Sep 25, 2011

కదలని రైళ్లు , రైల్‌రోకో మరో 2రోజులు !

కదలవ్...

నేడు నిర్ణయం ప్రకటిస్తామన్న తెలంగాణ రాజకీయ జేఏసీ

బస్సులు, రైళ్లు, ఆటోలు.. సకలం బంద్
తెలంగాణలో పూర్తిగా స్తంభించిన రవాణా..
ప్రయాణికులకు యాతన
సమ్మెలోకి ప్రభుత్వ డ్రైవర్లు.. డిస్టిలరీలు, బ్రూవరీలూ
ఒక రోజు బంద్?.. 26, 27ల్లో పారిశ్రామిక బంద్
కాంట్రాక్టు ఉద్యోగులపై వేటుకు సర్కారు హెచ్చరిక
3.5 లక్షల మందితో సచివాలయం ముట్టడిస్తామని ఉద్యోగుల జేఏసీ హెచ్చరిక

హైదరాబాద్, న్యూస్‌లైన్: సకల జనుల సమ్మె ఉధృతి సకల రంగాలనూ తాకింది. దాంతో సాధారణ పౌర జీవనం కుదేలైంది. ఆర్టీసీ సమ్మెకు ఆటోల బంద్, రైల్‌రోకో కూడా తోడవడంతో శనివారం తెలంగాణలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఉత్తర, దక్షిణ భారతాల మధ్య రవాణా బంధం తెగిపోయింది. తొలుత ఆదివారం వరకూ ప్రకటించిన రైల్‌రోకోను మరోరెండు రోజులు పాటు పొడిగించాలని తెలం గాణ రాజకీయ జేఏసీ నిర్ణయించింది. తెలంగాణలో ప్రధాన రైల్వే స్టేషన్లన్నీ బోసిపోయాయి. సోమవారం నుంచి సమ్మెకు దిగుతామంటూ హైదరాబాద్ జంటనగరాల డ్రైవర్ల సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసిచ్చింది. దాంతో మంత్రులు, అధికారులకు కార్ల డ్రైవర్లు కూడా కరువవనున్నారు. మరోవైపు ఉద్యోగులు తదితర వర్గాల సమ్మె వరుసగా 12వ రోజు కూడా కొనసాగడంతో తెలంగాణ అంతటా సర్కారీ, ఇతరత్ర సేవలన్నింటికీ పూర్తిసాయిలో విఘాతం కలిగింది. ఆర్టీసీ సమ్మెతో సీమాంధ్ర, తెలంగాణ మధ్య రవాణా సంబంధాలు వరుసగా ఆరో రోజూ తెగిపోయాయి.

ఆటోల బంద్ ప్రభావం తెలంగాణ అంతటా తీవ్రంగా పడింది. హైదరాబాద్‌లో 250 రాష్ట్రస్థాయి కార్యాలయాల్లో ఫైళ్ల కదలికలు ఆగిపోయాయి. జిల్లాల్లోనూ ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు తీసేవారూ కరువయ్యారు. వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది సమ్మెతో సర్కారు దవాఖానాల్లో వైద్య సేవల బంద్, కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థల బంద్ కొనసాగాయి. ఒక రోజు పనికి రెండురోజుల వేతనమంటూ సింగరేణి యాజమాన్యం ప్రకటించిన తాయిలం కూడా పెద్దగా పనిచేయలేదు. శనివారం ఉద్యోగుల హాజరు ఒక శాతం మాత్రమే పెరిగింది. పెట్రోల్ బంకులు, మద్యం దుకాణాలు, బార్లు కూడా శనివారం బంద్ పాటించాయి. హైదరాబాద్‌లోనే సుమారు 3,00 బంకులు, 10వేలకు పైగా సెలూన్లు మూతపడ్డాయి. 26,27వ తేదీలలో పారిశ్రామిక బంద్ పాటిస్తామని రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రకటించారు. సోమవారం నుంచీ సమ్మెకు దిగుతున్నట్టు కరీంనగర్ జిల్లా గెజిటెడ్ అధికారులు ప్రకటించారు. 24 గంటల్లో విధుల్లో చేరని కాంట్రాక్ట్ సిబ్బందిని తొలగిస్తామంటూ అన్ని శాఖలకూ సర్కారు నోటీసులు పంపడంపై ఉద్యోగుల జేఏసీ మండిపడింది. నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే 3.5 లక్షల ఉద్యోగులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించింది! సకల జనుల సమ్మెకు మద్దతుగా తెలంగాణలోని డిస్టిలరీలు, బ్రూవరీ (మద్యం, బీరు తయారీ పరిశ్రమ)లను ఒకరోజు పాటు మూసేయాలని యజమానుల సంఘం నిర్ణయిచారు. తెలంగాణలో 18 డిస్టిలరీలు, 7 బ్రూవరీలున్నాయి. అవి ఒక రోజు పని చేయకుంటే దాదపు లక్ష కేసుల మద్యం ఉత్పత్తి నిలిచిపోతుంది. ఇప్పటికే మద్యం డిపోల ఉద్యోగులు రెండు రోజుల పాటు విధులను బహిష్కరించడం తెలిసిందే.

