలు వేసి చంపుతాడని, దాన్ని తీసికెళ్లి
భార్యకిచ్చాడు. ఆమె దాన్ని చక్కగా కోసి, కూర వండింది.
ఒక కోడి
లెక్క తక్కువొచ్చినందుకు యజమాని కారణం అడిగాడు. 'వ్యాన్‌లోంచి
ఎగిరిపోయినట్లుందండి. నేనేమన్నా తిన్నానా?' కోపంగా అన్నాడు అబ్దుల్లా.
'నువ్వు తినలేదు. వ్యాన్‌లోంచి ఎలా ఎగిరిపోయింది?' అడిగాడు యజమాని.
'ఏమో.. నాకేం తెలుసు? వాటికి రెక్కలుంటాయి గదా?' అన్నాడు తెలివిగా.
'ఈ తలకాయలేని కోడితో భలే తంటా వచ్చి పడిందే...' అనుకుంటూ ఇంటికి వెళ్లసాగాడు.
'రేపు బోడంగిపర్తి వెళ్లాలి. తొందరగా రా! ఆరుగంటలకే బయల్దేరాలి!' కేకేసి మరీ చెప్పాడు యజమాని.
ఆ
రాత్రి చక్కగా కోడి కూర తిని, ఆలస్యంగా నిద్ర లేచాడు. నెమ్మదిగా తొమ్మిది
గంటలకు కోళ్లఫారం దగ్గరకు వెళ్లాడు. యజమానికి అబ్దుల్లాను చూడగానే భలే
కోపమొచ్చింది. 'నిన్న దూరం వెళ్లాలి. త్వరగా రా.. అంటే ఇప్పుడా వచ్చేది?
కోడి మెదడు వెధవా!' అన్నాడు.
'ఏంటండీ! ప్రతిసారీ మీరు కోడి మెదడు
వెధవా అని తిడతారు? రాత్రి తిన్న కోడికి అసలు తలకాయేలేదు. ఇంక మెదడు
ఎక్కడుంటుంది?' అన్నాడు కోపాన్ని అణచుకోలేక.
'అచ్ఛా! అట్లాగా! నిన్న లెక్కతేలని కోడిని తమరు కోసుకుని, తిన్నారన్నమాట. మరి ఎగిరిపోయిందని చెప్వావేం?' అన్నాడు యజమాని.
'ఏం
చేయమంటారండీ! తలకాయలేని కోడిని ఏ దుకాణదారుడూ తీసుకోవడానికి ఇష్టపడలేదు.
మీకు చెపితే అసలది ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చింది? అంటూ ప్రశ్నల మీద
ప్రశ్నలు వేసి చంపుతారాయే! అందుకే ఆ తలకాయలేని కోడిని తినేశాను. కానీండి, ఈ
మధ్య మన కోళ్లలో కొన్నిటికి తలకాయలుండడం లేదండీి!' అన్నాడు ఏదో గొప్ప నిజం
కనుక్కున్నట్టు.
'తలకాయలేనిది కోళ్లకు కాదురా! నీకు. తల
జాలిలోంచి బయటకు పెడితే ఏ కుక్కో, నక్కో కొరక్కు తినుంటుంది. నువ్వు
జాగ్రత్తగా చూడటం లేదన్నమాట!' అన్నాడు ఆగ్రహంగా యజమాని.
'అర్రే అవునండీ..! దప్పికయితేనూ అడవిలో ఆపి, మంచినీళ్లకు వెళ్లాను. తర్వాతే ఇది జరిగింది' అన్నాడు అబ్దుల్లా.
'సరేలే! త్వరగా బయలుదేరు...' అని వ్యాన్ ఎక్కించాడు.
మరుసటిరోజు వ్యాన్‌కున్న ఇనుప జాలిలోంచి కోళ్లు తలలు బయటకు పెట్టకుండా, సన్నటి తీగ వలను అడ్డంగా పెట్టించాడు.
అంతే అప్పటి నుండి మరెప్పుడూ అబ్దుల్లాకు తలలేని కోళ్లు కనిపించలేదు.



No comments:
Post a Comment