రైల్‌రోకోతో కేంద్రంపై ఒత్తిడి!


ఉద్యమ వేడికి కొనసాగించేందుకు రైల్‌రోకోను పొడిగించే అవకాశముందని కోదండరాం వెల్లడించారు. ఆదివారం జేఏసీస్టీరింగ్ కమిటీ అత్యవసర భేటీలో చర్చించాక, దాన్ని మరో 48 గంటలు పొడిగిస్తూ సాయంత్రంలోపు లాంఛన ప్రకటన చేసే అవకాశముంది. సామాన్యులకు తక్కువ నష్టం, ఇబ్బందులతో కేంద్రానికి వేడిని పుట్టించే నిరసన రూపమైన దీన్ని కొనసాగించాలంటూ జేఏసీపై ఉద్యమకారులు ఒత్తిడి తెస్తున్నారు. జేఏసీ భాగస్వామ్యపార్టీలు, సంఘాలు కూడా అందుకు సానుకూలంగా ఉన్నాయి. రైల్‌రోకో మొదలయ్యాకే తెలంగాణ ఉద్యమ, సకల జనుల సమ్మెలను జాతీయ చానళ్లు ప్రసారం చేస్తున్నాయని జేఏసీ అభిప్రాయపడుతోంది.

పడకేసిన పట్టాలు!


రెండు రోజుల ఆటోల బంద్, రైల్ రోకో శనివారం ప్రశాంతంగా జరిగాయి. తెలంగాణ నినాదాలు, ధూంధాం, ఆటపాటలు, బతకమ్మలతో రైల్వేస్టేషన్లు మార్మోగాయి. ఉదయం ఆరింటి నుంచే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, కాజిపేట్, మౌలాలి తదితర రైల్వేస్టేషన్లలో పార్టీలు, సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఆందోళనకారులు పట్టాలపైకి చేరుకుని నిరసన ప్రారంభించారు. పలుచోట్ల పట్టాల మీదే వంటావార్పు చేసుకోవడంతో పాటు ధూంధాం నిర్వహించారు. 55 ఎక్స్‌ప్రెస్ రైళ్లను పూర్తిగా, 44 ఎక్స్‌ప్రెస్‌లను పాక్షికంగా రైల్వే శాఖ రద్దు చేసింది. తెలంగాణ మీదుగా వెళ్లే 55 ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లించింది. తెలంగాణలో తిరిగే 176 ప్యాసింజర్లను పూర్తిగా, 28 ప్యాసింజర్లను పాక్షికంగా రద్దు చే సింది. దాంతో హైదరాబాద్ నుంచి రోజూ ప్రయాణించే 2లక్షల మంది ప్రయాణాలు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు.


దేశంలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్, ఢిల్లీ వెళ్లే పలు రైళ్లను విజయవాడ, గుంటూరు, కర్నూలు, రాయిచూర్, నాందేడ్, బల్లార్షా తదితర చోట్ల ఆపేశారు. తూర్పు, దక్షిణ ప్రాంతాల రైళ్లను విజయవాడ, తెనాలి, గుంటూరులకే పరిమితం చేశారు. ఆయా స్టేషన్లలో సామర్థ్యానికి మించి రైళ్లు ఆగడంతో ప్రయాణికులు నానా అగచాట్లు పడ్డారు. షిర్డీ, ముంబైల నుంచి వచ్చే రైళ్లను నాందేడ్ వద్దే నిలిపేశారు. హైదరాబాద్‌లో 222 ఎంఎంటీఎస్, 102 డీహెచ్‌ఎంయూలు కూడా రద్దయ్యాయి. దాంతో సుమారు లక్షా 50 వేల మందికి రవాణా సదుపాయం స్తంభించింది. రైల్వే అదనపు డీజీ కౌముది, డీఐజీ అతుల్‌సింగ్ పరిస్థితులను సమీక్షించారు. లక్షా 10 వేల ఆటోరిక్షాలు బంద్‌లో పాల్గొనడంతో మరో 8 లక్షల మంది ప్రయాణికులు రోడ్డెక్కలేకపోయారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌లో ఆర్టీసీ తరలిస్తున్న 150 బస్సులను హయత్‌నగర్‌లో ఆందోళనకారులు అడ్డుకోవడం లాఠీచార్జికు దారి తీసింది.

దసరా స్పెషల్ బస్సులపై ‘సమ్మె’ట!

ఏటా ఆర్టీసీకి బాగా ఆదాయం తెచ్చి పెట్టే దసరా స్పెషల్ సర్వీసులపైనా ‘సమ్మె’ట పోటు పడేలా కన్పిస్తోంది. 29 నుంచి అక్టోబర్ 8 దాకా రాష్ట్రవ్యాప్తంగా 40 శాతం బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంది. వీటిపై అదనపు చార్జీల రూపంలోనే సంస్థకు కనిష్టంగా రూ.40 కోట్ల రాబడి వచ్చేది! టికెట్ల బుకింగ్ ఇప్పటికే నిలిచిపోయిన నేపథ్యంలో సమ్మె మరో నాలుగైదు రోజులు కొనసాగితే ఆర్టీసీకి ఈసారికి దసరా జోష్ లేనట్లే! మరోవైపు, సమ్మెను సాకుగా చూపుతూ ప్రైవేట్ బస్సులను స్టేజీ క్యారేజీలుగా తిప్పేందుకు అనుమతిస్తే ఖబడ్దార్ అని ప్రభుత్వాన్ని ఆర్టీసీ జేఏసీ హెచ్చరించింది.
  • బస్సు, ఆటో, పెట్రోల్‌ పంపు బంద్‌ ప్రశాంతం
  • స్తంభించిన రవాణా
  • ఏడు బస్సులు ధ్వంసం బ ప్రయాణీకుల ఇక్కట్లు
  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై బొత్స సమీక్ష
  • ట్రాన్స్‌పోర్టు ఉద్యోగులకు నోటీసులు
తెలంగాణాలో రవాణా బంద్‌ శనివారం ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, ఎవరినీ అరెస్టు చేయలేదని ప్రభుత్వం, పోలీస్‌ వర్గాలు తెలిపాయి. ఈ నెల 19 నుండి ఆర్టీసి ఉద్యోగులు నిరవధిక సమ్మె పాటిస్తుండగా ఇదే సమయంలో శని, ఆదివారాల్లో రైలు రోకోలకు తెలంగాణ రాజకీయ, ఉద్యోగ జెఎసిలు పిలుపునిచ్చాయి. ఆటో డ్రైవర్లు కూడా రెండు రోజుల బంద్‌ పాటిస్తున్నారు. రైళ్లు, బస్సులు, ఆటోలు బంద్‌ కావడంతో శనివారం రవాణా స్తంభించింది. ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు. రైల్వే స్టేషన్ల వద్దకు, రైలు పట్టాలపైకి కార్యకర్తలు చేరుకొని వివిధ పద్ధతుల్లో ఆందోళన చేపట్టారు. రైలు రోకోల నేపథ్యంలో రైల్వే స్టేషన్ల వద్ద, ఆందోళన చేస్తున్న ప్రధాన కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో సాయుధ పోలీసులు మోహరించారు. రైలు రోకో పిలుపుతో తెలంగాణ గుండా ప్రయాణించే రైళ్లనన్నింటినీ దక్షిణ మధ్య రైల్వే ముందస్తుగా రద్దు చేసింది. దీంతో అన్ని రైల్వే స్టేషన్లు ప్రయాణీకులు లేక వెలవెల పోయాయి. నిత్యం వేలాది మంది ప్రయాణీకులతో కిట కిటలాడే సికిందరాబాద్‌ రైల్వే స్టేషన్‌ శనివారం బోసి పోయింది. విజయవాడ- కాజీపేట- సికిందరాబాద్‌ మార్గంలో ఒక్క రైలు కూడా తిరగలేదు. తెలంగాణాలోని పలు ప్రాంతాలకు తిరగాల్సిన 12 ప్యాసింజర్‌ రైళ్లు రద్దయ్యాయి. మరో 44 రైళ్లను దారి మళ్లించారు. నల్గొండ జిల్లాలో రైలు రోకో కారణంగా పుష్‌పుల్‌ ఎక్స్‌ప్రెస్‌ను దారి మళ్లించారు. యశ్వంత్‌పూర్‌-నిజాముద్దీన్‌, బెంగళూరు- నిజాముద్దీన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లనూ దారి మళ్లించారు. శనివారం ఉదయం నుండే ప్రత్యేక తెలంగాణ వాదులు పలు ప్రాంతాల్లో రైలు పట్టాలపై బైఠాయించారు. హైదరాబాద్‌లోని మౌలాలి వద్ద జరిగిన ఆందోళనలో తెలంగాణ రాజకీయ జెఎసి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం, టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కెటిఆర్‌, బిజెపి నేత దత్తాత్రేయ పాల్గొన్నారు. రాత్రి పూట కూడా అక్కడే బైఠాయించాలని నిర్ణయించారు. రైలు రోకోను మరో 48 గంటలకు పొడిగించే విషయంపై జెఎసిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కోదండరాం చెప్పారు. కరీంనగర్‌ జిల్లా ఉప్పల్‌లో ఈటెల రాజేందర్‌, మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌లో హరీష్‌రావు, నల్గొండ జిల్లా భువనగిరిలో బిజెపి నేత కిషన్‌రెడ్డి రైలు రోకో ఆందోళనలో పాల్గొన్నారు. రైలు రోకో వల్ల హైదరాబాద్‌లో ఎంఎంటిఎస్‌లు రద్దయ్యాయి. ఆటోలు, రైళ్లు, బస్సులు ఒకేసారి బంద్‌ కావడంతో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన ఉద్యోగులు విధులకు హాజరు కాలేక పోయారు. రవాణా బంద్‌తో సచివాలయంలో శనివారం హాజరు పడిపోయినట్లు అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణాలో శనివారం పెట్రోల్‌ పంపులు కూడా బంద్‌ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రైలు రోకో వల్ల రైళ్లు నిలిచిపోవడంతో తెలంగాణాలోనే కాకుండా విజయవాడ, తిరుమల తదితర చోట్ల కూడా ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు. కాగా శనివారం తెలంగాణాలో 359 బస్సులను నడిపినట్లు ఆర్టీసి పేర్కొంది. హైదరాబాద్‌లో 269, సికిందరాబాద్‌లో 87, ఖమ్మంలో 3 బస్సులు తిరిగాయి. హైదరాబాద్‌ సమీపంలో ఏడు ఆర్టీసి బస్సులు ఆందోళనకారుల ఆగ్రహానికి ధ్వంసమైనట్లు ఆర్టీసి వెల్లడించింది. రైళ్లు, బస్సులు, ఆటోల బంద్‌ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో సమీక్షించారు. రవాణా శాఖ ఉన్నతాధికారులు, ఆర్టీసి ఎమ్‌డి ప్రసాదరావు ఈ భేటీకి హాజరయ్యారు. కార్మిక సంఘాలతో మరోసారి చర్చలు జరిపి విధుల్లో హాజరయ్యేలా చూడాలని ఆ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. ఆదివారం గ్రూపు-1 పరీక్షల అభ్యర్థులకు పోలీస్‌ భద్రత మధ్య ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలనినిర్ణయించారు. రవాణ శాఖ అధికారుల సమ్మెతో తెలంగాణాలో వాహన రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడింది. రవాణ ఉద్యోగులు 24 గంటల్లో విధులకు హాజరు కావాలని ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. విధులకు హాజరు కాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

No comments: